పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
నిర్గమకాండము 4:24-26లో వ్రాయబడివున్న సంఘటన జరిగినప్పుడు ఏమి సంభవించింది, ఎవరి ప్రాణం ప్రమాదంలో ఉంది?
మోషే తన భార్య సిప్పోరా, తన కుమారులైన గెర్షోము, ఎలీయెజెరులతో ఐగుప్తుకువెళ్లే మార్గంలో ఉన్నప్పుడు ఈ క్రింది సంఘటన జరిగింది: “అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసికొని తన కుమారునికి సున్నతిచేసి అతని పాదములయొద్ద అది పడవేసి—నిజముగా నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను; అంతట ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె—ఈ సున్నతినిబట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను.” (నిర్గమకాండము 4:20, 24-26) ఈ వాక్యం అర్థం చేసుకోవడానికి కష్టంగావుండి, దాని అర్థమేమిటో ఖచ్చితంగా చెప్పడానికి సాధ్యం కాకపోయినా, ఈ వచనాలపై లేఖనాలు కొంత వివరణ ఇస్తున్నాయి.
ఆ వృత్తాంతం ఎవరి ప్రాణం ప్రమాదంలో ఉందో సవివరంగా చెప్పడం లేదు. అయితే, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను తోడుకొనిరమ్మని దేవుడు అంతక్రితమే మోషేను ఆజ్ఞాపించాడు కాబట్టి అది మోషే ప్రాణం కాదని మనం న్యాయంగా చెప్పవచ్చు. (నిర్గమకాండము 3:10) ఆ నియామకం నెరవేర్చడానికి వెళుతుండగా దేవుని దూత మోషేను చంపచూడడం అసంభవం. కాబట్టి అతని కుమారుల్లో ఒకరి ప్రాణం ప్రమాదంలో ఉండాలి. సున్నతి గురించి అంతకుముందు అబ్రాహాముకు ఇవ్వబడిన నియమం ఇలా తెలియజేసింది: “సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలోనుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరియున్నాడు.” (ఆదికాండము 17:14) మోషే తన కుమారునికి సున్నతి చేయడాన్ని బహుశా నిర్లక్ష్యం చేశాడు. అందువల్ల ఆ బాలుణ్ణి యెహోవా దూత చంపజూశాడు.
పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో సిప్పోరా తన కుమారుని గోప్యాంగచర్మం కోసినప్పుడు అది ఎవరిపాదాలను తాకింది? సున్నతిపొందని కుమారుని చంపే శక్తి యెహోవా దూతకు మాత్రమే ఉంది. కాబట్టి, ఆ నిబంధనకు తాను కట్టుబడ్డాను అనేందుకు రుజువుగా సిప్పోరా ఆ గోప్యాంగచర్మాన్ని ఆ దేవదూత పాదాలు తాకేలాచేసి ఉండవచ్చు.
“నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివి” అని సిప్పోరా పలికిన మాటలు అసాధారణం. ఆ మాటలు ఆమె గురించి ఏమి సూచిస్తున్నాయి? సున్నతి నిబంధనా నియమాలకు కట్టుబడడం ద్వారా యెహోవాతో తనకు నిబంధనా సంబంధం ఉందని సిప్పోరా అంగీకరించింది. ఇశ్రాయేలీయులతో ఆ తర్వాత చేయబడిన ధర్మశాస్త్ర నిబంధన, ఒక నిబంధన సంబంధంలో యెహోవాను పెనిమిటిగా అవతలి పక్షంవారిని భార్యగా తలంచవచ్చని చూపించింది. (యిర్మీయా 31:32) అందువల్ల, “నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివి” అని యెహోవాను (ఆయన ప్రతినిధియైన దేవదూత ద్వారా) సంబోధిస్తూ, సిప్పోరా ఆ నిబంధనా షరతులకు తాను స్వయంగా లోబడుతున్నానని అంగీకరిస్తున్నట్లు అనిపిస్తోంది. యెహోవా దేవుడు పెనిమిటిగా, సున్నతి నిబంధనలో భార్యగా ఆమె తన స్థానాన్ని అంగీకరించినట్టుగా ఉంది. ఏదేమైనా, దేవుని నియమానికి విధేయంగా ఆమె తీసుకున్న నిర్ణయాత్మక చర్య కారణంగా అమె కుమారుని ప్రాణం ప్రమాదం నుండి తప్పించబడింది.