మీరు ఎవరి వాగ్దానాలు నమ్మవచ్చు?
మీరు ఎవరి వాగ్దానాలు నమ్మవచ్చు?
“అప్పుడు ఆయన స్థాయికి తగ్గట్టు గొప్ప వాగ్దానాలు చేశాడు; కానీ ఆ వాగ్దానాలన్నీ ఆయనతోపాటే మట్టిలో కలిసిపోయాయి.”—విలియమ్ షేక్స్పియర్ వ్రాసిన, కింగ్ హెన్రీ ది ఎయిత్.
షేక్స్పియర్ ఆపాదించిన ఆ గొప్ప వాగ్దానాలు ఆంగ్లేయ కార్డినల్ థామస్ వోల్సీ చేసినవి, అతను 16వ శతాబ్దంలో ఇంగ్లాండులో తిరుగులేని రాజకీయ అధికారం చెలాయించాడు. తాము నేడు వింటున్న అనేక వాగ్దానాలకూ షేక్స్పియర్ వర్ణన అన్వయిస్తుందని కొందరంటారు. పదేపదే ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేయబడుతున్నాయి గానీ వారికి లభించేది మాత్రం శూన్యం. అందువల్ల, ఎలాంటి వాగ్దానాల విషయంలోనైనా వారెందుకు సంశయాత్మకంగా తయారయ్యారో అర్థంచేసుకోవడం కష్టం కాదు.
వాగ్దానభంగాలు ఎక్కువయ్యాయి
బాల్కన్ దేశాల్లో భీకర పోరాటం జరుగుతున్న 1990వ దశాబ్ద కాలంలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి బోస్నియా పట్టణమైన స్రేబ్రెనేట్సెను “రక్షిత ప్రాంతంగా” ప్రకటించింది. అంతర్జాతీయ సమాజం ద్వారా ఇవ్వబడిన ఆ హామీ నమ్మదగినదిగా అనిపించింది. స్రేబ్రెనేట్సెలోని వేలాదిమంది ముస్లిమ్ శరణార్థులు కూడా అలాగే నమ్మారు. అయితే చివరకు ఆ ప్రాంతం రక్షిత నిలయంగా ఉంటుందనే వాగ్దానానికి బొత్తిగా అర్థంలేకుండా పోయింది. (కీర్తన 146:3) 1995లో ముట్టడి దళాలు ఐ.రా.స. బలగాలను పక్కకు నెట్టేసి ఆ పట్టణాన్ని ఆక్రమించుకున్నాయి. 6,000లకు పైగా ముస్లిమ్‌లు అదృశ్యంకాగా కనీసం 1,200 మంది ముస్లిమ్ పౌరులు హతమార్చబడ్డారు.
జీవితంలోని ప్రతీ అంశం వాగ్దానభంగాలతో నిండిపోయింది. “తప్పుదోవపట్టించే, అబద్ధాలతో నిండివుండే లెక్కలేనన్ని వాణిజ్య ప్రకటనలతో” తాము మోసగించబడుతున్నామని నేటి ప్రజానీకం భావిస్తోంది. “అనేకమంది రాజకీయ నాయకులు ముమ్మరంగా చేసిన వాగ్దానభంగాలతో” వారు నిరాశ చెందుతున్నారు. (ద న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, 15వ సంపుటి, 37వ పేజీ) తమ మందలను సంరక్షిస్తామని వాగ్దానంచేసే నమ్మిన మతనాయకులే వారిని నికృష్టంగా మోసగిస్తున్నారు. కనికరం, ఇతరులపట్ల శ్రద్ధతో నడిపించబడాలని భావించే విద్య, వైద్య వృత్తుల్లో సైతం కొందరు ఇతరులను మోసం చేసి నమ్మకద్రోహం చేశారు, ఇంకా ఘోరంగా తమ సంరక్షణలో ఉన్నవారిని హతమార్చారు. కాబట్టి ప్రతీమాట నమ్మకూడదని బైబిలు మనలను హెచ్చరించడంలో ఆశ్చర్యం లేదు!—సామెతలు 14:15.
నెరవేర్చబడిన వాగ్దానాలు
అనేకులు కొన్నిసార్లు తామెంత త్యాగం చేయవలసి వచ్చినా, తమ మాట నిలబెట్టుకుంటారు. (కీర్తన 15:4) వారి మాటే వారి పవిత్ర హామీ, వారు దానిని నిలబెట్టుకుంటారు. మరికొందరు స్వచ్ఛమైన ఉద్దేశాలతో తమ వాగ్దానాలు నెరవేర్చాలని నిష్కపటంగా కోరుకుంటారు. తాము వాగ్దానం చేసింది చేయడానికి వారు సుముఖంగా, సిద్ధంగా ఉంటారు కానీ వారలా చేయలేరు. ఎంత ఉదాత్త పథకాలైనా పరిస్థితులు ఆశాభంగం కలిగించవచ్చు.—ప్రసంగి 9:11.
కారణమేదైనా, అసలు విషయమేమంటే చాలామందికి ఎవరి వాగ్దానాలైనా నమ్మడం చాలా కష్టం. అందుకే ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది: మనం నమ్మగల వాగ్దానాలు ఏమైనా ఉన్నాయా? అవును ఉన్నాయి. దేవుని వాక్యమైన బైబిల్లోవున్న వాగ్దానాలు మనం నమ్మవచ్చు. ఈ అంశం మీద తర్వాతి ఆర్టికల్ ఏమి చెబుతుందో ఎందుకు పరిశీలించకూడదు? దేవుని వాగ్దానాలను మనం నిజంగా నమ్మగలమని ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన లక్షలాదిమందివలెనే మీరూ ఓ నిర్ధారణకు రావచ్చు.
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
AP Photo/Amel Emric