ప్రపంచవ్యాప్త నైతిక పతనం
ప్రపంచవ్యాప్త నైతిక పతనం
“మోసం జరగని చోటేలేదు” అని డేవిడ్ కాలహాన్ అంటున్నాడు, ఆయన ఇటీవల ద చీటింగ్ కల్చర్ (మోసగించే సంస్కృతి) అనే పుస్తకాన్ని వ్రాశాడు. అమెరికాలో జరుగుతున్న వివిధ రకాల మోసాల గురించి మాట్లాడుతూ ఆయన “ఉన్నత పాఠశాల, కాలేజీ విద్యార్థులు చేసే మోసం,” ఆడియో, వీడియో సీడీల “పైరసీ,” “ఉద్యోగస్థలంలో దొంగిలించడం, సమయం వృథాచేయడం” “ఆరోగ్య సంస్థల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న స్కాంలు,” క్రీడల్లో స్టెరాయిడ్ల వాడకం వంటివాటి గురించి ప్రస్తావించాడు. ఆయన ఈ ముగింపుకొచ్చాడు: “నేడు జరుగుతున్న వివిధ రకాల అనైతికమైన, చట్టవిరుద్ధమైన పనులను పరిశీలిస్తే, నైతిక సంక్షోభం ఎంత తీవ్రస్థాయిలో ఉందో తెలుస్తుంది.”
2005 ఆగస్టులో అమెరికాను అల్లకల్లోలం చేసిన కత్రీనా హరికేన్ సంభవించినప్పుడు, “ఆధునిక చరిత్రలో ముందెప్పుడూ జరగనంత పెద్ద స్కాంలు, మోసపూరిత వ్యూహాలు, విపరీతమైన ప్రభుత్వ అసమర్థత వెలుగు చూశాయి” అని ద న్యూయార్క్ టైమ్స్ వ్రాసింది. అమెరికా సెనేట్‌కు చెందిన ఒక సభ్యురాలు ఇలా వ్యాఖ్యానించింది: “అప్పుడు జరిగిన విపరీతమైన మోసం, నీచమైన వ్యూహాలు, దుబారా ఖర్చు, నిజంగా ఊహకందనివి.”
అయితే, నిస్వార్థంగా దయ చూపించినవారి ఉదాహరణలు కూడా ఉన్నాయి. (అపొస్తలుల కార్యములు 27:3; 28:2) కానీ మనం తరచూ ప్రజలు ఇలా అనడాన్ని వింటుంటాం: “దీనివల్ల నాకు వచ్చేదేమిటి? ఇది చేయడంవల్ల నాకు లాభమేమిటి?” ప్రజల్లో స్వార్థపూరిత వైఖరి ప్రబలమైనట్లు అనిపిస్తోంది.
గతంలో, రోమా సామ్రాజ్యంవంటి నాగరికతలు పతనమవడానికి స్వార్థపూరిత, అసభ్య అనైతిక ప్రవర్తన ప్రధాన కారణంగా సూచించబడుతోంది. మన కాలంలో జరుగుతున్నవి మరింత ప్రాముఖ్యమైన దానికి నడిపించవచ్చా? ఈ విధానాంతానికి సూచనగా ఉంటుందని బైబిలు ముందుగానే చెప్పినట్లుగా, నేడు ప్రపంచమంతటా ‘అక్రమము విస్తరిస్తోందా?’—మత్తయి 24:3-8, 12-14; 2 తిమోతి 3:1-5.
ప్రపంచవ్యాప్త పతనం
ఆఫ్రికా న్యూస్ అనే పత్రిక 2006, జూన్ 22 సంచికలో, ఉగాండాలోని ఒక ప్రాంతంలోవున్న మురికివాడల్లో “లైంగిక వేధింపుపై, అశ్లీల చిత్రాలపై అధ్యయనం చేసే ఒక గుంపు” గురించి నివేదిస్తూ “ఆ ప్రాంతంలో వ్యభిచారం ఎక్కువకావడానికి, మాదకద్రవ్యాల ఉపయోగం పెరిగిపోవడానికి తల్లిదండ్రుల అశ్రద్ధే కారణం” అని తెలిపింది. ఆ వార్తాపత్రిక ఇంకా ఇలా పేర్కొన్నది: “పిల్లలపై అత్యాచారం, గృహహింస విపరీతంగా పెరిగిపోయాయని కావెంపే పోలీసు స్టేషన్ పరిధిలోని శిశు, కుటుంబ సంరక్షణ శిబిర అధికారి డాబాంజీ సాలోంగో చెప్పారు.”
భారతదేశానికి చెందిన ఒక వైద్యుని అభిప్రాయం ప్రకారం, “సమాజం దాని సంప్రదాయ మూలాలను కోల్పోతోంది.” భారతదేశానికే చెందిన ఒక సినీ దర్శకురాలు ఇలా అంది: “భారతదేశంలో మాదకద్రవ్యాల వాడకం ఎక్కువకావడం, విచ్చలవిడిగా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వంటివి, అది ‘పాశ్చాత్యదేశాల విచ్చలవిడి ప్రవర్తన’ అనే ఊబిలోకి కూరుకుపోతోందనడానికి మరో సూచనగా ఉన్నాయి.”
బీజింగ్‌లోని చైనా సెక్సాలజీ అసోసియేషన్‌కు సెక్రెటరీ జనరల్ అయిన హూ పెజెన్ ఇలా అన్నాడు: “పూర్వం సమాజంలో తప్పొప్పుల మధ్య వ్యత్యాసం ఉండేది. ఇప్పుడు ఎవరికి ఇష్టమైనది వాళ్ళు చెయ్యవచ్చు.” అదే విషయం గురించి, చైనా టుడే అనే పత్రికలోని ఒక ఆర్టికల్ ఇలా చెబుతోంది: “సమాజం ఇప్పుడు వివాహేతర సంబంధాలను అంగీకృతమైనవిగా పరిగణిస్తోంది.”
ఇంగ్లాండ్‌కు చెందిన యార్క్‌షైర్ పోస్ట్ ఇటీవల ఇలా వ్యాఖ్యానించింది, “ఉత్పత్తుల ప్రచారానికి అందరూ శరీరాన్ని చూపిస్తూ, లైంగిక దృశ్యాలను ఉపయోగిస్తున్నట్లు అనిపిస్తోంది. కొంతకాలం క్రితమైతే అలాంటి పనులు ప్రజల్లో ఆగ్రహావేశాల్ని రేకెత్తించి ఉండేవి. నేడు ఎక్కడ చూసినా లైంగిక దృశ్యాలు కనిపిస్తున్నాయి, అశ్లీల రచనలు, చిత్రాలు . . . సామాన్యులకు విరివిగా అందుబాటులోకి వచ్చాయి.” ఆ వార్తాపత్రిక ఇంకా ఇలా చెబుతోంది: “ఒకప్పుడు 18 ఏళ్లు పైబడినవారికి మాత్రమే అని భావించబడేవి నేడు కుటుంబాలు సాధారణంగా చూసే కార్యక్రమాల్లో భాగమయ్యాయి, అంతేకాక అవి తరచూ ప్రత్యేకంగా పిల్లల కోసమే తయారుచేయబడుతున్నాయని అశ్లీల చిత్రాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు అభిప్రాయపడుతున్నారు.”
ద న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ ఇలా చెబుతోంది: “[కొందరు యౌవనులు తమ లైంగిక అనుభవాల] గురించి క్యాంటీన్లో దొరికే ఆహారం గురించి మాట్లాడుకునేంత మామూలుగా మాట్లాడుకుంటుంటారు.” 8 నుండి 12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల తల్లిదండ్రులకు సలహాలిచ్చే ట్వీన్స్ న్యూస్ అనే పత్రిక ఇలా చెబుతోంది: “ఒక అమ్మాయి చిన్నపిల్లలు రాసినట్లుగా రాస్తూ, హృదయాన్ని కలచివేసే ఈ సందేశాన్ని రాసింది: ‘అబ్బాయిలతో కలిసి తిరగమనీ, వారితో లైంగిక సంబంధాలు పెట్టుకోమనీ మా అమ్మ నన్ను బలవంతం చేస్తోంది. నాకు 12 ఏళ్లే . . . దయచేసి నన్ను ఆదుకోండి!’”
రోజులు ఎంతగా మారిపోయాయో కదా! కెనడాకు చెందిన టొరొంటో స్టార్ పత్రిక, కొద్దికాలం క్రితమైతే “సలింగ సంయోగులు అందరికీ తెలిసేవిధంగా కలిసి జీవించడమనే తలంపే ప్రజల్లో ఆగ్రహావేశాల్ని రేకెత్తించేది” అని పేర్కొంది. అయితే, ఒట్టావాలోని కార్లెటన్ విశ్వవిద్యాలయంలో సామాజిక చరిత్రను బోధించే బార్బరా ఫ్రీమెన్ ఇలా అంటోంది: “ప్రజలిప్పుడు, ‘నా వ్యక్తిగత జీవితం నా ఇష్టం, ఇతరుల జోక్యం అనవసరం’ అంటున్నారు.”
గత కొన్ని దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల నైతిక విలువలు వేగంగా దిగజారిపోయాయని స్పష్టమౌతోంది. ఈ ప్రాథమిక మార్పులకు కారణమేమిటి? వాటి గురించి మీ అభిప్రాయమేమిటి? ఆ మార్పులు భవిష్యత్తు ఎలా ఉంటుందని సూచిస్తున్నాయి? (g 4/07)