ప్రపంచ పరిశీలన
ప్రపంచ పరిశీలన
కోతి చేష్టలు
లెక్కలేనన్ని కోతుల్ని, లెక్కలేనన్ని టైపురైటర్లపై టైపు చేయనిస్తే చివరకవి షేక్స్పియర్ గ్రంథాలన్నింటిని టైపు చేసేస్తాయని కొందరు సిద్ధాంతీకరించారు. దానిని దృష్టిలో పెట్టుకొని, ఇంగ్లాండ్‌లోని ప్లేమౌత్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆరు కోతులకు ఒక నెలపాటు ఒక కంప్యూటర్ ఇచ్చారు. ఆ కోతులు “ఒక్కమాట కూడా టైపు చేయలేకపోయాయి” అని ద న్యూయార్క్ టైమ్స్ నివేదిస్తోంది. నైరృతి ఇంగ్లాండ్‌లోని పేంటన్ జంతు ప్రదర్శనశాలలోని ఆ ఆరు కోతులు ఎక్కువగా s అనే అక్షరంతో నిండిన “ఐదు పేజీలు మాత్రమే టైపు చేయగలిగాయి.” ఆ డాక్యుమెంటు చివర్లో ఆ కోతులు కొన్ని jలు, aలు, lలు, mలు టైపు చేశాయి. అంతేకాదు అవి కీబోర్డును తమ టాయిలెట్‌గా ఉపయోగించుకున్నాయి. (g04 1/22)
గుడ్లనుండి పాము విషసంహారిణి
“పాము కాటు చికిత్సకు పనికొచ్చే పరమాణు సముదాయానికి కోడిగుడ్లు మూలాధారం కాగలవని భారత శాస్త్రజ్ఞులు కనుగొన్నారు” అని ద టైమ్స్ ఆఫ్ ఇండియా చెబుతోంది. దాదాపు 12 వారాల వయసున్న కోడిపిల్లలకు “ప్రాణాంతకం కాని విషపు ఇంజక్షన్” ఇచ్చి ఆ తర్వాత రెండు మూడు వారాలకు బూస్టర్ ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ పిమ్మట 21 వారాలకు అవి విషసంహారక ప్రతిరక్షకాలున్న గుడ్లు పెట్టడం మొదలుపెడతాయి. “బాధాకరమైన పరీక్షలు జరిపి గుర్రాల నుండి సేకరించే పాము విషసంహారక మందు” స్థానాన్ని గుడ్లనుండి లభించే విషసంహారకం ఆక్రమించవచ్చునని పరిశోధకులు ఆశిస్తున్నారు అని ద టైమ్స్ చెబుతోంది. జంతు పరీక్షల్లో ఈ కొత్త సాంకేతికత్వంలో ఇప్పటికే విజయం సాధించామని ఆస్ట్రేలియాలోని శాస్త్రజ్ఞులు చెప్పుకొంటున్నారు. గుడ్లనుండి లభించే విషసంహారకం మానవులపై మంచి ప్రభావం చూపిస్తోందని రుజువైతే, భారత దేశానికి అది వరప్రసాదమే అవుతుంది ఎందుకంటే నివేదికల ప్రకారం భారతదేశంలో ప్రతీ సంవత్సరం 3,00,000 మంది పాముకాటుకు గురవుతున్నారు. వీరిలో 10 శాతంమంది చనిపోతున్నారు. (g04 1/8)
సుదూర ఫోన్‌కాల్ సేవలు
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నివసించే ఒక స్త్రీ స్థానిక కస్టమర్ సర్వీస్ నంబరుకు ఫోన్ చేస్తుంది. అవతల నుండి బదులుపలికే అమ్మాయి తన అసలు పేరు మేఘన అయినా తననుతాను మిషెల్‌గా పరిచయం చేసుకుంటుంది, ఆమె ఉన్నది ఇండియాలో, అప్పుడు సమయం అర్థరాత్రి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఎటి&టి, బ్రిటిష్ ఎయిర్వేస్, సిటీ బ్యాంక్, జనరల్ ఎలక్ట్రిక్ వంటి విదేశీ కంపెనీల కోసం అనేక “సుదూర కార్యాలయ” వ్యవహారాలు నిర్వహించేందుకు ఇండియాలోని కాల్‌సెంటర్లు 1,00,000కు పైగా ఉద్యోగులను నియమిస్తున్నాయి. ఈ పనిని ఇండియాకు తరలించడానికి ఇక్కడ అంతర్జాతీయ ఫోన్ రేట్లు తక్కువగా ఉండడంతోపాటు, ఇంగ్లీషు మాట్లాడే విద్యాధికులు ఎక్కువగా ఉండడం, పైగా “పాశ్చాత్య దేశాల్లో అలాంటి పనివారికంటే వీరి జీతం 80 శాతం తక్కువగా ఉండడం” కారణమవుతోంది అని ఇండియా టుడే పత్రిక నివేదిస్తోంది. సాధ్యమైనంత వరకు అమెరికన్లా మాట్లాడేందుకు మేఘనవంటి ఆపరేటర్లు అనేక నెలల శిక్షణ తీసుకోవడమే కాకుండా “అమెరికన్ల అనేక రీతుల ఉచ్ఛారణను అర్థం చేసుకోవడానికి హాలీవుడ్ చిత్రాలు కూడా అనేకం చూస్తుంటారు.” ఫిలడెల్ఫియాలో ఉన్న వాతావరణం గురించి మాట్లాడేందుకు మేఘన కంప్యూటర్ అక్కడి వాతావరణమెలా ఉందోకూడా ఆమెకు సూచిస్తుంది. అలా ఆమె “హేవ్ ఎ గుడ్ డే” అని అంటూ తన సంభాషణ ముగిస్తుంది. (g03 12/22)
కొట్టుమిట్టాడుతున్న రైతులు
ఒక నివేదిక ప్రకారం, “దాదాపు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులను గణనీయంగా పెంచిన హరిత విప్లవం, ఆఫ్రికాలో ఉన్న, ప్రపంచంలోని పేద రైతుల్లో లక్షలాదిమందిని మరింత పేద వారిని చేసింది” అని న్యూ సైంటిస్ట్ పత్రిక చెబుతోంది. అదెలా సాధ్యం? పెరుగుతున్న ప్రపంచ జనాభా వల్ల రాగల ఆహార కొరతను తట్టుకోవడానికి 1950వ దశాబ్దం చివర్లో అధిక దిగుబడి తీసుకొచ్చే గోధుమ, వరి వంగడాలు పరిచయం చేయబడ్డాయి. అయితే ఈ రకాలు తెచ్చిన అధిక దిగుబడి ధరలు పడిపోవడానికి కారణమయింది. “ఈ కొత్త రకాలు కొని విత్తగలిగిన రైతులు తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడి పొందగా, వాటిని కొనలేని వారు నష్టాల పాలయ్యారు” అని న్యూ సైంటిస్ట్ చెబుతోంది. దానికితోడు, ఈ కొత్త రకాలు ఆఫ్రికా పరిస్థితులకు తగ్గట్టులేవు ఎందుకంటే ఆ వంగడాలు ఆసియా, లాటిన్ అమెరికాల్లోని వ్యవసాయం కోసం వృద్ధిచేయబడ్డాయి. (g04 1/22)
కరుగుతున్న హిమఖండాలు
ఆలస్యమైన వర్షాల కారణంగా ఇండియాలోని పంజాబ్లోవున్న జలాశయాల్లో నీటి పరిమాణాలు తగ్గిపోగా, సట్లెజ్ నదిపై నిర్మించిన భాక్రా ఆనకట్టవద్ద నీటి పరిమాణం గత సంవత్సరపు స్థాయి కంటే రెండింతలు పెరిగింది. ఎందుకు? ఎందుకంటే సట్లెజ్ ముఖ్య ఉపనది 89 హిమఖండాలున్న ప్రాంతంగుండా ప్రవహిస్తుంది అని డౌన్ టు ఎర్త్ అనే పత్రిక చెబుతోంది. “వర్షాభావం హిమఖండాలు కరగడానికి కారణమవుతోంది. మేఘాలులేని కారణంగా ఆ హిమఖండాలపై సూటిగా ప్రసరించే సూర్యరశ్మి మరింత తీవ్రంగా ఉంటోంది. దీనితోపాటు, అధిక ఉష్ణోగ్రత అవి వేగంగా కరగడానికి కారణమవుతోంది” అని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన హిమఖండాల నిపుణుడైన సయ్యద్ ఇక్బాల్ హస్నేన్ వివరిస్తున్నారు. ఇలా కరగడం హిమసరస్సులు పొంగిపొర్లడానికి కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, చిన్న హిమఖండాలవల్ల భవిష్యత్ నీటి సరఫరా తగ్గిపోవడమే కాకుండా అది శక్తి ఉత్పాదనపై, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. (g04 1/22)
సబ్బు ప్రాణాలు కాపాడుతుంది
లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్న వాల్ కురిటీస్ అభిప్రాయం ప్రకారం కేవలం సబ్బుతో చేతులు కడుక్కోవడం ప్రతీ సంవత్సరం పదిలక్షల మంది ప్రాణాలు కాపాడగలదు, ఎందుకంటే అది అతిసార సంబంధ వ్యాధులు సోకకుండా ప్రజలకు సహాయం చేస్తుంది. జపాన్‌లోని కోటోలో జరిగిన మూడవ ప్రపంచ నీటి సదస్సులో మానవ మలంలోని వ్యాధికారక సూక్ష్మజీవులను “ఒకటవ రకపు ప్రజా శత్రువు” అని అభివర్ణించినట్లు ద డైలీ యొమ్యూరీ నివేదిస్తోంది. “కొన్ని సమాజాల్లో స్త్రీలు తమ పసిపిల్లలు మలవిసర్జన చేశాక వాళ్ళను కడిగిన తర్వాత, తమ చేతులు కడుక్కోకుండానే వంట చేయడం” సర్వసాధారణమని ఆ పత్రిక పేర్కొంది. సబ్బుతో, నీళ్లతో చేతులు కడుక్కోవడం ప్రాణాంతక వైరస్లు, బ్యాక్టీరియా వ్యాపించకుండా అరికడుతుంది. కురిటీస్ అభిప్రాయం ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అతిసార సంబంధ వ్యాధులను అరికట్టడానికి నీటిని శుభ్రంచేయడానికయ్యే ఖర్చుతో పోలిస్తే, సబ్బుతో చేతులు కడుక్కోవడానికి అందులో మూడవవంతు మాత్రమే ఖర్చవుతుంది. (g04 2/22)
లాటిన్ భాషను సజీవంగా ఉంచడం
లాటిన్ భాషను చాలామంది మృత భాషగా పరిగణిస్తున్నప్పటికీ, వాటికన్ దానిని సజీవంగా, తాజాగా ఉంచడానికి తంటాలుపడుతోంది. ఎందుకు? ఎందుకంటే, వాటికన్ వ్యవహార భాష ఇటాలియన్ అయినప్పటికీ, లాటిన్ భాషను దాని అధికార భాషే కాకుండా అది పోపు వ్రాసే ఉత్తరాల్లో మరియు ఇతర దస్తావేజుల్లో ఇంకా ఉపయోగించబడుతూనే ఉంది. మాస్‌ను (తుదిభోజన ప్రార్థనలను) స్థానిక భాషల్లో నిర్వహించవచ్చనే శాసనం 1970వ దశకంలో వచ్చిన తర్వాత లాటిన్ భాషా వాడుక తీవ్రంగాకుంటుపడింది. అప్పుడే పోప్ పాల్ VI ఆ భాషను సజీవంగా ఉంచేందుకు లాటిన్ ఫౌండేషన్ నెలకొల్పాడు. ఆ మేరకు రెండు సంపుటల్లో లాటిన్-ఇటాలియన్ నిఘంటువు ప్రచురించడానికి చర్య తీసుకోబడింది, మరియు ఆ సంపుటలు పూర్తిగా అమ్ముడుపోయాయి. ఇప్పుడు కొత్తగా ఆ రెంటినీ కలిపి ఒకే సంపుటగా ప్రచురించి అమ్మకానికి పెట్టారు, దాని ఖరీదు 115 అమెరికా డాలర్లు. దానిలో “ఎస్కారియోరమ్ లావెటర్” (డిష్వాషర్) వంటి ఆధునిక లాటిన్ భాషాపదాలు దాదాపు 15,000 ఉన్నాయి. మరో కొత్త సంపుటి “రెండు మూడు సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తుందనే ఆశాభావం ఉంది” అని ద న్యూయార్క్ టైమ్స్ చెబుతోంది. అందులో చేర్చే అనేక పదాలు “కంప్యూటర్ మరియు సమాచార క్షేత్రాలనుండి” సేకరించబడినవై ఉంటాయి. (g04 2/22)