కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

అపవాదియగు సాతానుకు మానవ మనస్సును చదివే సామర్థ్యం ఉందా?

ఈ విషయం గురించి మనం ఖచ్చితంగా చెప్పలేకపోయినా సాతానుకు గానీ అతని దయ్యాలకు గానీ మన ఆలోచనలను చదివే సామర్థ్యం లేనట్లే అనిపిస్తోంది.

సాతానుకు ఇవ్వబడిన వర్ణణాత్మకమైన పేర్లను పరిశీలించండి. అతను సాతాను (విరోధి), అపవాది (కొండెములు చెప్పేవాడు), సర్పము (మోసం చేసే వ్యక్తికి సమానార్థంగల పదం), శోధకుడు, అబద్ధికుడు అని పిలువబడ్డాడు. (యోబు 1:6; మత్తయి 4:3; యోహాను 8:44; 2 కొరింథీయులు 11:3; ప్రకటన 12:⁠9) ఈ వర్ణణాత్మక పేర్లలో ఏదీ కూడా సాతానుకు మనస్సులను చదివే సామర్థ్యం ఉందని సూచించడం లేదు.

అయితే అతనికి విరుద్ధంగా యెహోవా దేవుడు “హృదయ పరిశోధకుడు” అని వర్ణించబడ్డాడు. (సామెతలు 17:3; 1 సమూయేలు 16:7; 1 దినవృత్తాంతములు 29:​17) “ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని [యెహోవా] కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది” అని హెబ్రీయులు 4:13వ వచనం తెలియజేస్తోంది. యెహోవా ఇలా హృదయాలను పరిశోధించే సామర్థ్యాన్ని తన కుమారుడైన యేసుకు అనుగ్రహించడంలో ఆశ్చర్యం లేదు. పునరుత్థానుడైన యేసు ఇలా అన్నాడు: “అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే . . . మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.”​—⁠ప్రకటన 2:23.

సాతాను మనుష్యుల హృదయాలను, మనస్సులను పరిశీలించగలడని బైబిలు చెప్పడం లేదు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది ఎందుకంటే క్రైస్తవులు ‘సాతాను తంత్రములను ఎరుగనివారుకారు’ అని అపొస్తలుడైన పౌలు మనకు హామీ ఇస్తున్నాడు. (2 కొరింథీయులు 2:​11) కాబట్టి మనకు తెలియని అసాధారణమైన సామర్థ్యం ఏదో సాతానుకు ఉందని మనం భయపడాల్సిన అవసరం లేదు.

అంటే దానర్థం మన శత్రువు మన బలహీనతలను గ్రహించలేడని కాదు. సాతాను ఎంతోకాలంగా మానవ ప్రవర్తనను అధ్యయనం చేస్తున్నాడు. మనం ఎలాంటి ప్రవర్తనా ప్రమాణాలను అనుసరిస్తామో గ్రహించడానికి, మనం ఎలాంటి వినోదాన్ని ఇష్టపడతామో గమనించడానికి, మనం ఏ విషయాల గురించి మాట్లాడతామో వినడానికి మనస్సులను చదివే సామర్థ్యమే అవసరం లేదు. మన ముఖకవళికలు, మన భంగిమ కూడా మనమేమి ఆలోచిస్తున్నామో, ఎలా భావిస్తున్నామో సూచించగలవు.

సాధారణంగా సాతాను ఏదెను తోటలో ఉపయోగించిన పన్నాగాలనే అంటే అబద్ధాలు, మోసం, తప్పుడు సమాచారం వంటి వాటిని ఉపయోగిస్తాడు. (ఆదికాండము 3:​1-5) సాతాను తమ మనస్సులను చదువుతాడని క్రైస్తవులు భయపడవలసిన అవసరం లేదు. అయితే అతను తమ మనస్సులో ఎటువంటి తలంపులను నాటడానికి ప్రయత్నిస్తాడో వారు గంభీరంగా ఆలోచించాలి. క్రైస్తవులు “చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీను[లుగా]” తయారవ్వాలని అతను కోరుకుంటున్నాడు. (1 తిమోతి 6:⁠5) సాతాను లోకం, చెడు ప్రభావాన్ని చూపే సమాచారాన్ని, వినోదాన్ని సమృద్ధిగా అందిస్తుండడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆ దాడిని తట్టుకొని నిలబడడానికి క్రైస్తవులు “రక్షణయను శిరస్త్రాణమును” ధరించి తమ మనస్సులను కాపాడుకోవాలి. (ఎఫెసీయులు 6:​17) వారు తమ మనస్సులను బైబిలు సత్యాలతో నింపుకొంటూ, సాతాను లోకపు హీనమైన ప్రభావాలతో అనవసరమైన సంబంధాలకు దూరంగా ఉండడం ద్వారా తమ మనస్సులను కాపాడుకుంటారు.

సాతాను ఒక భయంకరమైన శత్రువు. అయితే మనం అతని గురించి, అతని దయ్యాల గురించి అనారోగ్యకరంగా భయపడాల్సిన అవసరం లేదు. యాకోబు 4:7 మనకు ఇలా హామీ ఇస్తుంది: “అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.” మనం ఈ హితబోధను పాటిస్తే, మనం కూడా యేసువలే మనతో సాతానుకు సంబంధమేమీ లేదని నిర్భయంగా చెప్పవచ్చు.​—⁠యోహాను 14:⁠30.