ఓదార్పు అవసరం ఎంతో ఉంది!
ఓదార్పు అవసరం ఎంతో ఉంది!
“వాళ్లు కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూశాను. ఆ విచారగ్రస్తుల్ని ఓదార్చేవాళ్లు ఎవరూ లేరన్న విషయం, క్రూరులైనవాళ్ల చేతుల్లోనే అధికారమంతా ఉందన్న విషయం కూడా నేను గమనించాను. ఆ క్రూరుల చేతుల్లో బాధలుపడేవాళ్లకు ఉపశమనం కలిగించే వాడెవడూ లేడని నేను గమనించాను.”—ప్రసంగి 4:1, పరిశుద్ధ బైబల్.
మీరు ఓదార్పు కోసం చూస్తున్నారా? నిరాశా నిస్పృహల నుండి బయట పడాలనీ, కాస్త ఉపశమనాన్ని పొందాలనీ ఆరాటపడుతున్నారా? కష్టాలతో చేదు అనుభవాలతో నిండివున్న జీవితంలో కాస్త ఊరట పొందాలని వాంఛిస్తున్నారా?
ఎప్పుడో ఒకప్పుడు, ఓదార్పూ ప్రోత్సాహమూ మనందరికీ చాలా అవసరం అవుతూ ఉంటాయి. ఎందుకంటే జీవితాన్ని బాధామయం చేసే అనేక విషయాలు ఉన్నాయి. ఆశ్రయం, ఆప్యాయత, ఆలింగనాలు మనందరికీ అవసరం. మనలో కొందరు వృద్ధులవుతున్నారు గనుక సంతోషంగా లేరు. జీవితం తాము ఆశించినట్లుగా లేనందువల్ల ఇతరులు నిరాశతో కుమిలిపోతున్నారు. మరి కొందరు లేబరేటరీలో పరీక్ష చేయించుకున్నాక తెలిసిన విషయాన్ని బట్టి స్థైర్యాన్ని కోల్పోతున్నారు.
అంతేకాక, మన కాలంలో జరుగుతున్న సంఘటనల మూలంగా మనకు ఆశా, ఓదార్పుల అవసరం ఎంతో ఏర్పడిందన్న విషయాన్ని ఎవరూ కూడా నిరాకరించలేరు. కేవలం గత శతాబ్దంలో జరిగిన యుద్ధాల్లోనే పది కోట్ల కంటే ఎక్కువమంది ప్రజలు చనిపోయారు. * ఆ యుద్ధాల్లో మరణించినవారి తల్లులూ, తండ్రులూ అక్కచెల్లెళ్ళూ, అన్నదమ్ములూ, వారి భార్యలూ, పిల్లలూ ఎంతో దుఃఖంలో ఉన్నారు. వాళ్ళు ఓదార్పు కోసం ఆరాటపడుతున్నారు. ఈనాడు, దాదాపు 100 కోట్ల కన్నా ఎక్కువ మంది కడు పేదరికంలో జీవిస్తున్నారు. ప్రపంచ జనాభాలో సగం మందికి వైద్య సహాయం అందడం లేదు, అత్యవసర మందులు వాళ్ళకు అందుబాటులో లేవు. కాలుష్యమయమైన మహా నగర వీధుల్లో వదిలిపెట్టబడిన దిక్కులేని పిల్లలు, అటు ఇటు తిరుగుతుంటారు, మత్తుమందులను వాడుతుంటారు, వ్యభిచార వృత్తిని చేపడుతుంటారు. కోట్లాదిమంది శరణార్థులు దుర్భరమైన క్యాంపుల్లో జీవితాన్ని గడుపుతున్నారు.
అయినప్పటికీ, యుద్ధం మూలంగా చనిపోయినవారి సంఖ్య ఆసక్తి కలిగిస్తున్నప్పటికీ, మృతుల కుటుంబ సభ్యులు కొందరు తమ జీవితంలో అనుభవిస్తున్న వేదననూ బాధలనూ అది తెలియజేయదు. ఉదాహరణకు, బాల్కాన్స్‌లో ఉన్న ఒక యువతి విషయమే తీసుకుందాం. ఆమె పేరు స్వెట్లానా. * ఆమె నిరుపేద కుటుంబంలో పుట్టింది. “డబ్బు సంపాదించేందుకుగాను, నా తల్లిదండ్రులు నన్ను అడుక్కోవడానికి లేదా దొంగతనం చేయడానికి పంపించేవారు. మా కుటుంబ జీవితం ఎంత దిగజారిపోయిందంటే, స్వయంగా రక్త సంబంధీకుల అత్యాచారానికి నేను ఎర అయ్యాను. నేను వెయిట్రస్‌గా పని సంపాదించుకున్నాను. నేను సంపాదించే డబ్బంతా అమ్మ తీసుకునేది. నేను పనిని పోగొట్టుకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని అమ్మ నాతో చెప్పేది. ఇలాంటి పరిస్థితుల్లో నేను వ్యభిచారిణిగా మారవలసి వచ్చింది. నాకు అప్పుడు కేవలం 13 ఏండ్లు. కొంత కాలం గడిచిన తర్వాత నేను నెల తప్పాను. అయితే అబార్షన్ చేయించుకున్నాను. 15 ఏండ్ల వయస్సులో 30 ఏండ్ల వయస్సు దానిలా కనిపించాను” అని ఆమె అంటోంది.
లాటివ్యాలోని లైమానిస్ అనే యువకుడు తనకు ఓదార్పు కావాలన్న విషయాన్ని గురించీ, తనను నిరాశ నిస్పృహలకు గురి చేసిన నిరాశాజనకపు స్మృతులను గురించీ చెబుతున్నాడు. 29 ఏండ్ల వయస్సులో, కారు ప్రమాదం జరిగి, నడుము క్రింది భాగమంతా పక్షవాతం వచ్చేసింది. అతడు నిరాశతో కుమిలిపోయి, త్రాగుడు మొదలుపెట్టాడు. ఐదు సంవత్సరాల తర్వాత, పూర్తిగా ఆశాభంగమై పోయింది—పక్షవాతం వచ్చి త్రాగుబోతు అయిన ఈ వ్యక్తికి ఇక భవిష్యత్తు మీద ఏ ఆశా లేదు. ఆయన దేనిని బట్టి ఓదార్పు పొందగలడు?
ఏంజీ విషయమే తీసుకోండి. ఆమె భర్తకు మూడుసార్లు బ్రెయిన్ సర్జరీ చేశారు. దానితో ఆయనకు మొదట్లో పాక్షికంగా పక్షవాతం వచ్చింది. చివరి సర్జరీ జరిగిన ఐదు సంవత్సరాల తర్వాత ఆయన ప్రాణాంతకమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆయన చనిపోయేవాడే, కొంతలో తప్పించుకున్నాడు. తలకు పెద్ద గాయం కలిగినా ఎలాగోలా తప్పించుకున్నాడు. ఆయన భార్య ఎమర్జన్సీ రూమ్‌లోకి ప్రవేశించినప్పుడు కోమాలో ఉన్నాడు. చాలా పెద్ద ప్రమాదమేదో ముంచుకొస్తోందని ఆమెకు తెలుసు. తన భవిష్యత్తూ తన కుటుంబ భవిష్యత్తూ చాల కష్టతరం కాబోతోంది. ఆలంబననూ ప్రోత్సాహాన్నీ ఆమె ఎలా కనుగొనగలదు?
ప్యాట్ విషయమే తీసుకోండి. అది కొన్ని సంవత్సరాల క్రితంనాటి సంగతి. అది చలి కాలంలో ఒకరోజు. అది మామూలుగానే మొదలవుతున్నట్లు ఆమెకు అనిపించింది. కాని తర్వాతి మూడు రోజులు ఆమెకు గుర్తే లేదు. తీవ్రంగా ఛాతీనొప్పి వచ్చి, మూడు రోజులు కోమాలోకి వెళ్లిపోయిందని ఆమె భర్త ఆమెకు తర్వాత చెప్పాడు. ఆమె గుండె చాలా వేగంగా క్రమరహితంగా కొట్టుకోనారంభించి చివరికి పూర్తిగా కొట్టుకోవడం ఆగిపోయింది. ఆమె ఉచ్ఛ్వాశ నిశ్వాసాలు ఆగిపోయాయి. “నిజానికి వైద్య పరిభాషలో నేను చనిపోయాననే చెప్పవచ్చు” అని ఆమె అంటోంది. కానీ ఎలాగోలా బ్రతికిపోయింది. “అనేకానేక పరీక్షల మూలంగా భయపడిపోయాను. ముఖ్యంగా నా గుండె మొదట్లో ఎలాగైతే వేగంగా కొట్టుకోనారంభించి ఆగిపోయిందో, అలాగే మళ్ళీ వేగంగా కొట్టుకునేలా చేసి, మళ్ళీ ఆపేందుకు వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు చాలా భయపడ్డాను” అని ఆమె అంటోంది. ఈ క్లిష్ట సమయాల్లో ఆమెకు కావలసిన ఉపశమనాన్నీ ఓదార్పునూ ఏది ఇవ్వగలదు?
జో, రిబెకాల 19 ఏండ్ల కుమారుడు వాహన ప్రమాదంలో చనిపోయాడు. “మునుపు ఇతరుల ప్రియమైన వ్యక్తులు చనిపోయినప్పుడు వాళ్ళతోపాటు మేము కూడా దుఃఖించినప్పటికీ, అంత వేదనను మేము ఎన్నడూ అనుభవించలేదు. ఇప్పుడు అనుభవిస్తున్న హృదయ వేదనను నిజంగా మునుపెన్నడూ అనుభవించలేదు” అని వాళ్ళు అంటున్నారు. అంతటి “హృదయ వేదన”కూ తమ ప్రియమైనవారు చనిపోయినప్పుడు కలిగే తీవ్ర దుఃఖానికీ ఏది ఉపశమనాన్ని కలిగించగలదు?
ఈ వ్యక్తులూ, మరనేక వేలాదిమందీ వీటినన్నింటినీ అధిగమించేందుకు సహాయపడే ఓదార్పునూ ఉపశమనాన్ని ఇవ్వగల మూలాన్ని కనుగొన్నారు. ఆ మూలం నుండి మీరు కూడ ఎలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకునేందుకు తర్వాతి భాగాన్ని కూడా చదవండి.
[అధస్సూచీలు]
^ పేరా 5 చనిపోయిన సైనికుల సంఖ్యా, పౌరుల సంఖ్యా ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. ఉదాహరణకు, 1998 లోని ఫ్యాక్ట్స్ ఎబౌట్ ది అమెరికన్ వార్స్ అనే పుస్తకం రెండవ ప్రపంచ యుద్ధాన్ని గురించి ఇలా అంటుంది: “రెండవ ప్రపంచ యుద్ధం వల్ల చనిపోయినవారి (సైనికులు, పౌరులు) మొత్తం సంఖ్య ఐదు కోట్లని అనేక మూలాలు చెబుతున్నాయి, కానీ ఆ యుద్ధం వల్ల చనిపోయినవారి అసలు సంఖ్య చాలా పెద్దదని, ఐదుకోట్లకన్నా రెండు రెట్లు ఉంటుందని ఆ విషయంపై లోతుగా అధ్యయనం చేసినవారు నమ్ముతున్నారు.”
^ పేరా 6 పేరు మార్చబడింది.
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
UNITED NATIONS/PHOTO BY J. K. ISAAC
UN PHOTO 146150 BY O. MONSEN