మీ పేరును కాపాడుకోండి
మీ పేరును కాపాడుకోండి
అందమైన ఇళ్ళూ పెద్ద పెద్ద భవనాలూ కట్టడానికి మంచి ప్రణాళికలు తయారు చేసే ఒక వ్యక్తి మంచి ఆర్కిటెక్టుగా పేరు సంపాదించుకుంటాడు. విద్యాభ్యాసంలో ఉత్తమ స్థానానికి చేరుకున్న ఒక యువతి ప్రజ్ఞగల విద్యార్థిని అని పేరు సంపాదించుకుంటుంది. ఏమీ చేయని ఒక బద్దకస్తుడు కూడా సోమరి అని పేరు సంపాదించుకుంటాడు. ఒక మంచిపేరు సంపాదించడం ఎంత విలువైనదో నొక్కిచూపుతూ, ఒక బైబిలు అనువాదం ఇలా అంటుంది: “గొప్ప ఐశ్వర్యముకంటె మంచి పేరు, వెండి బంగారములకంటె కీర్తి ప్రతిష్ఠలు కోరదగినవి.”—సామెతలు 22:1, ఏన్ అమెరికన్ ట్రాన్స్‌లేషన్.
ఒక మంచి పేరును, కొంత కాలంలో చేసిన అనేకమైన చిన్న చిన్న పనులతో సంపాదించుకోవచ్చు. కానీ, ఆ మంచి పేరు పాడవడానికి, ఒక చిన్న మూర్ఖపు చర్య చాలు. ఉదాహరణకు, లైంగికపరమైన దుష్ప్రవర్తనతో కూడిన ఒక్క సంఘటన మంచి పేరును అపఖ్యాతి పాలు చేస్తుంది. బైబిలు పుస్తకమైన సామెతలులోని ఆరవ అధ్యాయంలో, మన పేరును పాడుచేయడమే కాకుండా యెహోవాతో మనకున్న సంబంధాన్ని కూడా చెడగొట్టగలిగే మన ప్రవర్తన గురించి, మన మనోవైఖరి గురించి ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను ఒక హెచ్చరిక చేస్తున్నాడు. వీటిలో ముఖ్యంగా యెహోవా అసహ్యించుకునే అనాలోచిత వాగ్దానాలు, సోమరితనం, మోసం, లైంగిక అనైతికత గురించి చెబుతున్నాడు. ఈ చక్కని సలహాను మనం శ్రద్ధగా గ్రహిస్తే మన మంచిపేరును కాపాడుకోవడానికి అది సహాయపడుతుంది.
మూర్ఖపు వాగ్దానాల నుండి తప్పించుకోండి
సామెతలు ఆరవ అధ్యాయం ఇలా ప్రారంభమౌతుంది: “నా కుమారుడా, నీ చెలికానికొరకు పూటపడిన యెడల పరునిచేతిలో నీవు నీ చేయి వేసినయెడల నీ నోటి మాటలవలన నీవు చిక్కుబడియున్నావు నీ నోటి మాటలవలన పట్టబడియున్నావు నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఈలాగు చేసి తప్పించుకొనుము.”—సామెతలు 6:1-3.
ఈ సామెత ఇతరుల వ్యాపార లావాదేవీల్లో ఇరుక్కోవడం గురించి, ప్రత్యేకించి, ఎక్కువగా పరిచయంలేని వారితో వ్యవహరించడం గురించి హెచ్చరిస్తోంది. అవును, “సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీయొద్దకు వచ్చినయెడల నీవు వానికి సహాయము చేయవలెను” అనే నియమాన్ని ఇశ్రాయేలీయులు పాటించాల్సి ఉండేది. (లేవీయకాండము 25:35-38) కానీ కొందరు ఔత్సాహిక ఇశ్రాయేలీయులు దుస్సాహసంతో కూడిన వ్యాపారాలు చేయడానికి తెగించి, అందుకు కావల్సిన ఆర్థిక పెట్టుబడి కోసం, అప్పు చేస్తూ, అప్పిచ్చేవాడి దగ్గర తమ కోసం ‘పూటపడేలా’ ఇతరులను నమ్మించి, ఆ అప్పుకు వారిని బాధ్యులుగా చేసేవారు. ఇలాంటి పరిస్థితులు నేడు కూడా తలెత్తవచ్చు. ఉదాహరణకు ఫైనాన్సింగ్ సంస్థలు, అప్పు ఇవ్వడానికి ముందు, అనుమానాస్పదంగా ఉంటే ఒక సహసంతకందారు కావాలనవచ్చు. అలాంటి పరిస్థితుల్లో త్వరపడి ఒకరి తరపున, నిబద్ధులవడం ఎంత అవివేకమో కదా! అవును, ఇది మనల్ని ఆర్థికపరమైన చిక్కుల్లో ఇరుక్కొనేలా చేయవచ్చు, బ్యాంకుల్లోనూ, అప్పిచ్చినవారి మధ్యా కూడా మనకు చెడ్డపేరును తీసుకురావచ్చు!
సామెతలు 6:4, 5) తరువాత చిక్కుల్లో పడేకంటే, సాధ్యమైనప్పుడు ఒక మూర్ఖపు వాగ్దానాన్ని ఉపసంహరించుకోవడం మంచిది.
ఒకవేళ మనం ఇప్పటికే తీసుకున్న ఒక చర్య మొదట్లో మంచిగా కనిపించి, తరువాత మనం చేసిన నిశితమైన పరిశీలన వల్ల అది మూర్ఖమైన చర్య అని తెలుసుకునే సరికి మనం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటే ఎలా? సలహా ఏమిటంటే గర్వాన్ని పక్కనబెట్టి “విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము” చేయాలి—పట్టు విడువకుండా బ్రతిమాలాలి. పరిస్థితులు చక్కదిద్దడానికి మనం చేయగలిగినవన్నీ చేయాలి. ఒక పరిశోధక గ్రంథం, “నీవు చేసిన వాగ్దానం వల్ల నీవూ లేక నీ కుటుంబమూ కష్టాల్లో పడకుండా, నీ ప్రత్యర్థిని ఒప్పించి పరిస్థితి చక్కబడేంత వరకు వీలైనన్ని విధాలుగా ప్రయత్నించడం మానకు” అని సూచిస్తోంది. ఆ చర్యను తీసుకోవడానికి ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు. రాజు ఇంకా ఇలా అంటున్నాడు, “నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము. వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకొనుము.” (శ్రమించే చీమలా ఉండండి
“సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము” అని సొలొమోను ఆదేశిస్తున్నాడు. ఒక చిన్న చీమ నడత నుండి మనమే విధంగా జ్ఞానం పొందగలం? రాజు ఇలా జవాబిస్తున్నాడు: “వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.”—సామెతలు 6:6-8.
చీమలు ఆశ్చర్యకరమైన రీతిలో సంస్థీకరించబడి గమనార్హమైన రీతిలో ఒక దానితో ఒకటి మంచి సహకార సంబంధాలు కలిగి ఉంటాయి. వాటికి “పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను” సహజ ప్రవృత్తితో భవిష్యత్తు కొరకు ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. నిజమే, రాణి చీమ ఉంటుందక్కడ, కానీ అది గ్రుడ్లు పెట్టడంవల్ల, ఆ చీమల గుంపుకు తల్లి అవడంవల్ల మాత్రమే రాణి లాంటిది. అయినా అది ఆజ్ఞాపించదు. కనీసం వాటిని నడిపించడానికి అధ్యక్ష్య చీమకానీ, వాటిపై నిఘా ఉంచే చీమగానీ లేకున్నా అవి విసుగు చెందకుండా పనిచేస్తాయి.
చీమలాగా మనము కూడా శ్రమించవద్దా? మనల్ని గమనించేవారు ఉన్నా లేకున్నా కష్టపడి పనిచేయడం, మన పనిలో మరింత మెరుగుచెందడానికి గట్టిగా ప్రయత్నించడం మనకే మంచిది. అవును, పాఠశాలలో, పనిస్థలంలో, ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనేటప్పుడు మనకు చేతనైనంత మనం చేయాలి. చీమ తన శ్రమ వల్ల ఎలా లాభం పొందుతుందో మనం కూడా ‘మన కష్టార్జితమువలన సుఖమనుభవించాలని’ దేవుడు కోరుకుంటున్నాడు. (ప్రసంగి 3:13, 22; 5:18) కష్టపడి పనిచేస్తే ప్రతిఫలంగా నిర్మలమైన మనస్సాక్షి, నిజమైన సంతృప్తి లభిస్తాయి.—ప్రసంగి 5:12.
ఆలోచింపజేసే రెండు ప్రశ్నలను వేస్తూ, ఒక సోమరిని వాని బద్దకాన్నుండి లేపడానికి సొలొమోను ఇలా ప్రయత్నిస్తున్నాడు: “సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు?” రాజు ఇంకా ఇలా అంటున్నాడు, “ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును, ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును.” (సామెతలు 6:9-11) సోమరి నిద్రమత్తులో ఉండగానే దోపిడిదారుడు వచ్చినట్లు అకస్మాత్తుగా దారిద్ర్యము కమ్ముకుంటుంది. ఆయుధధారుడు మీదపడినట్లు లేమి కలుగుతుంది. సోమరివాని చేను ముండ్ల తుప్పలతో నిండిపోతుంది. (సామెతలు 24:30, 31) ప్రారంభించిన వ్యాపారంలో అతడు నష్టపోతాడు. ఒక యజమాని పనికిమాలిన వానిని ఎంతకాలం సహించగలడు? చదవడానికి బద్దకించే వ్యక్తి పాఠశాలలో మంచి విద్యార్థి అవుతాననుకోగలడా?
నిజాయితీగా ఉండండి
ఒక వ్యక్తికి దేవునితో ఉన్న మంచి సంబంధాన్నీ, సమాజంలో అతనికున్న మంచిపేరునూ పతనం చేసే, మరొక విధమైన ప్రవర్తన గురించి సంక్షిప్తంగా సొలొమోను ఇలా వర్ణిస్తున్నాడు: “కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడును దుష్టుడునై యున్నాడు వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగచేయును వ్రేళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతిమూర్ఖ స్వభావముగలది వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును.”—సామెతలు 6:12-14.
ఒక మోసగాడిని గురించిన వర్ణన ఇది. ఒక అబద్ధాలకోరు, సాధారణంగా తన అబద్ధాలను కప్పిపుచ్చుతాడు. ఎలా? “కుటిలమైన మాటలతో” మాత్రమే కాదు, అభినయంతో కూడా. ఒక విద్వాంసుడు ఇలా చెబుతున్నాడు: “సంజ్ఞలు, కంఠస్వరంలోని భేదాలు, ముఖకవళికలు కూడా మోసపు పన్నుగడలకు ఉపకరించే గొప్ప మాధ్యమాలు. ఒక నిజాయితీ ముసుగు వెనుక దుష్ప్రవర్తనతో నిండిన మనస్సు, అసమ్మతమైన స్ఫూర్తి నక్కి ఉంటాయి. అలాంటి పనికిమాలిన వాడు ఎప్పుడూ దుష్ట పథకాలు వేస్తుంటాడు. అన్నివేళలా పోరుకు కారకుడవుతాడు. అలాంటి వాడి పరిస్థితి ఏమౌతుంది?
“కాబట్టి ఆపద వాని మీదకు హఠాత్తుగా వచ్చును” అని ఇశ్రాయేలు రాజు జవాబిస్తున్నాడు. “వాడు తిరుగలేకుండ ఆ క్షణమందే నలుగగొట్టబడును.” (సామెతలు 6:15) అబద్ధాలు చెప్పేవాడి గుట్టు బట్టబయలు అయిన తక్షణమే వాడి పేరు ప్రతిష్ఠలు పతనమైపోతాయి. వాడిని మళ్ళీ ఎవరు నమ్ముతారు? “అబద్ధికులందరు” సర్వనాశనానికి గురయ్యే వారి పట్టికలో చేర్చబడ్డారు గనుక నిజంగా వాడికి నాశనమే ముగింపు. (ప్రకటన 21:8) కాబట్టి, మనమెల్లప్పుడూ ‘అన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తించుదాం.’—హెబ్రీయులు 13:18.
యెహోవా అసహ్యించుకొనేవాటిని అసహ్యించుకోండి
దుష్టత్వంపై ద్వేషం—మన పేరు ప్రతిష్ఠలకు హాని కలిగించే చర్యల్లో పాల్గొనకుండా మనల్ని నిరోధిస్తుంది! మరి మనం చెడును ఏవగించుకోవడానికి కృషి చేయవద్దా? అయితే, మనం నిజానికి దేన్ని అసహ్యించుకోవాలి? “యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును” అని సొలొమోను చెప్తున్నాడు.—సామెతలు 6:16-19.
ఈ సామెతలో పేర్కొనబడిన ఏడు వర్గాలు, అన్ని విధాల తప్పిదాలకు ప్రధానమైన మూల వర్గాలు. “అహంకారదృష్టి,” “దుర్యోచనలు యోచించు హృదయము” తలంపుల్లో చేసే పాపాలు. “కల్లలాడు నాలుక” ‘లేనివాటిని పలుకు అబద్ధసాక్ష్యం’ అనేవి పాపపూరితమైన మాటల క్రిందికి వస్తాయి. “నిరపరాధులను చంపు చేతులును” “కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు” దుష్ట క్రియల క్రిందికి వస్తాయి. ప్రత్యేకంగా, శాంతియుతంగా కలిసిమెలిసి ఉన్న వారి మధ్య కలహాలు రేపే వ్యక్తిని యెహోవా ఎక్కువగా అసహ్యించుకుంటాడు. ఇక్కడి సంఖ్య ఆరు నుండి ఏడుకు పెరగడానికి కారణం, మానవులు ఎప్పుడూ వారి దుష్కార్యాలను పెంచుకుంటూనే ఉంటారు కాబట్టి, ఈ పట్టికకు అంతులేదన్న విషయాన్ని సూచించడానికి అయివుండవచ్చు.
వాస్తవానికి మనం యెహోవా అసహ్యించుకొనేవాటిపై చీదరింపు భావాన్ని పెంచుకోవల్సిన అవసరంవుంది. ఉదాహరణకు మనకు “అహంకారదృష్టి” లేక గర్వాన్ని వ్యక్తపరిచే లక్షణమేదైనా ఉంటే దాన్ని పూర్తిగా విసర్జించాలి. హానికరమైన ఊసుపోని కబుర్లకు తప్పకుండా దూరంగా ఉండాలి. అది సులభంగా “అన్నదమ్ములలో జగడములు పుట్టి[స్తుంది].” ఇతరుల మనసు నొప్పించే గాలి వార్తలను వ్యాప్తి చేస్తూ, అన్యాయమైన విమర్శలతో లేక అబద్ధాలతో మనం ‘నిరపరాధులను చంపక’ పోయినా, మనము మరొక వ్యక్తి మంచి పేరు ప్రతిష్టలను నాశనం చేయగలము.
“ఆమె అందాన్ని ఆశించకు”
సొలొమోను ఆయన తరువాతి సలహా విభాగాన్ని ఇలా ప్రారంభిస్తున్నాడు: “నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము.” కారణం? “నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును.”—సామెతలు 6:20-22.
బైబిలు క్రమశిక్షణతో కూడిన పెంపకం అనైతిక లైంగిక ఉచ్చు నుండి నిజంగా కాపాడగలదా? అవును, కాపాడగలదు. మనకు ఇలా హామీ ఇవ్వబడింది: “ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండను పర స్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును.” (సామెతలు 6:23, 24) దేవుని వాక్యంలోని సలహాలను గుర్తు చేసుకుంటూ వాటిని ‘మన పాదములకు దీపముగా మన త్రోవకు వెలుగుగా’ ఉపయోగించుకుంటే, అవి ఒక చెడు స్త్రీ నుండైనా, చెడు అలవాట్లుగల పురుషుడినుండైనా వచ్చే తేనెపూసిన మాటలకు లోనుకాకుండా సహాయపడతాయి.—కీర్తన 119:105.
“దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము” అని జ్ఞానియైన రాజు ఆదేశిస్తున్నాడు. “అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొననియ్యకుము.” ఎందుకు? ఎందుకంటే “వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును.”—సామెతలు 6:25, 26.
సొలొమోను ఇక్కడ వేశ్య అని సంభోదించినప్పుడు, పర పురుషుడితో అక్రమ సంబంధంవున్న ఒక వివాహితను వేశ్యగా సూచిస్తున్నాడా? బహుశా కావచ్చు. లేక ఒక వేశ్యతోగానీ పొరుగువాని భార్యతోగానీ అనైతిక లైంగిక సంబంధాలు కలిగి ఉంటే వచ్చే దుష్ఫలితాల భేదాన్ని తెలియజేస్తుండవచ్చు. వేశ్యతో సాంగత్యము ఉన్న ఒక వ్యక్తి, “రొట్టెతునక మాత్రము మిగిలియుండే” దుస్థితికి—కటిక పేదరికానికి దిగజారతాడు. అతను ఇంకా, బాధాకరమైన లైంగిక వ్యాధులకు గురవ్వవచ్చు, ప్రాణాంతకమైన ఎయిడ్స్ కూడా రావచ్చు. మరొక వైపు, ఇంకొకరి వివాహ భాగస్వామితో అక్రమ లైంగిక సంబంధాన్ని కోరుకునే వ్యక్తి ధర్మశాస్త్రం ప్రకారం గొప్ప ప్రాణాపాయంలో పడతాడు. ఒక వ్యభిచారిణి అయిన భార్య, తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి “విలువగల ప్రాణమును” అపాయానికి గురి చేస్తుంది. “సహజ మరణానికంటే ముందే ప్రాణాలు కోల్పోవడం మాత్రమే కాదు ఇక్కడ ఉద్దేశించబడింది. తన పొరుగువాని భార్యతో వ్యభిచరించినవాడు మరణశిక్షకు పాత్రుడౌతాడు” అని ఒక పరిశోధన గ్రంథం వివరిస్తుంది. (లేవీయకాండము 20:10; ద్వితీయోపదేశకాండము 22:22) ఏదేమైనా ఆమె బాహ్యంగా సౌందర్యవతి అయినప్పటికినీ అటువంటి స్త్రీని ఆశించవద్దు.
‘ఒడిలో అగ్ని ఉంచుకోవద్దు’
వ్యభిచారంలోని అపాయాన్ని ఎత్తి చూపుతూ సొలొమోను ఇంకా ఇలా అడుగుతున్నాడు: “ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా?” ఆ ఉపమానాన్ని వివరిస్తూ, “తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు” అని ఆయన చెబుతున్నాడు. (సామెతలు 6:27-29) అవును, అటువంటి పాపం చేసినవాడు శిక్ష తప్పించుకోలేడు.
“దొంగ ఆకలిగొని ప్రాణరక్షణకొరకు దొంగిలిన యెడల యెవరును వాని తిరస్కరింపరు గదా” అని మనకు జ్ఞాపకం చేయబడుతోంది. అయినప్పటికినీ, “వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను తన యింటి ఆస్తి అంతయు అప్పగింపవలెను.” (సామెతలు 6:30, 31) ప్రాచీన ఇశ్రాయేలులో ఒక దొంగ తనకున్నదంతా అప్పగించాల్సి వచ్చినా తప్పక దాని పరిహారం చెల్లించాల్సిందే. * అయితే, తాను చేసిన తప్పుకు దొంగకు ఉన్నట్లుగా, ఎటువంటి ఏర్పాటూ లేక అవకాశమూ లేని ఒక వ్యభిచారి మరెంతటి పెద్ద శిక్షకు పాత్రుడు!
“జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు” అని సొలొమోను వివరిస్తున్నాడు. బుద్ధిశూన్యతగల ఒక వ్యక్తికి యుక్తాయుక్త జ్ఞానం సరిగా ఉండదు. అందుకే “స్వనాశనమును కోరు”కుంటున్నాడు. (సామెతలు 6:32) అతడు పైకి పేరు ప్రతిష్ఠలుగల వ్యక్తిగా కన్పించవచ్చు. కానీ అతనికి మానసిక వికాసం తీవ్రంగా లోపించింది.
ఒక వ్యభిచారి కోయాల్సిన పంట ఇంకా ఉంది: “వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రముగలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు.”—సామెతలు 6:33-35.
ఒక దొంగ తను దొంగిలించినదానికి పరిహారము ఇవ్వగలడేమో కానీ ఒక వ్యభిచారి నష్టపరిహారం మాత్రం చెల్లించలేడు. కోపంతో ఉన్న ఒక భర్తకు అతడు ఏమి నష్టపరిహారము చెల్లించగలడు? ఎంత దీనాతిదీనంగా వేడుకున్నా అలాంటి తప్పిదస్థునిపై ఆ భర్తకు జాలి కలుగదు. ఏవిధంగానూ తను చేసిన పాపానికి నష్టపరిహారం చెల్లించలేడు. తన పేరుమీదకు తెచ్చుకున్న కళంకం, అవమానం మాత్రం మిగులుతాయి. అంతేకాకుండా శిక్ష నుండి ఏవిధంగానూ తనను తాను విడుదల చేసుకోలేడు, స్వేచ్ఛను కొనుక్కోలేడు.
వ్యభిచారాన్నుండి దూరంగా ఉంటూ, మన మంచిపేరును మలినపరిచేదే కాక, దేవునిపైకి నిందను తెచ్చే ప్రవర్తన, మనో వైఖరి నుండి దూరంగా ఉండడం ఎంత తెలివైన పనో కదా! అందుకని మనం మూర్ఖపు వాగ్దానాలు చేయకుండా జాగ్రత్తగా ఉందాము. నిజాయితీతో శ్రమించే వాడని మంచి పేరు తెచ్చుకుందాం. యెహోవా అసహ్యించుకునేదానిని మనమూ అసహ్యించుకోవడానికి కృషి చేయడం ద్వారా యెహోవాతోనూ తోటివారితోనూ మంచి పేరు సంపాదించుకుందాం.
[అధస్సూచి]
^ పేరా 28 మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఒక దొంగ రెండింతలు, నాలుగింతలు లేక ఐదింతలు చెల్లించాలి. (నిర్గమకాండము 22:1-4) ఇక్కడ వాడిన “ఏడంతలు” అనే పదం సంపూర్ణ నష్టపరిహారాన్ని సూచిస్తున్నట్టుంది. అది అతడు దొంగిలించిన దానికి అనేక రెట్లు ఎక్కువ కూడా ఉండవచ్చు.
[25వ పేజీలోని చిత్రం]
అప్పు విషయంలో సహసంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి
[26వ పేజీలోని చిత్రం]
చీమలాగా శ్రమించండి
[27వ పేజీలోని చిత్రం]
హానికరమైన పుకార్లకు దూరంగా ఉండండి