నైతిక విలువలు హఠాత్తుగా పడిపోయిన కాలం
నైతిక విలువలు హఠాత్తుగా పడిపోయిన కాలం
నైతిక విలువలు హఠాత్తుగా పడిపోవడం ఎప్పుడు ప్రారంభమైందని మీరంటారు? మీ జీవితకాలంలోనా లేక మీ ముందటి తరంలోనా? 1914లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధంతో నైతిక విలువలు ముందెప్పుడూ లేనంతగా పడిపోవడం మొదలైందని కొందరంటారు. చరిత్ర ప్రొఫెసర్ రాబర్ట్ వోల్, ద జనరేషన్ ఆఫ్ 1914 అనే తన పుస్తకంలో ఇలా వ్రాశాడు: “ఆ యుద్ధం నుండి బ్రతికి బయటపడినవారు, 1914 ఆగస్టులో ఒక లోకం గతించిపోయి మరో లోకం ప్రారంభమైందని గట్టిగా నమ్ముతున్నారు.”
చరిత్రకారుడైన నార్మన్ కాంటోర్ ఇలా చెబుతున్నాడు: “అప్పటికే పడిపోతున్న సామాజిక ప్రవర్తనా ప్రమాణాలు ఒక్కసారిగా పతనమైపోయాయి. రాజకీయ నాయకులు, అధినేతలే తమ సంరక్షణ క్రిందవున్న కోట్లాదిమందిని బలిపశువుల్లా చూస్తే, సామాన్యులు ఒకరినొకరు క్రూరమృగాల్లా హింసించుకోకుండా మతంలోని లేక నీతిశాస్త్రంలోని ఏ సూత్రాలు ఆపగలవు? . . . మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో [1914-18] జరిగిన హింసాకాండ మానవ జీవానికి ఏమాత్రం విలువలేకుండా చేసింది.”
ఇంగ్లాండుకు చెందిన చరిత్రకారుడు హెచ్. జి. వెల్స్ ది ఔట్‌లైన్ ఆఫ్ హిస్టరీ అనే తన సర్వసంగ్రహ పుస్తకంలో, పరిణామ సిద్ధాంతాన్ని నమ్మడం మొదలుపెట్టిన తర్వాతే “నైతిక విలువలు నిజంగా పడిపోవడం ఆరంభమైంది” అని పేర్కొన్నాడు. ఎందుకు? మానవులు ఉన్నత వర్గానికి చెందిన జంతువులు మాత్రమే అని కొందరు అనుకున్నారు. పరిణామవాది కూడా అయిన వెల్స్ 1920లో ఇలా వ్రాశాడు: “మానవులు భారతదేశపు వేటకుక్కల్లాంటి సంఘ జీవులే అని వారు నిర్ణయించారు, . . కాబట్టి మానవుల్లోని పెద్ద కుక్కలవంటి శక్తిమంతులు ఇతరులపై దౌర్జన్యం చేసి వారిని లోబరుచుకోవడం తప్పేమీ కాదని వారికి అనిపించింది.”
నిజానికి, కాంటోర్ పేర్కొన్నట్లుగానే మొదటి ప్రపంచ యుద్ధం ప్రజల నైతిక ప్రమాణాలను పూర్తిగా మార్చేసింది. ఆయనిలా వివరించాడు: “రాజకీయాలు, వస్త్రధారణ, లైంగిక నైతికతవంటి విషయాల్లో పెద్దవారి అభిప్రాయాలు పూర్తిగా తప్పని పరిగణించబడేవి.” పరిణామ సిద్ధాంతాన్ని అంగీకరించడం ద్వారా క్రైస్తవ బోధలను కలుషితం చేసి, యుద్ధాలు చేసే దేశాలను ప్రోత్సహించిన చర్చీలు చాలావరకు నైతిక పతనానికి కారణమయ్యాయి. బ్రిటన్‌లోని బ్రిగేడ్దళ నాయకుడైన ఫ్రాంక్ క్రోజీయర్ ఇలా వ్రాశాడు: “చర్చీలు రక్తదాహంతో హింసను, దౌర్జన్యాన్ని పురికొల్పడంలో పెద్ద పాత్రే పోషించాయి, వాటిని మనం బాగా ఉపయోగించుకున్నాం.”
నైతికసూత్రాలు నిరాకరించబడ్డాయి
సుభిక్షమైన ఇరవైలు అని పిలువబడిన కాలంలో అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతి దశాబ్దంలో, ప్రజలు పాత విలువలను, నైతిక కట్టుబాట్లను పక్కకు నెట్టేసి, ఏదైనా ఫర్వాలేదనే వైఖరిని అలవర్చుకున్నారు. చరిత్రకారుడైన ఫ్రెడరిక్ లూయిస్ ఆలెన్ ఇలా అన్నాడు: “ప్రపంచ యుద్ధం తర్వాతి పది సంవత్సరాలను ‘అమర్యాద ప్రవర్తనా దశాబ్దం’ అని సహేతుకంగానే పిలవవచ్చు. . . . పూర్వపు పద్ధతులతోపాటు జీవితాన్ని సుసంపన్నం చేసి, జీవితానికి అర్థాన్నిచ్చిన విలువలు కూడా కనుమరుగైపోయాయి, వాటి స్థానంలో వేరే విలువలను ఏర్పర్చుకోవడం కష్టమయ్యింది.”
1930లలో ఏర్పడిన గొప్ప ఆర్థిక మాంద్యంవల్ల కడు పేదరికాన్ని అనుభవించవలసి రావడంతో చాలామంది తమ వైఖరి మార్చుకున్నారు. అయితే,
ఆ దశాబ్దాంతానికి మరింత విధ్వంసకరమైన మరో యుద్ధం అంటే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. త్వరలోనే దేశాలు భయంకరమైన ప్రాణాంతక ఆయుధాలు తయారుచేయడం మొదలుపెట్టడంతో ప్రపంచం ఆర్థిక మాంద్యం నుండైతే బయటపడింది కానీ అనూహ్యమైన బాధలను, అపరిమితమైన భయాన్ని ఎదుర్కొంది. యుద్ధం ముగిసేసరికి వందలాది పట్టణాలు ధ్వంసమయ్యాయి, జపాన్‌లోని రెండు నగరాలపై అణుబాంబులు వేయబడడంతో అవి నేలమట్టమయ్యాయి! కిరాతకమైన నిర్బంధ శిబిరాల్లో లక్షలాదిమంది మృత్యువాతపడ్డారు. ఆ యుద్ధంలో సుమారు 5 కోట్లమంది స్త్రీపురుషులు, చిన్నారులు ప్రాణాల్ని కోల్పోయారు.రెండవ ప్రపంచ యుద్ధపు భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు ఎంతోకాలంగా పాటించబడుతున్న సాంప్రదాయక ప్రమాణాలకు కట్టుబడివుండే బదులు తమ స్వంత ప్రవర్తనా ప్రమాణాలను ఏర్పర్చుకున్నారు. లవ్, సెక్స్ ఎండ్ వార్—చేంజింగ్ వాల్యూస్ 1939-45 అనే పుస్తకం ఇలా వ్యాఖ్యానించింది: “యుద్ధభూమిలో ఎలాంటి ప్రవర్తనైనా తప్పుకాదన్నట్లు పరిగణించబడేది, అదే పరిస్థితి ఇళ్లలో కూడా ఏర్పడింది. అందుకే యుద్ధం జరుగుతున్న సమయంలో లైంగిక విషయాల్లో విచ్చలవిడి ప్రవర్తన పెరిగిపోయిందనిపిస్తోంది. . . . యుద్ధం జరుగుతున్న సమయంలో ఉన్న అత్యవసరభావం, మానసికోద్రేకం వల్ల త్వరలోనే నైతిక కట్టుబాట్లు తొలగిపోయాయి, యుద్ధభూమిలోలాగే చాలా ఇళ్లలో కూడా జీవితం విలువలేనిదిగా, అల్పమైందిగా తయారైనట్లుంది.”
నిత్యం ప్రాణభయం ఉండడం వల్ల ప్రజల్లో, భావోద్వేగ సంబంధాలను, అవి తాత్కాలిక సంబంధాలైనా సరే వాటిని ఏర్పర్చుకోవాలనే కోరిక పెరిగింది. ఉద్వేగభరితమైన ఆ సంవత్సరాల్లో ఉండిన విచ్చలవిడి లైంగిక ప్రవర్తనను సమర్థిస్తూ బ్రిటన్‌లోని ఒక గృహిణి ఇలా అంది: “మేము నిజంగా నైతికత లేనివారమేం కాదుగానీ అప్పుడు యుద్ధం జరుగుతోంది కాబట్టే మేమలా ప్రవర్తించాం.” అమెరికాకు చెందిన ఒక సైనికుడు ఇలా ఒప్పుకున్నాడు: “అనేకుల ప్రమాణాల ప్రకారం మేము నైతికత లేనివారమే కావచ్చు కానీ మేమప్పుడు యౌవనంలో ఉన్నాం, ఏ క్షణంలోనైనా మా ప్రాణాలు పోవచ్చు.”
ఆ యుద్ధం తాలూకు దారుణాల్ని చూసిన వారెందరో ఆ జ్ఞాపకాలతో ఆ తర్వాత చాలా బాధను అనుభవించారు. అప్పట్లో పిల్లలుగా ఉన్నవారితో సహా కొంతమంది నేటికీ ఆ దారుణాలు గుర్తొచ్చి, ఆ హింస మళ్లీ జరుగుతోందని ఊహించుకుని ఉద్వేగానికి లోనవుతున్నారు. అనేకులు నమ్మకాన్ని కోల్పోయారు, దాంతోపాటే వారికి తప్పేది ఒప్పేది అనే గ్రహింపు కూడా లేకుండాపోయింది. తప్పొప్పుల ప్రమాణాలను ఏర్పర్చే ఎలాంటి అధికారంపట్ల కూడా గౌరవంలేని ప్రజలు ప్రమాణాలను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునేవిగా పరిగణించడం మొదలుపెట్టారు.
కొత్త సామాజిక ప్రమాణాలు
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, మానవ లైంగిక ప్రవర్తనపై చేయబడిన అధ్యయనాలు ప్రచురించబడ్డాయి. 1940లలో అమెరికాలో జరిగిన అలాంటి అధ్యయనాల్లో కిన్సీ నివేదిక ఒకటి, అది 800 కన్నా ఎక్కువ పేజీలున్న నివేదిక. ఆ అధ్యయనాలవల్ల, ప్రజలు ఇంతకుముందు సాధారణంగా ఇతరులతో చర్చించని లైంగిక విషయాలను నిర్మొహమాటంగా వెల్లడిచేయడం మొదలుపెట్టారు. కిన్సీ నివేదికలో, సలింగ సంయోగానికి పాల్పడుతున్న, ఇతర అసభ్య లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నవారి గురించిన గణాంకాలు ఎక్కువ చేసి వ్రాయబడ్డాయని ఆ తర్వాత వెల్లడైనా, యుద్ధం తర్వాత నైతిక విలువలు హఠాత్తుగా పడిపోయాయని ఆ అధ్యయనం చూపించింది.
అయితే, పైకి మర్యాదకరంగా కనిపించే ప్రవర్తనను కాపాడడానికి కొంతకాలం కృషి జరిగింది. ఉదాహరణకు రేడియోలో, చలనచిత్రాల్లో, టీవీలో అనైతికమైనవాటిని సెన్సార్ చేసేవారు. కానీ అలా ఎంతోకాలం జరగలేదు. అమెరికా విద్యాశాఖ మాజీ కార్యదర్శి విలియమ్ బెన్నెట్ ఇలా వివరించాడు: “అయితే,
1960లకల్లా అమెరికా నాగరికతా పతనం అని పిలువబడగల దానిలోకి వేగంగా పడిపోవడం ప్రారంభించింది.” అనేక ఇతర దేశాల్లో కూడా అదే జరిగింది. అయితే 1960లలోనే నైతిక పతనం ఎందుకంత ఎక్కువయ్యింది?ఆ దశాబ్దంలో స్త్రీ స్వాతంత్ర్యోద్యమం, నామకార్థ కొత్త నైతికతతో లైంగిక విప్లవం దాదాపు ఒకేసారి ప్రారంభమయ్యాయి. అలాగే, సమర్థవంతమైన గర్భనిరోధక మాత్రలను కనిపెట్టారు. గర్భం వస్తుందనే భయం లేకుండా లైంగికానందం పొందగల్గినప్పుడు, “ఇద్దరు వ్యక్తులు ఎలాంటి నిబద్ధత లేకుండా శారీరక సంబంధాలు పెట్టుకోవడం” సర్వసాధారణమైపోయింది.
అదే సమయంలో, ముద్రిత సమాచారం, సినిమాలు, టీవీ కార్యక్రమాలు తమ నైతిక నియమాలను సడలించాయి. అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు మాజీ అధికారి స్బెగ్నాయెవ్ బ్రాజింస్కీ, టీవీ కార్యక్రమాల్లో చూపించబడే విలువల గురించి ఇలా అన్నాడు: “అవి ఖచ్చితంగా స్వార్థపూరిత కోరికలు తీర్చుకోవడాన్ని ప్రస్తుతిస్తూ, తీవ్రమైన దౌర్జన్యాన్ని, క్రూరత్వాన్ని సాధారణమైన విషయంగా చూపిస్తూ, లైంగిక విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నాయి.”
1970లకే వీడియో క్యాసెట్ రికార్డర్లు జనాదరణ పొందాయి. దానితో ప్రజలు సినిమా హాళ్లకు వెళ్లి ఇతరులకు తెలిసే విధంగా చూడడానికి ఎంతమాత్రం ఇష్టపడని, లైంగికంగా రెచ్చగొట్టే అనైతిక చిత్రాలను తమ ఇళ్లలోనే చూడగలిగారు. ఇప్పుడైతే, ఇంటర్నెట్ మూలంగా, అతి జుగుప్సాకరమైన అశ్లీల సమాచారం, అశ్లీల చిత్రాలు ప్రపంచమంతటా అన్ని దేశాల్లోనూ కంప్యూటర్ ఉన్నవారందరికీ అందుబాటులోకి వచ్చాయి.
దానివల్ల కలుగుతున్న వివిధ పర్యవసానాలు భయానకంగా ఉన్నాయి. అమెరికాలోని ఒక జైలు వార్డెన్ ఇటీవల ఇలా అన్నాడు: “పది సంవత్సరాల క్రితం, ఇక్కడికి వచ్చే యౌవనులతో నేను మంచి చెడుల గురించి మాట్లాడగలిగేవాడిని. కానీ ఇప్పుడు వస్తున్న వారికైతే నేనేం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావడంలేదు.”
నిర్దేశం కోసం ఎవరి దగ్గరికి వెళ్లవచ్చు?
నైతిక నిర్దేశం కోసం మనం లోకంలోని చర్చీలను ఆశ్రయించలేము. అవి యేసులా, మొదటి శతాబ్దంలోని ఆయన శిష్యుల్లా నీతిసూత్రాలను ఉన్నతమైనవిగా పరిగణించే బదులు ఈ లోక సంబంధమైన చెడు క్రియల్లో పాల్గొంటున్నాయి. ఒక రచయిత ఇలా అడిగాడు: “దేవుడు మా పక్షాన ఉన్నాడని ఇరువర్గాలు చెప్పుకోని ఏ యుద్ధమైనా ఏనాడైనా జరిగిందా?” దేవుని నైతిక ప్రమాణాలను ఉన్నతమైనవిగా పరిగణించడం గురించి, కొన్నేళ్ల క్రితం న్యూయార్క్ నగరానికి చెందిన ఒక మతనాయకుడు ఇలా అన్నాడు: “బస్సులో ప్రయాణించడానికైనా కనీసం కొన్ని నిబంధనలు పాటించవలసి ఉంటుంది గానీ అంతకంటే తక్కువ ప్రమాణాలు పాటిస్తూ కూడా సభ్యులు కాగలగడం చర్చీలో తప్ప ప్రపంచంలోని మరే సంస్థలోనూ సాధ్యంకాదు.”
ఈ లోకంలో హఠాత్తుగా జరిగిన నైతిక పతనం, ఏదైనా చర్య తీసుకోవడం అత్యవసరమని స్పష్టంగా చూపిస్తోంది. కానీ ఏమిటా చర్య? ఎలాంటి మార్పు అవసరం? ఆ మార్పు ఎవరు తీసుకురాగలరు, ఎలా తీసుకొస్తారు? (g 4/07)
[5వ పేజీలోని బ్లర్బ్]
“మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో [1914-18] జరిగిన హింసాకాండ మానవ జీవానికి ఏమాత్రం విలువలేకుండా చేసింది”
[6వ పేజీలోని బాక్సు]
ప్రమాణాలా లేక విలువలా?
ప్రమాణాలు ఒకప్పుడు స్పష్టంగా ఉండేవి. ఒక వ్యక్తి నిజాయితీపరునిగా, నమ్మకస్థునిగా, నిగ్రహంగలవానిగా, గౌరవనీయునిగా ఉండేవాడు లేదా ఇవేవి లేనివానిగా ఉండేవాడు. ఇప్పుడు, “ప్రమాణాల” స్థానంలో “విలువలు” వచ్చాయి. కానీ దానివల్ల ఒక సమస్య ఉందని చెబుతూ, ద డీమోరలైజేషన్ ఆఫ్ సొసైటీ అనే తన పుస్తకంలో చరిత్రకారురాలైన జెర్ట్రూడ్ హిమల్ఫార్బ్ ఇలా పేర్కొన్నది: “ఒకరు విలువల గురించి చెప్పినట్లు ప్రమాణాల గురించి చెప్పలేరు, . . . అంటే ప్రతి ఒక్కరూ తమ సొంత ప్రమాణాల్ని ఎంచుకునే హక్కు తమకుందని చెప్పలేరు.”
విలువలంటే, “నమ్మకాలు, అభిప్రాయాలు, వైఖరులు, భావాలు, అలవాట్లు, ప్రవర్తనా సూత్రాలు, ఇష్టాయిష్టాలు, దురభిమానాలు, చివరకు విపరీత ధోరణులు కూడా, అంటే ఒక వ్యక్తి, ఒక గుంపు, లేక ఒక సమాజం ఏ సమయంలోనైనా, ఏ కారణంతోనైనా విలువైనవిగా ఎంచేవి” అని ఆమె పేర్కొన్నది. ప్రస్తుత స్వేచ్ఛా సమాజంలో, ప్రజలు సూపర్మార్కెట్లో వస్తువులు ఎంపిక చేసుకున్నట్లు, తమ స్వంత విలువల్ని ఎంపిక చేసుకోవడం సరైనదేనని భావిస్తున్నారు. కానీ పరిస్థితి అలా ఉంటే, నిజమైన నైతికతకు ఏం జరుగుతుంది?
[6, 7వ పేజీలోని చిత్రం]
నీచమైన వినోదం అంతకంతకూ సులభంగా లభ్యమౌతోంది