కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేహాలు చిన్నవి, హృదయాలు పెద్దవి

దేహాలు చిన్నవి, హృదయాలు పెద్దవి

దేహాలు చిన్నవి, హృదయాలు పెద్దవి

మీరు కేవలం 30 అంగుళాలు మాత్రమే ఎత్తుండి దేవుని రాజ్యం గురించి అపరిచితులతో మాట్లాడాలంటే మీకెలా ఉంటుంది? లారా మీకు చెప్పగలదు. 33 ఏళ్ల వయస్సులో ఉన్న ఆమె కేవలం 30 అంగుళాల ఎత్తు మాత్రమే ఉంది. 24 ఏళ్ల ఆమె చెల్లెలు మారియా 34 అంగుళాల ఎత్తుంది. మారియా, లారా ఈక్వెడార్‌లోని క్విటోలో నివసిస్తున్నారు. వాళ్లు తమ క్రైస్తవ పరిచర్యలో ఎదుర్కుంటున్న అవాంతరాలేమిటో వాళ్లనే చెప్పనివ్వండి.

“ప్రకటించే ప్రాంతానికీ, క్రైస్తవ కూటాలకూ వెళ్లటానికి మేము అర కిలోమీటరు దూరం నడిచివెళ్లి బస్సు ఎక్కుతాము. బస్సు దిగాక మరో అర కిలోమీటరు దూరం నడిచి ఇంకో బస్సు ఎక్కుతాము. విచారకరమైన విషయం ఏమిటంటే, ఆ దారి పొడవునా భయంకరమైన ఐదు కుక్కలున్నాయి. కుక్కలంటే మాకు చాలా భయం ఎందుకంటే అవి మాకు గుర్రాలంత పెద్దగా అనిపిస్తాయి. అవసరమైనప్పుడు వాటిని అదిలించటానికి, మాతోపాటు ఒక కర్రను తీసుకెళ్లి బస్సు ఎక్కబోయే ముందు దాన్ని ఒకచోట దాచిపెడ్తాము, మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు దాన్ని తీసుకెళ్తాము.

“బస్సు ఎక్కడమన్నది నిజంగా మాకు పెద్దగండమే. బస్సులోకి కాస్త తేలికగా ఎక్కగలిగేలా మేము బస్టాప్‌ దగ్గర ఉండే మట్టిదిబ్బ మీద ఎక్కి నిలుచుంటాము. కొందరు డ్రైవర్లు బస్సును దిబ్బ వరకూ తీసుకొచ్చి ఆపుతారు, కొందరు అలా చేయరు. అలాంటప్పుడు, మాలో కాస్త పొడుగున్నవారు రెండవవాళ్లకి బస్సు ఎక్కేందుకు సహాయం చేస్తారు. రెండవ బస్సును ఎక్కాలంటే మేము రద్దీగా ఉండే రహదారిని దాటవల్సి ఉంటుంది—పొట్టి కాళ్లున్న మాకు అది నిజంగా ప్రాణసంకటమే. మా చిన్న ఆకారం మూలంగా, బరువుగా ఉండే పుస్తకాల బ్యాగు కూడా అదనపు సవాలును మా ముందుంచుతుంది. దాన్ని తేలిక చేసుకునేందుకు మేము పాకెట్‌ సైజ్‌ బైబిలును వాడతాము, సాహిత్యాన్ని కూడా పరిమితంగా పట్టుకెళ్తాము.

“చిన్నప్పట్నుంచి మేమంత కలుపుగోలుగా ఉండేవాళ్లం కాదు. కొత్తవాళ్లతో మాట్లాడటం మాకు ఎప్పుడూ చాలా కష్టంగా ఉంటుందని మా పొరుగు వాళ్లకు తెలుసు. కాబట్టి మేము వాళ్ల తలుపులు తట్టడం చూసి వాళ్లు ఆశ్చర్యపోయేవాళ్లు, అది వాళ్లను ఎంతో ప్రభావితం చేసేది, వాళ్లు సాధారణంగా మేము చెప్పేది వినేవాళ్లు. కానీ మేము అంతగా తెలీనిచోట, ప్రజలు మమ్మల్ని కేవలం మరుగుజ్జులుగానే చూస్తారు; అందుకని వాళ్లు ఎప్పుడూ మన సందేశానికి తగిన గంభీరమైన అవధానాన్నివ్వరు. అయినప్పటికీ, యెహోవా ప్రేమను చవిచూడటం, ఈ సువార్త పనిలో కొనసాగడానికి కావలసిన ధైర్యాన్నిస్తుంది. సామెతలు 3:5, 6 వచనాలను ధ్యానించటం కూడా మాకు ధైర్యాన్నిస్తుంది.”

లారా మారియాల ఉదాహరణలు చూపిస్తున్నట్లు, శారీరక ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ పట్టుదలతో కొనసాగడం దేవునికి మహిమను తేగలదు. తన ‘శరీరములో ఉన్న ముల్లును’ తొలగించమని అపొస్తలుడైన పౌలు ప్రార్థించాడు, బహుశ అది శారీరక బాధై ఉండవచ్చు. కానీ దేవుడు ఆయనతో “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని” చెప్పాడు. అవును, దేవుని సేవచేయడానికిగాను శారీరక వైకల్యం తొలగించబడనవసరంలేదు. దేవునిపై పూర్తిగా ఆధారపడటం, మనకున్న పరిస్థితులను చక్కగా ఉపయోగించుకోవడానికి సహాయం చేస్తుంది. పౌలు తన ‘శరీరములో ఉన్న ముల్లును’ అలాగే దృష్టించాడు గనుకనే ఆయనిలా చెప్పగలిగాడు: “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.” (2 కొరింథీయులు 12:7, 9, 10) కొన్ని సంవత్సరాల తర్వాత పౌలు ఇలా వ్రాశాడు: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.”—ఫిలిప్పీయులు 4:13.

ఆధునిక కాలాల్లో, తనకు పూర్తిగా సమర్పించుకున్న స్త్రీ పురుషుల ద్వారా, పిల్లల ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని సాధిస్తున్నాడు. వారిలో అనేకులు ఏదో విధమైన అంగవైకల్యం ఉన్నవారే. అందరూ దేవుని రాజ్యం క్రింద దైవిక స్వస్థత కోసం నిరీక్షిస్తున్నప్పటికీ, తాము ఆయన సేవలో ఎంతో కొంత చేయాలంటే దేవుడు ముందు తమ సమస్యల నుంచి తమకు విముక్తి కల్గించాలని వాళ్లు ఊరక వేచిచూడటం లేదు.

మీరు ఏదైనా శారీరక బలహీనతతో బాధపడుతున్నారా? ధైర్యం తెచ్చుకోండి ! మీ విశ్వాసం ద్వారా మీరు కూడా పౌలు, లారా, మారియాల వంటి వారిలో ఒకరై ఉండవచ్చు. ప్రాచీన కాలాల్లోని విశ్వాసులైన స్త్రీపురుషుల గురించి చెప్పగల్గినట్లే, వీరి గురించి కూడా ఇలా చెప్పవచ్చు, “బలహీనులుగా ఉండి బలపరచబడిరి.”—హెబ్రీయులు 11:34.

[8వ పేజీలోని చిత్రం]

మారియా

లారా

[9వ పేజీలోని చిత్రం]

బస్సులోకి ఎక్కటానికి లారాకు సహాయం చేస్తున్న మారియా

[9వ పేజీలోని చిత్రాలు]

“కుక్కలంటే మాకు చాలా భయం ఎందుకంటే అవి మాకు గుర్రాలంత పెద్దగా అనిపిస్తాయి”

క్రింద: లారా, మారియా, వారితో బైబిలు పఠించినవారు