కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేను వైఫల్యాన్ని ఎలా తట్టుకోగలను?

నేను వైఫల్యాన్ని ఎలా తట్టుకోగలను?

యువత ఇలా అడుగుతోంది . . .

నేను వైఫల్యాన్ని ఎలా తట్టుకోగలను?

“ఇప్పుడే నా ప్రోగ్రెస్‌ కార్డ్‌ అందింది, అవే నాలుగు సబ్జెక్టుల్లో మళ్ళీ ఫెయిల్‌ అయ్యాను. నేను ఎంతో కష్టపడ్డాను, అయినా మళ్ళీ ఫెయిల్‌ అయ్యాను.”​—లారెన్‌, 15 ఏండ్లు.

“వైఫల్యంతో వ్యవహరించడం అంటే నిజంగా పోరాటమే. ప్రతికూలంగా ఆలోచించడం చాలా సులభం.”​—జెస్సిక, 19 ఏండ్లు.

వైఫల్యం. ఈ పదాన్ని మీరు తలంచడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. కానీ అప్పుడప్పుడు మనం అందరమూ దాన్ని ఎదుర్కొంటుంటాం. అది పాఠశాల పరీక్షలో ఫెయిల్‌ కావడం, నలుగురిలో అవమానానికి గురికావడం, మనం గౌరవించే ఎవరికైనా ఆశాభంగం కలిగించడం, నైతికపరమైన పెద్ద తప్పు చేయడం వంటిది ఏదైనా కావచ్చు. వైఫల్యం చాలా బాధాకరంగా ఉంటుంది.

మానవులందరూ పొరపాట్లు చేస్తారు అనడంలో సందేహం లేదు. “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అని బైబిలు చెబుతోంది. (రోమీయులు 3:23) కానీ కొందరు ఒకసారి పడ్డాక మళ్ళీ కోలుకోవడానికి చాలా కష్టపడతారు. జేసన్‌ అనే ఒక యువకుడు ఇలా అంటున్నాడు: “నన్ను నేనే తీవ్రంగా విమర్శించుకుంటాను. నేను ఏదైనా పొరపాటు చేస్తే, ప్రజలు నవ్వుతుండవచ్చు, కానీ సాధారణంగా వారు దాన్ని మరచిపోతారు. అయితే నేను మరచిపోను, నేను చేసిన పొరపాటు గురించి పదేపదే ఆలోచిస్తుంటాను.”

ఎదురైన వైఫల్యాల గురించి కాస్త ఆలోచించడం తప్పేమీ కాదు, ప్రత్యేకించి అలా ఆలోచించడం మీరు మెరుగుపడేందుకు పురికొల్పుతున్నప్పుడు అది మంచిదే. అయితే దీర్ఘకాలంపాటు అదేపనిగా మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం హానికరమే కాక అభివృద్ధికి ఆటంకం కూడా అవుతుంది. సామెతలు 12:25 ఇలా చెబుతోంది: “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును.”

బైబిల్లోని, ఎపఫ్రొదితు అనే పేరుగల ఒక వ్యక్తిని పరిశీలించండి. ఆయన అపొస్తలుడైన పౌలుకు వ్యక్తిగత సహచరునిగా సేవ చేయడానికి రోముకు పంపించబడ్డాడు. అయితే ఆయన అనారోగ్యానికి గురికావడంవల్ల ఆ నియామకాన్ని నెరవేర్చలేకపోయాడు. నిజానికి అప్పుడు పౌలే ఆయనకు సపర్యలు చేశాడు! నమ్మకస్థుడైన ఎపఫ్రొదితు విచారపడుతున్నాడని స్థానిక సంఘానికి తెలుపుతూ పౌలు ఆయనను ఇంటికి పంపించే ఏర్పాటు చేశాడు. ఆయన విచారానికి కారణం? “అతడు రోగి యాయెనని మీరు వింటిరి గనుక” అని పౌలు వివరించాడు. (ఫిలిప్పీయులు 2:25, 26) ఎపఫ్రొదితు తాను అనారోగ్యానికి గురయ్యాననీ, అందువల్ల తాను తన విధులను నిర్వహించలేకపోయాననీ ఇతరులకు తెలిసిందని గ్రహించాడు, ఆయన దాన్ని ఒక వైఫల్యంగానే భావించి ఉండవచ్చు. అందుకని, ఆయన విచారించడంలో ఆశ్చర్యమేమీ లేదు!

వైఫల్యం వల్ల కలిగే బాధాకరమైన భావాలకు దూరంగా ఉండే మార్గం ఏదైనా ఉందా?

మీ పరిమితులను తెలుసుకోండి

విఫలమయ్యే అవకాశాలను తగ్గించుకోవడానికి ఒక మార్గం ఏమిటంటే, మీరు ఆచరణాత్మకమైన, వినయపూర్వకమైన అంటే సహేతుకమైన లక్ష్యాలను పెట్టుకోండి. “వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 11:2; 16:18) వినయంగల లేదా సహేతుకంగా ఉండే వ్యక్తికి తన పరిమితులు ఏమిటో తెలుసు. నిజమే, మీరు మీ నైపుణ్యాలను, సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం మంచిదే. కానీ సహేతుకమైన స్వభావంతో ఉండండి. మీరు గణిత శాస్త్రంలో దిగ్గజులు కాకపోవచ్చు లేదా ప్రసిద్ధ అథ్లెట్‌కు ఉండే చేవ, నైపుణ్యం మీకు ఉండకపోవచ్చు. మైఖల్‌ అనే ఒక యువకుడు ఇలా అంగీకరిస్తున్నాడు: “నేను క్రీడల్లో అంతంత మాత్రమేనని నాకు తెలుసు. అందుకే, నేను ఆడినా, సాధించలేను అని తెలిసిన లక్ష్యాలను నేను పెట్టుకోను.” ఆయనింకా ఇలా వివరిస్తున్నాడు: “మీరు సాధించగలిగే లక్ష్యాలనే మీరు పెట్టుకోవాలి.”

14 ఏండ్ల ఈవాన్‌ వైఖరిని పరిశీలించండి, ఆమె స్పైన బైఫడ (వెన్నుపాము చుట్టూ ఉండే ఎముకలో వెలితి)తో, సెరెబ్రల్‌ పాల్సీ (పాక్షిక పక్షవాతం)తో బాధపడుతోంది. “నేను ఇతరుల్లాగ నడవలేను, డాన్స్‌ చేయలేను, పరుగెత్తలేను. ఇతరులు చేసేది నేను చేయలేకపోవడం నన్ను చాలా కలతపరుస్తుంది. దాన్ని చాలామంది సరిగా అర్థం చేసుకోరు. అయినా నేను అలాంటి భావాలతో వ్యవహరించగలను.” ఆమె సలహా ఏమిటి? “మానేయకండి. ప్రయత్నిస్తూనే ఉండండి. మీరు విఫలమైనా లేక సరిగా చేయకపోయినా చేతులెత్తేయకండి. మీరు బాగా చేయగలిగేది చేస్తుండండి.”

అదే సమయంలో మిమ్మల్ని మీరు అనవసరంగా ఇతరులతో పోల్చుకుంటూ మిమ్మల్ని మీరే హింసించుకోకండి. 15 ఏండ్ల ఆండ్రూ ఇలా అంటున్నాడు: “నన్ను నేను ఇతరులతో పోల్చుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను, ఎందుకంటే మనందరి శక్తిసామర్థ్యాలు భిన్నంగా ఉంటాయి.” ఆండ్రూ మాటలు గలతీయులు 6:4 లో కనబడే బైబిలు మాటలను ప్రతిధ్వనిస్తున్నాయి: “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.”

ఇతరులు మీ నుండి ఎక్కువగా ఆశించినప్పుడు

అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతరులు మీ నుండి ఎక్కువగా ఆశిస్తారు. ఎంత ప్రయత్నించినా వారిని సంతోషపెట్టలేకపోతున్నానని మీరనుకోవచ్చు. పరిస్థితిని మరింత దుర్భరం చేస్తూ, వారు తమ ఆశాభంగాన్ని మీకు చికాకు కలిగించే లేదా మిమ్మల్ని కృంగదీసే మాటల్లో కూడా వ్యక్తం చేస్తుండవచ్చు. (యోబు 19:2) మీ తల్లిదండ్రులూ, ఇతరులూ మిమ్మల్ని కావాలని నొప్పించడం లేదని మీరు గ్రహిస్తుండవచ్చు. జెస్సిక చెబుతున్నట్లు, “చాలాసార్లు వారు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తున్నామనేది కూడా గ్రహించరు. కొన్నిసార్లు అది కేవలం అపార్థం మాత్రమే కావచ్చు.”

మరోవైపున, మీరు చూడనిది ఏదైనా వారు చూసే అవకాశముందా? ఉదాహరణకు, బహుశా మీరు మీ సామర్థ్యాలను సరిగ్గా తెలుసుకోకుండా మిమ్మల్ని మీరు చాలా తక్కువ అంచనా వేసుకుంటుండవచ్చు. వారి సలహాలను నిర్లక్ష్యం చేసే బదులు, ‘ఉపదేశమును అవలంబించి జ్ఞానులై యుండడం’ తెలివైన పని. (సామెతలు 8:33) మైఖల్‌ ఇలా వివరిస్తున్నాడు: “అది మీ మంచి కోసమే. మీరు మరింత బాగా చేయాలనీ, మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవాలనీ వారు కోరుకుంటున్నారు. దాన్నొక సవాలుగా భావించండి.”

ఒకవేళ తల్లిదండ్రులైనా, ఇతరులైనా మీ నుండి పట్టుబట్టి కోరుతున్నవి సహేతుకమైనవి కావనీ, మీరు సాధించలేని లక్ష్యాలు మీ ముందు పెడుతున్నారనీ అనిపిస్తే అప్పుడెలా? అలాంటప్పుడు మీరు వారితో మాట్లాడడమే మంచిది, మీరెలా భావిస్తున్నారో​—గౌరవపూర్వకంగానే అయినా సూటిగా​—వారికి తెలపండి. వారితో కలిసి, మరింత సహేతుకమైన కొన్ని లక్ష్యాలను మీరు పెట్టుకోవచ్చు.

మీ ఆధ్యాత్మిక జీవితంలో “వైఫల్యాలు”

యెహోవాసాక్షుల్లో, దేవుని పరిచారకులుగా తమ నియామకాలను నెరవేర్చడమనే సవాలు యువత ఎదుట ఉంది. (2 తిమోతి 4:5) మీరు యువ క్రైస్తవులైతే కొన్నిసార్లు మీలో, తగనివాడననే లేదా తగనిదానననే భావం కలగవచ్చు. బహుశా మీరు కూటాల్లో వ్యాఖ్యానాలు సరిగా చేయడం లేదని భావిస్తుండవచ్చు. లేదా బైబిలు సందేశాన్ని ఇతరులకు వివరించడం మీకు కష్టంగా ఉండవచ్చు. ఉదాహరణకు జెస్సిక, మరో యౌవనస్థురాలితో బైబిలు అధ్యయనం చేసింది. కొంతకాలం ఆమె బైబిలు విద్యార్థి మంచి ప్రగతి సాధించింది. అయితే అకస్మాత్తుగా ఆ అమ్మాయి దేవుని సేవ చేయకూడదని నిర్ణయించుకుంది. “అప్పుడు నేను విఫలమైనట్లుగా భావించాను” అని జెస్సిక జ్ఞాపకం చేసుకుంటోంది.

జెస్సిక ఆ భావాలను ఎలా తట్టుకుంది? మొదట, తన విద్యార్థి తిరస్కరించింది తనను కాదు దేవుణ్ణి అని ఆమె గ్రహించవలసి వచ్చింది. బైబిలులోని పలు బలహీనతలున్న దైవ భక్తుడైన పేతురు ఉదాహరణను ధ్యానించడం కూడా ఆమెకు సహాయపడింది. ఆమె ఇలా వివరిస్తోంది: “పేతురు తన బలహీనతలను అధిగమించాడనీ, రాజ్య సంబంధ విషయాలను కొనసాగించడానికి యెహోవా ఆయనను అనేక విధాలుగా ఉపయోగించుకున్నాడనీ బైబిలు చూపిస్తోంది.” (లూకా 22:31-34, 60-62) ఒక బోధకునిగా మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంటే, మీరు ఆ విషయంలో మరింత కృషి ఎందుకు చేయకూడదు? (1 తిమోతి 4:13) సంఘంలో, మీకు బోధించగల, శిక్షణనివ్వగల, పరిణతి చెందినవారి నుండి సహాయం తీసుకోండి.

అయినా బహుశా మీకు ఇంటింటి పరిచర్య చేయడం సవాలుగా అనిపించవచ్చు. జేసన్‌ ఇలా అంగీకరిస్తున్నాడు: “గృహస్థులు వినడానికి నిరాకరించిన ప్రతీసారి అది ఒక చిన్న వైఫల్యంలా అనిపిస్తుంది.” మరి ఆయనెలా తట్టుకున్నాడు? “నిజానికి నేను విఫలం కాలేదని నేను గుర్తుంచుకోవాలి.” అవును, దేవుడు ఏమి చేయమని ఆయనకు ఆజ్ఞాపించాడో ఆ పనిలో అంటే ప్రకటించడంలో ఆయన విజయం సాధించాడు! తిరస్కారాన్ని సహించడం బాధాకరమైన విషయమే, అయితే బైబిలు సందేశాన్ని అందరూ తిరస్కరించరు. జేసన్‌ ఇలా అంటున్నాడు: “వినే వ్యక్తి తారసపడినప్పుడు, నేను పడిన శ్రమకు ఫలితం లభించిందని భావిస్తాను.”

గంభీరమైన తప్పులు

మీరు ఒక గంభీరమైన తప్పు లేదా పాపం చేసినట్లయితే అప్పుడెలా? 19 ఏండ్ల ఆన అలాంటి పొరపాటే చేసింది. * ఆమె ఇలా ఒప్పుకుంటోంది: “నేను సంఘాన్ని, నా కుటుంబాన్ని, ప్రత్యేకించి యెహోవా దేవుణ్ణి నిరాశపరిచాను.” కోలుకోవడానికి మీరు పశ్చాత్తాపపడి, సంఘంలోని ఆధ్యాత్మిక పెద్దల నుండి సహాయం తీసుకోవాలి. (యాకోబు 5:14-16) ఒక పెద్ద చెప్పిన సహాయకరమైన మాటలను ఆన జ్ఞాపకం చేసుకుంటూ ఇలా చెబుతోంది: “దావీదు రాజు అన్ని పొరపాట్లు చేసినప్పటికీ, యెహోవా ఆయనను క్షమించడానికి ఇష్టపడ్డాడనీ, దాంతో దావీదు కోలుకున్నాడనీ ఆయన చెప్పాడు. అది నాకు సహాయపడింది.” (2 సమూయేలు 12:9, 13; కీర్తన 32:5) అంతేకాక మిమ్మల్ని మీరు ఆధ్యాత్మికంగా బలపరచుకోవడానికి మీరు చేయగలిగినదంతా చేయాలి. ఆన ఇలా అంటోంది: “నేను పదే పదే కీర్తనల గ్రంథం చదువుతాను. ప్రోత్సాహకరమైన లేఖనాలను వ్రాసి పెట్టుకోవడానికి ఒక పుస్తకం కూడా నా దగ్గర ఉంది.” ఒక వ్యక్తి ఘోరమైన పాపం చేసినప్పటికీ అతను క్రమేణా కోలుకోవచ్చు. సామెతలు 24:16 ఇలా చెబుతోంది: “నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును.”

ఎదురైన వైఫల్యం నుండి కోలుకోవడం

చిన్న చిన్న వైఫల్యాలు కూడా బాధ కలిగిస్తాయి. అలాంటి వైఫల్యాల నుండి కోలుకోవడానికి ఏమి సహాయం చేయగలదు? మొట్ట మొదట, మీ పొరపాట్లతో సహేతుకంగా పోరాడండి. మైఖల్‌ ఇలా చెబుతున్నాడు: “మిమ్మల్ని మీరు ఒక వైఫల్యంగా పరిగణించుకోవడానికి బదులు, మీరు దేంట్లో విఫలమయ్యారో అందుకు కారణమేమిటో గుర్తించండి. ఆ విధంగా మీరు మరోసారి అదే తప్పు చేయకుండా, ఏదైనా మరింత బాగా చేయగలుగుతారు.”

దానితోపాటు, మీ భావాల గురించే అధికంగా చింతించకండి. ‘నవ్వుటకు సమయము కలదు’ అంటే అందులో మీపై మీరు నవ్వుకోవడం కూడా ఉండవచ్చు! (ప్రసంగి 3:1-4) మీకు నిరుత్సాహంగా అనిపిస్తే, మీకు నచ్చిన అలవాటు వైపో లేక బాగా ఆడగల ఆట వైపో మీ మనస్సు మళ్ళించుకోండి. మీ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడం వంటి “సత్‌క్రియలు అను ధనము” గలవారిగా ఉండడం, మీ గురించి మీరు మరింత సానుకూలంగా భావించేందుకు సహాయపడగలదు.​—1 తిమోతి 6:18.

చివరిగా, “యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు . . . ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు” లేక తప్పులు వెదికేవాడు కాడు అని గుర్తుంచుకోండి. (కీర్తన 103:8, 9) జెస్సిక ఇలా అంటోంది: “నేను యెహోవా దేవునికి ఎంత సన్నిహితం అవుతానో, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాసరే ఆయన మద్దతు, సహాయం ఉంటుందనే నమ్మకం కూడా అంత ఎక్కువవుతుంది.” అవును మీరు వైఫల్యాలు పొందినప్పటికీ, మీ పరలోక తండ్రి మిమ్మల్ని విలువైనవారిగానే ఎంచుతాడని తెలుసుకోవడం ఓదార్పునిస్తుంది. (g04 11/22)

[అధస్సూచి]

^ ఆమె పేరు మార్చబడింది.

[24వ పేజీలోని చిత్రం]

మిమ్మల్ని పట్టుబట్టి కోరుతున్న వాటివల్ల మీరు కృంగిపోయినట్లు భావిస్తే, దాని గురించి గౌరవపూర్వకంగా మాట్లాడే విధానం కోసం చూడండి

[25వ పేజీలోని చిత్రం]

మీరు బాగా చేయగలవాటిని చేయడం, వైఫల్య భావాలను దూరం చేసుకోవడానికి సహాయపడగలదు