పసితనంలో శిక్షణ ఎంత ప్రాముఖ్యం?
పసితనంలో శిక్షణ ఎంత ప్రాముఖ్యం?
ఫ్లారెన్సుకు 40 ఏండ్లు. తనకు పిల్లలు కలగాలని ఆమె ఎంతగానో కోరుకుంది. కానీ ఆమె గర్భవతి అయినప్పుడు ఆమెకు పుట్టబోయే బిడ్డ నేర్చుకునే సామర్థ్య లోపంతో జన్మించే అవకాశం ఉందని డాక్టర్ హెచ్చరించినా గర్భస్రావం చేయించుకోవడానికి ఆమె ఒప్పుకోలేదు. చివరకు ఆమె ఆరోగ్యంగా ఉన్న ఒక బాబుకు జన్మనిచ్చింది.
ఫ్లారెన్సు తన కుమారుడు స్టీవన్ పుట్టిన కొద్దికాలం తర్వాత, అతనికి అన్ని సందర్భాల్లోనూ చదివి వినిపించడం, అతనితో మాట్లాడడం ప్రారంభించింది. అతను కాస్త పెద్దవాడవగానే వారు కలిసి ఆటలు ఆడారు, వినోదయాత్రలకు వెళ్ళారు, లెక్కబెట్టడం అభ్యాసం చేశారు, పాటలు పాడారు. “చివరకు స్నానం చేయించేటప్పుడు కూడా ఏదో ఒక ఆట ఆడుకునేవాళ్ళం” అని ఆమె జ్ఞాపకం చేసుకుంటోంది. అందుకు తగిన ఫలితం దక్కింది.
స్టీవన్ 14 ఏళ్ళ వయసులోనే యూనివర్శిటీ ఆఫ్ మియామీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ర్యాంకు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రెండేళ్లకు అంటే అతని 16వ ఏట న్యాయశాస్త్ర విద్య పూర్తి చేశాడు, ఆ తర్వాత అమెరికాలో అతి చిన్న వయసుగల లాయరు అయ్యాడని ఆయన జీవిత చరిత్ర ప్రకారం తెలుస్తోంది. ఆయన తల్లి డాక్టర్ ఫ్లారెన్స్ బాకస్ గతంలో ఉపాధ్యాయినిగానూ, మార్గదర్శక సలహాదారుగానూ పనిచేసింది. పసితనంలో నేర్చుకోవడం అనే అంశం మీద అధ్యయనానికి ఆమె చాలా సమయాన్ని అంకితం చేసింది. ఆమె తన కుమారుని పసితనంలో అతని విషయంలో తాను చూపించిన శ్రద్ధ, ఇచ్చిన ప్రేరణ అతని భవిష్యత్తునే మార్చేశాయని దృఢంగా నమ్మింది.
సహజ స్వభావం లేక పెంపకం
ఇటీవలి కాలంలో, పిల్లల వికాసంలో వారసత్వంగా వచ్చే “సహజ స్వభావం” పాత్ర గురించీ, ఆలనాపాలనా శిక్షణల మిళితమైన “పెంపకం” పాత్ర గురించీ పిల్లల మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుల మధ్య ఒక ముఖ్యమైన వివాదం చెలరేగింది. చాలామంది పరిశోధకులు, పిల్లల వికాసంపై సహజ స్వభావం, పెంపకం ఈ రెండూ ప్రభావం చూపిస్తాయని దృఢంగా నమ్ముతున్నారు.
పిల్లల వికాస నిపుణుడైన డా. జె. ఫ్రేసర్ మస్టర్డ్ ఇలా వివరిస్తున్నారు: “ఒక పిల్లవాడికి పసితనంలో ఎదురయ్యే అనుభవాలు అతని మెదడు వికాసంపై ప్రభావం చూపిస్తాయని మనం ఇప్పుడు వైద్యపరంగా తెలుసుకున్నాం.” ప్రొఫెసర్ సూసాన్ గ్రీన్ఫీల్డ్ కూడా అలాగే అంటోంది: “ఉదాహరణకు, వయొలిన్ వాయించేవారు ఎడమ చేతివేళ్ళకు సంబంధించిన మెదడు భాగాన్ని ఇతరుల కంటే ఎక్కువగా వికసింప చేసుకుంటారని మనకు తెలుసు.”
ఎలాంటి శిక్షణ ఇవ్వాలి?
ఈ ఫలితాలకు స్పందిస్తూ అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి శిశు సంరక్షణా కేంద్రాలకు పంపించడానికి అనేక తంటాలుపడడమే కాక వారికి సంగీతం, కళలు నేర్పించేందుకు కూడా బోలెడంత డబ్బు వెచ్చిస్తున్నారు. ఒక పిల్లవాడు అన్నిటినీ నేర్చుకుంటే పెద్దవాడయ్యాక అన్నీ చేయగలుగుతాడని కొందరి నమ్మకం. అందువల్ల ప్రత్యేక శిక్షణనిచ్చే కార్యక్రమాలు, నర్సరీ స్కూళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లల కంటే మంచి స్థితిలో ఉంచేందుకు తమకు సాధ్యమైనదంతా చేసేందుకు సిద్ధపడుతున్నారు.
ఈ తరహా ప్రయత్నాలు ప్రయోజనకరంగా ఉంటాయా? అలాంటి ప్రయత్నాల ద్వారా మనం పిల్లలను ఎన్నో సదవకాశాలతో పెంచుతున్నట్లు అనిపించవచ్చు. కానీ ఎంతో ప్రాముఖ్యమైన నేర్చుకునే అనుభవాన్ని ఆ పిల్లలు పొందలేకపోతున్నారు, దానిని వాళ్ళు సహజంగా ఆడుకునే ఆటల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. సహజమైన ఆటలు పిల్లవాడిలోని సృజనాత్మకతను ప్రేరేపించి, అతనిలోని సామాజిక, మానసిక, భావోద్వేగ సామర్థ్యాలను వృద్ధి చేస్తాయి అని బోధకులు అంటున్నారు.
తల్లిదండ్రులు ఆడించే ఆటలు ఒక కొత్త తరహా సమస్యకు దారి తీస్తున్నాయని, అంటే ఒత్తిడికి గురై చంచల స్వభావం ఏర్పరచుకొని, నిద్రపోలేక, నొప్పులూ బాధలూ అని ఫిర్యాదు చేసే మైక్రోమానేజ్డ్ పిల్లలుగా తయారుచేస్తున్నాయని కొందరు పిల్లల వికాస నిపుణులు నమ్ముతున్నారు. అలాంటి పిల్లలు కౌమార దశకు చేరుకునే సరికి వారిలో చాలామంది సమస్యలను అధిగమించే నైపుణ్యాలను ఎలా వృద్ధిచేసుకోవాలో నేర్చుకోలేకపోయారు, చివరకు “మానసికంగా అలసిపోయి, సంఘ విరోధులుగా, తిరుగుబాటుదారులుగా తయారయ్యారు” అని ఒక మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు అంటున్నాడు.
అందుకే చాలామంది తల్లిదండ్రులు సందిగ్ధావస్థలో ఉన్నారు. వారు తమ పిల్లలు సాధ్యమైనంత మేరకు సామర్థ్యాలను అభివృద్ధి చేసుకొనేందుకు సహాయం చేయాలనుకుంటారు. అయినప్పటికీ వారు చిన్న పిల్లలను మరీ కఠినంగా, మరీ వేగంగా అభివృద్ధి చెందాలని బలవంతం చేయడం మూర్ఖత్వమని గ్రహిస్తున్నారు. సహేతుకమైన సమతుల్యతగల విధానం ఏదైనా ఉందా? చిన్న పిల్లల్లో పెరుగుదలకు సంబంధించి ఎలాంటి సామర్థ్యం ఉంటుంది, దాన్ని ఎలా వృద్ధి చేయవచ్చు? తమ పిల్లలు తప్పకుండా విజయం సాధిస్తారని నిశ్చయించుకునేందుకు తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు? ఈ ప్రశ్నలను దీని తర్వాతి ఆర్టికల్లు పరిశీలిస్తాయి. (g04 10/22)
[3వ పేజీలోని చిత్రం]
పిల్లల పసితనంలోని అనుభవాలు వారి మెదడు వికాసంపై ప్రభావం చూపించగలవు
[4వ పేజీలోని చిత్రం]
ఆటలు పిల్లవాని సృజనాత్మకతను ప్రేరేపించి, అతనిలోని నైపుణ్యాలను వృద్ధి చేస్తాయి