కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విశ్వాసం మీ జీవితాన్ని మార్చగలదు

విశ్వాసం మీ జీవితాన్ని మార్చగలదు

విశ్వాసం మీ జీవితాన్ని మార్చగలదు

“దేవునితో సంబంధం లేకుండా మంచి విలువలతో ఉండడం కచ్చితంగా సాధ్యమే” అని ఒక అజ్ఞేయవాది దృఢంగా చెప్పారు. దేవుని మీద విశ్వాసం లేకుండానే, తన పిల్లలను ఉన్నత నైతిక విలువలతో పెంచాననీ, అలాగే వారు తమ పిల్లలను అదే విధమైన ఉన్నత ప్రమాణాలతో పెంచారనీ ఆమె చెప్పారు.

దేవునిపై విశ్వాసం అనవసరమని దానర్థమా? ఆమె అలాగే తలంచారన్నది సుస్పష్టం. నిజమే, దేవుని మీద విశ్వాసం లేని ప్రతి ఒక్కరూ చెడ్డవారే అయ్యుంటారనేమీ లేదు. దేవుడ్ని ఎరుగకపోయినా, ‘ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను స్వాభావికంగా చేసే’ “అన్యజనుల” గురించి అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు. (రోమీయులు 2:14) అజ్ఞేయవాదులతో సహా అందరూ పుట్టుకతో మనస్సాక్షిగలవారే. తప్పొప్పులను గురించిన స్వాభావిక స్పృహను ఇచ్చిన దేవునిపై విశ్వాసం లేకపోయినప్పటికీ, తమ మనస్సాక్షి ఇచ్చే ప్రబోధనాలను అనుసరించడానికి అనేకులు ప్రయత్నిస్తారు.

అయినప్పటికీ, మంచితనానికి ప్రేరణనిచ్చే విషయానికి వస్తే, ఎలాంటి మార్గదర్శనపు సహాయం లేని మనస్సాక్షి కన్నా దేవునిపై బైబిలు ఆధారంగా ఉండే గట్టి విశ్వాసానికే ఎక్కువ శక్తి ఉంది. దేవుని వాక్యమైన బైబిలు ఆధారంగా పెంపొందిన విశ్వాసం, ఏది తప్పు ఏది ఒప్పు అన్నది మనస్సాక్షికి తెలియజేస్తుంది, ఏది తప్పు ఏది ఒప్పు అని వివేచించడంలో మనస్సాక్షిని అప్రమత్తం చేస్తుంది. (హెబ్రీయులు 5:14) అంతేకాక, తీవ్రమైన ఒత్తిళ్ళున్నప్పుడు కూడా ఉన్నత ప్రమాణాలను అంటిపెట్టుకుని ఉండేందుకు విశ్వాసం శక్తినిస్తుంది. ఉదాహరణకు, 20వ శతాబ్దంలో, చాలా దేశాలు భ్రష్టుపట్టిన రాజకీయ ప్రభుత్వాల పరిపాలన క్రిందకు వచ్చాయి. ఆ దేశాల్లో మంచి మర్యాదలతో ప్రవర్తిస్తున్నట్లుండే ప్రజలు సహితం క్రూరకృత్యాలను చేసేలా ఆ ప్రభుత్వాలు బలవంతం చేశాయి. అయినప్పటికీ, దేవునిపై నిజంగా విశ్వాసం ఉన్నవాళ్ళు, తమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా తాము నమ్ముతున్న సూత్రాలకు భిన్నంగా ప్రవర్తించడానికి నిరాకరించారు. అంతేకాక, బైబిలు ఆధారంగా ఉన్న విశ్వాసం, వ్యక్తులను మార్చగలదు, సర్వనాశనం అయిపోయాయనిపించే జీవితాలను నిలబెట్టగలదు, వ్యక్తులు గంభీరమైన తప్పులు చేయకుండా ఉండేందుకు కూడా అది సహాయం చేస్తుంది. కొన్ని ఉదాహరణలను చూడండి.

విశ్వాసం కుటుంబ జీవితాన్ని మార్చగలదు

జాన్‌, టాన్యాల పిల్లలను వాళ్ళకే తిరిగి అప్పగించాలన్న తీర్పును విధిస్తూ ఆంగ్లేయుడైన ఒక జడ్జి, “మీరు మీ విశ్వాసం ద్వారా అసాధ్యమైనదానిని సాధించుకోగల్గారు” అన్నాడు. జాన్‌, టాన్యాల జీవితం అధికారుల దృష్టికి వచ్చినప్పుడు, వాళ్ళు వివాహితులు కాదు. వాళ్ళ ఇంటి వాతావరణం చాలా భయంకరంగా ఉండేది. జాన్‌ మత్తుమందులను ఎక్కించుకునేవాడు, జూదమాడే అలవాటు కూడా ఉండేది. ఆయన తన వ్యసనాలకు కావలసిన డబ్బు కోసం నేరాలకు పాల్పడ్డాడు. ఆయన తన పిల్లలనూ, వాళ్ళ తల్లినీ నిర్లక్ష్యం చేశాడు. మరి, ఏ “అద్భుతం” జరిగింది?

ఒకరోజు, తన అన్న కొడుకు పరదైసు గురించి మాట్లాడుతుండగా జాన్‌ విన్నాడు. ఆయనకు ఆసక్తి కలిగింది, ఆయన తన అన్నా వదినలను దాని గురించి అడిగాడు. వాళ్ళు యెహోవాసాక్షులు. దాని గురించి బైబిలు నుండి తెలుసుకునేందుకు వాళ్ళు జాన్‌కు సహాయం చేశారు. నెమ్మనెమ్మదిగా, జాన్‌, టాన్యాలు బైబిలు ఆధారమైన విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు, అది వాళ్ళ జీవితాలను మార్చింది. వాళ్ళు చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు, తమ చెడ్డ అలవాట్లను అధిగమించారు. ఈసారి అధికారులు వాళ్ళ కుటుంబాన్ని పరిశీలించడానికి వచ్చినప్పుడు, కొద్దికాలం ముందు అసాధ్యం అనిపించిన విషయాలను—పిల్లలు పెరిగేందుకు అనుకూలమైన వాతావరణం అంటే ఇల్లు శుభ్రంగా ఉండి, ఆ కుటుంబం సంతోషభరితంగా ఉండడం—చూశారు. ఆ జడ్జి, ఈ అద్భుతాన్ని జాన్‌, టాన్యాలు క్రొత్తగా కనుగొన్న విశ్వాసానికి ఆపాదించడం సరైనదే.

ఇంగ్లండ్‌కు, వేలాది మైళ్ళ దూరంలో, ప్రాచ్య సమీప దేశంలో యౌవనంలో ఉన్న ఒక భార్య, చాలా మంది తీసుకునే శోచనీయమైన ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకుంది. ఆమెకు ఒక బిడ్డ. ఆమె కన్నా ఆమె భర్త వయసులో చాలా పెద్దవాడు, కనుక విడాకులు తీసుకోమని ఆమెను ఆమె బంధువులు ప్రేరేపిస్తూ వచ్చారు. విడాకులు తీసుకునేందుకు ఆమె పథకం వేసుకుంది. నిజానికి ఆమె అలాంటి ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది కూడా. ప్రతి సంవత్సరమూ, విడాకులతో ముగిసిపోయే వైవాహిక జీవితాల్లో ఆమె వైవాహిక జీవితం కూడా ఒకటయ్యేదే. అయితే, ఆమె యెహోవాసాక్షుల్లో ఒకరితో బైబిలు పఠిస్తోంది. ఆమెతో పఠిస్తున్న సాక్షి జరుగుతున్న విషయం తెలుసుకున్నప్పుడు, వివాహాన్ని గురించి బైబిలు ఏమి చెబుతుందో వివరించింది. ఉదాహరణకు, వివాహం దేవుడిచ్చిన బహుమతి అనీ, తేలికగా కొట్టిపారేయవలసినది కాదనీ వివరించింది. (మత్తయి 19:4-6, 9) ‘మా వివాహబంధం తెగతెంపులు కావాలని మాకు సన్నిహితులైనవాళ్ళు అనుకుంటుంటే, మాకు పరిచయం లేని ఈ స్త్రీ మా వివాహబంధాన్ని కాపాడేందుకు ప్రయత్నించడం వింతగా ఉందే’ అని ఆ స్త్రీ తనలో తాను అనుకుంది. ఆమె క్రొత్తగా పొందిన విశ్వాసం, తన వివాహబంధాన్ని నిలబెట్టుకునేందుకు ఆమెకు సహాయం చేసింది.

కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేసే మరో ఘోరమైన తప్పు గర్భ విచ్ఛిత్తి చేయించడం. ప్రతి సంవత్సరం కనీసం, 450 లక్షల జన్మించని శిశువులను కావాలని గర్భవిచ్ఛిత్తి చేసి చంపేయడం జరుగుతోందని యునైటెడ్‌ నేషన్స్‌ నివేదిక ఒకటి అంచనా వేస్తోంది. అలాంటి ప్రతి సంఘటనా ఒక విషాద సంఘటనే. అలా గర్భవిచ్ఛిత్తి చేయించుకునేవారిలో తనూ ఒకరు కాకుండా ఉండేందుకు ఫిలిప్పైన్‌లోని ఒక స్త్రీకి బైబిలు జ్ఞానం సహాయపడింది.

యెహోవాసాక్షులు ఆ స్త్రీని కలిసినప్పుడు, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? * అనే బైబిలు పఠన బ్రోషూర్‌ను ఆమె వాళ్ళ దగ్గరి నుండి తీసుకుని బైబిలు పఠనం చేయడం మొదలుపెట్టింది. తాను బైబిలు పఠనాన్ని అంగీకరించడానికి గల కారణాన్ని కొన్ని నెలల తర్వాత తెలిపింది. సాక్షులు ఆమెను మొదటిసారి కలిసినప్పుడు ఆమె గర్భవతి, గర్భవిచ్ఛిత్తి చేయించుకోవాలని ఆమె, ఆమె భర్తా నిర్ణయించుకున్నారు. అయితే, ఆ బ్రోషూర్‌లోని 24వ పేజీలో ఉన్న ఇంకా జన్మించని శిశువు చిత్రం, ఆ స్త్రీ హృదయాన్ని తాకింది. దానితో పాటు, ‘జీవపు ఊట ఉన్నది దేవునియొద్ద’ కనుక జీవము పవిత్రమైనది అని తెలియజేస్తూ, ఇవ్వబడిన బైబిలు ఆధారమైన వివరణ ఆమె తన శిశువు ప్రాణాన్ని నిలబెట్టుకునేలా చేసింది. (కీర్తన 36:9) ఆమె ఇప్పుడు, అందంగా ఆరోగ్యంగా ఉన్న పసిబిడ్డకు తల్లి.

చిన్నచూపు చూడబడేవారికి విశ్వాసం సహాయం చేస్తుంది

ఈథీయోపీయలో, యెహోవాసాక్షులు ఆరాధన జరుపుకునేందుకు కూడుకునే స్థలానికి, మంచి దుస్తులు వేసుకోని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ కూటం ముగిసినప్పుడు, ఒక సాక్షి వాళ్ళకు తనను తాను స్నేహభావంతో పరిచయం చేసుకున్నాడు. ఆ వ్యక్తులు ధర్మం చేయమని అడిగారు. ఆ సాక్షి, వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు గానీ, అంత కన్నా మేలైనది ఇచ్చాడు. దేవుని మీద విశ్వాసాన్ని పెంపొందించుకొమ్మని ఆయన వారిని ప్రోత్సహించాడు. దేవుని మీద విశ్వాసము ‘సువర్ణము కంటె అమూల్యమైనది.’ (1 పేతురు 1:7) వారిలో ఒకరు, దానికి ప్రతిస్పందించి, బైబిలు పఠనం చేయడం మొదలుపెట్టారు. అది ఆయన జీవితాన్ని మార్చివేసింది. ఆయన, విశ్వాసంలో ఎదుగుతుండగా, ధూమపానాన్ని, మద్యపానాన్నీ, అనైతికతనూ, ఖాట్‌ను (ఉత్తేజమిచ్చే మత్తుమందు) మానుకున్నాడు. ఇతరులను యాచించే బదులు, తనను తాను పోషించుకోవడమెలాగో నేర్చుకున్నాడు, ఇప్పుడు శుభ్రమైన, ఫలవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.

ఇటలీలో, 47 ఏండ్ల ఒక వ్యక్తికి, పది సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఆయనను, జూడీషియల్‌ సైకియాట్రిక్‌ హాస్పిటల్‌లో ఉంచారు. అలాంటి కారాగార ఇన్‌స్టిట్యూషన్‌లకు వెళ్ళి ఆధ్యాత్మిక సహాయాన్నిచ్చేందుకు అనుమతి పొందిన ఒక యెహోవాసాక్షి, ఆయనతో బైబిలు పఠనం మొదలుపెట్టారు. ఆ వ్యక్తి శీఘ్రగతిన అభివృద్ధిని సాధించాడు. విశ్వాసం ఆయన జీవితాన్ని ఎంతగా మార్చిందంటే, మిగతా ఖైదీలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆయన దగ్గరికి రావడం మొదలుపెట్టారు. బైబిలు ఆధారంగా ఆయన పెంపొందించుకున్న విశ్వాసం, ఆయనకు గౌరవాన్నీ, అభిమానాన్నీ, జైలు అధికారుల నమ్మకాన్నీ సంపాదించి పెట్టింది.

ఇటీవలి సంవత్సరాల్లో, ఆఫ్రికాలో జరిగిన అంతర్యుద్ధాలను గురించి వార్తాపత్రికలు నివేదించాయి. ముఖ్యంగా, సైనికులుగా శిక్షణ పొందిన బాలురను గురించిన నివేదికలు భీతిగొల్పేవిగా ఉన్నాయి. ఈ పిల్లలకు మత్తుమందులను ఇస్తున్నారు, పిల్లలను క్రూరులుగా మార్చుతున్నారు, పిల్లలు ఏ సంస్థీకృత గుంపు కోసం పోరాడుతున్నారో ఆ గుంపుకు మాత్రమే వాళ్ళు నమ్మకస్థులుగా ఉండేలా చేసేందుకు గాను వాళ్ళ బంధువులతో మానవత్వం లేకుండా ప్రవర్తించేందుకు వాళ్ళను బలవంతం చేస్తున్నారు. అలాంటి పిల్లల జీవితాలను మార్చేంత శక్తివంతమైనదా బైబిలు ఆధారమైన విశ్వాసం? ఇద్దరి విషయంలో అది అంత శక్తివంతమైనదేనని నిరూపితమయ్యింది.

లైబీరియాలో, అలెక్స్‌ అనే అబ్బాయి క్యాథలిక్‌ చర్చిలో పూజాపీఠం దగ్గర సేవ చేసేవాడు. అయితే, అతడు తన 13వ ఏట, పోరాటాలు చేసే ఒక సంస్థీకృత గుంపులో చేరి, ఒక కుప్రసిద్ధ బాల సైనికుడుగా మారాడు. తాను ధైర్యంగా పోరాటంలో పాల్గొనేందుకు, క్షుద్రశక్తుల వైపుకు మళ్ళాడు. అతని సహచరుల్లో అనేకులు చంపబడడాన్ని అతడు చూశాడు, కానీ అతడు బ్రతికి బయటపడ్డాడు. 1997 లో, ఆయన యెహోవాసాక్షులను కలిశాడు, వాళ్ళు తనను చిన్నచూపు చూడడంలేదని ఆయన కనుగొన్నాడు. అతడ్ని చిన్న చూపు చూసే బదులు, హింసను గురించి బైబిలు ఏమని చెబుతుందో తెలుసుకునేందుకు వాళ్ళు అతనికి సహాయం చేశారు. అలా అతడు సైన్యం నుండి వచ్చేశాడు. అతడి విశ్వాసం పెరగనారంభించగా, “అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను” అన్న బైబిలు ఆజ్ఞను అనుసరించాడు.—1 పేతురు 3:11.

ఇంతలో, మునుపు బాల సైనికుడైన సామ్సన్‌ ఇప్పుడు అలెక్స్‌ ఉంటున్న పట్టణానికి వచ్చాడు. అతడు చర్చి గాయకబృందంలో సభ్యుడుగా ఉండేవాడు. కానీ 1993 లో, సైన్యంలో చేరి, మత్తుమందులను దుర్వినియోగం చేయడమూ, క్షుద్రవిద్య నేర్చుకోవడమూ, అనైతికతకు పాల్పడడమూ చేశాడు. 1997 లో, అతడు సైన్యం నుండి పంపించబడ్డాడు. తర్వాత, అతడు ఒక స్పెషల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో చేరేందుకు మన్‌రోవీయకు బయలుదేరుతుండగా, యెహోవాసాక్షులతో బైబిలు పఠనం చెయ్యి అని ఒక స్నేహితుడు అతడ్ని బలవంతం చేశాడు. అలా, అతడు బైబిలు పఠనం చేసి బైబిలు ఆధారమైన విశ్వాసాన్ని పెంపొందించుకున్నాడు. అది, యుద్ధ ప్రవృత్తిని విడనాడేందుకు అవసరమైన ధైర్యాన్ని అతడికి ఇచ్చింది. ఇప్పుడు, అలెక్సూ, సామ్సనూ శాంతియుతమైన, నైతికమైన జీవితాలను గడుపుతున్నారు. ఎంతో క్రూరులుగా మారిన వారి జీవితాలను బైబిలు ఆధారమైన విశ్వాసం తప్ప మరేదైనా మార్చగలదా?

సరైన విశ్వాసం

బైబిలు ఆధారమైన యథార్థమైన విశ్వాసానికుండే శక్తిని తెలిపేందుకు ఉపయోగించగల అనేకానేక ఉదాహరణల్లో ఇవి కేవలం కొన్ని మాత్రమే. నిజమే, దేవునిపై విశ్వాసముంది అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ, బైబిలులోని ఉన్నత ప్రమాణాలకు అనుగుణ్యంగా జీవించడం లేదు. నిజానికి, క్రైస్తవులమని చెప్పుకునే కొందరి కన్నా కొందరు నాస్తికులే మంచి జీవితాలను గడుపుతుండవచ్చు. ఎందుకలా జరుగుతుందంటే, బైబిలు ఆధారంగా ఉండే విశ్వాసంలో, దేవుని మీద విశ్వాసం ఉందని కేవలం చెప్పుకోవడం కన్నా ఎక్కువే ఇమిడి ఉంది.

విశ్వాసం, అంటే, “నిరీక్షింపబడువాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది” అని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. (హెబ్రీయులు 11:1) ఖండించలేని రుజువును ఆధారం చేసికొని, కనిపించని విషయాలను గట్టిగా నమ్మడం కూడా విశ్వాసంలో ఇమిడి ఉంది. ముఖ్యంగా దేవుడు ఉన్నాడు, ఆయనకు మనమీద ఆసక్తి ఉంది, ఆయన చిత్తాన్ని చేసేవారిని ఆయన ఆశీర్వదిస్తాడు అనే విషయంలో సందేహం లేకుండా ఉండడం అందులో ఇమిడి ఉంది. “దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను” అని కూడా ఈ అపొస్తలుడు అంటున్నాడు.—హెబ్రీయులు 11:6.

జాన్‌ టాన్యాల జీవితాలను, అలాగే ఈ శీర్షికలో ప్రస్తావించబడిన మరితరుల జీవితాలను మార్చింది అటువంటి విశ్వాసమే. అది, నిర్ణయాలను తీసుకోవడంలో మార్గదర్శనం కోసం పూర్ణ నమ్మకంతో దేవుని వాక్యమైన బైబిలు వైపుకు చూసేందుకు వాళ్ళను నడిపింది. ఒక మార్గం సౌకర్యవంతమైనదే అయినప్పటికీ అది తప్పుడు మార్గమైతే దాన్ని అనుసరించకుండా ఉండేలా తాత్కాలికమైన త్యాగాలను చేసేందుకు వాళ్ళకు అది సహాయం చేసింది. ఈ అనుభవాలు ఒకదానితో ఒకటి వ్యత్యాసంగా ఉన్నప్పటికీ, ఇవన్నీ కూడా ఒకే విధంగా మొదలయ్యాయి. ఎలాగంటే, ఈ వ్యక్తుల్లో ప్రతి ఒక్కరితోనూ యెహోవాసాక్షుల్లో ఒకరు బైబిలు పఠనం చేశారు, ‘దేవుని వాక్యము సజీవమైనది, బలముగలది’ అని బైబిలు చెబుతున్న మాటల్లోని సత్యాన్ని వాళ్ళు అనుభవం ద్వారా తెలుసుకున్నారు. (హెబ్రీయులు 4:12) దేవుని వాక్యపు శక్తి, వీరిలో ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని మెరుగైనదిగా మార్చేంతటి బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు సహాయం చేసింది.

230 కన్నా ఎక్కువ దేశాల్లోను, దీవుల్లోను యెహోవాసాక్షులు క్రియాశీలంగా ఉన్నారు. బైబిలు పఠనం చేయమని వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఎందుకని? ఎందుకంటే, బైబిలు ఆధారమైన విశ్వాసం, మీ జీవితాన్ని కూడా మెరుగుపరచగలదన్న నమ్మకం వాళ్ళకుంది.

[అధస్సూచీలు]

^ పేరా 10 వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినది.

[3వ పేజీలోని చిత్రాలు]

బైబిలు ఆధారమైన విశ్వాసం, జీవితాలను మెరుగుపరుస్తుంది

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

Title card of Biblia nieświeska by Szymon Budny, 1572