కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

నిబంధన మందసమును మోసే దండెలు [మోతకఱ్ఱలు] పరిశుద్ధ స్థలంలోనికి కనబడేలా ఉండేవని 1 రాజులు 8:8 సూచిస్తుంది గనుక ఆమోతకఱ్ఱలు ఏవిధంగా ఉంచబడేవి?

అరణ్యంలో గుడారము కోసం యెహోవా మోషేకు నమూనాను ఇచ్చినప్పుడు, దానిలో కీలకమైన అంశం నిబంధన మందసమే. దీర్ఘచతురస్రాకారంగల, బంగారు పూత పూయబడిన ఈపెట్టెలో పది ఆజ్ఞలున్న పలకలు, ఇతర వస్తువులు ఉండేవి. అది గర్భాలయంలో, అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడేది. మందసముపైన కరుణాపీఠము మీద రెక్కలు చాపుకుని ఉన్నట్లుండే కెరూబుల బంగారు ప్రతిమలు రెండు ఉండేవి. తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారు రేకు పొదిగింపబడిన మోతకఱ్ఱల సహాయంతో మందసమును మోసుకు వెళ్ళగలిగేలా దానికి ఇరుప్రక్కలా ఉంగరములు ఉండేవి. సహేతుకంగా, మోతకఱ్ఱలు ఉంగరముల గుండా జొప్పించబడి, మందసం పొడుగునా ఉండేవి. కాబట్టి, తూర్పుకు అభిముఖంగా ఉన్న గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉండేది గనుక మోతకఱ్ఱలు ఉత్తర-దక్షిణ దిక్కులకు ఉండేవి. తర్వాత మందసము, సొలొమోను నిర్మించిన ఆలయంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉంచబడింది.​—⁠నిర్గమకాండము 25:​10-22; 37:​4-9; 40:​17-21. *

అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి (ముందు గదికి) మధ్యన ఒక తెర ఉండేది. పరిశుద్ధ స్థలంలోని యాజకులు అతిపరిశుద్ధ స్థలంలోకి చూడలేరు, దేవుడు నెలకొనివుండే మందసము వారికి కనిపించదు. (హెబ్రీయులు 9:​1-7) కాబట్టి, “వాటి కొనలు గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడవుగా ఆ దండెలుంచబడెను గాని యివి బయటికి కనబడలేదు” అని చెబుతున్న 1 రాజులు 8:8 చిక్కు సమస్యలా అనిపించవచ్చు. అదే విషయం 2 దినవృత్తాంతములు 5:9 లో కూడా చెప్పబడింది. దేవాలయంలోని పరిశుద్ధ స్థలంలో ఉండే ఎవరికైనా మోతకఱ్ఱలు ఎలా కనిపిస్తాయి?

మోతకఱ్ఱలు తెరను తాకుతూ బయటికి బుడిపెలుగా కనిపించేవని కొందరు ఊహించారు. కానీ మోతకఱ్ఱలు ఉత్తర-దక్షిణ దిక్కులకు ఉండి, అవి తెరకు సమాంతరంగా ఉంటే అది సాధ్యంకాదు. (సంఖ్యాకాండము 3:​38) మరింత సహేతుకమైన వివరణ ఉంది. ఒకవేళ తెరకు, ఆలయ గోడకు మధ్యన కొద్దిగా ఎడం ఉన్న పరిస్థితిలోను లేదా ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే సందర్భంలోను మోతకఱ్ఱలు కనిపిస్తుండవచ్చు. మందసం కనిపించకుండా తెర పూర్తిగా అడ్డుకుంటుంది గానీ ఈచివరి నుండి ఆచివరి వరకూ ఉండే మోతకఱ్ఱలు మాత్రం గోడకు తెరకు మధ్య ఉండే ఎడం గుండా కనిపిస్తుండవచ్చు. ఈవివరణ సహేతుకమైనదే అయినప్పటికీ, మనం దాని గురించి మూర్ఖపు పట్టుదల కలిగి ఉండకూడదు.

మనం తెలుసుకోవలసిన వివరాలు ఇంకా అనేకం ఉన్నాయని స్పష్టమవుతోంది. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన తన లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించాడు. తర్వాత ఆయనిలా వ్యాఖ్యానించాడు: “వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు.” (హెబ్రీయులు 9:⁠5) త్వరలో జరుగబోతున్న నమ్మకమైనవారి పునరుత్థానం, మోషే, అహరోను, బెసలేలు వంటివారి నుండీ, గుడారపు నమూనా గురించి అది పని చేసే తీరు గురించి వ్యక్తిగతంగా తెలిసిన మరితరుల నుండీ తెలుసుకునేందుకు మనకు ఉత్తేజభరితమైన అవకాశాలను కలిగించాలి.​—⁠నిర్గమకాండము 36:⁠1.

[అధస్సూచి]

^ పేరా 3 మందసము గుడారంలో దాని స్థానంలో ఉన్నప్పటికీ, ఉంగరాలలో నుండి మోతకఱ్ఱలను తీయకూడదు. తత్ఫలితంగా, మోతకఱ్ఱలు మరే పనికి ఉపయోగించబడేవి కావు. అంతేగాక, మందసమును ముట్టుకునే పని ఉండదు; మోతకఱ్ఱలను గనుక ఉంగరాలలో నుండి తీసివేయాల్సి ఉండుంటే, మందసమును మోసుకువెళ్ళే ప్రతిసారి మోతకఱ్ఱలను ఉంగరాలలో పెట్టవలసి వచ్చేది. “మోతకఱ్ఱలను దూర్చవలెను” అని సంఖ్యాకాండము 4:6 లో ఉన్న వ్యాఖ్యానం, బరువైన మందసమును క్రొత్త శిబిరంలోకి తీసుకు వెళ్ళేందుకు సిద్ధం చేస్తూ మోతకఱ్ఱలను క్రమపద్ధతిలో ఉంచడాన్ని లేక సరిచేయడాన్ని సూచిస్తుండవచ్చు.