కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ప్రాచీన ఇశ్రాయేలునందు లేవీయులకు స్వాస్థ్యము లేదుకదా, అలాంటప్పుడు యిర్మీయా 32:7లో వ్రాయబడివున్నట్లు లేవీయుడైన హనమేలు తన సమీపజ్ఞాతియైన యిర్మీయాకు తన పొలం ఎలా అమ్మగలడు?

లేవీయుల గురించి యెహోవా అహరోనుతో ఇలా అన్నాడు: “వారి [ఇశ్రాయేలు] దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు; వారి మధ్యను నీకు పాలు ఉండదు.” (సంఖ్యాకాండము 18:​20) అయితే, వాగ్దాన దేశమంతటా చెదరివున్న 48 పట్టణములు వాటిలోని పొలాలు లేవీయులకు నియమించబడ్డాయి. యిర్మీయా సొంత పట్టణమైన అనాతోతు, ‘యాజకులైన అహరోను వంశీకులకు’ నియమించబడిన పట్టణాల్లో ఒకటి.​—⁠యెహోషువ 21:13-19; సంఖ్యాకాండము 35:1-8; 1 దినవృత్తాంతములు 6:54, 60.

లేవీయకాండము 25:32-34లో లేవీయుల ఆస్తిని “విడిపించే అధికారము” గురించి యెహోవా ప్రత్యేక ఆదేశాలిచ్చాడని మనం గమనిస్తాం. కాబట్టి ఆ యా లేవీ కుటుంబాలకు, తమ కోసం నిర్దిష్టంగా కేటాయించబడిన భాగాలకు సొంతదారులయ్యే, వాటిని ఉపయోగించుకునే, వాటిని అమ్ముకునే వారసత్వ హక్కులు ఉండేవని స్పష్టమవుతోంది. దానిలో సహజంగానే ఆస్తి క్రయ విక్రయాలు ఇమిడి ఉంటాయి. * లేవీయులకు కూడా చాలా విషయాల్లో ఇశ్రాయేలీయుల ఇతర గోత్రాలవారి మాదిరిగానే సొంత ఆస్తి ఉండేది, వారు దానిని వాడుకునేవారు.

లేవీయుల ఆస్తికి సంబంధించిన అలాంటి యజమానత్వపు హక్కు బహుశా కుటుంబ వారసత్వం ద్వారా సంక్రమిస్తూ ఉండవచ్చు. అయితే ‘విడిపించే అధికారం’ విషయంలో మాత్రం మారక వ్యవహారాలు లేవీయుల మధ్య మాత్రమే జరగడానికి పరిమితం చేయబడ్డాయి. అలాగే ‘వారి పట్టణముల ప్రాంతభూములు వారికి శాశ్వత స్వాస్థ్యమైనందున’ వాటిని అమ్ముకోకూడదు కాబట్టి భూముల క్రయ విక్రయాలు ఆయా పట్టణాల్లోవున్న ఆస్తికి మాత్రమే వర్తిస్తున్నట్లు కనిపిస్తోంది.​—⁠లేవీయకాండము 25:32, 34.

కాబట్టి హనమేలు దగ్గరనుండి యిర్మీయా తిరిగికొన్న పొలం ఈ రీతిలో విడిపించే అధికారపు పద్ధతిలో ఆయనకు అమ్మబడే అవకాశముంది. అది ఆ పట్టణపు సరిహద్దులోనే ఉండవచ్చు. ‘భూమి’ హనమేలుకు చెందినదని, ‘విమోచకుని ధర్మము’ యిర్మీయాకు ఉందని యెహోవాయే స్వయంగా నొక్కిచెప్పాడు. (యిర్మీయా 32:​6, 7) బబులోనులో చెరవాసపు కాలం తర్వాత ఇశ్రాయేలీయులు తమ దేశాన్ని మళ్ళీ స్వాస్థ్యంగా పొందడానికి తిరిగి వస్తారనే తన వాగ్దానాన్ని బలోపేతం చేయడానికి యెహోవా ఈ మార్పిడిని సూచనార్థకంగా ఉపయోగించాడు.​—⁠యిర్మీయా 32:​13-15.

అనాతోతులో హనమేలు అక్రమంగా తన ఆస్తి సంపాదించుకున్నాడనడానికి ఎలాంటి సూచనా లేదు. అనాతోతులో తన పొలం కొనమని యిర్మీయాను అడగడంలో ఆయన యెహోవా నియమాన్ని ఉల్లంఘించాడని లేదా ఆ పొలం కొనడంలో తన విమోచకుని ధర్మాన్ని యిర్మీయా దుర్వినియోగం చేశాడని సూచించేదీ ఏదీ లేదు.​—⁠యిర్మీయా 32:8-15.

[అధస్సూచి]

^ పేరా 4 సా.శ. మొదటి శతాబ్దంలో, లేవీయుడైన బర్నబా తన భూమి అమ్మి దాని వెలను యెరూషలేములో ఉన్న బీదలైన క్రీస్తు అనుచరుల సహాయార్థమై విరాళంగా ఇచ్చాడు. ఆ భూమి బహుశా పాలస్తీనాలో లేదా కుప్రలో ఉండవచ్చు. లేదా అది యెరూషలేము పరిసరాల్లో బర్నబా సంపాదించుకున్న స్మశాన స్థలంకావచ్చు.​—⁠అపొస్తలుల కార్యములు 4:34-37.