అబ్రాహాము మరియు శారా—మీరు వాళ్ళ విశ్వాసాన్ని అనుకరించవచ్చు!
అబ్రాహాము మరియు శారా—మీరు వాళ్ళ విశ్వాసాన్ని అనుకరించవచ్చు!
ఆయన ‘విశ్వాసముగలవారికందరికి తండ్రి’ అని పిలువబడ్డాడు. (రోమీయులు 4:11, NW) ఆయన ప్రియమైన భార్య కూడా విశ్వాసంగలది. (హెబ్రీయులు 11:11) వాళ్ళు పితరుడైన అబ్రాహాము ఆయన భార్య శారా, వాళ్ళిద్దరూ దైవభక్తిగలవాళ్ళు. వాళ్ళిద్దరూ విశ్వాసం విషయంలో అంత మంచి మాదిరులుగా ఎందుకున్నారు? వాళ్ళు సహించిన కొన్ని శ్రమలు ఏవి? వాళ్ళ జీవిత కథ మనకు ఎలా ఉపయోగపడుతుంది?
దేవుడు అబ్రాహామును తన ఇల్లు వదిలి వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు ఆయన విశ్వాసం ప్రదర్శించాడు. యెహోవా ఆయనకు ఇలా చెప్పాడు: “నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువులయొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.” (ఆదికాండము 12:1) విశ్వాసంగల పితరుడైన అబ్రాహాము ఆ ఆజ్ఞకు విధేయత చూపించాడు, ఎందుకంటే ఆయన గురించి మనం ఇలా చదువుతాము: “అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను.” (హెబ్రీయులు 11:8) అలా బయలుదేరి వెళ్ళడానికి ఆయన ఏమేమి చేయవలసి వచ్చిందో పరిశీలించండి.
అబ్రాహాము ఊరు అనే పట్టణంలో నివసించేవాడు, అది ఇప్పుడు దక్షిణ ఇరాక్‌లో ఉంది. ఊరు పట్టణం పర్షియా సింధుశాఖలోని దేశాలతో, బహుశా సింధు లోయతో కూడా వ్యాపారం చేసే వర్ధిల్లుతున్న మెసొపొతమియ కేంద్రంగా ఉండేది. అబ్రాహాము కాలంలో చాలామట్టుకు ఇళ్ళు ఇటుకలతో నిర్మించబడి ప్లాస్టరింగ్ చేయబడి సున్నం వేయబడి ఉండేవి అని ఊరు పట్టణాన్ని ఒక పద్ధతి ప్రకారం తవ్వి బయటకు తీసే పనిని నిర్దేశించిన సర్ లియోనార్డ్ వూలి వెల్లడి చేశారు. ఉదాహరణకు, ఒక సంపన్నుని ఇల్లు రెండంతస్తుల భవనం, దాని మధ్యలో రాళ్ళు అమర్చబడిన ప్రాంగణం ఉండేది. క్రింది అంతస్తులో ఆ ఇంటి నౌకర్లకు, అతిథులకు గదులు ఉండేవి. మొదటి అంతస్తులో చెక్క బాల్కనీ ఉండేది, అది ఆ ఇంటివారి గదులకు వెళ్ళడానికి మార్గంగా ఉపయోగపడేది. 10 నుండి 20 గదులతో ఉండే ఇలాంటి భవనాలు “ఎంతో విశాలంగా ఉండడమే కాక చక్కగా, సౌకర్యవంతంగా, ప్రాచ్య దేశాల ప్రమాణాల ప్రకారమైతే విలాసవంతంగా జీవించడానికి అనువుగా ఉండేవి” అని వూలి చెబుతున్నారు. అవి “ఖచ్చితంగా నాగరికులైన ప్రజల ఇళ్ళు, ఎంతో వృద్ధిచెందిన నగర జీవితపు అవసరాలకు తగినట్లుగా నిర్మించబడ్డాయి.” అబ్రాహాము శారాలు గుడారాల్లో నివసించడానికి అలాంటి ఇంటిని వదిలివచ్చారంటే వాళ్ళు యెహోవాకు విధేయత చూపించడానికి గొప్ప త్యాగమే చేశారు.
అబ్రాహాము తన కుటుంబంతోపాటు మొదట, ఉత్తర మెసొపొతమియలోని హారాను నగరానికి వెళ్ళాడు, ఆ తర్వాత అక్కడనుండి కనానుకు వెళ్ళాడు. అది దాదాపు 1,600 కిలోమీటర్ల ప్రయాణం, వయసు పైబడిన ఆ దంపతులకు అది కష్టమైన ప్రయాణమే మరి! హారానును ఆదికాండము 12:4.
విడిచివెళ్ళే సమయానికి అబ్రాహాముకు 75 సంవత్సరాలు, శారాకు 65 సంవత్సరాలు.—తాము ఊరును విడిచి వెళ్ళబోతున్నామని అబ్రాహాము శారాకు వెల్లడిచేసినప్పుడు ఆమె ఎలా భావించివుంటుంది? సౌకర్యవంతమైన ఇంటిలో లభించే భద్రతను వదిలి తెలియని ప్రాంతానికి, తమను శత్రుభావంతో చూసే అవకాశమున్న ప్రాంతానికి వెళ్ళడం, తమ జీవిత విధానంకంటే తక్కువ స్థాయిలోవున్న జీవితవిధానాన్ని అలవరచుకోవడం అనేవి ఆమెను కలవరపరచివుండవచ్చు. అయినప్పటికీ శారా అబ్రాహామును తన “యజమాని”గా భావించి నమ్రతతో ఆయనకు లోబడింది. (1 పేతురు 3:5, 6) అది శారా “అలవాటుగా ఆయనపట్ల కలిగివున్న గౌరవపూర్వకమైన దృక్పథాన్ని, ప్రవర్తనను” తెలియజేస్తుందని, “తలంపుల్లో, భావాల్లో ఆమెకున్న నిజమైన అలవాట్లకు” నిదర్శనమని కొంతమంది విద్వాంసులు పరిగణిస్తున్నారు. కానీ అంతకంటే ప్రాముఖ్యమైన విషయమేమిటంటే శారా యెహోవాపై విశ్వాసముంచింది. ఆమె చూపించిన నమ్రత మరియు విశ్వాసం క్రైస్తవ భార్యలకు చక్కని మాదిరిగా ఉన్నాయి.
నిజమే నేడు మనం దేవునికి విధేయత చూపించడానికి ఇల్లు వదిలి రమ్మని పిలువబడలేదు, అయినప్పటికీ కొంతమంది పూర్తికాల సువార్తికులు మరో దేశంలో సువార్తను ప్రకటించడానికి తమ స్వదేశాన్ని విడిచి వెళ్ళారు. మనం దేవుణ్ణి ఎక్కడ సేవించినప్పటికీ ఆధ్యాత్మిక విషయాలకు మన జీవితంలో మొదటి స్థానమిస్తే ఆయన మన అవసరాలు తీరుస్తాడు.—మత్తయి 6:25-33.
శారా గాని అబ్రాహాము గాని తాము తీసుకున్న నిర్ణయం విషయంలో ఆ తర్వాత పశ్చాత్తాపపడలేదు. “వారు ఏ దేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న యెడల మరల వెళ్లుటకు వారికి వీలు కలిగియుండును” అని అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు. కానీ వాళ్ళు తిరిగి వెళ్ళలేదు. యెహోవా “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనే” దృఢ నమ్మకంతో వాళ్ళు ఆయన వాగ్దానాలపై విశ్వాసముంచారు. మనం యెహోవాకు సంపూర్ణ భక్తితో సేవచేయడంలో కొనసాగాలంటే మనం కూడా ఆయన వాగ్దానాలపై విశ్వాసముంచాలి.—హెబ్రీయులు 11:6, 15, 16.
ఆధ్యాత్మిక, భౌతిక సంపదలు
అబ్రాహాము కనానుకు చేరుకున్న తర్వాత దేవుడు ఆయనకు ఇలా చెప్పాడు: “నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదను.” ఆదికాండము 12:7, 8) యెహోవా అబ్రాహామును సంపన్నుడిగా చేశాడు, ఆయన పరివారములో ఎంతోమంది ఉండేవారు. ఆయన ఒకసారి, తన ఇంట పుట్టిన బానిసలైన 318 మంది శిక్షణపొందిన పురుషులను కూడగట్టాడు కాబట్టి “ఆయన పరివారములో వెయ్యికంటే ఎక్కువమంది ఉండివుంటారు” అని సూచించబడుతోంది. కారణమేదైనప్పటికీ ప్రజలు ఆయనను “మహారాజు”గా పరిగణించారు.—ఆదికాండము 13:2; 14:14; 23:5, 6.
దానికి ప్రతిస్పందనగా అబ్రాహాము యెహోవాకు ఒక బలిపీఠము కట్టి “యెహోవా నామమున ప్రార్థన చే[శాడు].” (అబ్రాహాము తన పరివారములోనివారికి ‘నీతి న్యాయములు జరిగించడానికి యెహోవా మార్గమును గైకొనడాన్ని’ నేర్పిస్తూ దేవుణ్ణి ఆరాధించడంలో నడిపింపునిచ్చాడు. (ఆదికాండము 18:19) ప్రస్తుత దిన క్రైస్తవ కుటుంబ శిరస్సులు, యెహోవాపై ఆధారపడి నీతిగా నడుచుకోవడాన్ని తన ఇంటివారికి నేర్పించడంలో విజయం సాధించిన అబ్రాహాము మాదిరినుండి ప్రోత్సాహం పొందవచ్చు. అబ్రాహాము అలా చేసినందువల్ల, శారాకు దాసురాలైన ఐగుప్తుకు చెందిన హాగరు, అబ్రాహాము పెద్దదాసుడు, ఆయన కుమారుడు ఇస్సాకు యెహోవాపై ఆధారపడడంలో ఆశ్చర్యమేమీ లేదు.—ఆదికాండము 16:5, 13; 24:10-14; 25:21.
అబ్రాహాము సమాధానపరిచేవాడు
అబ్రాహాము జీవితంలోని సంఘటనలు ఆయనది దైవభక్తిగల వ్యక్తిత్వమని తెలియజేస్తున్నాయి. అబ్రాహాము తన పశువుల కాపరులకు తన సోదరుని కుమారుడైన లోతు పశువుల కాపరులకు మధ్యనున్న కలహాన్ని కొనసాగనిచ్చే బదులు, తాము వేరైతే బాగుంటుందని సలహా ఇవ్వడమే కాకుండా తనకంటే చిన్నవాడైన లోతును ముందుగా తనకు ఇష్టమైన స్థలాన్ని ఎంపిక చేసుకోమని ఆహ్వానించాడు. అబ్రాహాము సమాధానపరిచేవాడిగా ఉన్నాడు.—ఆదికాండము 13:5-13.
మనం ఎప్పుడైనా మన హక్కుల కోసం పోరాడడమో లేదా సమాధానాన్ని కాపాడడానికి రాజీ పడడమో ఈ రెండింటిలో ఏదైనా ఒకటి చేయవలసి వస్తే, అబ్రాహాము లోతు విషయంలో రాజీపడినందుకు యెహోవా అబ్రాహామును కష్టాలనుభవించనివ్వలేదని గుర్తుంచుకోవచ్చు. దానికి బదులుగా యెహోవా అబ్రాహాముకు కనుచూపు మేరలోవున్న స్థలాన్నంతటిని ఆయనకు, ఆయన సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. (ఆదికాండము 13:14-17) “సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు” అని యేసు చెప్పాడు.—మత్తయి 5:9.
అబ్రాహాము వారసుడిగా ఎవరు ఉంటారు?
సంతానము కలుగుతుందని వాగ్దానాలు చేయబడినప్పటికీ శారా గొడ్రాలిగానే ఉంది. అబ్రాహాము ఆ విషయమై దేవునికి ప్రార్థించాడు. తనకు ఉన్నదంతా తన సేవకుడైన ఎలీయెజెరుకు సంక్రమిస్తుందా? లేదు ఎందుకంటే యెహోవా ఇలా చెప్పాడు: “ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగును.”—ఆదికాండము 15:1-4.
అయినా కూడా అబ్రాహాము శారాలకు పిల్లలు పుట్టలేదు, 75 సంవత్సరాల శారా తనకు పిల్లలు పుడతారనే ఆశ వదులుకుంది. కాబట్టి ఆమె అబ్రాహాముతో ఇలా చెప్పింది: “ఇదిగో నేను పిల్లలు కనకుండ యెహోవా చేసి యున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము; ఒకవేళ ఆమెవలన నాకు సంతానము కలుగవచ్చును.” అప్పుడు అబ్రాహాము హాగరును తన రెండవ భార్యగా చేసుకొని ఆమెతో సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఆమె గర్భవతి అయ్యింది. హాగరు తాను గర్భవతినని తెలుసుకున్న వెంటనే తన యజమానురాలిని ఈసడించడం ప్రారంభించింది. శారా అబ్రాహాముకు మొరపెట్టుకొని హాగరును అవమానపరిచింది, అప్పుడు ఆ దాసి అక్కడనుండి పారిపోయింది.—ఆదికాండము 16:1-6.
అబ్రాహాము శారాలు తాము చేస్తున్నది సరైనదన్న నమ్మకంతోనే, తమ కాలంలో అంగీకారయోగ్యంగా పరిగణించబడిన పద్ధతిని అనుసరించారు. అయితే అబ్రాహాముకు సంతానం కలుగజేయడానికి యెహోవా ఎన్నుకున్న మార్గం అది కాదు. వివిధ పరిస్థితుల్లో కొన్ని పనులు చేయడం సరైనదేనని మన సంస్కృతి చెబుతుండవచ్చు అయితే యెహోవా వాటిని అంగీకరిస్తాడని దాని భావం కాదు. ఆయన మన పరిస్థితిని పూర్తిగా వేరే విధంగా దృష్టిస్తుండవచ్చు. కాబట్టి మనం యెహోవా మార్గనిర్దేశాన్ని కోరుతూ, మనం ఎలా వ్యవహరించాలని ఆయన కోరుకుంటున్నాడో సూచించమని ఆయనకు ప్రార్థించాలి.—కీర్తన 25:4, 5; 143:8, 10.
‘యెహోవాకు అసాధ్యమైనదేదీ’ లేదు
చివరకు హాగరు అబ్రాహాముకు ఇష్మాయేలు అనే కుమారుణ్ణి కన్నది. అయితే ఆయన వాగ్దానం చేయబడిన సంతానం కాదు. శారాకు వయసు పైబడినప్పటికీ ఆమే ఆ సంతానానికి జన్మనివ్వాలి.—ఆదికాండము 17:15, 16.
ఆదికాండము 17:17) ఒక దేవదూత ఆ సందేశాన్ని మళ్ళీ చెప్పినప్పుడు విన్న శారా ‘తనలో తానే నవ్వుకొంది.’ అయితే ‘యెహోవాకు అసాధ్యమైనదేదీ’ లేదు. ఆయన తాను కోరుకున్నదేదైనా చేస్తాడని మనం విశ్వాసంతో ఉండవచ్చు.—ఆదికాండము 18:12-14.
శారా అబ్రాహాముకు ఒక కుమారుణ్ణి కంటుందని దేవుడు చెప్పినప్పుడు “అబ్రాహాము సాగిలపడి నవ్వి—నూరేండ్లవానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అనుకొనెను.” (“విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.” (హెబ్రీయులు 11:11) కొంతకాలానికి శారా ఇస్సాకుకు జన్మనిచ్చింది, ఆయన పేరుకు “నవ్వు” అని అర్థం.
దేవుని వాగ్దానాలపై ప్రగాఢ విశ్వాసం
ఎంతోకాలంగా ఎదురు చూసిన సంతానం ఇస్సాకేనని యెహోవా తెలియజేశాడు. (ఆదికాండము 21:12) కాబట్టి దేవుడు అబ్రాహామును తన కుమారుణ్ణి బలి ఇవ్వమని కోరినప్పుడు ఆయన అవాక్కయి ఉంటాడు. అయినా కూడా దేవునిపై ప్రగాఢ విశ్వాసంతో ఉండడానికి అబ్రాహాముకు సరైన కారణాలు ఉన్నాయి. యెహోవా ఇస్సాకును మరణం నుండి పునరుత్థానం చేయలేడా? (హెబ్రీయులు 11:17-19) ఇస్సాకు జన్మించేందుకు వీలుగా దేవుడు అబ్రాహాము శారాల సంతానోత్పత్తి శక్తులను అద్భుతరీతిలో పునరుద్ధరించి తన శక్తిని నిరూపించుకోలేదా? దేవునికి తన వాగ్దానాలను నెరవేర్చే సామర్థ్యం ఉందన్న దృఢ నమ్మకంతో అబ్రాహాము ఆయనకు విధేయత చూపించడానికి సిద్ధపడ్డాడు. అయితే ఆయన తన కుమారుణ్ణి నిజంగానే బలి ఇవ్వకుండా ఆపుచేయబడ్డాడు. (ఆదికాండము 22:1-14) అయితే ఈ విషయంలో అబ్రాహాము పోషించిన పాత్ర, ‘తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించడానికి’ యెహోవా దేవునికి ఎంత కష్టంగా ఉండివుంటుందో అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.—యోహాను 3:16; మత్తయి 20:28.
అబ్రాహాము దేవునిపై తనకున్న విశ్వాసాన్ని బట్టి, యెహోవా వాగ్దానాలకు వారసుడైన ఇస్సాకు కనాను దేశానికి చెందిన అబద్ధ ఆరాధికురాలిని వివాహం చేసుకోకూడదని అర్థం చేసుకున్నాడు. తమ కుమారుడు గానీ కుమార్తె గానీ యెహోవాను సేవించని వ్యక్తిని వివాహం చేసుకోవడానికి దైవభక్తిగల తల్లిదండ్రులు ఎలా అంగీకరించగలరు? కాబట్టి అబ్రాహాము 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోవున్న మెసొపొతమియలోని తన బంధువుల నుండి ఇస్సాకుకు తగిన భార్యను వెదకడానికి ప్రయత్నించాడు. ఇస్సాకుకు భార్యగా ఉండడానికి, మెస్సీయకు పూర్వికురాలిగా ఉండడానికి తాను రిబ్కాను ఎంపిక చేశానని సూచించి దేవుడు అబ్రాహాము ప్రయత్నాలను ఆశీర్వదించాడు. అవును “అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను.”—ఆదికాండము 24:1-67; మత్తయి 1:1, 2.
జనములన్నింటికీ ఆశీర్వాదాలు
పరీక్షలను తాళుకోవడంలో, దేవుని వాగ్దానాలపై విశ్వాసముంచడంలో అబ్రాహాము శారాలు మాదిరికరంగా ఉన్నారు. అలాంటి వాగ్దానాల నెరవేర్పుకు మానవాళి నిరంతర భవిష్యత్తుకు సంబంధం ఉంది ఎందుకంటే యెహోవా ఆదికాండము 22:18.
అబ్రాహాముకు ఇలా హామీ ఇచ్చాడు: “నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.”—అబ్రాహాము శారాలు మనలాగే అపరిపూర్ణులైన మానవులు. కానీ వారికి దేవుని చిత్తమేమిటో స్పష్టంగా అర్థమైనప్పుడు వాళ్ళు వెంటనే దానికి అనుగుణంగా ప్రవర్తించారు, అలా చేయడానికి ఎలాంటి త్యాగాలు చేయవలసి వచ్చినా వాళ్ళు వెనకాడలేదు. అందుకే అబ్రాహాము ‘దేవుని స్నేహితునిగా,’ శారా ‘దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీగా’ గుర్తుండిపోయారు. (యాకోబు 2:23; 1 పేతురు 3:5) అబ్రాహాము శారాల విశ్వాసాన్ని అనుకరించడానికి కృషి చేయడం ద్వారా మనం కూడా దేవునితో అమూల్యమైన సన్నిహితత్వాన్ని అనుభవించవచ్చు. యెహోవా అబ్రాహాముకు చేసిన అమూల్యమైన వాగ్దానాల నుండి కూడా మనం ప్రయోజనం పొందవచ్చు.—ఆదికాండము 17:7.
[26వ పేజీలోని చిత్రం]
అబ్రాహాము శారాల విశ్వాసం కారణంగా యెహోవా వారికి వృద్ధాప్యంలో కుమారుణ్ణిచ్చి ఆశీర్వదించాడు
[28వ పేజీలోని చిత్రం]
అబ్రాహాము మాదిరి, యెహోవా తన అద్వితీయ కుమారుడు చనిపోవడానికి అనుమతించడమనేది ఆయనపై ఎలాంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది