టెర్టూలియన్ యొక్క వైరుద్ధ్యం
టెర్టూలియన్ యొక్క వైరుద్ధ్యం
‘క్రైస్తవునికి, తత్వజ్ఞుడికి మధ్య ఏమైనా పోలిక ఉందా? సత్యాన్ని భ్రష్టుపట్టించే వ్యక్తికి, దాన్ని పూర్వస్థితికి తెచ్చి బోధించే వ్యక్తికి మధ్య పోలికా? తత్వాన్ని బోధించే కేంద్రానికి, చర్చికి మధ్య ఏమిటి ఒప్పందం?’ అలాంటి సవాలుచేసే ప్రశ్నలను రెండవ, మూడవ శతాబ్దాల మధ్యకాలంలోని రచయిత టెర్టూలియన్ లేవదీశాడు. ఆయన, “చర్చి చరిత్రకు, ఆయన కాలంలో బోధించబడిన సిద్ధాంతాలు పుట్టడానికి గల అనేక మూలాధారాల్లో ఒక్కడు” అని పేరుగాంచాడు. దాదాపు మత జీవితానికి సంబంధించిన ఏ కోణం కూడా ఆయన దృష్టిలో పడకుండా పోలేదు.
“దేవునిలో ప్రత్యేకత లేనప్పుడు, ప్రత్యేకించి ఆయన చాలా గొప్పవాడు.” “[దేవుని కుమారుని మరణం] నిస్సందేహంగా నమ్మాల్సిందే, ఎందుకంటే అది తర్కరహితమైనది.” “[యేసు] సమాధి చేయబడి, మళ్ళీ లేచాడు; ఆ ఘటన విశ్వసనీయమైనదే, ఎందుకంటే అది అసాధ్యమైనది,” వంటి వైరుద్ధ్యమైన లేక విరుద్ధంగా కనబడే వ్యాఖ్యానాలకు టెర్టూలియన్ బాగా పేరుగాంచి ఉండవచ్చు.
టెర్టూలియన్ వైరుద్ధ్యానికి ఆయన వ్యాఖ్యానాలు మాత్రమే కారణం కాదు. తన రచనలు సత్యాన్ని కాపాడి, చర్చి యథార్థతను దాని సిద్ధాంతాలను నిలబెడతాయని ఆయన ఉద్దేశించినప్పటికీ, వాస్తవానికి ఆయన సత్య బోధలను భ్రష్టుపట్టించాడు. క్రైస్తవమత సామ్రాజ్యంపై ఆయన చూపించిన ప్రముఖ ప్రభావం ఒక వాదముగా మారింది, ఆయన తర్వాతి రచయితలు దాన్ని ఆధారం చేసుకొని త్రిత్వ సిద్ధాంతాన్ని రూపొందించారు. అదెలా జరిగిందో క్షుణ్ణంగా తెలుసుకోవడానికి, మొదట మనం టెర్టూలియన్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
“చురుకుదనం లేకుండా ఉండడం ఆయనకు చేతకాదు”
టెర్టూలియన్ జీవితం గురించి చాలా తక్కువగా తెలుసు. అనేకమంది విద్వాంసులు ఆయన సుమారు సా.శ. 160 లో, ఉత్తర ఆఫ్రికాలోనున్న కార్తేజ్‌లో జన్మించాడని ఒప్పుకుంటారు. ఆయన చక్కని విద్యావేత్త, ఆయన తన కాలంలోని తత్త్వజ్ఞాన వర్గాల్లో ముఖ్యమైన వాటితో బాగా పరిచయం ఉన్నవాడని రుజువులు చూపిస్తున్నాయి. ఆయన క్రైస్తవత్వం వైపు ఆకర్షించబడడానికి కారణం, క్రైస్తవులమని చెప్పుకొనేవారు తమ విశ్వాసం కోసం మరణించడానికి కూడా వెనుకాడకపోవడమే అని స్పష్టమవుతుంది. క్రైస్తవ మతం కోసం ప్రాణత్యాగం చేయడం గురించి ఆయన ఇలా అడిగాడు: “ప్రాణత్యాగం చేయాలనుకునే వారెవరూ, అలా చేసేలా పురికొల్పుతున్నదేమిటని అడిగేందుకు ప్రేరేపించబడలేదా? అలా విచారించిన తర్వాత మన సిద్ధాంతాలను ఎవరు మాత్రం హత్తుకోరు?”
టెర్టూలియన్ నామమాత్రపు క్రైస్తవత్వానికి మారిన తర్వాత, ఆయన క్లుప్తంగా చమత్కారంగా వ్యాఖ్యానించే నైపుణ్యంగల ఒక సృజనాత్మకమైన రచయిత అయ్యాడు. “[ఆయనలో,] వేదాంతుల్లో చాలా అరుదుగా ఉండే సామర్థ్యం ఉంది,” అని చర్చి ఫాదర్లు (ఆంగ్లం) అనే పుస్తకం వ్యాఖ్యానిస్తోంది. “చురుకుదనం లేకుండా ఉండడం ఆయనకు చేతకాదు.” ఒక విద్వాంసుడు ఇలా అన్నాడు: “టెర్టూలియన్‌లో వాక్యాలకు బదులు పదాలు చెప్పే ఒక వరం [ఉండేది], ఆయన వాదాలకంటే ఆయన చమత్కారాలను అర్థం చేసుకోవడం చాలా సులభం. బహుశా ఇందుకే కావచ్చు ఆయన చాలా తరచుగా ప్రస్తావించబడ్డాడు, ఆయన మూలపాఠాల నుండి పొడవైన భాగాలు చాలా అరుదుగా ఉల్లేఖించబడ్డాయి.”
క్రైస్తవమతాన్ని రక్షించేందుకు
టెర్టూలియన్ వ్రాసిన అత్యంత ప్రసిద్ధికెక్కిన గ్రంథం అపాలజీ, నామమాత్రపు క్రైస్తవమతాన్ని కాపాడే సాహిత్యాల్లో అత్యంత శక్తివంతమైనదిగా అది పరిగణించబడుతోంది. క్రైస్తవులు తరచుగా మూఢవిశ్వాసం గల మూకలకు బలవుతున్న కాలంలో అది వ్రాయబడింది. ఆ క్రైస్తవులను రక్షించడానికి టెర్టూలియన్ ముందుకు వచ్చి, వారిపట్ల మూర్ఖత్వంతో
వ్యవహరిస్తున్నందుకు అభ్యంతరాన్ని ప్రకటించాడు. ఆయనిలా అన్నాడు: “ప్రజలకు కలుగుతున్న ప్రతి విపత్తుకు, ప్రతి దురదృష్టానికి క్రైస్తవులే కారణమన్నట్టు [వ్యతిరేకులు] భావిస్తున్నారు . . . నైలు జలాలు పొలాలకు పారలేకపోయినా, వాతావరణం మారకపోయినా, భూకంపంగానీ, కరవుగానీ, ఏ మహామారిగానీ వచ్చినా—వెంటనే ఇలాంటి కేకలు వినిపించేవి: ‘క్రైస్తవులను పట్టుకొని సింహాలకు వేయండి!’”క్రైస్తవులు ప్రభుత్వంపట్ల విశ్వాసంగా ఉండరని తరచుగా నిందించబడినప్పటికీ, నిజానికి రాజ్యంలోకెల్లా వాళ్ళే అత్యంత విశ్వసనీయులైన పౌరులు అని చూపించడానికి టెర్టూలియన్ బాగా కృషి చేశాడు. రోమా ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి చేయబడిన కొన్ని ప్రయత్నాల గురించి ప్రస్తావించిన తర్వాత, ఆ కుట్రదారులు నిజానికి క్రైస్తవేతరుల నుండే పుట్టుకువచ్చారు కానీ, క్రైస్తవమతం నుండి కాదని ఆయన తన వ్యతిరేకులకు జ్ఞాపకం చేశాడు. క్రైస్తవులకు మరణశిక్ష విధించబడినప్పుడు, నిజానికి దేశమే నష్టపోతోందని టెర్టూలియన్ సూచించాడు.
టెర్టూలియన్ వ్రాసిన ఇతర గ్రంథాలు క్రైస్తవ జీవన విధానానికి సంబంధించినవి. ఉదాహరణకు, టెర్టూలియన్ ఆన్ ద షోస్ అనే తన వ్యాఖ్యానంలో, క్రైస్తవేతర క్రీడలు, నాటకాల వంటి కొన్ని వినోద స్థలాల్లో ఉండడం గురించి మందలించాడు. క్రొత్తగా మతమార్పిడి చేసుకున్నవారు, బైబిలు బోధ కోసం సమావేశమై ఆ తర్వాత క్రైస్తవేతర ఆటలకు హాజరవ్వడంలో తప్పేమీ లేదని భావించిన వారు అక్కడ ఉండి ఉండవచ్చు. వారి ఆలోచనా సామర్థ్యాన్ని ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తూ, టెర్టూలియన్ ఇలా వ్రాశాడు: “దేవుని చర్చినుండి సాతాను చర్చికి అంటే ఆకాశం నుండి పందులదొడ్డికి వెళ్ళిపోవడం ఎంత జుగుప్సాకరం.” ఆయనింకా ఇలా అన్నాడు: “మీరు చర్యల్లో తిరస్కరించేదాన్ని మాటల్లోనూ తిరస్కరించాలి.”
సత్యాన్ని కాపాడే సమయంలోనే దాన్ని భ్రష్టు పట్టిస్తాడు
ఎగైన్‌స్ట్ ప్రాక్సియాస్ అనే తన వ్యాసాన్ని టెర్టూలియన్ ఇలా ప్రారంభించాడు: “సాతాను అనేక విధాలుగా సత్యానికి పోటీపడ్డాడు, దాన్ని అడ్డగించాడు. సత్యాన్ని కాపాడడం ద్వారా దాన్ని నాశనం చేయాలన్నది కొన్నిసార్లు అతని లక్ష్యమైంది.” ఈ వ్యాసంలోని ప్రాక్సియాస్ ఎవరో స్పష్టంగా తెలియదు, కానీ దేవుని గురించి, క్రీస్తు గురించి ఆయన చేసిన బోధలను టెర్టూలియన్ సవాలు చేశాడు. ఆయన ప్రాక్సియాస్‌ను, క్రైస్తవమతాన్ని భ్రష్టు పట్టించడానికి కుహనా ప్రయత్నాలు చేస్తున్న సాతాను యొక్క పావులా దృష్టించాడు.
ఆ కాలంలో క్రైస్తవులమని చెప్పుకొనేవారి మధ్య ఉన్న ప్రధానమైన వివాదాంశం ఏమిటంటే, దేవునికి క్రీస్తుకు మధ్యగల సంబంధం. వారిలో కొందరు, ప్రత్యేకంగా గ్రీకు నేపథ్యం గలవారు, దేవుడు ఒక్కడే అనే నమ్మకాన్ని, రక్షకుడిగా, విమోచకుడిగా యేసుకున్న పాత్రతో సమన్వయపరచడం కష్టంగా భావించారు. ప్రాక్సియాస్, యేసు తండ్రి యొక్క విభిన్న రూపాంతరం మాత్రమేగానీ తండ్రికి కుమారునికి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని బోధించడం ద్వారా వారి సందిగ్ధావస్థను పరిష్కరించడానికి ప్రయత్నించాడు. మోడలిజమ్ అని పేరు గాంచిన ఆ సిద్ధాంతం, దేవుడు “సృష్టించడంలో, ధర్మశాస్త్రం ఇవ్వడంలో తండ్రిగా, యేసుక్రీస్తు రూపంలో కుమారుడిగా, క్రీస్తు అధిరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మగా” తనను తాను బయలుపరచుకున్నాడని చెబుతుంది.
తండ్రికి కుమారుడికి మధ్యగల వ్యత్యాసాన్ని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయని టెర్టూలియన్ చూపించాడు. 1 కొరింథీయులు 15:27, 28 వచనాలను ప్రస్తావించిన తర్వాత ఆయనిలా తర్కించాడు: “(సమస్తమును) లోపరచిన వ్యక్తి, అది ఎవరికైతే లోపరచబడిందో ఆ వ్యక్తి, తప్పకుండా ఇద్దరు వేర్వేరు వ్యక్తులై ఉండవలసిందే.” టెర్టూలియన్ యేసు సొంత మాటలను దృష్టికి తెచ్చాడు: “తండ్రి నాకంటె గొప్పవాడు.” (యోహాను 14:28) కీర్తన 8: 5 వంటి, హీబ్రూ లేఖనాల్లోని భాగాలను ఉపయోగిస్తూ, కుమారుని “తక్కువ హోదాను” బైబిలు ఎలా వర్ణిస్తోందో చూపించాడు. “ఆ విధంగా తండ్రి కుమారుని కంటే గొప్పవాడని, కుమారుడి నుండి భిన్నమైన వ్యక్తి” అని టెర్టూలియన్ ముగించాడు. “దాన్ని బట్టి కలుగజేయువాడు ఒక వ్యక్తి, కలుగజేయబడినవాడు మరొక వ్యక్తి; అలాగే, పంపించినది ఒక వ్యక్తి, పంపించబడినవాడు మరొక వ్యక్తి; అంతేకాదు, చేయువాడు ఒక వ్యక్తి, ఎవరిద్వారానైతే చేయబడిందో ఆయన మరొక వ్యక్తి.”
కుమారుడ్ని తండ్రికంటే తక్కువ స్థాయి గలవాడిగానే టెర్టూలియన్ దృష్టించాడు. అయితే, మోడలిజాన్ని విఫలం చేసే ప్రయత్నంలో, ఆయన ‘లేఖనముల యందు వ్రాసియున్న సంగతులను అతిక్రమించాడు.’ (1 కొరింథీయులు 4:6) టెర్టూలియన్ మరో వాదము ద్వారా యేసు దైవత్వాన్ని రుజువు చేయడానికి పొరపాటుగా ప్రయత్నిస్తూ, “ఒకే స్వరూపంలో ముగ్గురు వ్యక్తులు” అన్న సూత్రాన్ని సృష్టించాడు. ఈ తలంపును ఉపయోగిస్తూ, ఆయన దేవుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు భిన్నమైన వ్యక్తులు ఒకే దైవ స్వరూపంలో ఉంటున్నారు అని చూపించడానికి ప్రయత్నించాడు. ఆ విధంగా టెర్టూలియన్, “త్రిత్వం” అనే పదం యొక్క లాటిన్ భాషా రూపాంతరాన్ని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలకు అనువర్తించడంలో మొదటి వాడయ్యాడు.
లోకసంబంధమైన తత్త్వజ్ఞానం గురించి జాగ్రత్తగా ఉండండి
టెర్టూలియన్ “ఒకే స్వరూపంలో ముగ్గురు వ్యక్తులు” అనే వాదం ఎలా రూపొందించగలిగాడు? దాని జవాబు, ఆయనను గురించిన మరో వైరుద్ధ్యంలో, అంటే తత్త్వజ్ఞానంపై ఆయనకున్న దృక్కోణంలో లభిస్తుంది. తత్త్వజ్ఞానాన్ని టెర్టూలియన్ “మానవుల, ‘దయ్యాల సిద్ధాంతాలు’” అని అన్నాడు. క్రైస్తవ సత్యాలకు మద్దతుగా తత్త్వజ్ఞానాన్ని ఉపయోగించే అలవాటును ఆయన బహిరంగంగా విమర్శించాడు. “స్టోయిక్, ప్లేటోనిక్, డయలెక్టిక్‌ల కూర్పు అయిన భ్రష్ట క్రైస్తవత్వాన్ని రూపొందించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు దూరంగా ఉండండి” అని ఆయన పేర్కొన్నాడు. కానీ, తన సొంత యోచనలతో సామరస్యంగా ఉన్నప్పుడు, టెర్టూలియన్ స్వయంగా తానే లౌకిక తత్త్వజ్ఞానాన్ని యథేచ్ఛగా ఉపయోగించాడు.—కొలొస్సయులు 2:8.
ఒక రిఫరెన్స్ గ్రంథం ఇలా పేర్కొంది: “త్రిత్వ సిద్ధాంత అభివృద్ధికి, భావ ప్రకటనకు హెలెనిస్టిక్ తలంపులు, వర్గీకరణలు అవసరమయ్యాయి.” టెర్టూలియన్ సిద్ధాంతం అనే పుస్తకం ఇలా పేర్కొంది: “[అది] ఒక చట్టబద్ధమైన, తాత్త్విక యోచనల, జిజ్ఞాసగొలిపే పదాల మిళితం, టెర్టూలియన్ త్రిత్వ సిద్ధాంతం రూపొందించడానికది దోహదపడింది, పరిమితులు అపరిపూర్ణతలు దానిలో ఉన్నప్పటికీ, ఆ తర్వాత కౌన్సిల్ ఆఫ్ నైసీయాలో ప్రతిపాదించబడిన సిద్ధాంతానికి అదే మూలాధారం అయ్యింది.” ఆ విధంగా, ముగ్గురు వ్యక్తులు ఒకే దైవిక స్వరూపం అనే టెర్టూలియన్ సూత్రం, క్రైస్తవమత సామ్రాజ్యమంతటా మతసంబంధమైన పొరపాటును విస్తరింపజేయడంలో ప్రధాన పాత్ర వహించింది.
సత్యాన్ని కాపాడాలన్న ప్రయత్నాల్లో దాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని టెర్టూలియన్ ఇతరులను నిందించాడు, కానీ హాస్యాస్పదంగా, దేవుని ప్రేరేపిత బైబిలు యొక్క సత్యమును, మానవ తత్త్వజ్ఞానముతో కలపడం ద్వారా ఆయనా అదే ఉచ్చులో చిక్కుకుపోయాడు. కాబట్టి మనం, ‘మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచడం’ గురించి ఇవ్వబడిన లేఖనాధారిత హెచ్చరికను హృదయంలో ఉంచుకుందాం.—1 తిమోతి 4:1, 2.
[29, 30వ పేజీలోని చిత్రాలు]
టెర్టూలియన్ తత్త్వజ్ఞానమును విమర్శించాడు కానీ తన సొంత యోచనలను ముందుకు సాగించడానికి దాన్ని ఉపయోగించుకున్నాడు
[చిత్రసౌజన్యం]
29వ పేజీ, 30వ పేజీ: © Cliché Bibliothèque nationale de France, Paris
[31వ పేజీలోని చిత్రం]
నిజ క్రైస్తవులు బైబిలు సత్యమును మానవ తత్త్వజ్ఞానముతో కలపరు