ప్రేమికుల మధ్య వివాహానికి ముందు లైంగిక సంబంధం సరైనదేనా?
బైబిలు ఉద్దేశము
ప్రేమికుల మధ్య వివాహానికి ముందు లైంగిక సంబంధం సరైనదేనా?
ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటుంటే వివాహానికి ముందు లైంగిక సంబంధాలు కలిగివుండడంలో తప్పులేదని ఒక సర్వేలో పాల్గొన్న 90 శాతం మంది యౌవనస్థులు అభిప్రాయపడ్డారు. అలాంటి ధోరణిని ప్రచార మాధ్యమాలు ప్రసారం చేయడమేకాక, వాటిని ఆమోదిస్తున్నాయి కూడా. పరస్పరం ప్రేమించుకున్నప్పుడు లైంగిక సంబంధాలు కలిగివుండడం మామూలే అన్నట్లు టీవీలో, సినిమాల్లో సాధారణంగా చూపిస్తూ ఉంటారు.
అయితే, దేవుణ్ణి సంతోషపెట్టాలనుకునేవారు మార్గనిర్దేశం కోసం లోకంవైపు చూడరు, ఎందుకంటే లోకం దాని పాలకుడైన అపవాది ఆలోచనా విధానాన్నే ప్రతిబింబిస్తుందనే విషయాన్ని వారు గుర్తిస్తారు. (1 యోహాను 5:19) వారు తమ స్వంత మనోభావాలచేత కూడా ప్రభావితులవరు ఎందుకంటే “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది” అని వారికి తెలుసు. (యిర్మీయా 17:9) బదులుగా, నిజమైన జ్ఞానవంతులు నడిపింపు కోసం సృష్టికర్తవైపు, ఆయన ప్రేరేపిత వాక్యంవైపు చూస్తారు.—సామెతలు 3:5, 6; 2 తిమోతి 3:16.
లైంగిక సంబంధం దేవుడిచ్చిన వరం
“శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును” అని యాకోబు 1:17 చెబుతోంది. ఆ శ్రేష్ఠమైన వరాల్లో ఒకటి, లైంగిక సంబంధాలను వివాహ ఏర్పాటుకు మాత్రమే పరిమితం చేయడం. (రూతు 1:9; 1 కొరింథీయులు 7:2, 6, 7) అది సంతానోత్పత్తికేకాక, భార్యాభర్తలు కోమలమైన, మధురమైన రీతిలో శారీరకంగా, మానసికంగా సన్నిహితమయ్యేందుకు తోడ్పడుతుంది. “నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. . . . ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందుచుండుము” అని ప్రాచీనకాల రాజైన సొలొమోను వ్రాశాడు.—సామెతలు 5:18, 19.
యెహోవా దయచేసిన వరాలనుండి మనం ప్రయోజనాన్ని, సంతోషాన్ని పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఆయన, మనం జీవితంలో పాటించాల్సిన శ్రేష్ఠమైన నియమాలను, సూత్రాలను కూడా ఇచ్చాడు. (కీర్తన 19:7, 8) యెహోవా ‘మనకు ప్రయోజనము కలుగునట్లు మనకు ఉపదేశము చేస్తాడు, మనం నడవాల్సిన త్రోవలో మనల్ని నడిపిస్తాడు.’ (యెషయా 48:17) ప్రేమకు అత్యుత్తమ మాదిరియైన మన పరలోక తండ్రి మనకు నిజంగా సంతోషం కలిగించేదాన్ని మనకు దక్కకుండా చేస్తాడా?—కీర్తన 34:10; 37:4; 84:11; 1 యోహాను 4:8.
వివాహానికి ముందు లైంగిక సంబంధాలు కలిగివుండడం ప్రేమకు వ్యతిరేకం
స్త్రీ పురుషులు వివాహ బంధంలో ఏకమైనప్పుడు వారు “ఏకశరీరము” అవుతారు. ఇద్దరు అవివాహిత వ్యక్తులు లైంగిక సంబంధాలు కలిగివుంటే లేదా జారత్వానికి పాల్పడితే, వారు కూడా “ఏకశరీరమై” ఉంటారు, కానీ అది దేవుని దృష్టిలో అపవిత్రమైనది. * అంతేకాదు, అలా చేయడం ప్రేమకు వ్యతిరేకం. అలా అని ఎందుకు చెప్పవచ్చు?—మార్కు 10:7-9; 1 కొరింథీయులు 6:9, 10, 16.
ఒక కారణమేమిటంటే, జారత్వమనేది పెళ్లిచేసుకోవాలనే నిబద్ధత లేకుండా లైంగిక సంబంధాలు కలిగివుండడం. అలాగే
అది స్వాభిమానాన్ని దెబ్బతీయడమేకాక, వ్యాధులకు, అవాంఛిత గర్భధారణకు, మనోవేదనకు దారితీయగలదు. అన్నింటికన్నా ముఖ్యంగా, అలా చేయడం దేవుని నీతియుక్తమైన ప్రమాణాలను ఉల్లంఘించినట్లవుతుంది. కాబట్టి, జారత్వం చేయడం అవతలి వ్యక్తి ప్రస్తుత, భవిష్యత్ సంక్షేమాలపట్ల, సంతోషంపట్ల ఏమాత్రం శ్రద్ధ లేకపోవడాన్ని చూపిస్తుంది.ఒక క్రైస్తవుడు జారత్వానికి పాల్పడితే, అతను లేదా ఆమె తన ఆధ్యాత్మిక సహోదరుని లేదా సహోదరి హక్కులను అతిక్రమించినట్లు కూడా అవుతుంది. (1 థెస్సలొనీకయులు 4:3-6) ఉదాహరణకు, దేవుని సేవకులమని చెప్పుకునేవారు వివాహేతర లైంగిక సంబంధాలు కలిగివుంటే, వారు క్రైస్తవ సంఘంలోకి అపవిత్రతను తెచ్చినవారవుతారు. (హెబ్రీయులు 12:15, 16) అంతేకాక, వారితోపాటు జారత్వంలో పాల్గొన్న వ్యక్తియొక్క పవిత్రమైన నైతిక స్థితిని పాడుచేస్తారు, ఆ వ్యక్తికి ఇంకా వివాహమవకపోతే వారు నైతిక పవిత్రతతో వివాహం చేసుకునే అవకాశం లేకుండా చేస్తారు. వారు తమ స్వంత కుటుంబంతోపాటు లైంగిక సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి కుటుంబానికున్న మంచి పేరుపై కళంకం తెస్తారు. అంతేకాదు, వారు దేవుని నీతియుక్తమైన నియమాలను, సూత్రాలను ఉల్లంఘించడం ద్వారా ఆయనపట్ల అగౌరవం చూపించినవారవుతారు. (కీర్తన 78:40, 41) అలాంటి చెడు కార్యాలు చేస్తూ, పశ్చాత్తాపం చూపించనివారందరికీ యెహోవా “ప్రతిదండన” చేస్తాడు. (1 థెస్సలొనీకయులు 4:6) కాబట్టి “జారత్వమునకు దూరముగా పారిపోవుడి” అని బైబిలు మనకు చెప్పడంలో ఆశ్చర్యమేమైనా ఉందా?—1 కొరింథీయులు 6:18.
మీరు ఎవరినైనా ప్రేమిస్తూ, పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నారా? ఒకరినొకరు తెలుసుకోవడానికి గడిపే సమయాన్ని పరస్పరం గౌరవాన్ని, నమ్మకాన్ని పెంపొందించుకోవడానికి ఎందుకు ఉపయోగించకూడదు? దీన్ని గురించి ఆలోచించండి: ఆశానిగ్రహం చూపించని పురుషుణ్ణి ఒక స్త్రీ పూర్తిగా ఎలా నమ్మగలదు? తనలోని లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి లేదా ఒక పురుషుణ్ణి సంతోషపెట్టడానికి దేవుని నియమాన్ని అలక్ష్యం చేసిన స్త్రీని ఒక పురుషుడు ఏమాత్రం ప్రేమించి గౌరవించగలడు?
దేవుని ప్రేమపూర్వక ప్రమాణాలను నిరాకరించేవారు తమ క్రియల పర్యవసానాలను కూడా అనుభవించాల్సి ఉంటుందనే విషయాన్ని మరచిపోకండి. (గలతీయులు 6:7) “జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు” అని బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 6:18; సామెతలు 7:5-27) పెళ్ళికి ముందు లైంగిక సంబంధాలు కలిగివున్న వ్యక్తులు నిజంగా పశ్చాత్తాపపడి, దేవునితో తమ సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవడానికి కృషి చేస్తూ ఒకరిపై ఒకరు నమ్మకాన్ని బలపర్చుకుంటే, అనతికాలంలో అలాంటి అపరాధ భావాలు తొలగిపోవచ్చు, అవతలి వ్యక్తిపై తిరిగి నమ్మకం ఏర్పడవచ్చు. అయినా, గతంలో వారి ప్రవర్తన మానని గాయాన్నే మిగులుస్తుంది. ఇప్పుడు వివాహితులైన ఒక యువ జంట గతంలో జారత్వానికి పాల్పడినందుకు తీవ్రంగా బాధపడుతున్నారు. ఆ భర్త కొన్నిసార్లు తనలోతాను, ‘మా వివాహం అలా అపవిత్రంగా ప్రారంభమైనందుకే మా దాంపత్యంలో భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయా’ అని ప్రశ్నించుకుంటాడు.
నిజమైన ప్రేమ నిస్వార్థమైనది
నిజమైన ప్రేమలో ప్రణయాత్మక భావాలు పుట్టినా, అది “అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు.” (1 కొరింథీయులు 13:4, 5) బదులుగా, అది ఎదుటివ్యక్తి సంక్షేమం కోసం, నిత్య సంతోషం కోసం పాటుపడుతుంది. అలాంటి ప్రేమగల స్త్రీపురుషులు ఒకరినొకరు గౌరవించి, లైంగిక సంబంధాలు కలిగివుండడాన్ని దేవుడు ఏర్పర్చిన వివాహ పానుపుకే పరిమితం చేస్తారు.—హెబ్రీయులు 13:4.
వివాహాన్ని నిజంగా సంతోషకరంగా చేయగల నమ్మకం, భద్రతాభావం పిల్లలు పుట్టినప్పుడు ప్రత్యేకంగా ప్రాముఖ్యం, ఎందుకంటే పిల్లలు ప్రేమపూర్వకమైన, స్థిరమైన, సురక్షితమైన వాతావరణంలో పెరగాలని దేవుడు కోరుతున్నాడు. (ఎఫెసీయులు 6:1-4) కేవలం వివాహంలోనే ఇద్దరు వ్యక్తులు నిజంగా ఒకరికొకరు కట్టుబడి ఉంటారు. తమ శేష జీవితాల్లో కష్టనష్టాలు ఎదురైనప్పుడు ఒకరికొకరు శ్రద్ధ చూపిస్తూ, సహకరిస్తూ ఉంటామని వారి హృదయంలోను, అలాగే వారి మాటల ద్వారానూ వాగ్దానం చేస్తారు.—రోమీయులు 7:2, 3.
భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం వారి వివాహబంధాన్ని బలపర్చగలదు. సంతోషభరితమైన వివాహంలో అలా చేరువవ్వడం మరింత మనోహరమైనదిగా, అర్థవంతమైనదిగా ఉందని దంపతులు తెలుసుకుంటారు. వారు లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వివాహాన్ని అగౌరవపర్చదు, మనస్సాక్షిని నొప్పించదు లేదా సృష్టికర్తకు అవిధేయులయ్యేలా చేయదు. (g 11/06)
మీరెప్పుడైనా ఆలోచించారా?
◼ వివాహానికి ముందు లైంగిక సంబంధాలు కలిగివుండడం విషయంలో దేవుని దృక్కోణమేమిటి?—1 కొరింథీయులు 6:9, 10.
◼ జారత్వం ఎందుకు హానికరమైనది?—1 కొరింథీయులు 6:18.
◼ పరస్పరం ప్రణయాత్మకంగా ఆకర్షితులైన ఇద్దరు వ్యక్తులు నిజమైన ప్రేమను ఎలా కనపర్చవచ్చు?—1 కొరింథీయులు 13:4, 5.
[అధస్సూచి]
^ “జారత్వం” అని అనువదించబడిన గ్రీకు పదం, వివాహ జతకాని వ్యక్తి మర్మాంగాలను స్పర్శించడంతోపాటు, ముఖరతిలాంటి అన్నిరకాలైన లైంగిక కార్యాలకు వర్తిస్తుంది.—యెహోవాసాక్షులు ప్రచురించిన తేజరిల్లు! (ఆంగ్లం) జూలై 22, 2004 12వ పేజీ మరియు కావలికోట ఫిబ్రవరి 15, 2004 13వ పేజీ చూడండి.