మీ ప్రార్థనలు పరిస్థితిని మార్చగలవా?
మీ ప్రార్థనలు పరిస్థితిని మార్చగలవా?
మన అదుపులోలేని తీవ్ర పరిస్థితిని ఎదుర్కోని వారు మనలో ఎవరు ఉన్నారు? అలాంటి గంభీర పరిస్థితుల ఫలితంపై ప్రార్థన ప్రభావం చూపగలదని అపొస్తలుడైన పౌలుకు తెలుసని బైబిలు చూపిస్తోంది.
పౌలు అన్యాయంగా రోములోని చెరసాలలో వేయబడినప్పుడు, తనకోసం ప్రార్థించమని తోటి విశ్వాసులను అర్థిస్తూ ఇంకా ఇలా అన్నాడు: “నేను మరి త్వరగా మీయొద్దకు మరల వచ్చునట్లు ఈలాగు చేయవలెనని మరి యెక్కువగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను.” (హెబ్రీయులు 13:18, 19) మరో సందర్భంలో, త్వరగా విడుదల పొందడం కోసం తానుచేసే ప్రార్థనకు దేవుడు ప్రతిస్పందిస్తాడనే నమ్మకాన్ని పౌలు వ్యక్తపరిచాడు. (ఫిలేమోను 22) పౌలు త్వరలోనే విడుదల చేయబడి తిరిగి తన మిషనరీ యాత్రను ఆరంభించాడు.
అయితే ప్రార్థన మీ సమస్యల పరిణామాన్ని నిజంగా మార్చగలదా? బహుశా మార్చవచ్చు. అయితే ప్రార్థన కేవలం ఒక మతాచారం కాదని గుర్తుంచుకోండి. అది పరలోకమందున్న మన ప్రేమగల, శక్తిగల తండ్రితోచేసే వాస్తవమైన సంభాషణ. మన ప్రార్థనల్లో ఆయా అంశాలను ప్రత్యేకంగా చెప్పడానికి సంకోచించకూడదు, అయితే యెహోవా వాటికెలా ప్రతిస్పందిస్తాడో చూసేందుకు ఓపికగా వేచివుండాలి.
ప్రతీ ప్రార్థనకు దేవుడు నేరుగా ప్రతిస్పందించకపోవచ్చు, లేదా అన్ని సందర్భాల్లో మనం అనుకున్న విధంగా లేదా మనం ఆశించిన సమయంలో జవాబు ఇవ్వకపోవచ్చు. ఉదాహరణకు, పౌలు తన “శరీరములో ఒక ముల్లు” గురించి పదేపదే ప్రార్థించాడు. అదేదైనా దేవుడు పౌలు సమస్యను తొలగించలేదు, బదులుగా ఆయన బలపరిచే ఈ మాటలతో పౌలును ఓదార్చాడు: “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్న[ది].”—2 కొరింథీయులు 12:7-9.
ఒకానొక సమస్యను దేవుడు తొలగించకపోయినా, మనం ‘సహింపగలుగుటకు ఆయన తప్పించుకొను మార్గం కలుగజేస్తాడనే’ నమ్మకంతో ఉండవచ్చు. (1 కొరింథీయులు 10:13) దేవుడు త్వరలోనే మానవాళి బాధలన్నింటినీ తొలగిస్తాడు. ఈలోగా, ‘ప్రార్థన ఆలకించువాని’ వైపు తిరగడం పరిస్థితిని మార్చగలదు.—కీర్తన 65:2.