కూరగాయలు తినండి!
కూరగాయలు తినండి!
బ్రెజిల్‌లోని తేజరిల్లు! రచయిత
“చేదుగా ఉంటాయి.” “వాటి రుచి అస్సలు బావుండదు.” “నేను వాటినెన్నడూ తినలేదు.”
అనేకులు కూరగాయలు తినడానికి ఇష్టపడకపోవడానికి గల కారణాల్లో పైవి కొన్ని మాత్రమే. మీ విషయం ఏమిటి? మీరు ప్రతిరోజూ కూరగాయలు తింటారా? కూరగాయలు తినడానికి కొందరు ఎందుకు ఇష్టపడతారు, కొందరు ఎందుకు ఇష్టపడరన్నది తెలుసుకోవడానికి తేజరిల్లు! ఇంటర్వ్యూలు చేసింది.
కూరగాయలు, పండ్లు తినవలసిన ప్రాముఖ్యతను గురించి తమ తల్లిదండ్రులు తమకు బోధించారని కూరగాయలు తినేవారు చెప్పారు. అయితే, కూరగాయలు తినడం ఇష్టం లేనివారికి కూరగాయలను తినే అలవాటు చిన్నప్పటి నుండే లేదు. వాళ్ళు ఎక్కువగా చిరుతిండినే ఇష్టపడేవారు. అయితే, వాళ్ళు కూడా, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, కూరగాయలు చాలా ప్రాముఖ్యమైనవన్న విషయాన్ని ఒప్పుకుంటున్నారు.
తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కూరగాయలను తినడం నేర్పండి! ఎలా నేర్పించాలి? ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి ప్రచురించిన ఫ్యాక్ట్స్ ఫర్ లైఫ్ అనే పుస్తకం, దాదాపు ఆరునెలల పసిపిల్లలకు, తల్లిపాలు లేదా సీసా పాలు ఇచ్చిన తర్వాత, కనీసం రోజుకొక్కసారైనా ఉడకబెట్టి తొక్కు తీసి గుజ్జులా చేసిన కూరగాయలను ఇవ్వాలని సూచిస్తుంది. బిడ్డకు ఎన్ని రకాల ఆహార పదార్థాలను తినిపిస్తే అంత మంచిది. బిడ్డకు మొదటి రెండు సంవత్సరాలు పాలు చాలా ప్రాముఖ్యమైన ఆహారమైనప్పటికీ, ఇతర ఆహార పదార్థాలను రుచి చూపించడం, “బిడ్డ కొత్త రుచులను కనుగొనేందుకు ప్రోత్సహిస్తుంది” అని బ్రెజిల్‌కి చెందిన పిల్లల నిపుణుడైన డా. వాగ్నర్ లాపాటే అంటున్నారు.
ఆరు నెలలు రాకముందే, బిడ్డకు కొంత బత్తాయి రసాన్నీ అరటిపండు, ఆపిల్, బొప్పాయి మొదలైన పండ్లనూ ఉడకబెట్టి చేసిన గుజ్జునూ సీరియల్‌నూ కూరగాయల సూప్నూ ఇవ్వనారంభించవచ్చు అని మెడీసీన—మీటూస్ ఈ వెర్దాదీస్ (మందులు—కల్పితాలూ, సత్యాలూ) అనే పుస్తకంలో కార్ల లియోనల్ సూచిస్తున్నారు. నిజమే, ఈ విషయంలో ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కో విధంగా ఉంటాయి కనుక, మీ పిల్లల డాక్టర్ని సంప్రదించడం వివేకవంతమైన పని.
(g01 1/8)