కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మేఘాలకంటే ఎత్తులో జీవించడం

మేఘాలకంటే ఎత్తులో జీవించడం

మేఘాలకంటే ఎత్తులో జీవించడం

బొలీవియాలోని తేజరిల్లు! రచయిత

ప్రశాంతమైన, మనోహరమైన ప్రకృతి దృశ్యాలు, వాటిమధ్యగా నడిచివెళ్లడం, పర్వతాలు ఎక్కడం, రివ్వున స్కీయింగ్‌ చేస్తూ ఆనందించడంలాంటి అవకాశాలుగల పర్వత ప్రాంతాలు సెలవులు గడపడానికివెళ్లే చాలామందిని ఆకర్షిస్తాయి. దానికితోడు, లక్షలాదిమంది మేఘాలకంటే ఎత్తుగావున్న ప్రాంతపు లోయల్లో, సమతల ప్రదేశాల్లో స్థిరనివాసం ఏర్పరచుకుంటారు. అయితే అంత ఎత్తులో నివసించడం ప్రజల ఆరోగ్యంపై లేదా వారి వాహనాలపై విచిత్రమైన ప్రభావం చూపవచ్చు అలాగే వారి వంటచేసే విధానంపై కూడా ప్రభావం చూపవచ్చు. ఈ సమస్యలకు మూలకారణమేమిటి, వాటినెలా ఎదుర్కోవచ్చు? మొదటిగా, ఎత్తైన పర్వతాలపై నిజంగా అంత ఎక్కువమంది నివసిస్తున్నారా?

అలాంటి అనేక పర్వత ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి జరుగుతోంది. మెక్సికో నగర ప్రజల్లో లక్షలాదిమంది సముద్ర మట్టానికి 2,000 మీటర్లకంటే ఎక్కువ ఎత్తులో నివసిస్తున్నారు. అమెరికాలోవున్న కొలొరాడోలోని డెన్‌వర్‌, కెన్యాలోవున్న నైరోబీ, దక్షిణాఫ్రికాలోవున్న జొహన్నస్‌బర్గ్‌ నగరాలు 1,500 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. హిమాలయాల్లో నివసించే లక్షలాదిమంది 3,000 మీటర్లకంటే ఎక్కువ ఎత్తులో నివసిస్తున్నారు. ఆండీస్‌ పర్వత ప్రాంతాల్లోవున్న అనేక పెద్ద నగరాల్లోని ప్రజలు సముద్ర మట్టానికి 3,300 మీటర్లకంటే ఎక్కువ ఎత్తులో నివసిస్తున్నారు, 6,000 మీటర్ల ఎత్తున ఉన్న గనుల్లో వారు పనిచేస్తారు. అంతమంది పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నందువల్ల అక్కడి జీవితానికి శరీరం అలవాటుపడే విధానపు అధ్యయనం ప్రాముఖ్యత సంతరించుకుంది. వెల్లడైన విషయాలు మీ శరీరం యొక్క అద్భుత రూపకల్పనపట్ల మీ ప్రశంసను అధికం చేయగలవు.

ఎత్తుకు వెళ్లినప్పుడు ఏం జరుగుతుంది?

ఎత్తైన ఆండీస్‌ ప్రాంతాలకు చేరుకున్నప్పుడు డెగ్‌కు ఎలా అనిపించిందో సాధారణంగా అందరికీ అలాగే అనిపిస్తుంది. ఆయనిలా చెబుతున్నాడు: “విమానాశ్రయంలో మా సూటుకేసులు తీసుకెళుతుండగా నాకు ఉన్నట్టుండి తలతిప్పినట్లయి దాదాపు స్పృహతప్పేంత పనయ్యింది. ఆ వెంటనే నేను కోలుకున్నప్పటికీ, మొదటి ఒకటి రెండు వారాలు నేను తలనొప్పితో, నిద్రలేమితో బాధపడ్డాను. ఊపిరి ఆడనట్లయి అకస్మాత్తుగా మెలకువ వచ్చేది. ఆ తర్వాత రెండు నెలలపాటు నాకు అంతగా ఆకలి వేసేదికాదు, త్వరగా అలసిపోయేవాడిని, ఎక్కువగా నిద్రపోవలసి వచ్చేది.” కెట్టీ ఇలా చెబుతోంది: “పర్వత ప్రాంతాల సమస్యల గురించి ప్రజలు మాట్లాడేదంతా వారి ఊహ మాత్రమే అని నేననుకునేదాన్ని. అయితే అది తప్పని నాకిప్పుడు తెలిసింది.”

డెగ్‌ అనుభవించిన కలత నిద్రను డాక్టర్లు పీరియాడిక్‌ బ్రీథింగ్‌ అంటారు. కొత్తగా పర్వత ప్రాంతానికి వచ్చిన ప్రజల్లో ఇది సాధారణంగా కనబడుతుంది. ఒకవేళ మీకూ అలాగే జరిగితే అది మీలో భయాన్ని కలిగించవచ్చు. మీరు అప్పుడప్పుడు, అంటే నిద్రపోతున్నప్పుడు కొద్ది క్షణాలపాటు ఊపిరి పీల్చడం ఆపివేయవచ్చు. కొన్నిసార్లు మీకు ఊపిరి అందడం కష్టమై మీరు గభాలున మేలుకోవచ్చు.

కొంతమందికైతే పర్వత ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఎలాంటి సమస్యా ఉండదు. కొంతమందికి 2,000 మీటర్ల ఎత్తుకు వెళ్లేసరికి వారిలో వికారం మొదలవుతుంది. అలాగే ఎత్తైన ప్రదేశాలకు మొదటిసారి వస్తున్నవారిలో సగంమందిలో 3,000 మీటర్లకు చేరుకునేసరికి ఆ సూచనలు కనబడతాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, పర్వత ప్రాంత నివాసులు ఒకటి రెండు వారాలు దిగువ ప్రాంతాల్లో ఉండివస్తే, వారిలో కూడా ఇవే ప్రతిచర్యలు కనబడతాయి. ఎందుకు?

పర్వత ప్రాంతాలు మీ శరీరంపై ఎందుకు ప్రభావం చూపుతాయి

ఆక్సిజన్‌ తగినంత లేకపోవడమే అనేక సమస్యలకు కారణం. మీరు ఎంత ఎత్తుకువెళితే వాతావరణపు ఒత్తిడి అంత తక్కువగా ఉంటుంది కాబట్టి సముద్ర మట్టానికి 2,000 మీటర్ల ఎత్తులో మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్‌ 20 శాతం తక్కువగా, 4,000 మీటర్ల ఎత్తులో 40 శాతం తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్‌ లేకపోవడం మన శరీరపు పనితీరుపై అధికశాతం ప్రభావం చూపుతుంది. మీ కండరాలు తక్కువగా పని చేయవచ్చు, మీ నాడీవ్యవస్థ తక్కువ ఒత్తిడినే తట్టుకోవచ్చు, అలాగే మీ జీర్ణ వ్యవస్థ కొవ్వు పదార్ధాలను జీర్ణించుకోలేకపోవచ్చు. సాధారణంగా మీ శరీరానికి ఎక్కువ ఆక్సిజన్‌ అవసరమైనప్పుడు, మీరు అనుకోకుండానే ఊపిరి ఎక్కువగా పీల్చుకుంటూ ఆ కొరత తీరేలా చేసుకుంటారు. అలాంటప్పుడు మీరు ఎత్తైన ప్రాంతానికి వెళ్లినప్పుడు ఇలా ఎందుకు జరగదు?

శ్వాసను శరీరమెలా నియంత్రిస్తుందనేది ఒక అద్భుతం, ఆ విషయం ఇంకా పూర్తిగా అర్థంకాలేదు. అయితే మీరు అధికంగా శ్రమించేటప్పుడు, కేవలం ఆక్సిజన్‌ కొరతవల్లే ఊపిరి ఎక్కువగా పీల్చడం ఉండదు. బదులుగా, కండరాల పనివల్ల రక్తంలో పెరిగిన కార్బన్‌డయాక్సైడ్‌ మోతాదే మీరు ఎక్కువగా ఊపిరి పీల్చుకోవడానికి కీలకమన్నట్లు కనిపిస్తోంది. మీరు ఎత్తైన ప్రాంతంలో ఉన్నప్పుడు ఎక్కువగానే ఊపిరి పీలుస్తారు అయితే అది అక్కడున్న ఆక్సిజన్‌ కొరతను తీర్చడానికి సరిపోదు.

తలనొప్పికి ఏది కారణమవుతుంది? బొలీవియాలోని లాపేజ్‌లో జరిగిన హై ఆల్టిట్యూడ్‌ మెడిసిన్‌ అండ్‌ సైకాలజీ ప్రథమ ప్రపంచ సదస్సులో ఒక ప్రసంగీకుడు, పర్వత సంబంధ అస్వస్థతా సూచనల్లో అధికం మెదడులో ద్రవపదార్థం ఎక్కువ చేరినందువల్ల కలుగుతాయని వివరించాడు. కొందరిలో ఇది తలలో ఒత్తిడికి కారణమవుతుంది. వారి కపాలపు పరిమాణాన్నిబట్టి కొందరిలో ఈ లక్షణాలు కనబడవు. అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో ప్రాణాంతక పరిస్థితి ఏర్పడవచ్చు. కండరాలు పట్టు తప్పడం, కంటిచూపు మందగించడం, మతి భ్రమించడం, మానసిక విభ్రాంతి వంటి లక్షణాలు కనిపిస్తే మీరు వెంటనే వైద్య సహాయం కోసం ప్రయత్నించడంతోపాటు పల్లపు ప్రాంతాలకు వెళ్లిపోవాలి.

వివేకయుక్తమైన ముందు జాగ్రత్తలు

ఎత్తుగావున్న ప్రాంతపు ప్రభావాలు రెండు మూడు రోజుల్లో తీవ్రస్థాయికి చేరుకుంటాయి, కాబట్టి అక్కడికి వెళ్లడానికి కొన్ని రోజులు ముందు ఆ తర్వాత, ప్రత్యేకంగా రాత్రిపూట, కేవలం తేలికపాటి ఆహారం తీసుకోవటం మంచిది. అక్కడికి చేరుకున్న తర్వాత, కొవ్వు పదార్థాలు ఉండే ఆహారానికి బదులు అన్నం, ఓట్స్‌, ఆలుగడ్డలు వంటి కార్బోహైడ్రేట్లు తినాలి. పగలు సుష్టుగా భోంచేయండి, రాత్రిపూట కొద్దిగానే తినండి అనే సలహాను లక్ష్యపెట్టడం మీకు మేలుచేస్తుంది. అలాగే శారీరక శ్రమకు దూరంగా ఉండండి, ఎందుకంటే ఇది పర్వతప్రాంత అస్వస్థతను ఎక్కువ చేస్తుంది. యౌవనులు ఈ సలహాను పెడచెవినపెట్టే అవకాశం ఉన్నందున, వారే తరచూ ఎక్కువ బాధపడుతూ ఉంటారు.

ప్రమాదకరమైన సూర్య కిరణాలనుండి మిమ్మల్ని కాపాడే వాతావరణం అక్కడ తక్కువగా ఉంటుంది కాబట్టి టోపీ పెట్టుకుని, సూర్యరశ్మినుండి శరీరాన్ని కాపాడే క్రీమ్‌ రాసుకోండి అని ఇవ్వబడే సలహా పాటించడం మంచిది. ఆ కిరణాలు కళ్లకు బాధకలిగించవచ్చు లేదా హానికరం కావచ్చు, అందువల్ల మంచి చలువ కళ్లద్దాలు పెట్టుకోవడం మంచిది. పలచని పర్వత పవనాలు మీ కళ్లల్లో తేమ లేకుండా చేయడంతోపాటు కళ్ల మంటలకు కారణం కావచ్చు. కాబట్టి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

ఊబకాయులు లేదా అధిక రక్తపోటు, సికిల్‌-సెల్‌ ఎనీమియా ఉన్నవారు లేదా గుండెజబ్బు లేదా ఊపిరితిత్తుల జబ్బుగలవారు పర్వత ప్రాంతాలకు వెళ్లడానికి నిర్ణయించుకోవడానికి ముందు వైద్య సలహా తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. * మీకు అధిక జలుబు, శ్వాసకోశ సంబంధ అస్వస్థత, లేదా న్యుమోనియా ఉన్నట్లయితే మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది, ఎందుకంటే ఎత్తైన ప్రాంతం దానితోపాటు కలిగే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు లేదా తీవ్ర శారీరక శ్రమ కొన్నిసార్లు ఊపిరితిత్తుల్లో ప్రమాదకర స్థాయిలో ద్రవపదార్థాలు చేరేలా చేయగలవు. పర్వత ప్రాంతాల్లోనే నివసించేవారిలో సహితం శ్వాసకోశ సంబంధిత రుగ్మతల వల్ల ఆక్సిజన్‌ కొరత ఏర్పడి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇదిలా ఉండగా, ఎత్తైన ప్రదేశాల్లో నివసించడం ఉబ్బసరోగులకు హాయిగా ఉంటుంది. వాస్తవానికి, కొన్ని రకాలైన అస్వస్థతలతో బాధపడేవారిని చికిత్సలో భాగంగా ఎత్తైన ప్రదేశాల్లోని ఆసుపత్రులకు తీసుకెళతామని రష్యా వైద్యుల బృందమొకటి హై ఆల్టిట్యూడ్‌ మెడిసిన్‌ అండ్‌ సైకాలజీ ప్రథమ ప్రపంచ సదస్సుకు నివేదించింది.

పర్వత ప్రాంతాల్లో స్థిరపడడం

పర్వత ప్రాంతాల్లో నివసించడానికి భయపడాల్సిన పనిలేదు. నిజానికి, కాకస్‌ పర్వతాలవంటి ఎత్తైన ప్రదేశాలు కొన్ని, అసాధారణ రీతిలో ఎక్కువకాలం జీవించిన అనేకమంది స్థానికులకు పేరుగాంచాయి. కొందరు అనేక సంవత్సరాలపాటు మిగుల ఎత్తైన ప్రాంతాల్లో నివసించారు. ఆండీస్‌ పర్వతప్రాంతాల్లో నివసించే, తేజరిల్లు! పాఠకుడు ఇలా వివరిస్తున్నాడు: “నేను 13 సంవత్సరాలపాటు అగ్ని పర్వతానికి దగ్గరగా, 6,000 మీటర్ల [19,500 అడుగుల] ఎత్తులో నివసించాను, అక్కడి గనిలో పనిచేశాను. స్లెడ్జిహ్యామర్‌తో గంధకపు దిమ్మల్ని పగలగొట్టడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ, సాయంత్రాల్లో మేము ఫుట్‌బాల్‌ ఆడేవాళ్లం.” కొత్త పరిస్థితులకు అలవాటుపడగల ఎంతో అసాధారణ సామర్థ్యాలు మానవ శరీరానికి ఇవ్వబడ్డాయి, ఈ విషయంలో సృష్టికర్త జ్ఞానాన్నిబట్టి మనం ఆశ్చర్యపడక తప్పదు. ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్‌ కొరతను మీ శరీరమెలా తాళుకొంటుంది?

ఎత్తైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు మీ శరీరపు మొదటి ప్రతిస్పందన ఏమిటంటే మీ గుండె, ఊపిరితిత్తులు వేగంగా పనిచేసేటట్లు చేయడమే. అప్పుడు మీ రక్తంలోని ప్లాస్మా తగ్గిపోతుంది దానితో ఆక్సిజన్‌ మోసుకెళ్లే ఎర్ర రక్తకణాలు అధికమవుతాయి. కొద్ది సమయంలోనే, ఎక్కువ రక్తం అవసరమైన మెదడుకు అదనంగా రక్తం సరఫరా చేయబడుతుంది. కేవలం కొద్ది గంటల్లోనే, ఎముకల్లోని మూలుగ, ఆక్సిజన్‌ను మరింతగా ఆకర్షించే సామర్థ్యంగల ఎర్ర రక్త కణాల్ని అప్పటికే అధికంగా ఉత్పత్తిచేస్తూ ఉంటుంది. అంటే ఎత్తైన ప్రదేశాలకు పూర్తిగా అలవాటు పడడానికి అనేక నెలలు పట్టినప్పటికీ, కేవలం కొద్దిరోజుల్లోనే మీ గుండె కొట్టుకోవడం, ఊపిరి పీల్చుకోవడం సాధారణ స్థితికి చేరుకుంటాయని దాని భావం.

మోటారు నడపడానికి, వంటకు సంబంధించిన సమస్యలు

అయితే ఆక్సిజన్‌ కొరత ఏర్పడేది ఒక్క శరీరానికే కాదు. మీ మోటారు వాహనం కూడా మందకొడిగా మారినట్లు అనిపిస్తుంది. మీ స్థానిక మోటారు మెకానిక్‌ ఇంధన మిశ్రమాన్ని సవరించి, ఇగ్నిషన్‌ టైమింగ్‌ అడ్వాన్స్‌ చేసినప్పటికీ మీ ఇంజన్‌ పవర్‌ ఇంకా తక్కువగానే ఉంటుంది. మరి వంటగదికి ఏ సమస్య వచ్చిపడింది?

పొంగని కేకు, పొడిపొడిగా ఉండే బ్రెడ్డు, ఎంతకూ ఉడకని బీన్సు, ఉడకబెట్టినా గట్టిపడని గుడ్డు, వంటచేసే వారికి ఎదురయ్యే సమస్యల్లో కొన్ని మాత్రమే. ఎత్తైన ప్రదేశాల్లో ఇలాంటివి ఎందుకు జరుగుతాయి, ఈ విషయంలో ఏమిచేయవచ్చు?

మీరు బేకింగ్‌ చేసేటప్పుడు చాలా తరచుగా, గమనించదగిన రీతిలో, మీ వంట ప్రయత్నాలు విఫలమవుతాయి. తక్కువ స్థాయిలోవున్న గాలి వత్తిడి కేకుల్ని, బ్రెడ్డును పొంగేలాచేసే గ్యాసుల్ని సముద్ర మట్టం దగ్గర ఉండేదానికంటే ఎక్కువగా సమతలంగా వెడల్పుగా చేస్తాయి. కేకు పిండిలోవుండే చిన్నచిన్న బుడగలు పెద్దగా తయారై కేకును పొడిపొడి చేస్తాయి, లేదా అంతకంటే ఘోరంగా, ఆ బుడగలు పగిలి ఆ కేకు అట్టులాగే ఉండిపోవడానికి కారణమవుతాయి. అయితే ఆ సమస్యను పరిష్కరించడం కష్టమేమీ కాదు. గిలకొట్టిన గుడ్లవల్ల కేకు మెత్తబడిపోతుంటే, వాటిని ఎక్కువ గిలకొట్టకండి. లేదా ఆ వంటకంలో ఈస్ట్‌ లేదా బేకింగ్‌ పౌడర్‌ వంటివి కలపవలసి ఉంటే తక్కువ కలపండి. ద న్యూ హై ఆల్టిట్యూడ్‌ కుక్‌బుక్‌, ఈస్ట్‌ లేదా బేకింగ్‌ పౌడర్‌ 600 మీటర్ల ఎత్తులో 25 శాతం తక్కువగా, అదే 2,000 మీటర్ల ఎత్తులో అయితే 75 శాతం తక్కువగా కలపమని సిఫారసు చేస్తోంది.

ఈస్ట్‌ కలిపిన బ్రెడ్డు తయారుచేసేటప్పుడు, ఆ పిండి రెండింతలకంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలి. కేకుల్లో కణ నిర్మాణాన్ని గుడ్లు బలపరుస్తాయి కాబట్టి, మీ వంటకానికి తగ్గట్టు పెద్దగావున్న గుడ్లు వాడండి. అయితే చక్కెర ఎక్కువగా కలపడం కణ నిర్మాణాన్ని బలహీనం చేస్తుంది కాబట్టి చక్కెర తక్కువ వేయండి, ఎందుకంటే అల్ప గాలి పీడనం నీటిని మరింత వేగంగా ఆవిరిగా మార్చి పిండిలోని చక్కెర చిక్కబడేలా చేస్తుంది. పర్వతాలమీది పలచని, పొడి గాలులు ఆహారంలో తేమ లేకుండా చేస్తాయి కాబట్టి అనేక వంటకాల్లో నిజానికి ఎక్కువ నీరు అవసరం.

ఎత్తైన ప్రదేశాల్లో దాదాపు అన్నిరకాల వంటకాలు నెమ్మదిగా ఉడుకుతాయి. ఉదాహరణకు, ఒక గుడ్డు ఉడకడానికి 1,500 మీటర్ల ఎత్తులో మామూలుకంటే ఒక నిమిషం ఎక్కువగాను, 3,000 మీటర్ల ఎత్తులో మూడు నిమిషాలు ఎక్కువగాను అవసరమవుతుంది. ప్రెషర్‌ కుక్కర్‌ మీకు అతి ప్రాముఖ్యం. నిజానికి, ఎత్తైన ప్రదేశాల్లో ప్రెషర్‌ కుక్కర్‌ లేకుండా బీన్సు, బటానీలు ఉడకబెట్టడం సాధ్యం కాదు.

కాబట్టి పర్వత ప్రాంతాలకు వెళ్లడానికి భయపడకండి. కొద్దిసేపు ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడినా, మీ స్పంజి కేకు పాన్‌ కేకులా కనిపించినా, మీరు నడుపుతున్న కారు కుంటినడక నడిచినా, మీరు ఒక మోస్తరు మంచి ఆరోగ్యం గలవారైతే బహుశా మీ అనుభవం మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. (g04 3/8)

[అధస్సూచి]

^ చాలా ఎత్తైన ప్రాంతాల్లో ఊపిరి ఆడడాన్ని ఎక్కువచేయడానికి కొందరు వైద్యులు అసిటజొలమైడ్‌ను సిఫారసు చేస్తారు. పర్వతప్రాంత అస్వస్థతకు వేరే మందులు ప్రచారంలో ఉన్నాయి, అయితే వైద్యులందరూ వాటిని సిఫారసు చేయరు.

[14వ పేజీలోని డయాగ్రామ్‌/చిత్రాలు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ఎత్తైన పర్వతప్రాంత నగరాలు, పర్వతాలు

—⁠9,000 మీటర్లు​—⁠

నేపాల్‌ చైనాలలోని ఎవరెస్ట్‌ శిఖరం

8,850 మీటర్లు

—⁠7,500 మీటర్లు​—⁠

—⁠6,000 మీటర్లు​—⁠

టాంజానియాలోని కిలిమంజారో పర్వతం

5,895 మీటర్లు

చిలీలోని ఆకాంగ్‌కీల్‌చా

5,346 మీటర్లు

ఫ్రాన్స్‌లోని బ్లాంక్‌ పర్వతం

4,807 మీటర్లు

—⁠4,500 మీటర్లు​—⁠

బొలీవియాలోని పొటొసీ

4,180 మీటర్లు

పెరూలోని ప్యూనో

3,826 మీటర్లు

జపాన్‌లోని ఫ్యూజీ పర్వతం

3,776 మీటర్లు

బొలీవియాలోని లాపేజ్‌

3,625 మీటర్లు

—⁠3,000 మీటర్లు​—⁠

భూటాన్‌లోని ట్రెన్‌ సోజోన్‌

2,398 మీటర్లు

మెక్సికోలోని మెక్సికో నగరం

2,239 మీటర్లు

అమెరికాలోని న్యూ హ్యాంప్‌షైర్‌లోవున్న

వాషింగ్టన్‌ పర్వతం

1,917 మీటర్లు

కెన్యాలోని నైరోబీ

1,675 మీటర్లు

అమెరికాలోని కొలొరాడోలోవున్న డెన్‌వెర్‌

1,609 మీటర్లు

—⁠1,500 మీటర్లు​—⁠

—⁠సముద్ర మట్టం​—⁠

[16వ పేజీలోని చిత్రం]

బొలీవియాలోని లాపేజ్‌ 3,625 మీటర్లు

[14వ పేజీలోని చిత్రం]

దక్షిణాఫ్రికాలోని జొహన్నస్‌బర్గ్‌ 1,750 మీటర్లు