మీరు విభేదాల్ని ఎలా పరిష్కరించుకుంటారు?
మీరు విభేదాల్ని ఎలా పరిష్కరించుకుంటారు?
ప్రతిరోజు మనం ఎంతో వైవిధ్యమున్న వ్యక్తిత్వాలు గలవారిని కలుస్తుంటాము, కలిసి పనిచేస్తుంటాము. అందులో మనం తరచు ఆనందాన్ని కనుగొంటాము, కొత్త కొత్త దృక్పథాల్ని తెలుసుకుంటాము. కొన్నిసార్లైతే కొన్ని విభేదాలు కూడా తలెత్తుతుంటాయి. ఈ విభేదాల్లో కొన్ని గంభీరమైనవైతే, మరికొన్ని దైనందిన జీవితంలో తరచు ఏర్పడే చిన్న చిన్న విభేదాలే. అవి ఎలాంటివైనప్పటికీ, మనకు ఎదురయ్యే విభేదాలతో మనం ఎలా వ్యవహరిస్తామో, దాన్నిబట్టి మనపై మానసికంగా, భావోద్వేగపరంగా, ఆధ్యాత్మికంగా ప్రభావం ఉంటుంది.
ఇతరులతో మనకున్న విభేదాల్ని సరైన రీతిలో పరిష్కరించుకోవడానికి మనకు చేతనైనంత మట్టుకు చేస్తే మనం మరింత ఆరోగ్యవంతంగా ఉంటాము, ఇతరులతో శాంతియుతమైన సంబంధాలూ నెలకొంటాయి. ప్రాచీనకాలం నాటి ఒక సామెత ఇలా చెబుతుంది: “సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము.”—సామెతలు 14:30.
దీనికి భిన్నమైన కోణంలో మరో వాస్తవం ఇలా ఉంది: “ప్రాకారము లేక పాడైన పురము ఎంతో; తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే.” (సామెతలు 25:28) అనుచితమైన ప్రవర్తనకు నడిపించే తప్పుడు ఆలోచనలు మన మనస్సుల్లోకి ప్రవేశించేంత బలహీనంగా ఉండాలని మనలో ఎవరు మాత్రం ఇష్టపడతారు? అటువంటి ప్రవర్తన మనకూ మన చుట్టూ ఉన్నవారికీ హాని తలపెట్టగలదు. నిగ్రహం కోల్పోయి కోపంతో ప్రతిస్పందించినప్పుడు జరిగేది సరిగ్గా అదే. కొండమీది ప్రసంగంలో యేసు, మనం మన వైఖరిని పరిశీలించుకోవాలని చెప్పాడు. ఇతరులతో మనకున్న విభేదాల్ని మనం ఎలా పరిష్కరించుకుంటామన్నదాన్ని మన వైఖరి ప్రభావితం చేయగలదు. (మత్తయి 7:3-5) ఇతరులను గూర్చి విమర్శనాత్మకంగా ఉండే బదులు, భిన్నమైన అభిప్రాయాలూ నేపథ్యాలూ ఉన్నవారితో ఎలా స్నేహాన్ని పెంపొందించుకోవచ్చో ఆలోచించాలి.
మన వైఖరి
ఇతరులతో నిజంగానే విభేదాలు ఉన్నా, లేదా ఉన్నాయని కేవలం మనం ఊహించుకున్నా, వాటిని పరిష్కరించటానికి మొట్టమొదటి మెట్టు ఏమిటంటే, మనం తప్పుడు తలంపులకూ తప్పుడు వైఖరులకూ లోనయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించటమే. మనమందరమూ పాపాలు చేస్తామనీ, అందువలన “దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నా”మనీ లేఖనాలు మనకు గుర్తుచేస్తున్నాయి. (రోమీయులు 3:23) దానికి తోడు వివేచన అనే లక్షణం, నిజానికి మన సమస్యకు మూలం అవతలి వ్యక్తే కాదని కూడా మనకు వెల్లడిచేయవచ్చు. దీని సంబంధించి మనం యోనా ఉదాహరణని పరిశీలిద్దాము.
యెహోవా నిర్దేశం ప్రకారం యోనా, నీనెవె పట్టణస్థులపైకి రానైయున్న యెహోవా దేవుని తీర్పులను ప్రకటించటానికి అక్కడికి వెళ్ళాడు. సంతోషకరమైన విషయమేమిటంటే చివరికి నీనెవె పట్టణస్థులందరూ పశ్చాత్తాపపడి సత్య దేవుని యందు విశ్వాసం ఉంచారు. (యోనా 3:5-10) పశ్చాత్తాపంతో కూడిన వైఖరిని వారు చూపించినప్పుడు వారు క్షమకు అర్హులని యెహోవా భావించి వారిని శిక్షించలేదు. అయితే, “యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించు[కున్నాడు.]” (యోనా 4:1) యెహోవా వారిపై కనికరపడడం పట్ల యోనా ఈ విధంగా ప్రతిస్పందించడం ఆశ్చర్యంగా ఉంది. యెహోవాపై యోనాకు కోపమెందుకు రావాలి? అర్థమౌతున్న విషయమేమిటంటే, యోనా తన స్వంత భావాలను గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, తను వారి ఎదుటికి వెళ్ళడానికి తనకిక ముఖం చెల్లదని ఆయన అనుకుంటున్నాడు. ఆయన యెహోవా కనికరాన్ని గుణగ్రహించలేకపోయాడు. యెహోవా దయతో యోనాకు ఒక సంఘటన ద్వారా పాఠాన్ని నేర్పి, ఆయన తన వైఖరిని మార్చుకునేందుకూ తనలోని కనికరమనే గుణం ఎంత అమూల్యమైనదో గ్రహించటానికీ ఆయనకు సహాయం చేశాడు. (యోనా 4:7-11) మార్పు అవసరమైనది యెహోవా వైఖరిలో కాదుగానీ యోనా వైఖరిలోనన్నది స్పష్టమౌతుంది.
మనం కూడా అదే విధంగా ఏదైనా విషయాన్ని గురించి మనకున్న వైఖరిని మార్చుకోవల్సిన అవసరం ఉండగలదా? అపొస్తలుడైన పౌలు మనకిలా ఉద్బోధిస్తున్నాడు: “ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.” (రోమీయులు 12:10) ఏమిటి దానర్థం? ఒక రకంగా చూస్తే, ఆయన మనల్ని సహేతుకంగా ఉండమని ప్రోత్సహిస్తున్నాడు, ఇతర క్రైస్తవుల్ని ప్రగాఢమైన గౌరవంతో, మన్ననతో చూడమని చెబుతున్నాడు. ఇందులో, ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛాపూర్వకంగా ఎంపికలు చేసుకునే అధికారం ఉందని గుర్తించడం ఇమిడివుంది. పౌలు ఇలా కూడా గుర్తుచేస్తున్నాడు: “ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా?” (గలతీయులు 6:5) అందుకని, విభేదాలు అగాధాల్ని సృష్టించక మునుపే, అసలు మన స్వంత వైఖరినే మార్పుచేసుకోవల్సిన అవసరం ఉందో లేదో పరిశీలించుకోవడం ఎంత జ్ఞానయుక్తం! మనం యెహోవా ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించడానికీ, ఆయనను నిజంగా ప్రేమించే వారితో శాంతియుత సంబంధాల్ని స్థాపించుకోవటానికీ కృషిచేయాలి.—యెషయా 55:8, 9.
మన ప్రవర్తన
ఇద్దరు చిన్న పిల్లలు ఒక బొమ్మ కోసం కీచులాడుకుంటున్నారనుకోండి, దాన్నెలాగైనా తన చేతుల్లోకి రప్పించుకోవాలని ఒకరిని మించి మరొకరు గట్టిగా లాక్కుంటున్నారు. ఈ పెనుగులాటలో కోపంతో అరుచుకుంటూ ఉంటారు, చివరికి ఎవరో ఒకరి చేతిలోకి ఆ బొమ్మ వెళ్ళిపోవడమో లేదా వేరెవరో కలుగజేసుకోవడమో జరుగుతుంది. కానీ ఈ వృత్తాంతాన్ని పరిశీలించండి.
అబ్రాహాము దగ్గరి పశువుల కాపరులకూ ఆయన అన్న కొడుకైన లోతు దగ్గరి పశువుల కాపరులకూ కలహం పుట్టడం గురించి అబ్రాహాము విన్నాడని ఆదికాండములోని ఒక వృత్తాంతం మనకు చెబుతుంది. అబ్రాహాము చొరవ తీసుకుని లోతు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: “మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశుపుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు.” ఎటువంటి కలహమూ తమ సంబంధాన్ని దెబ్బతీయకూడదన్నది అబ్రాహాము నిర్ణయం. అందుకు చెల్లించాల్సిన మూల్యం? ముందుగా ఎంపిక చేసుకునే ఆధిక్యత పెద్ద మనిషిగా తనకున్నా ఆ అవకాశాన్ని త్యాగం చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు; అంటే తన ఇష్టాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. లోతు తన పరివారాన్నీ తన పశువుల మందల్నీ ఎటువైపు తీసుకెళ్ళాలనుకుంటున్నాడో తననే ముందుగా ఎంపిక చేసుకోమని అబ్రాహాము ఆయనకు అవకాశమిచ్చాడు. చివరికి లోతు సొదొమ గొమొఱ్ఱాలలో ఉన్న పచ్చని ప్రదేశాల్ని ఎంపిక చేసుకున్నాడు. అబ్రాహాము లోతులు సమాధానంతో విడిపోయారు.—ఆదికాండము 13:5-12.
ఇతరులతో శాంతియుత సంబంధాల్ని కాపాడుకోవడానికి మనం అబ్రాహాములా ప్రవర్తించడానికి సిద్ధంగా ఉన్నామా? ఏదైనా విభేదం తలెత్తినప్పుడు దాన్ని పరిష్కరించటానికి మనకొక చక్కని మాదిరిని ఈ బైబిలు వృత్తాంతం అందజేస్తుంది. ‘మనకు కలహముండకూడదు’ అని అబ్రాహాము విజ్ఞప్తి చేశాడు. అబ్రాహాము చేస్తున్న ప్రయత్నమేమిటంటే ఒక శాంతికరమైన పరిష్కారాన్ని సాధించాలన్నదే. శాంతియుత సంబంధాల్ని కొనసాగించేందుకైన అటువంటి విన్నపం ఎటువంటి అపార్థాన్నైనా రూపుమాపుతుంది. అబ్రాహాము “మనము బంధువులము” అని అన్నాడు. ఏవో వ్యక్తిగత ఇష్టాయిష్టాల కోసమో లేదా అహం దెబ్బతింటుందనో అటువంటి బంధుత్వాన్ని ఎందుకు త్యాగం చేయాలి? ఏది ప్రాముఖ్యమైనదో అబ్రాహాముకు స్పష్టంగా తెలుసు. ఆయన తన ఆత్మ-గౌరవానికీ తన హుందాతనానికీ తగ్గట్టుగానూ, అదే సమయంలో తన అన్న కొడుకు గౌరవానికి భంగం వాటిల్లకుండానూ ప్రవర్తించాడు.
ఏదైనా విభేదాన్ని పరిష్కరించుకోవడానికి కొన్నిసార్లు బయటి నుండి సహాయం అవసరం కావచ్చు, కానీ విషయాల్ని వ్యక్తిగతంగా పరిష్కరించుకోగల్గితే అదెంత ఉత్తమం! మన సహోదరునితో శాంతియుత సంబంధాల్ని కాపాడుకోవడానికి మనం చొరవ తీసుకోవాలని యేసు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, అవసరమైతే క్షమాపణలు కోరడంలో కూడా చొరవ తీసుకోవచ్చు. * (మత్తయి 5:23, 24) అందుకు నమ్రత, అంటే దీనమనస్సు అవసరమౌతుంది, కానీ పేతురు ఏమి వ్రాశాడో చూడండి: “మీరందరు ఎదుటివానియెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.” (1 పేతురు 5:5) మనం మన తోటి ఆరాధకులతో ఎలా వ్యవహరిస్తామో, అది దేవునితో మనకు గల సంబంధంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.—1 యోహాను 4:20.
క్రైస్తవ సంఘం లోపల శాంతిని నెలకొల్పటానికి మనం ఫలాని హక్కును విడిచిపెట్టుకోవాలని మనల్ని కోరుతుండవచ్చు. ఇప్పుడు యెహోవాసాక్షులతో సహవసిస్తున్న వారిలో చాలామంది గత ఐదు సంవత్సరాల్లో ఈ దేవుని సత్యారాధకుల కుటుంబంలోకి వచ్చినవారే. ఇలా ఇతరులు మనతో చేరడం మన హృదయాలకు ఎంత పులకింతను కలుగజేస్తుంది! మనం ఎలా ప్రవర్తిస్తామన్నది వీరిపైనా సంఘంలోని మరితరులపైనా తప్పక ప్రభావాన్ని చూపుతుంది. అందుకనే మనం ఏ విధమైన వినోదాన్ని, వ్యాపకాల్ని, సాంఘిక కార్యకలాపాల్ని, లేదా ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుంటామో జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇతరులు మనల్ని చూసి ఏమి అనుకుంటారో పరిగణనలోనికి తీసుకోవాలి. మన మాటలు గానీ చర్యలు గానీ ఇతరులు అపార్థం చేసుకునే సాధ్యత ఉందా? తద్వారా ఇతరులెవరైనా అభ్యంతర పడే అవకాశం ఉందా?
అపొస్తలుడైన పౌలు మనకిలా గుర్తుచేస్తున్నాడు: “అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.” (1 కొరింథీయులు 10:23, 24) క్రైస్తవులముగా మనం మన క్రైస్తవ సహోదరత్వపు ప్రేమా ఐక్యతలకు క్షేమాభివృద్ధిని కలుగజేయాలని పూర్ణ మనస్సుతో కోరుకుంటాము.—కీర్తన 133:1; యోహాను 13:34, 35.
గాయాల్ని మాన్పే మాటలు
మనం మాట్లాడే మాటలు మంచి ప్రభావాన్ని కల్గివుండగలవు. “ఇంపైన మాటలు తేనెపట్టువంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్యకరమైనవి.” (సామెతలు 16:24) గిద్యోను ఎఫ్రాయిమీయులతో జరుగబోయే సంఘర్షణను తప్పించిన వృత్తాంతంలో ఈ సామెతలోని సత్యం వెల్లడౌతుంది.
గిద్యోను మిద్యానుతో యుద్ధంలో కూరుకుపోయివున్నాడు, సహాయం కోసం ఎఫ్రాయిమీయులను అర్థించాడు. అయితే యుద్ధం ముగిసిన తర్వాత, ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో కలహం పెట్టుకొని తమను ముందే ఎందుకు పిలువలేదని గట్టిగా నిలదీశారు. దీన్ని గూర్చిన నివేదికలో, వారు “అతనితో కఠినముగా కలహించిరి” అని ఉంది. గిద్యోను దానికి ప్రతిస్పందనగా ఇలా అన్నాడు: “మీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడ? అబీయెజెరు ద్రాక్షపండ్ల కోతకంటె ఎఫ్రాయిమీయుల పరిగె మంచిదికాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జెయేబును మీచేతికి అప్పగించెను; మీరు చేసినట్లు నేను చేయగలనా?” (న్యాయాధిపతులు 8:1-3) ఈ విధంగా ఆచితూచి మాట్లాడడంతో, ప్రశాంతత నెలకొల్పి ముంచుకురాబోతున్న గిద్యోను అంతర్‌గోత్ర యుద్ధాన్ని నివారించాడు. బహుశా ఎఫ్రాయిము గోత్రంవారిలో తాము ప్రముఖులమన్న భావన లేదా అహంభావం అనే సమస్య ఉండివుండవచ్చును. అయితే, దాని మూలంగా శాంతిని నెలకొల్పాలన్న తన సంకల్పం దెబ్బ తినేందుకు గిద్యోను అనుమతించలేదు. మనం కూడా అలా చేయగలమా?
కొన్నిసార్లు అవతలివారు ఏదైనా సందర్భంలో కోపంతో నిప్పులు చెరుగుతుండవచ్చు; మనపట్ల శత్రుత్వ భావాలు వారిలో ఉండవచ్చు. వారి భావనల్ని గుర్తించి వారి దృక్పథాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారలా ప్రవర్తించటానికి మనమేమన్నా దోహదపడ్డామా? అలాగైతే, అలాంటి పరిస్థితిని సృష్టించినందుకు మీరెంత వరకు కారణమో ఒప్పుకుని, మీరు సమస్యని ఎక్కువ చేసినందుకు మీరు విచారిస్తున్నారని వ్యక్తం చేయండి. ఆచితూచి మాట్లాడడం ద్వారా, దెబ్బతిన్న సంబంధాల్ని తిరిగి పునఃస్థాపించవచ్చు. (యాకోబు 3:4) మనపట్ల ఉక్రోషంతో ఉన్న కొందరికి మనవైపు నుండి కేవలం దయాపూర్వకమైన మాటలు అవసరం కావచ్చు. “కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును” అని బైబిలు చెబుతుంది. (సామెతలు 26:20) అవును, జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న మాటలను సరైన స్ఫూర్తితో వ్యక్తం చేసినప్పుడు అవి ‘క్రోధాన్ని చల్లార్చి’ గాయాల్ని మాన్పేవిగా ఉండగలవు.—సామెతలు 15:1.
అపొస్తలుడైన పౌలు ఇలా సిఫారసు చేస్తున్నాడు: “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.” (రోమీయులు 12:18) మనం ఇతరుల భావాల్ని అదుపు చేయలేమన్నది నిజమే, కానీ శాంతిని నెలకొల్పడానికి మనకు చేతనైనంత మట్టుకు మాత్రం తప్పక చేయగలం. మనలోని అలాగే ఇతరులలోని అపరిపూర్ణతల మూలంగా వ్యక్తమయ్యే భావాలకు తల ఒగ్గడానికి బదులుగా, మనం బైబిలులోని సుస్థాపితమైన సూత్రాలను ఆచరించడానికి చర్యలు తీసుకోగలము. యెహోవా మనకు ఉపదేశిస్తున్నట్లుగా మనం విభేదాల్ని పరిష్కరించుకుంటే నిత్య శాంతిసంతోషాలు వెల్లివిరుస్తాయి.—యెషయా 48:17.
[అధస్సూచి]
^ పేరా 13 అక్టోబరు 15, 1999, కావలికోటలోని “హృదయపూర్వకంగా క్షమించండి,” “మీరు మీ సహోదరుని సంపాదించుకోవచ్చు” అనే శీర్షికలు చూడండి.
[24వ పేజీలోని చిత్రం]
మన మాటే నెగ్గాలని మనం పట్టుబట్టుతామా?
[25వ పేజీలోని చిత్రం]
విలువైనదాన్ని వదులుకోవడంద్వారా అబ్రాహాము విభేదాన్ని పరిష్కరించుకోవటంలో చక్కని మాదిరిని నెలకొల్పాడు