పాలచక్కెర పడకపోవడాన్ని అర్థంచేసుకోవడం
పాలచక్కెర పడకపోవడాన్ని అర్థంచేసుకోవడం
మీరు మీకిష్టమైన ఐస్‌క్రీమ్ లేదా ఛీస్ తినడం పూర్తయి గంట గడిచిందో లేదో, కడుపు గడబిడతో గ్యాస్ పోవడం మొదలైంది. ఈసారి కూడా, ఉపశమనం పొందడానికి అప్పటికే మీ దగ్గరున్న మందు నోట్లో వేసుకున్నారు. అయితే ‘నా కడుపు ఇంత సున్నితంగా ఉందేమిటి?’ అనే సందేహం మీకిప్పుడు కలుగుతుంది.
మీరు పాలు త్రాగిన తర్వాత లేదా పాల ఉత్పత్తులు తిన్న తర్వాత వికారము, తిమ్మిర్లు, కడుపు ఉబ్బడం, గ్యాస్ లేదా అతిసారం వంటివాటితో బాధపడుతుంటే మీకు పాలచక్కెర పడకపోవడం (లాక్టోస్ ఇన్‌టాలరెన్సు) అనే సమస్య ఉండవచ్చు. పాల ఉత్పత్తుల ప్రతిచర్యలో పాలచక్కెర పడకపోవడం సర్వసాధారణం. “మూడు నుండి ఐదుకోట్ల మంది అమెరికన్లు పాలచక్కెర పడకపోవడంతో బాధపడుతున్నారు” అని ద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ నివేదిస్తోంది. హార్వార్డ్ మెడికల్ స్కూల్ ప్రచురించిన ద సెన్సిటివ్ గట్ పుస్తకం ప్రకారం, “ప్రపంచ జనాభాలో దాదాపు 70 శాతం మందికి పాలచక్కెరతో ఎంతోకొంత సమస్య ఉంది” అని అంచనా వేయబడింది. కాబట్టి, ఈ పాలచక్కెర పడకపోవడం అంటే ఏమిటి?
పాలల్లో ఈ పాలచక్కెర ఉంటుంది. చిన్నప్రేవు లాక్టేస్ అనే సేంద్రియ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. దాని పని ఏమిటంటే ఈ పాలచక్కెరను గ్లూకోజ్, గాలక్టోస్ అని పిలువబడే
రెండు సరళ చక్కెర పదార్థాలుగా విడగొట్టడమే. ఈ ప్రక్రియవల్ల రక్తంలో గ్లూకోజ్ కలుస్తుంది. ఈ పని చేయడానికి సరిపడేంత లాక్టేస్ లభ్యం కానప్పుడు, విడగొట్టబడని ఆ పాలచక్కెర పెద్దప్రేవులోనికి ప్రవేశించి పులియడం మొదలుపెట్టి ఆమ్లాలను, గ్యాస్‌ను ఉత్పత్తిచేస్తుంది.పాలచక్కెర పడకపోవడం అని పిలువబడే ఈ పరిస్థితే పైన పేర్కొనబడిన లక్షణాల్లో కొన్నింటిని లేదా అన్నింటిని కలుగజేస్తుంది. జీవితపు మొదటి రెండు సంవత్సరాల్లో ఈ పాలచక్కెర ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తియై ఆ తర్వాత క్రమంగా దాని ఉత్పత్తి తగ్గుముఖం పడుతుంది. అందువల్ల, చాలామందిలో ఈ పరిస్థితి ఏర్పడవచ్చు, దానిని వారు గుర్తించకపోవచ్చు.
అది ఎలర్జీయా?
పాల ఉత్పత్తులు సేవించిన తర్వాత వాటి ప్రతిచర్యలవల్ల బాధపడుతున్న కారణంగా తమకు పాలవల్ల ఎలర్జీ ఉందని కొందరు భావిస్తారు. కాబట్టి అదేమిటి, ఎలర్జీయా * లేక పడకపోవడమా? కొంతమంది ఎలర్జీ నిపుణుల ప్రకారం, నిజమైన ఆహార ఎలర్జీలు చాలా అరుదు, వాటికి కేవలం 1 నుండి 2 శాతం జనాభా మాత్రమే ప్రభావితులవుతున్నారు. పిల్లల్లో ఈ పరిమాణం ఎక్కువగా ఉంది, అయితే ఇది 8 శాతంకంటే తక్కువగానే ఉంది. ఎలర్జీకి, పాలచక్కెర పడకపోవడానికి సంబంధించిన లక్షణాలు ఒకేలా ఉండే అవకాశమున్నా, భేదాలు కూడా ఉన్నాయి.
భుజించిన పదార్థంవల్ల లేదా త్రాగిన ద్రవపదార్థంవల్ల కలిగే పరిణామాలకు విరుద్ధంగా, హిస్టామైన్ ఉత్పత్తికావడంవల్ల అంటే రోగనిరోధక వ్యవస్థ చేసే పోరాటం వల్ల ఆహారపు ఎలర్జీ లక్షణాలు ఏర్పడతాయి. అలాంటి కొన్ని లక్షణాల్లో పెదవులు లేదా నాలుక వాపు, దద్దుర్లు (రాష్), లేదా ఉబ్బసం వంటివి ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ ప్రమేయం లేదు కాబట్టి పాలచక్కెర పడకపోవడం ఈ లక్షణాలను కలిగించదు. పాలచక్కెర పడకపోవడంలో ఆహారాన్ని సరిగా జీర్ణంచేసుకునే సామర్థ్యం లేకపోవడంవల్ల ప్రతిచర్య ఏర్పడుతుంది.
ఈ భేదాన్ని గ్రహించడానికి మీకేది సహాయం చేస్తుంది? దానికి ద సెన్సిటివ్ గట్ ఇలా జవాబిస్తోంది: “పడని ఆహారం
తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే . . . సిసలైన ఎలర్జీ ప్రతిచర్యలు సంభవిస్తాయి. ఒక గంటకంటే ఎక్కువ సమయం తర్వాత కనబడే లక్షణాలు ఎక్కువగా పడకపోవడాన్నే సూచిస్తాయి.”పసిపిల్లలపై దాని ప్రభావం
ఒక పసిపాప లేదా చిన్నపిల్లవాడు పాలు త్రాగిన వెంటనే ప్రతిచర్యతో బాధపడితే, అది ఆ పిల్లవానికీ అలాగే తల్లిదండ్రులకూ ఆందోళన కలిగించవచ్చు. పిల్లవానికి విరేచనాలు పట్టుకుంటే, నిర్జలీకరణ ఏర్పడవచ్చు. అలాంటప్పుడు తల్లిదండ్రులు పిల్లల వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. అది పడకపోవడమని రోగనిర్ధారణ జరిగినప్పుడు, కొందరు వైద్యులు పాలకు బదులు ప్రత్యామ్నాయంగా మరేదైనా ఇవ్వాలని సిఫారసు చేశారు. దానివల్ల చాలామంది బాధాకరమైన లక్షణాలనుండి విముక్తులయ్యారు.
ఎలర్జీ విషయానికొస్తే ఇంకా ఎక్కువ చింత ఉంటుంది. కొంతమంది డాక్టర్లు ఆంటీహిస్టమైన్ ఇస్తారు. కానీ ఊపిరి ఆడనప్పుడు, ఆ పరిస్థితి తొలగించడానికి డాక్టరు అంతకంటే ఎక్కువే చేయాల్సి ఉంటుంది. చాలా అరుదుగా, అనాఫిలాక్సిస్ అని పిలువబడే ప్రాణాంతక పరిస్థితి ఏర్పడవచ్చు.
పసిపిల్లవాడు వాంతులు చేసుకోవడం మొదలుపెడితే, చింత కలిగించే మరో విషయం ఏమిటంటే గాలక్టోసీమియా అని పిలువబడే అరుదైన పరిస్థితి. ముందు పేర్కొన్నట్లుగా, లాక్టేస్ ద్వారా గాలక్టోస్ విడగొట్టబడుతుంది, అయితే ఈ గాలక్టోస్ గ్లూకోజ్‌గా మార్చబడాలి. గాలక్టోస్ పేరుకుపోవడంవల్ల కాలేయం తీవ్రంగా దెబ్బతినడం, మూత్రపిండాల వైకల్యం, బుద్ధిమాంద్యత, హైపోగ్లిసీమియా, కంట్లో శుక్లాలు సైతం ఏర్పడవచ్చు. కాబట్టి, పసిపిల్లల ఆహారం నుండి సత్వరమే పాల ఉత్పత్తులు పూర్తిగా తొలగించడం ఆవశ్యకం.
పాలచక్కెర పడకపోవడం ఎంత ప్రమాదకరం?
ఒక యౌవనురాలు గ్యాస్ మరియు కడుపు పట్టేయడంవంటి తీవ్ర లక్షణాలతో బాధపడుతూ వచ్చింది. ఆమె పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందంటే ఆమె వెంటనే వైద్యచికిత్స తీసుకోవాల్సివచ్చింది. వరుసగా అనేక వైద్య పరీక్షల తర్వాత, ఆమెకు ఇన్‌ఫ్లమేటరీ బొవెల్ డిసీజ్ (IBD) * ఉన్నట్లు నిర్ధారించబడింది. ఈ వ్యాధిని నియంత్రించడానికి, వైద్య చికిత్స సిఫారసు చేయబడింది. అయితే ఆమె ప్రతీరోజు పాల ఉత్పత్తులు తీసుకునే తన అలవాటు మానుకోని కారణంగా, ఆ లక్షణాలు అలాగే ఉండిపోయాయి. వ్యక్తిగత పరిశోధన తర్వాత, తన ఆహారమే దానికి అసలు కారణమని గ్రహించి, ఒక పద్ధతిచొప్పున ఆయా ఆహార పదార్ధాలకు దూరంగా ఉండడం మొదలుపెట్టింది. చివరికామె పాల ఉత్పత్తులను పూర్తిగా మానేయడంతో, ఆ లక్షణాలు అదృశ్యం కావడం ఆరంభమయ్యాయి! ఒక్క సంవత్సరంలోనే అంటే మరిన్ని వైద్య పరీక్షల తర్వాత ఆమెకు IBD లేదని ఆమె డాక్టరు చెప్పాడు. ఆమెకు పాలచక్కెర పడడంలేదు. ఆమె ఎంత ఉపశమనం పొంది ఉంటుందో మీరు ఊహించవచ్చు!
మానవ శరీరంలో లాక్టేస్ ఉత్పత్తిని అధికం చేయగల చికిత్సేదీ ప్రస్తుతం అందుబాటులో లేదు. అయితే పాలచక్కెర పడకపోవడం ప్రాణాంతకమని నిర్ధారించబడలేదు. అందువల్ల పాలచక్కెర పడకపోవడానికి సంబంధించిన లక్షణాలను మీరెలా తాళుకోవచ్చు?
కొంతమంది తామెంతవరకు పాల ఉత్పత్తులను సహించగలమనేది వివిధ ప్రయత్నాల ద్వారా తెలుసుకున్నారు. తీసుకునే పాల ఉత్పత్తుల పరిమాణం, దానికి మీ శరీరపు ప్రతిచర్యను గమనించడం ద్వారా మీరెంతవరకు జీర్ణించుకోగలరో, లేదో తీర్మానించుకోవచ్చు.
కొందరైతే పాల ఉత్పత్తులను పూర్తిగా మానేయడానికి నిశ్చయించుకున్నారు. వ్యక్తిగత పరిశోధన ద్వారా లేదా డైటీషియన్‌ను సంప్రదించడం ద్వారా కొందరు తమ కాల్షియం అవసరం తీర్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కనుగొన్నారు. కొన్నిరకాల ఆకుకూరల్లో, కొన్నిరకాల చేపల్లో, గింజల్లో కాల్షియం అధికంగా ఉంటుంది.
పాల ఉత్పత్తుల ఆస్వాదన కొనసాగించాలని కోరుకునే వారికి సహాయంచేసే బిళ్లలు లేదా ద్రవపదార్థాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిలోవుండే లాక్టేస్ పాలచక్కెరను విడగొట్టడానికి ప్రేవులకు సహాయపడుతుంది. ఇవి తీసుకోవడం, పాలచక్కెర పడకపోవడమనే లక్షణాలకు ఒక వ్యక్తి దూరంగా ఉండడానికి సహాయం చేస్తుంది.
నేటి లోకంలో, ఒక వ్యక్తికి తన ఆరోగ్యం కాపాడుకోవడం ఒక సవాలే. అయితే వైద్య పరిశోధన మూలంగా, తేరుకునేందుకు మన శరీరానికున్న సామర్థ్యం మూలంగా మనం, ‘నాకు దేహములో బాగులేదని అందులో నివసించే’ ఏ వ్యక్తీ చెప్పని కాలం వచ్చేవరకు తాళుకోగలుగుతున్నాం.—యెషయా 33:24; కీర్తన 139:14. (g04 3/22)
[అధస్సూచీలు]
^ అతిసంవేదనాశీలత (హైపర్‌సెన్సిటివిటి) అని కూడా పిలువబడుతోంది.
^ ఈ IBD రెండురకాలు, ఒకటి క్రోన్స్ డిసీజ్ రెండోది అల్సరెటివ్ కొలిటిస్. ఈ ప్రమాదకర వ్యాధులు ప్రేవుల్లో కొంతభాగం తొలగించడానికి కారణం కావచ్చు. IBD మూలంగా ఏర్పడిన జటిలస్థితి ప్రాణాంతకం కావచ్చు.
[28వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
వీటిల్లో కూడా పాలచక్కెర ఉండవచ్చు:
◼ బ్రెడ్, బ్రెడ్ ఉత్పత్తులు
◼ కేక్స్, కుక్కీస్
◼ క్యాండీస్
◼ ఇన్స్‌టంట్ పొటాటోస్
◼ మార్గరీన్
◼ అనేక ప్రిస్క్రిప్షన్ మందులు
◼ సొంతగా కొనుక్కునే మందులు
◼ పాన్‌కేకుల, బిస్కట్ల, కుక్కీల మిశ్రమాలు
◼ ప్రాసెస్డ్ అల్పాహార తృణధాన్యాలు
◼ సలాడ్‌తో కలుపుకునే పదార్థాలు
◼ లంచ్ మీట్స్
◼ సూప్స్