అందరికీ మంచి ఆరోగ్యం—సాధించగల లక్ష్యమేనా?
అందరికీ మంచి ఆరోగ్యం—సాధించగల లక్ష్యమేనా?
మీరూ మీ కుటుంబం చక్కగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారా? నిస్సందేహంగా మీరలా కోరుకుంటారు. కానీ మనలో చాలామందికి అప్పుడప్పుడు చిన్న చిన్న అస్వస్థతలు మాత్రమే కలుగుతున్నా, లక్షలాదిమంది ప్రజలు బాధాకరమైన వ్యాధులతో జీవితాంతం బాధపడుతుంటారు.
అయితే, అనారోగ్యాన్ని వ్యాధులను అరికట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విషయమే తీసుకోండి. 1978లో WHO ఏర్పాటు చేసిన ఒక సదస్సులో 134 దేశాల నుండి, 67 ఐక్యరాజ్య సమితి అంతర్గత సంస్థల నుండి వచ్చిన ప్రతినిధులు ఆరోగ్యం అంటే కేవలం అనారోగ్యం నుండి విముక్తి మాత్రమే కాదని అంగీకరించారు. ఆరోగ్యం అంటే “పూర్తి శారీరక మానసిక సాంఘిక సంక్షేమం” అని వారు ఉద్ఘాటించారు. ఆ తర్వాత వారు ఆరోగ్యం “మానవుల ప్రాథమిక హక్కు” అని ఉద్ఘాటించడమనే సాహసోపేతమైన చర్యను తీసుకున్నారు! ఆ విధంగా WHO, “ఆమోదయోగ్య స్థాయిలో ప్రపంచ ప్రజలందరికీ ఆరోగ్యం” సాధించాలన్న లక్ష్యం పెట్టుకుంది.
అలాంటి లక్ష్యం చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఉదాత్తంగా ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. కానీ దాన్ని అసలు సాధించే అవకాశాలెన్ని ఉన్నట్లు? మానవుడు వివిధ రంగాల్లో సల్పిన సమష్టి కృషి అంతటిలో వైద్య రంగంలో చేసిన కృషి అత్యంత నమ్మతగ్గదిగా అత్యద్భుతమైనదిగా కనిపిస్తుంది. ది యూరోపియన్ అనే ఒక బ్రిటీషు పత్రిక ప్రకారం పాశ్చాత్య దేశాల్లోని ప్రజలు “మాయ గుళిక” వైద్యానికి అలవాటు పడిపోయారు. “వారి దృష్టిలో: ఒక్క సమస్యకి ఒక్క గుళిక అన్నట్లుగా ఉంది.” మరో మాటలో చెప్పాలంటే ప్రతి అనారోగ్యానికీ వైద్య రంగం ఒక సులభమైన సూటి చికిత్సను అందించాలని కోరుకుంటాము. వైద్య వృత్తి నిజంగానే అలాంటి పెద్ద కోరికలను తీర్చగలదా?(g01 6/8)