“దాదాపు డిజైన్ చేసినట్లే ఉంది”?
“దాదాపు డిజైన్ చేసినట్లే ఉంది”?
మీరు రాత్రిపూట అంతరిక్షాన్ని టెలిస్కోపుతో ఎప్పుడైనా చూశారా? అలా చూసినవారిలో చాలామంది తమకు శనిగ్రహం మొదటిసారి ఎలా కనబడిందో ఇప్పటికీ గుర్తుందని మీకు చెప్పగలరు. అది ఒక అసాధారణమైన దృశ్యం. కటిక చీకటి నేపథ్యంలో వెదజల్లినట్లు ఉండే అసంఖ్యాకమైన మెరిసే తారలతో తేజోమయమైన ఆ గ్రహం కనబడుతుంది, దానిచుట్టూ చదునైన అద్భుతమైన వలయాలు!
ఆ వలయాలు ఏమిటి? పూర్వం 1610లో ఖగోళ శాస్త్రవేత్త అయిన గెలీలియో తాను చేతితో తయారుచేసిన టెలిస్కోపుతో శనిగ్రహాన్ని మొదటిసారి చూశాడు. ఆ దృశ్యం అస్పష్టంగా కనిపించింది, మధ్యలో ఒక గ్రహం దానికి ఇరుప్రక్కలా మరో రెండు చిన్న ఉపగ్రహాలతో అది చెవులున్న గ్రహంలా కనబడింది. ఆ తర్వాతి సంవత్సరాల్లో టెలిస్కోపులు అభివృద్ధి చెందడంతో ఖగోళ శాస్త్రవేత్తలు ఆ వలయాలను మరింత స్పష్టంగా చూడగలిగారు, అయినా ఆ వలయాలు దేనితో ఏర్పడ్డాయన్న విషయంలో వాదోపవాదాలు జరిగాయి. అవి ఘనపదార్థంతో ఏర్పడిన దృఢమైన చక్రాలు అని చాలామంది వాదించారు. ఖగోళ శాస్త్రవేత్తలకు 1895 వరకు ఆ వలయాలు అసంఖ్యాకమైన రాతి, మంచు రేణువులతో ఏర్పడ్డాయని నిరూపించేందుకు బలమైన రుజువులు లభించలేదు.
ద ఫార్ ప్లానెట్స్ అనే పుస్తకం ఇలా పేర్కొంది: “శనిగ్రహపు వలయాలు అసంఖ్యాకమైన మంచు ముక్కలతో ఏర్పడిన రిబ్బన్ల సముదాయం, ఇది సౌరమండలంలో జరిగే గొప్ప అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తుంది. ధగ ధగ మెరిసే ఆ వలయాలు ఎంతో విశాలమైనవి, ఆ గ్రహాన్ని ఆవరించి ఉండే వాతావరణానికి కాస్త పైన ఉండే లోపలి అంచు నుండి, చాలా పలచగా కనబడే వెలుపలి అంచు వరకు 4,00,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది చాలా సన్నగా 30 మీటర్ల కన్నా తక్కువ మందంతో ఉంటుంది.” 2004 జూన్లో కాసీనీ హైజెన్స్ అనే అంతరిక్షనౌక శనిగ్రహాన్ని చేరుకుని అక్కడి నుండి డేటానూ ఫోటోలనూ పంపించడంతో, శాస్త్రవేత్తలు వందలాది వలయాలతో ఏర్పడిన ఆ వలయాల గురించి మరింతగా తెలుసుకోవడం ఆరంభించారు.
స్మిత్సోనియన్ అనే పత్రికలోని ఒక ఆర్టికల్ ఇటీవల ఇలా పేర్కొంది: “శనిగ్రహం గణితశాస్త్రం ఉన్నంత ఖచ్చితంగా, దాదాపు డిజైన్ చేసినట్లే ఉంది.” మనం ఆ రచయిత భావాలతో ఏకీభవించవచ్చు, కానీ ఆయన “దాదాపు” అనే పదాన్ని ఎందుకు చేర్చాడా అని ఆశ్చర్యపోక తప్పదు. వాస్తవానికి మనోహరంగా కనబడే తేజోమయమైన ఈ గ్రహం, వేల సంవత్సరాల క్రితం చేయబడిన ఈ ప్రేరేపిత వర్ణనకు సరిపోయే అసంఖ్యాకమైన గ్రహాల్లో ఒక్కటి మాత్రమే: “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.”—కీర్తన 19:1. (g05 6/22)
[31వ పేజీలోని చిత్రసౌజన్యం]
నేపథ్యం: NASA, ESA and E. Karkoschka (University of Arizona); ఇన్సెట్లు: NASA and The Hubble Heritage Team (STScl/AURA)