కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జ్ఞాపకం చేసుకోవలసిన జననం

జ్ఞాపకం చేసుకోవలసిన జననం

జ్ఞాపకం చేసుకోవలసిన జననం

“నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు; ఈయన ప్రభువైన క్రీస్తు.”​—⁠లూకా 2:11.

దాదాపు రెండువేల సంవత్సరాల పూర్వం, బేత్లెహేము పట్టణంలో ఒక స్త్రీ మగ శిశువుకు జన్మనిచ్చింది. స్థానికుల్లో కొద్దిమంది మాత్రమే ఆ జనన విశేషతను అర్థం చేసుకున్నారు. అయితే రాత్రివేళ పొలంలో తమ మందలు కాచుకుంటున్న పశువుల కాపరులు కొందరు, దేవదూతల సమూహాన్ని చూడడమే కాక, వారు “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక” అని పాడడం కూడా విన్నారు.​—⁠లూకా 2:8-14.

దేవదూతలు సూచించినట్లుగా, ఆ కాపరులు ఒక పశువులశాలలో మరియను ఆమె భర్త యోసేపును చూశారు. మరియ ఆ బాలునికి యేసు అని పేరు పెట్టి, ఆ పశువులశాలలోని మేతతొట్టిలో పడుకోబెట్టింది. (లూకా 1:​31; 2:​12) నేడు, దాదాపు రెండు వేల సంవత్సరాల తర్వాత మానవుల్లో మూడొంతుల మంది యేసుక్రీస్తును అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఆయన జనన సంఘటనల ఆధారంగా రూపొందించబడిన కథ బహుశా మానవ చరిత్రలోనే అత్యధికంగా చెప్పబడిన కథ కావచ్చు.

క్యాథలిక్‌ ఆచారం బలంగావున్న, సాంప్రదాయ పండుగలను ఆచరించడంలో ప్రజ్ఞగల స్పెయిన్‌ దేశం, బేత్లెహేములోని ఆ నిరుపమాన రాత్రిని జ్ఞాపకం చేసుకునేందుకు అనేక పద్ధతులను నెలకొల్పింది.

స్పానిష్‌ క్రిస్మస్‌

13వ శతాబ్దం నుండి, స్పానిష్‌ పండుగల్లో యేసు జన్మదిన సంఘటనల వేడుకలు అత్యంత ఆడంబరంగా ఆచరించబడుతున్నాయి. చాలా కుటుంబాలు యేసును పడుకోబెట్టిన ఆ చిన్న తొట్టిలాంటిది తయారుచేసుకుంటాయి, పశువుల కాపరుల, జ్ఞానుల (లేదా “ముగ్గురు రాజుల”), మరియ యోసేపుల మట్టి బొమ్మలను పెట్టుకుంటాయి. క్రిస్మస్‌ కాలంలో వాటికంటే పెద్దవైన, దాదాపు మనిషి పరిమాణంలో ఉండే బొమ్మలు టౌన్‌హాలున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడతాయి. యేసు జనన సువార్త వృత్తాంతంవైపు ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇటలీలో ఆ ఆచారాన్ని ఫ్రాన్సిస్‌ ఆఫ్‌ ఎస్సిసి అనే మతగురువు ఆరంభించాడు. ఫ్రాన్సిస్కన్‌ సన్యాసులు ఆ తర్వాత ఆ ఆచారాన్ని స్పెయిన్‌లో, అనేక ఇతర దేశాల్లో వ్యాప్తిచేశారు.

వేరే దేశాల్లోని క్రిస్మస్‌ తాతలాగే స్పెయిన్‌ దేశపు క్రిస్మస్‌ ఆచరణల్లో జ్ఞానులు ప్రధాన పాత్ర పోషిస్తారు. కొత్తగా జన్మించిన యేసుకు ఇవ్వడానికి జ్ఞానులు బహుమతులు తెచ్చారనే ప్రజాదరణ పొందిన నమ్మకం ప్రకారం, జనవరి 6న, డియాడి రాయాస్‌ (రాజుల రోజున) జ్ఞానులు స్పానిష్‌ పిల్లలకు బహుమతులిస్తారని భావించబడుతోంది. అయితే, ఎంతమంది జ్ఞానులు యేసును సందర్శించారో సువార్త వృత్తాంతం పేర్కొనడం లేదని చాలాకొద్ది మందికే తెలుసు. వాళ్లు రాజులు కాదుగాని, జ్యోతిష్కులని గుర్తించబడ్డారు. * అంతేకాదు, ఆ జ్ఞానులు వచ్చి వెళ్లిన తర్వాత, యేసును చంపాలనే ప్రయత్నంలో హేరోదు బేత్లెహేములో “రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల” బాలురనందరినీ వధించాడు. ఇది యేసు జన్మించిన చాలా రోజుల తర్వాత వారాయనను చూడడానికి వచ్చారని సూచిస్తోంది.​—⁠మత్తయి 2:11, 16.

12వ శతాబ్దం నుండి కొన్ని స్పానిష్‌ పట్టణాల్లో యేసు పుట్టుక, పశువుల కాపరులు బేత్లెహేమును సందర్శించడం, ఆ తర్వాత జ్ఞానులు సందర్శించడం వంటి సంఘటనలు రంగస్థల నాటికలుగా ప్రదర్శించబడేవి. ఈ రోజుల్లో, అనేక స్పానిష్‌ నగరాల్లో ప్రతీ జనవరి 5న, నగర కేంద్రాల్లో కాబల్‌గాటా లేదా ఊరేగింపు నిర్వహిస్తున్నారు, ఆ ఊరేగింపులో చాక్లెట్లు పంచుతూ “ముగ్గురు రాజులు” ఆడంబరంగా అలంకరించిన వాహనాల్లో తిరుగుతారు. సాంప్రదాయ క్రిస్మస్‌ అలంకరణలు, విల్లాన్సిసోస్‌ (కారల్స్‌) వంటివి పండుగను మరింత ఉత్తేజవంతం చేస్తాయి.

అనేక స్పానిష్‌ కుటుంబాలు క్రిస్మస్‌ రాత్రి (డిసెంబరు 24) ప్రత్యేక భోజనాన్ని ఆరగిస్తాయి. ఆ సాంప్రదాయ భోజనంలో ట్యూరొన్‌ (బాదం పప్పు, తేనెతో చేసిన మిఠాయిలు), మార్జిపాన్‌, డ్రైఫ్రూట్స్‌, మాంసం వేపుడు, చేపలు ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఈ పండుగకు ఒక దగ్గర సమకూడడానికి ప్రయత్నిస్తారు. జనవరి 6న ఉండే మరో సాంప్రదాయ భోజనంలో, కుటుంబ సభ్యులు రోస్కన్‌ డి రేయస్‌, లోపల సోర్‌ప్రెసా (బొమ్మ) ఉన్న గుండ్రని ఆకారంలోని “రాజుల” కేకును ఆరగిస్తారు. ఇలాంటి ఆచారమే రోమన్‌ కాలాల్లో ఉండేది. బానిసకు ఇచ్చే ఆహారంలో అలాంటి బొమ్మ గనుక ఉంటే, అది కేవలం ఒక్క రోజు కోసం “రాజుగా” ఉండే అవకాశం అతనికి లభించేది.

“సంవత్సరంలో సంతోషభరితమైన, తీరిక దొరకని సమయం”

స్థానికంగా ఏ ఆచారాలు వృద్ధి చెందినప్పటికీ, క్రిస్మస్‌ ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమైన పండుగగా తయారైంది. క్రిస్మస్‌, “ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు సంవత్సరంలో సంతోషభరితమైన, తీరిక దొరకని సమయం” అని ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా వర్ణిస్తోంది. అది ప్రయోజనకరమైనదేనా?

క్రీస్తు జననం నిశ్చయంగా చరిత్రలో ప్రసిద్ధమైన సంఘటనే. “ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము” అని దేవదూతలు ముందుగా ప్రకటించడం దాని ప్రాముఖ్యతను స్పష్టంగా రుజువుచేస్తోంది.

అయినప్పటికీ, “క్రైస్తవత్వపు తొలికాలాల్లో యేసు జననం ఒక పండుగలా ఆచరించబడలేదు” అని స్పానిష్‌ విలేఖరి క్వాన్‌ ఆర్యాస్‌ సూచిస్తున్నాడు. అదే నిజమైతే, క్రిస్మస్‌ ఆచరణ ఎక్కడనుండి వచ్చింది? యేసు జననాన్ని, జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి శ్రేష్ఠమైన మార్గమేమిటి? తర్వాతి ఆర్టికల్‌లో ఈ ప్రశ్నలకు జవాబులు లభిస్తాయి.

[అధస్సూచి]

^ పేరా 8 “పారసీకులు, మాదీయులు, కల్దీయుల్లో జ్ఞానులు తాంత్రిక శాస్త్రాన్ని, జ్యోతిశ్శాస్త్రాన్ని, వైద్యాన్ని ప్రోత్సహించిన అర్చకుల తరగతిగా రూపొందారు” అని లా సాగ్రతా ఎస్‌క్రిటురా​—⁠టెక్స్‌టో కొమెంటారియో పొర్‌ ప్రొఫెసొరెస్‌ డి లా కొంపెనియా డి కాసుస్‌ (ద హోలీ స్క్రిప్చర్‌​—⁠టెక్స్‌ట్‌ అండ్‌ కామెంట్రీ బై ప్రొఫెసర్స్‌ ఆఫ్‌ ద కంపెనీ ఆఫ్‌ జీసస్‌) వివరిస్తోంది. అయితే, మధ్య యుగాల నాటికి, బాల యేసును చూడడానికి వెళ్లిన ఆ జ్ఞానులను దివ్య పురుషులుగా పరిగణించి వారికి మెల్‌కియోర్‌, గాస్పర్‌, బాల్టజార్‌ అనే పేర్లు ఇవ్వబడ్డాయి. వారి అవశేషాలు జర్మనీలోని కొలోన్‌లోవున్న కెథడ్రిల్‌లో ఉంచబడ్డాయని చెప్పబడుతోంది.