మెలకువగా ఉండి, ధైర్యంగా ముందుకు సాగండి!
మెలకువగా ఉండి, ధైర్యంగా ముందుకు సాగండి!
ప్రత్యేక కూటాలపై నివేదిక
మనం “అపాయకరమైన కాలముల”లో జీవించడంలేదు అని న్యాయంగా ఎవరనగలరు? యెహోవాసాక్షులముగా మనం “అంత్యదినములలో” జీవించడం వల్ల వచ్చే ఒత్తిడులకు అతీతులమేమీ కాదు. (2 తిమోతి 3:1-5) అయినప్పటికీ ప్రజలకు సహాయం అవసరమని మనం గుర్తిస్తాము. ప్రపంచ సంఘటనల భావమేమిటో వారికి అర్థం కాదు. వారికి ఓదార్పు, నిరీక్షణ కావాలి. మన తోటి ప్రజలకు సహాయం చేయడంలో ప్రాథమికంగా మన పాత్ర ఏమిటి?
స్థాపించబడిన దేవుని రాజ్యాన్ని గురించిన సువార్తను పంచుకోవాలని దేవుడిచ్చిన ఆజ్ఞ మనకుంది. (మత్తయి 24:14) ఈ పరలోక రాజ్యమే మానవజాతికి ఏకైక నిరీక్షణ అని ప్రజలు తెలుసుకోవలసిన అవసరం ఉంది. అయితే, మన సందేశం అన్నివేళలా అనుకూలంగా స్వీకరించబడదు. కొన్ని ప్రాంతాల్లో మన పని నిషేధించబడింది, మన సహోదరులు హింసించబడ్డారు. అయినప్పటికీ, మనం వెనుకంజ వేయము. యెహోవాపై పూర్ణ నమ్మకంతో, మానకుండా సువార్త ప్రకటిస్తూ, మెలకువగా ఉండి, ధైర్యంగా ముందుకు సాగడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాము.—అపొస్తలుల కార్యములు 5:42.
ఆ దృఢ నిశ్చయం, 2001 అక్టోబరులో జరిగిన ప్రత్యేక కూటాల్లో స్పష్టమైంది. శనివారం అక్టోబరు 6న, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ పెన్సిల్వేనియా వార్షిక కూటమి అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో జెర్సీ నగరంలోనున్న యెహోవాసాక్షుల సమావేశ హాలులో జరిగింది. * ఆ మరుసటి రోజు, నాలుగు ప్రాంతాల్లో అదనపు కూటాలు జరిగాయి, మూడు అమెరికాలో ఒకటి కెనడాలో. *
యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన సామ్యెల్ ఎఫ్. హర్డ్, వార్షిక కూటమికి సభాధ్యక్షుడిగా తన ప్రారంభపు మాటల్లో, కీర్తన 92:1, 4 వచనాలను ప్రస్తావించి, ఇలా వ్యక్తంచేశాడు: “మనం కృతజ్ఞతతో ఉన్నామని చూపించాలనుకుంటాము.” నిజంగా మనం కృతజ్ఞతతో ఉండడానికి గల కారణాలు ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన ఐదు నివేదికల్లో ఇవ్వబడ్డాయి.
ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన నివేదికలు
సహోదరుడు అల్ఫ్రెడ్ క్వాచి, మునుపు గోల్డ్ కోస్ట్ అని పిలువబడిన ఘానాలో ప్రకటనా పని అభివృద్ధి గురించి నివేదించాడు. ఆ దేశంలో మన పని చాలా సంవత్సరాలుగా నిషేధించబడింది. అక్కడి ప్రజలు, “ఎందుకీ నిషేధం? మీరేమి చేశారు?” అని అడిగేవారు. అది సాక్ష్యం ఇవ్వడానికి
అవకాశాలను కల్పించేదని సహోదరుడు క్వాచి వివరించాడు. ఘానాలో 1991 లో నిషేధం ఎత్తివేయబడినప్పుడు, 34,421 మంది యెహోవాసాక్షులు ఉన్నారు. ఆగస్టు 2001 లో మొత్తం సంఖ్య 68,152—అది 98 శాతం పెరుగుదల. అక్కడ, 10,000 సీట్లు ఉండే అసెంబ్లీ హాలును నిర్మించడానికి పథకాలు వేయబడుతున్నాయి. ఘానాలో ఉన్న మన ఆధ్యాత్మిక సహోదరులు తమ మతపరమైన స్వేచ్ఛను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారని స్పష్టమవుతోంది.రాజకీయపరంగా పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ, ఐర్లాండ్‌లోని మన సహోదరులు పరిచర్యలో చురుగ్గా పాల్గొంటున్నారు, వారు తమ తటస్థతను బట్టి గౌరవింపబడుతున్నారు. ఐర్లాండ్‌లోని ఆరు సర్క్యూట్‌లలో 115 సంఘాలు ఉన్నాయని బ్రాంచ్ కమిటీ కో-ఆర్డినేటర్ పీటర్ ఆండ్రూస్ తెలియజేశాడు. ఆయన, పాఠశాలలో నిర్భయంగా సాక్ష్యమిచ్చే లీయమ్ అనే పదేళ్ళ బాలుని అనుభవం గురించి చెప్పాడు. లీయమ్ యెహోవాసాక్షులు ప్రచురించే నా బైబిలు కథల పుస్తకము అనే పుస్తక ప్రతులను తనతో చదువుకునే 25 మంది విద్యార్థులతోపాటు, తన టీచర్‌కు కూడా ఇచ్చాడు. లీయమ్ బాప్తిస్మం తీసుకోవాలని కోరుకున్నాడు, కాని ఆయన మరీ చిన్నవాడు కదా అని ఎవరో అడిగారు. లీయమ్ ఇలా సమాధానమిచ్చాడు: “నా వయస్సు కాదు గానీ యెహోవా పట్ల నాకున్న ప్రేమ నిర్ణయించే సూత్రంగా ఉండాలి. నా బాప్తిస్మం నేను ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నానో చూపిస్తుంది.” తానొక మిషనరీ కావాలన్నది లీయమ్ లక్ష్యం.
1968 లో, వెనిజులాలో 5,400 మంది సువార్త ప్రచారకులు ఉన్నారు. కానీ ఇప్పుడు 88,000 కంటే ఎక్కువమంది ఉన్నారని బ్రాంచ్ కమిటీ కో-ఆర్డినేటర్ స్టీఫన్ యోహన్‌సన్ పేర్కొన్నాడు. కానీ 2001 లో జ్ఞాపకార్థ ఆచరణకు 2,96,000 కంటే ఎక్కువమంది హాజరయ్యారు గనుక మరింత అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంది. డిసెంబరు 1999 లో, ఏకధాటిగా కురిసిన వర్షాలవల్ల మట్టి దిబ్బలు కూలడంతో 50,000 మంది మరణించినట్లు అంచనా వేయబడుతోంది, మరణించినవారిలో చాలామంది సాక్షులుకూడా ఉన్నారు. ఒక రాజ్యమందిరంలో దాదాపు పైకప్పు వరకు, అంటే పైకప్పు నుండి దాదాపు రెండు అడుగుల ఎడం వరకు మట్టి వచ్చి చేరింది. ఆ భవనాన్ని వదిలివేయవచ్చు కదా అని ఎవరో అన్నప్పుడు, “ఎంత మాత్రం వీల్లేదు! ఇది మా రాజ్య మందిరం, దాన్ని ఇప్పుడు వదిలివేయడం మాకిష్టం లేదు” అని సహోదరులు సమాధానమిచ్చారు. వాళ్ళు పని మొదలు పెట్టి టన్నుల కొద్ది మట్టి, రాళ్ళు, ఇతర చెత్త తీసివేశారు. ఆ భవనాన్ని పునర్నవీకరించారు, విపత్తు సంభవించక ముందు కన్నా ఇప్పుడు రాజ్య మందిరం మరింత ఆకర్షణీయంగా ఉందని సహోదరులు అంటున్నారు!
ఫిలిప్పీన్స్‌లో 87 భాషలు, మాండలికాలు మాట్లాడతారని బ్రాంచ్ కమిటీ కో-ఆర్డినేటర్ సహోదరుడు డెంటన్ హాప్కిన్‌సన్ చెప్పాడు. గత సేవా సంవత్సరంలో, ఆ దేశంలోని మూడు ప్రధాన భాషలైన సేబ్వానో, ఈలోకో, తగాలోగ్‌లలో పూర్తి పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదము విడుదల
చేయబడింది. యెహోవాసాక్షులు ప్రచురించిన నిన్ను సంతోషపరచు సువార్త అనే పుస్తకాన్ని చదివిన తొమ్మిదేళ్ళ బాలుడి అనుభవాన్ని సహోదరుడు హాప్కిన్‌సన్ చెప్పాడు. ఆ అబ్బాయి బ్రాంచి నుండి ఇతర సాహిత్యాలను తెప్పించుకుని వాటిని కూడా చదివాడు, కాని ఆయన కుటుంబం ఆయనను వ్యతిరేకించింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మెడికల్ స్కూల్‌లో చదువుకుంటున్నప్పుడు బ్రాంచిని సంప్రదించి బైబిలు అధ్యయనం కావాలని కోరాడు. ఆయన 1996 లో బాప్తిస్మం తీసుకుని, త్వరలోనే పూర్తికాల పరిచర్యలో ప్రవేశించాడు. ఇప్పుడాయన తన భార్యతోపాటు బ్రాంచి కార్యాలయంలో సేవచేస్తున్నాడు.‘ప్యూర్టోరికో “సాక్షులను ఎగుమతి” చేస్తోంది’ అని బ్రాంచ్ కమిటీ కో-ఆర్డినేటర్ రానల్డ్ పార్కిన్ వివరించాడు. ఆ ద్వీపంలో దాదాపు 25,000 మంది ప్రచారకులు ఉన్నారు, చాలా సంవత్సరాల పాటు ఆ సంఖ్య అలాగే ఉంది. ఎందుకు? ఎందుకంటే ప్యూర్టోరికో సంవత్సరానికి దాదాపు 1,000 మంది ప్రచారకులను అమెరికాకు “ఎగుమతి” చేస్తోందని అంచనా వేయబడుతోంది, వారిలో చాలామంది ఆర్థిక కారణాలను బట్టి వలస వెళుతున్న వారే. లుకేమియా ఉన్న 17 సంవత్సరాల సాక్షి లూయీస్‌కు సంబంధించిన ఒక మైలురాయివంటి కోర్టు తీర్పు గురించి సహోదరుడు పార్కిన్ చెప్పాడు. లూయీస్ రక్తం ఎక్కించుకోవడానికి నిరాకరించడంతో ఆయన కేసును కోర్టుకు తీసుకువెళ్ళడం జరిగింది. జడ్జి ఆయనతో స్వయంగా మాట్లాడాలని ఆయనను చూడడానికి హాస్పిటల్‌కే వచ్చింది. లూయీస్ ఆమెనిలా అడిగాడు: “నేను ఏదైనా గంభీరమైన నేరం చేస్తే మీరు నన్ను పెద్దవాడిగా పరిగణిస్తారు, కానీ నేను దేవునికి విధేయత చూపించాలనుకుంటుంటే, మీరు నన్ను ఒక మైనరుగా ఎందుకు పరిగణిస్తున్నారు?” ఆయన పరిణతి చెందిన వ్యక్తి అనీ, తనకు తాను నిర్ణయించుకోగలడనీ జడ్జికి నమ్మకం కలిగింది.
సుదూర ప్రాంతాల నుండి వచ్చిన నివేదికల తర్వాత, అమెరికా బ్రాంచ్ కమిటీకి చెందిన హరాల్డ్ కోర్కర్న్, చాలాకాలంగా యెహోవా సేవలో ఉన్న నలుగురిని ఇంటర్వ్యూ చేశాడు. ఆర్థర్ బోనో పూర్తికాల సేవలో 51 సంవత్సరాలు గడిపాడు, ఇప్పుడు ఈక్వెడార్ బ్రాంచ్ కమిటీలో సేవచేస్తున్నాడు. ఆంజేలో కాటాన్‌జారో పూర్తికాల సేవలో గడిపిన 59 సంవత్సరాల్లో ఎక్కువకాలం ప్రయాణ పైవిచారణకర్తగా సేవ చేశాడు. రిచర్డ్ ఏబ్రహమ్‌సన్ 1953 లో గిలియడ్ పాఠశాలలో పట్టభద్రుడయ్యాడు, ఆయన బ్రూక్లిన్ బేతేలుకు తిరిగి రాక ముందు డెన్మార్క్‌లో 26 సంవత్సరాలు పైవిచారణకర్తగా సేవచేసే ఆధిక్యతను పొందాడు. చివరిగా, 96 సంవత్సరాల క్యారీ డబ్ల్యు. బార్బర్ చెప్పింది విని అందరూ సంతోషించారు. ఆయన 1921 లో బాప్తిస్మం తీసుకుని, పూర్తికాల పరిచర్యలో 78 సంవత్సరాలు గడిపాడు, 1978 నుండి పరిపాలక సభ సభ్యునిగా ఉన్నాడు.
ఉత్తేజపరిచే ప్రసంగాలు
వార్షిక కూటములో ఆలోచన రేకెత్తించే కొన్ని ప్రసంగాలు కూడా ఉన్నాయి. సహోదరుడు రాబర్ట్ డబ్ల్యు. వాలెన్ “ఆయన నామము కొరకు ఏర్పరచబడిన జనము” అనే అంశంపై మాట్లాడాడు. మనం దేవుని నామము కొరకు ఏర్పరచబడిన ప్రజలము, మనం 230 కన్నా ఎక్కువ దేశాల్లో ఉన్నాము. యెహోవా మనకు “ఆశను, మంచి భవిష్యత్తును” ఇచ్చాడు. (యిర్మీయా 29:11, ఈజీ-టు-రీడ్ వర్షన్) ఓదార్పు, ఉపశమనముల అద్భుతమైన సందేశాన్ని పంచుకుంటూ, మనం దేవుని రాజ్యం గురించి అందరికీ తెలియజేయడంలో తప్పకుండా కొనసాగాలి. (యెషయా 61:1) “మనం, యెహోవాసాక్షులు అనే మన పేరుకు తగినవిధంగా జీవించడంలో అనుదినం కొనసాగుదాము” అంటూ సహోదరుడు వాలెన్ ముగించాడు.—యెషయా 43:10.
కార్యక్రమంలోని చివరి భాగం, పరిపాలక సభ సభ్యులు ముగ్గురు ఇచ్చిన గోష్ఠి. దాని శీర్షిక, “ఇది మెలకువగా ఉండి, నిలకడగా ఉండి, బలవంతులై ఉండవలసిన సమయం.”—1 కొరింథీయులు 16:13.
మొదట, సహోదరుడు స్టీవన్ లెట్ “ఈ చివరి ఘడియలో మెలకువగా ఉండండి” అనే అంశంపై ప్రసంగించాడు. భౌతిక నిద్ర ఒక వరమని సహోదరుడు లెట్ వివరించాడు. అది మనకు పునరుత్తేజాన్ని కలిగిస్తుంది. అయితే, ఆధ్యాత్మిక నిద్ర ఎన్నడూ ప్రయోజనకరమైనది కాదు. (1 థెస్సలొనీకయులు 5:6) అయితే, మనం ఆధ్యాత్మికంగా ఎలా మెలకువగా ఉండగలము? సహోదరుడు లెట్ మూడు ఆధ్యాత్మిక “మాత్రలు” పేర్కొన్నాడు: (1) ప్రభువు కార్యాభివృద్ధియందు ఆసక్తులై ఉండండి. (1 కొరింథీయులు 15:58) (2) మీ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించండి. (మత్తయి 5:3) (3) జ్ఞానయుక్తంగా చర్య తీసుకునేందుకు బైబిలు ఆధారిత సలహాకు ప్రతిస్పందించేవారై ఉండండి.—సామెతలు 13:20.
సహోదరుడు థియడోర్ జారస్ “పరీక్షా సమయంలో నిలకడగా ఉండండి” అనే ప్రేరణాత్మకమైన ప్రసంగాన్నిచ్చాడు. ప్రకటన 3:10 వచనాన్ని పేర్కొంటూ సహోదరుడు జారస్ ఇలా అడిగాడు, “‘శోధనకాలము’ అంటే ఏమిటి?” ఆ శోధన, నేడు మనం జీవిస్తున్న కాలమైన “ప్రభువు దినమందు” వస్తుంది. (ప్రకటన 1:10) మనం సుస్థాపిత దేవుని రాజ్యం పక్షాన ఉన్నామా లేక సాతాను దుష్ట విధానం పక్షాన ఉన్నామా అన్నదే ఆ శోధన కీలకాంశం. ఆ శోధన కాలము ముగిసే వరకు, మనం శ్రమలు లేదా కష్టాలు అనుభవించవలసిందే. మనం యెహోవా పట్ల, ఆయన సంస్థ పట్ల యథార్థంగా ఉంటామా? ‘వ్యక్తిగతంగా మనం అటువంటి యథార్థతను చూపించవలసి ఉంటుంది,’ అని సహోదరుడు జారస్ అన్నాడు.
చివరిగా, సహోదరుడు జాన్ ఇ. బార్ “ఆధ్యాత్మిక వ్యక్తులుగా బలవంతులై ఉండండి” అనే అంశంపై ప్రసంగించాడు. లూకా 13:23-25 వచనాలను ప్రస్తావిస్తూ, మనం ‘ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి’ శ్రమించాలని ఆయన పేర్కొన్నాడు. చాలామంది విఫలమవుతారు ఎందుకంటే బలవంతులవడానికి వారు తగినంత కృషి చేయరు. పరిణతి చెందిన క్రైస్తవులయ్యేందుకు, మనం మన జీవితంలోని అన్ని అంశాల్లోనూ బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం నేర్చుకోవాలి. సహోదరుడు బార్ ఇలా ఉద్బోధించాడు: “ఇది, (1) యెహోవాకు అగ్రస్థానం ఇవ్వడానికి; (2) బలవంతులవడానికి; (3) యెహోవా చిత్తాన్ని చేయడంలో కృషి చేయడానికి తగిన సమయమని మీరు అంగీకరిస్తారని నేను నమ్ముతున్నాను. ఈ విధంగా మనం అంతం లేని అద్భుతమైన జీవితానికి నడిపే ఇరుకు ద్వారము గుండా ప్రవేశించగలుగుతాము.”
వార్షిక కూటము ముగింపుకు చేరుకుంటుండగా, జవాబు చెప్పబడని ఒక ప్రశ్న మిగిలిపోయింది: 2002 సేవా సంవత్సరానికి వార్షిక లేఖనం ఏది? ఆ ప్రశ్నకు మరుసటి రోజు సమాధానం ఇవ్వబడింది.
అదనపు కూటము
ఆదివారం ఉదయం అదనపు కూటము యొక్క కార్యక్రమం ప్రారంభం కావడంతో అందరూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఆ వారపు కావలికోట పాఠం సారాంశంతో అది ప్రారంభమై, దాని తర్వాత వార్షిక కూటములో నుండి కొన్ని ఉన్నతాంశాలు క్లుప్తంగా అందజేయబడ్డాయి. తర్వాత, 2002 వార్షిక లేఖనమైన “నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అనే దానిపై ప్రసంగం విని అందరూ సంతోషించారు. (మత్తయి 11:28) ఆ ప్రసంగం ఆ తర్వాత కావలికోట డిసెంబరు 15 సంచికలో ప్రచురించబడిన అధ్యయన ఆర్టికల్‌ల ఆధారంగా ఇవ్వబడింది.
దాని తర్వాత, ఆగస్టు 2001 లో ఫ్రాన్స్‌లోనూ ఇటలీలోనూ జరిగిన “దేవుని వాక్యాన్ని బోధించేవారు” అనే ప్రత్యేక సమావేశాలకు ప్రతినిధులుగా హాజరైన కొందరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. * చివరిగా, ఆ నాటి కార్యక్రమ ఉన్నతాంశంగా, బ్రూక్లిన్ బేతేలు నుండి వచ్చిన ఇద్దరు ప్రసంగీకులు చివరి రెండు ప్రసంగాలను ఇచ్చారు.
“ఈ క్లిష్ట కాలాల్లో యెహోవాపై ధైర్యంగా నమ్మకం ఉంచడం” అన్నది మొదటిదాని శీర్షిక. ప్రసంగీకుడు ఈ ముఖ్య విషయాలపై ప్రసంగించాడు: (1) యెహోవాపై ధైర్యంగా నమ్మకముంచడం దేవుని ప్రజలకు ఎల్లప్పుడూ ఆవశ్యకం. వ్యతిరేకత ఎదురైన సమయంలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని చూపించిన అనేకుల ఉదాహరణలు బైబిలులో ఉన్నాయి. (హెబ్రీయులు 11:1-12:3) (2) మనం యెహోవాను ప్రగాఢంగా నమ్మడానికి ఆయన దృఢమైన ఆధారాన్ని ఇస్తున్నాడు. ఆయన తన సేవకుల గురించి శ్రద్ధ తీసుకుంటాడనీ, వారిని ఎన్నడూ మరచిపోడనీ ఆయన కార్యములు, ఆయన వాక్యము హామీ ఇస్తున్నాయి. (హెబ్రీయులు 6:10) (3) నేడు ధైర్యము, నమ్మకము ప్రత్యేకంగా అవసరం. యేసు ముందే చెప్పినట్లుగా, మనం ‘ద్వేషించబడతాము.’ (మత్తయి 24:9) సహించేందుకుగాను, మనం దేవుని వాక్యంపై ఆధారపడడం, దేవుని ఆత్మ మనతో ఉందనే నమ్మకం, సువార్త ప్రకటిస్తూ ఉండడానికి కావలసిన ధైర్యం మనకు అవసరం. (4) మనం ఇప్పుడే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నామని ఉదాహరణలు చూపిస్తున్నాయి. మన సహోదరులు అర్మేనియా, ఫ్రాన్స్, జార్జియా, ఖజకస్తాన్, రష్యా, టర్క్‌మెనిస్తాన్‌లలో ఏమి సహించారో ప్రసంగీకుడు చెప్పినప్పుడు అందరూ ఎంతో కదిలించబడ్డారు. నిజంగా, ఇది ధైర్యము, యెహోవాపై నమ్మకము చూపించవలసిన సమయం!
చివరి ప్రసంగీకుడు “యెహోవా సంస్థతోపాటు ఐక్యంగా ముందుకు సాగడం” అనే అంశంపై ప్రసంగించాడు. ఆ ప్రసంగంలో సమయోచితమైన అనేక విషయాలు ఉన్నాయి. (1) యెహోవా ప్రజల పురోగమనాన్ని అందరూ గమనిస్తున్నారు. మన ప్రకటనా పని, మన సమావేశాలు ఎఫెసీయులు 1:8-10) (3) సమావేశాలు అంతర్జాతీయ ఐక్యతను విశేషంగా ప్రదర్శిస్తాయి. గత ఆగస్టులో ఫ్రాన్స్‌లోనూ, ఇటలీలోనూ జరిగిన ప్రత్యేక సమావేశాల్లో ఇది స్పష్టమైంది. (4) ఫ్రాన్స్‌లోనూ, ఇటలీలోనూ ఉత్తేజపరిచే ఒక తీర్మానం తీసుకోబడింది. ఉత్తేజపరిచే ఆ తీర్మానం గురించిన కొన్ని విషయాలను ప్రసంగీకుడు పేర్కొన్నాడు. తీర్మానం గురించిన పూర్తి సారాంశం క్రింద ఇవ్వబడింది.
మనల్ని ప్రజల దృష్టికి తీసుకువస్తాయి. (2) యెహోవా ఐక్యంగా ఉన్న ఒక సంస్థను స్థాపించాడు. “సమస్తమును” అంటే పరలోక నిరీక్షణ గలవారిని అలాగే భూనిరీక్షణ గలవారిని దేవుని ఉమ్మడి కుటుంబంలోకి తీసుకురావాలనే సంకల్పంతో యేసు సా.శ. 29 లో పరిశుద్ధాత్మచే అభిషేకించబడ్డాడు. (చివరి ప్రసంగం ముగింపులో, అతిథి ప్రసంగీకుడు పరిపాలక సభ సిద్ధం చేసిన కదిలింపజేసే ఒక ప్రకటనను చదివాడు. దానిలో కొంతభాగం ఇలా ఉంది: “ఇది, ప్రపంచ దృశ్యంపై సంఘటనలు ఎలా చోటుచేసుకుంటున్నాయో గ్రహిస్తూ, మెలకువగా ఉండి అప్రమత్తంగా ఉండవలసిన సమయం. . . . మీ పట్ల, దేవుని ప్రజల్లోని మిగిలిన వారందరి పట్ల పరిపాలక సభకు ఉన్న ప్రేమపూర్వకమైన శ్రద్ధను మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము. పూర్ణాత్మతో ఆయన చిత్తాన్ని చేయడంలో ఆయన మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించును గాక.” సర్వత్రా ఉన్న యెహోవా ప్రజలు ఈ క్లిష్ట కాలాల్లో మెలకువగా ఉండి, యెహోవా ఐక్య సంస్థతో ధైర్యంగా ముందుకు సాగడానికి దృఢంగా నిశ్చయించుకున్నారు.
[అధస్సూచీలు]
^ పేరా 5 వార్షిక కూటము కార్యక్రమాన్ని అనేక ప్రాంతాలకు ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా అనుసంధానం చేశారు, దాంతో ఆ కార్యక్రమానికి హాజరైనవారి మొత్తం 13,757కు చేరుకుంది.
^ పేరా 5 అదనపు కూటాలు కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌లో, మిషిగాన్‌లోని పాంటియాక్‌లో, న్యూయార్క్‌లోని యూన్యండేల్‌లో, ఓంటరీయోలోని హమిల్టన్‌లో జరిగాయి. ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా అనుసంధానం చేయబడిన ఇతర స్థలాల్లో ఉన్నవారితో సహా మొత్తం 1,17,885 మంది హాజరయ్యారు.
^ పేరా 23 ఫ్రాన్స్‌లో మూడు ప్రత్యేక సమావేశాలు జరిగాయి, అవి పారిస్, బోర్‌డక్స్, లయాన్స్‌లలో జరిగాయి. ఇటలీలో, ఒకేసారి మొత్తం తొమ్మిది సమావేశాలు జరిగినప్పటికీ, అమెరికా నుండి వచ్చిన ప్రతినిధులను రోములో, మిలన్‌లో జరిగే సమావేశాలకు వెళ్ళాలని నియమించబడ్డారు.
[29-31వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
తీర్మానం
ఆగస్టు 2001 లో, ఫ్రాన్స్‌లోనూ ఇటలీలోనూ “దేవుని వాక్యాన్ని బోధించేవారు” అనే ప్రత్యేక సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో, ఉత్తేజపరిచే ఒక తీర్మానం ప్రవేశపెట్టబడింది. దాని సారాంశం ఈ క్రింద ఇవ్వబడింది.
“‘దే వుని వాక్యాన్ని బోధించేవారు’ అనే ఈ సమావేశానికి సమకూడిన యెహోవాసాక్షులమైన మనమందరము ఎంతో ప్రయోజనకరమైన బోధచే ఉపదేశించబడ్డాము. ఈ బోధకు మూలం ఎవరో స్పష్టంగా గుర్తించడం జరిగింది. ఈ బోధ మానవ మూలం నుండి రాలేదు. ప్రాచీన ప్రవక్తయైన యెషయా మన ‘మహోపదేశకుడు’ అని వర్ణించినవాని నుండి అది వస్తుంది. (యెషయా 30:20, NW) “నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును” అని యెషయా 48:17 లో పేర్కొనబడిన యెహోవా జ్ఞాపికను గమనించండి. ఆయన ఎలా ఉపదేశిస్తాడు? దానికి ప్రాథమికమైన మార్గం, అత్యధిక భాషల్లోకి అనువదించబడి, విరివిగా పంచిపెట్టబడిన పుస్తకమైన బైబిలు. దానిలో మనకు స్పష్టాతి స్పష్టంగా ఇలా చెప్పబడుతోంది: ‘దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ప్రయోజనకరమై యున్నది.’—2 తిమోతి 3:16.
“నేడు మానవజాతికి అలాంటి ప్రయోజనకరమైన బోధ ఎంతో అవసరం. ఎందుకలా చెప్పవచ్చు? మారుతున్న ఈ లోకపు సంక్లిష్టమైన పరిస్థితి గురించి వివేకవంతులైన ప్రజలు ఏమని ఒప్పుకుంటున్నారు? సరళంగా చెప్పాలంటే, కోట్లాదిమంది ఈ లోకపు విద్యా వ్యవస్థలచే బోధించబడుతున్నా, వారిలో నిజమైన విలువలు చాలా విపరీతంగా కొరవడుతున్నాయి, తప్పొప్పుల మధ్య తేడా తెలుసుకోవడంలో చాలా ఘోరంగా విఫలమవుతున్నారు. (యెషయా 5:20, 21) బైబిలు జ్ఞానం విషయంలో నిరక్షరాస్యత అధికమవుతోంది. కంప్యూటర్ల ద్వారా విస్తారమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి సాంకేతిక విజ్ఞానం తోడ్పడుతున్నమాట నిజమే. అయితే, జీవిత సంకల్పమేమిటి? మన కాలంలో జరుగుతున్న సంఘటనలను ఎలా అర్థం చేసుకోవాలి? భవిష్యత్తు కోసం దృఢమైన నిరీక్షణ ఉందా? శాంతి భద్రతలు ఎన్నటికైనా వాస్తవమవుతాయా? వంటి ఆవశ్యకమైన ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడున్నాయి? అంతేగాక, దాదాపు ప్రతి రంగంలో మానవుడు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన నివేదికలున్న కోటానుకోట్ల పేజీలు గ్రంథాల రూపంలో గ్రంథాలయ బీరువాల్లో కనబడతాయి. అయినా, మానవజాతి గతంలో చేసిన పొరపాట్లనే పునరావృతం చేస్తోంది. నేరం పెచ్చుపెరిగిపోతోంది. ఒకప్పుడు నిర్మూలించామని తలంచిన వ్యాధులు మళ్ళీ తలెత్తుతున్నాయి, ఎయిడ్స్ వంటి ఇతర వ్యాధులు ప్రమాదాన్ని సూచిస్తూ వ్యాపిస్తున్నాయి. కుటుంబ జీవితం విస్మయం కలిగించే వేగంతో తునాతునకలై పోతోంది. కాలుష్యం వాతావరణాన్ని నాశనం చేస్తోంది. తీవ్రవాదం, అధికసంఖ్యలో నాశనం చేయగల ఆయుధాలు శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లజేస్తున్నాయి. పరిష్కారాలు లేని సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి అపాయకరమైన కాలాల్లో మన తోటివారికి సహాయం చేయడంలో మన సరైన పాత్ర ఏమిటి? మానవజాతి అనుభవిస్తున్న దురవస్థకు కారణాన్ని వివరిస్తూ, ప్రస్తుతం మంచి జీవితాన్ని గడపడానికి మార్గాన్ని చూపించడమే గాక భవిష్యత్తు కోసం ఉజ్వలమైన ఖచ్చితమైన నిరీక్షణను ఇవ్వగల బోధ ఏదైనా ఉందా?
“‘వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేసి, క్రీస్తు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ గైకొనమని వారికి బోధించవలసిన’ లేఖనాధారిత ఆదేశం మనకు ఇవ్వబడింది. (మత్తయి 28:19, 20) యేసుక్రీస్తు తన మరణ పునరుత్థానాల తర్వాత, పరలోకంలోనూ భూమిమీదా సర్వాధికారాన్ని పొందిన తర్వాత ఈ ఆదేశాన్ని ఇచ్చాడు. ఇది మానవులు చేసే అన్ని కార్యకలాపాల కన్నా శ్రేష్ఠమైనది. నీతికోసం అలమటిస్తున్నవారి ఆధ్యాత్మిక అవసరాలపై అవధానాన్ని కేంద్రీకరింపజేసే ఒక పని మనకప్పగించబడింది, దేవుని దృక్కోణం నుండి చూస్తే దానికే మొదటి స్థానముంది. మనం ఆ నియామకాన్ని గంభీరంగా తీసుకోవడానికి బలమైన లేఖనాధారిత కారణాలు ఉన్నాయి.
“అందుకే, అలాంటి కార్యకలాపాలకు మన జీవితాల్లో అగ్రస్థానం ఇవ్వాలి. భూ వ్యాప్తంగా జరుగుతున్న ఈ బోధనా కార్యక్రమ అభివృద్ధిని అడ్డగించేందుకు రూపొందించబడిన మనసు చెదరగొట్టే ప్రభావాలు, అవాంతరాలు, మతపరమైన రాజకీయపరమైన వ్యతిరేకతలు వంటివి అనేకం ఉన్నప్పటికీ దేవుని ఆశీర్వాదము సహాయములతో ఈ పని నెరవేరుతుంది. ఈ పని వర్ధిల్లుతుందనీ, విశిష్టమైన చరమాంకానికి చేరుకుంటుందనీ మనకు నమ్మకము, విశ్వాసము ఉన్నాయి. మనమెందుకు అంత నమ్మకంగా ఉండవచ్చు? ఎందుకంటే, దేవుడిచ్చిన పరిచర్యలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ యుగసమాప్తి వరకు, మనతో ఉంటానని వాగ్దానం చేశాడు.
“క్షోభిస్తున్న మానవజాతి అంతమును సమీపిస్తోంది. ప్రస్తుతం మనకివ్వబడిన నియామకం ఆ అంతము రాకముందే నెరవేర్చబడాలి. కాబట్టి, యెహోవాసాక్షులముగా మనం ఇలా తీర్మానించుకుంటున్నాము:
“మొదటిగా: సమర్పించుకున్న పరిచారకులముగా, రాజ్యాసక్తులకు మన జీవితాల్లో మొదటి స్థానం ఇవ్వడానికి, నిర్విరామంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతుండడానికి మనం కృత నిశ్చయం చేసుకున్నాము. ఆ లక్ష్యాన్ని సాధించడానికి, “నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము” అని చెబుతున్న కీర్తన 143:10వ వచనంలోని మాటలతో పొందికగా మనం ప్రార్థిస్తాము. దీని కోసం, మనం శ్రద్ధగల విద్యార్థులమై, ప్రతిరోజు బైబిలు చదువుతూ, వ్యక్తిగత అధ్యయనమూ పరిశోధనా చేయవలసిన అవసరం ఉంది. మన అభివృద్ధి అందరికీ తేటగా కనిపించేలా చేయడానికి, సంఘ కూటాల్లోనూ ప్రాంతీయ, జిల్లా, జాతీయ, అంతర్జాతీయ, సమావేశాల్లోనూ అందజేయబడే దైవపరిపాలనా విద్య కోసం సిద్ధపడడానికీ దాని నుండి పూర్తిగా ప్రయోజనం పొందడానికీ సహేతుకంగా మనం చేయగలిగినంత కృషి చేస్తాము.—1 తిమోతి 4:15; హెబ్రీయులు 10:23-25.
“రెండవదిగా: దేవునిచే బోధించబడడానికి, మనం ఆయన బల్లమీద ఉన్నది మాత్రమే భుజిస్తూ, తప్పుదోవ పట్టించే దయ్యాల బోధల గురించి బైబిలు ఇస్తున్న హెచ్చరికను జాగ్రత్తగా లక్ష్యపెడతాము. (1 కొరింథీయులు 10:21; 1 తిమోతి 4:1) మతసంబంధమైన అబద్ధాలను, వ్యర్థమైన వాదనలను, సిగ్గుకరమైన లైంగిక దుష్ప్రవర్తనను, పోర్నోగ్రఫీ మహమ్మారిని, నీచమైన వినోదమును, ‘హితబోధకు అనుగుణంగా’ లేని వాటన్నిటితో సహా హానికరమైన కారకాలకు దూరంగా ఉండడానికి కావలసిన ప్రత్యేకమైన ముందు జాగ్రత్త చర్యను మనం తీసుకుంటాము. (రోమీయులు 1:26, 27; 1 కొరింథీయులు 3:20; 1 తిమోతి 6:3; 2 తిమోతి 1:13) ఆరోగ్యదాయకమైనది బోధించే అర్హతగల ‘మనుష్యులలో ఈవుల’ పట్ల గౌరవంతో మనం, దేవుని వాక్యంలోని పరిశుభ్రమైన, నీతియుక్తమైన నైతిక ఆధ్యాత్మిక ప్రమాణాలను ఉన్నతపరచడంలో వారు చేసే కృషిని నిజంగా గౌరవిస్తూ హృదయపూర్వకంగా వారితో సహకరిస్తాము.—ఎఫెసీయులు 4:7, 8, 11, 12; 1 థెస్సలొనీకయులు 5:12, 13; తీతు 1:9.
“మూడవదిగా: మన పిల్లలకు కేవలం మాట ద్వారానే గాక మాదిరి ద్వారా కూడా ఉపదేశించడానికి క్రైస్తవ తల్లిదండ్రులముగా మనం హృదయపూర్వక కృషి చేస్తాము. ‘రక్షణార్థమైన జ్ఞానము కలిగించే శక్తిగల పరిశుద్ధలేఖనములను నేర్చుకోవడానికి’ వారికి బాల్యము నుండే సహాయం చేయాల్నది మన ప్రాథమిక శ్రద్ధ. (2 తిమోతి 3:14) వారిని యెహోవా యొక్క బోధలోనూ శిక్షలోనూ పెంచడం, ‘మేలు కలుగుతుందనీ, భూమిమీద దీర్ఘాయుష్మంతులై ఉంటారనీ’ దేవుడు చేసిన వాగ్దానాన్ని అనుభవించడానికి వారికి చక్కని అవకాశాన్ని ఇస్తుందని మనం మనస్సులో ఉంచుకుంటాము.—ఎఫెసీయులు 6:1-4.
“నాలుగవదిగా: చింతలు లేదా గంభీరమైన సమస్యలు తలెత్తినప్పుడు, ‘సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము’ మనల్ని కాపాడుతుందనే నమ్మకంతో, మొట్టమొదటిగా ‘మన విన్నపములు దేవునికి తెలియజేస్తాము.’ (ఫిలిప్పీయులు 4:6, 7) క్రీస్తు కాడి క్రిందకు వచ్చి మనం పునరుత్తేజాన్ని పొందుతాము. దేవుడు మన పట్ల శ్రద్ధకలిగి ఉన్నాడని తెలుసుకుని, మనం మన చింతలను ఆయనపై వేయడానికి సంకోచించము.—మత్తయి 11:28-30; 1 పేతురు 5:6, 7.
“ఐదవదిగా: యెహోవా వాక్యాన్ని బోధించేవారిగా మన ఆధిక్యతను బట్టి ఆయనకు కృతజ్ఞతగా, మనం ‘ఆయన సత్యవాక్యమును సరిగా ఉపదేశించడానికి’ అలాగే ‘మన పరిచర్యను సంపూర్ణముగా జరిగించడానికి’ మనం మళ్ళీ తీవ్రంగా కృషి చేస్తాము. (2 తిమోతి 2:15; 4:5) అలా చేయడంలో ఏమి ఇమిడి ఉందో మనకు బాగా తెలుసు గనుక, పాత్రులైన వారి కోసం వెదుకుతూ, నాటబడిన విత్తనాన్ని మొలకెత్తించడమన్నదే మన హృదయపూర్వక కోరిక. అంతేగాక, మరిన్ని గృహ బైబిలు అధ్యయనాలు ప్రభావవంతంగా నిర్వహించడం ద్వారా మనం మన బోధను మెరుగుపరచుకుంటాము. ఇది మనం, “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై” ఉండాలన్న దేవుని చిత్తానికి మరింత అనుగుణంగా ఉండేలా చేస్తుంది.—1 తిమోతి 2:3, 4.
“ఆరవదిగా: గత శతాబ్దమంతటిలోనూ ఈ శతాబ్దంలోనూ, అనేక దేశాల్లో యెహోవాసాక్షులు వివిధ రకాలైన వ్యతిరేకతను, హింసను ఎదుర్కొన్నారు. కానీ నిశ్చయంగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. (రోమీయులు 8:31) మన రాజ్య ప్రకటనా, బోధనా పనిని ఆటంకపరచడానికి, మందగింపజేయడానికి, లేదా ఆపడానికి ‘మనకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును’ నిలువదని విశ్వసనీయమైన ఆయన వాక్యం మనకు హామీ ఇస్తోంది. (యెషయా 54:17) అనుకూల సమయంలోనైనా కష్టకాలంలోనైనా మనం సత్యం గురించి మాట్లాడకుండా ఉండలేము. మన ప్రకటనా, బోధనా నియామకాన్ని అతిత్వరగా నెరవేర్చాలన్నదే మన దృఢనిశ్చయం. (2 తిమోతి 4:1, 2) సాధ్యమైనంత సంపూర్ణంగా సమస్త జనులతో దేవుని రాజ్య సువార్తను పంచుకోవాలన్నదే మన లక్ష్యం. తద్వారా, నీతియుక్తమైన నూతనలోకంలో నిత్యజీవం పొందడానికి చేయబడిన ఏర్పాటు గురించి తెలుసుకునే అవకాశం వారికి లభిస్తుంది. దేవుని వాక్యాన్ని బోధించేవారి ఐక్య గుంపుగా, గొప్ప బోధకుడైన యేసుక్రీస్తు మాదిరిని అనుసరిస్తూ, ఆయన దైవిక లక్షణాలను ప్రతిబింబిస్తూ ఉండాలన్నది మన దృఢ నిశ్చయం. మనం ఇదంతా మన మహోపదేశకుడు, జీవదాత అయిన యెహోవా దేవునికి ఘనత, స్తుతి కలిగేలా చేస్తాము.
“ఈ సమావేశానికి హాజరైన వారిలో, ఈ తీర్మానాన్ని స్వీకరించడానికి సుముఖంగా ఉన్నవారందరూ, దయచేసి అవును అని చెప్పండి!”
ఫ్రాన్స్‌లోని మూడు సమావేశాలలో సమకూడిన 1,60,000 మందిని, ఇటలీలోని తొమ్మిది స్థలాల్లో సమకూడిన 2,89,000 మందిని తీర్మానంలోని ఆ చివరి ప్రశ్న అడిగినప్పుడు, హాజరైన వివిధ భాషలకు చెందిన వారు మేఘగర్జనలా “అవును” అని జవాబిచ్చారు.