కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చరిత్రను తెలుసుకుందాం

అల్హాజెన్‌

అల్హాజెన్‌

మీరు బహుశా అబూ ఆలీ అల్‌-హసన్‌ ఇబ్న్‌ అల్‌-హేథమ్‌ గురించి విని ఉండకపోవచ్చు. పశ్చిమ దేశాల్లో ఆయన్ని అల్హాజెన్‌ అని పిలుస్తారు. అల్‌-హసన్‌ అనే అతని అరబిక్‌ పేరుకి లాటిన్‌ భాష రూపాంతరం అల్హాజెన్‌. చెప్పాలంటే చాలావరకు మీరు ఆయన చేసిన పనుల నుండి ప్రయోజనం పొందుతున్నారు. “సైన్స్‌ చరిత్రలో ఎంతో ముఖ్యమైన, పలుకుబడి ఉన్న వాళ్లలో ఒకరిగా” ఆయన గురించి చెప్తారు.

అల్హాజెన్‌ దాదాపు క్రీస్తు శకం 965⁠లో బాస్రాలో పుట్టాడు. ఆ ప్రాంతం ఇప్పుడు ఇరాక్‌లో ఉంది. ఆయనకు ఖగోళశాస్త్రం, రసాయన శాస్త్రం, గణితశాస్త్రం, మెడిసిన్‌, మ్యూజిక్‌, ఆప్టిక్స్‌, ఫిజిక్స్‌, పోయట్రీ అంటే ఇష్టం. వీటిలో ముఖ్యంగా ఏ విషయంలో మనం ఆయనకు కృతజ్ఞులై ఉండవచ్చు?

నైలు నది మీద ఆనకట్ట

అల్హాజెన్‌ గురించి ఒక కథ చాలాకాలం ప్రచారంలో ఉంది. నైలు నది నీటిని అదుపు చేయాలనే ఆయన ప్లాన్‌ గురించి ఈ కథ చెప్తుంటారు. 1902⁠లో అస్వాన్‌లో డామ్‌ నిర్మాణం మొదలవ్వడానికి 1000 సంవత్సరాల ముందే ఆయనకు ఆ ప్లాన్‌ ఉండేది.

ఆ కథ ప్రకారం అల్హాజెన్‌ ఐగుప్తులో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వచ్చే వరదల్ని, కరువుల్ని తగ్గించడానికి నైలు నది మీద డామ్‌ కట్టాలని పెద్ద పెద్ద ప్లాన్లే వేసుకున్నాడు. కైరో పరిపాలకుడు కలీఫ్‌ అల్‌-హకీమ్‌ ఆ ప్లాన్‌ గురించి వినగానే డామ్‌ను కట్టడానికి అల్హాజెన్‌ను ఐగుప్తుకు పిలిపించాడు. కానీ అల్హాజెన్‌ ఆ నదిని తన సొంత కళ్లతో చూసినప్పుడు ఆ పని అతనికి చాలా కష్టం అని అర్థమైపోయింది. కానీ మూర్ఖుడు, నిలకడ లేని ఆ పరిపాలకుడు తనను శిక్షిస్తాడని భయపడి, అల్హాజెన్‌ ప్రాణాన్ని కాపాడుకోవడానికి పిచ్చివాడిలా నటించాడు. 1021⁠లో కలీఫ్‌ చనిపోయే వరకు 11 సంవత్సరాలు అలానే పిచ్చివాడిలా నటించాడు. పిచ్చివాడిగా నటిస్తూ బయట తిరగలేని పరిస్థితిలో ఉన్నా తనకు ఆసక్తి ఉన్న విషయాల గురించి బాగా పరిశోధన చేయడానికి అల్హాజెన్‌కు చాలా తీరిక సమయం దొరికింది.

బుక్‌ ఆఫ్‌ ఆప్టిక్స్‌ పుస్తకం

ఆయన విడుదల అయ్యే సమయానికి అల్హాజెన్‌ ఏడు సంపుటిలుగా ఉన్న తన బుక్‌ ఆఫ్‌ ఆప్టిక్స్‌ని దాదాపు రాసేశాడు. దానిని “ఫిజిక్స్‌ చరిత్రలో అత్యంత ముఖ్యమైన పుస్తకాల్లో ఒకటిగా” చూస్తారు. అందులో ఆయన కాంతి లేదా వెలుగు సహజ గుణం గురించిన ప్రయోగాలను చర్చించాడు. కాంతి ఎలా వివిధ రంగుల్లోకి విడిపోతుంది, అద్దాల్లో ఎలా ప్రతిబింబిస్తుంది, ఒక మాధ్యమం నుండి మరో మాధ్యమానికి వెళ్తున్నప్పుడు ఎలా వంగుతుంది లాంటి విషయాలను కూడా అందులో చర్చించాడు. అంతేకాదు కళ్లతో ఎలా చూడగలుతాం, కంటి నిర్మాణం, కన్ను పని చేసే విధానం లాంటి విషయాలను కూడా అధ్యయనం చేశాడు.

అల్హాజెన్‌ రాసిన పుస్తకాలు 13వ శతాబ్దానికల్లా అరబిక్‌ నుండి లాటిన్‌లోకి అనువాదం అయ్యాయి. తర్వాత కొన్ని శతాబ్దాలకు యూరప్‌కు చెందిన పండితులు వాటిని అధికారికంగా గుర్తించారు. అల్హాజెన్‌ రాసిన వాటిలో లెన్స్‌ల ధర్మాలు కూడా ఉన్నాయి. అవే యూరప్‌లో కంటి అద్దాలు తయారు చేసినవాళ్లకు ఉపయోగపడే మూల సమాచారాన్ని ఇచ్చాయి. వాళ్లు లెన్స్‌లను ఒకదానికొకటి ఎదురెదురుగా పెట్టి టెలిస్కోప్‌ను, మైక్రోస్కోప్‌ను కనిపెట్టారు.

కెమెరా అబ్స్‌క్యూరా (చీకటి గది)

మొదటి కెమెరా అబ్స్‌క్యూరాగా రికార్డులోకి వచ్చిన పరికరాన్ని అల్హాజెన్‌ తయారు చేసినప్పుడు ఫోటోగ్రఫీకి పునాదిగా ఉన్న సూత్రాలను కనిపెట్టాడు. ఈ పరికరంలో ఒక “చీకటి గది” ఉంటుంది. అందులోకి పిన్ను సైజులో ఉన్న ఒక చిన్న రంధ్రం ద్వారా వెలుగు లోపలికి ప్రవేశించి గది బయట ఉన్న బొమ్మని గదిలోపల గోడ మీద తలక్రిందులుగా చూపిస్తుంది.

నిజానికి మొదటి కెమెరా అబ్స్‌క్యూరాను నిర్మించింది అల్హాజెన్‌

ఈ బొమ్మలను పూర్తిగా లేదా శాశ్వతంగా క్యాప్చర్‌ చేయడానికి 1800లలో కెమెరా అబ్స్‌క్యూరాకు ఫోటోగ్రాఫిక్‌ ప్లేట్లను జత చేశారు. ఫలితం ఏంటి? ఫలితమే కెమెరా. అన్నీ ఆధునిక కెమెరాలకు, అంతెందుకు కంటికి కూడా కెమెరా అబ్స్‌క్యూరాకు ఉన్న ప్రాథమిక భౌతిక నియమాలే ఉన్నాయి. a

శాస్త్రీయ పద్ధతి

అల్హాజెన్‌ చేసిన పనుల్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన ప్రకృతిలో సహజంగా జరిగే విషయాలను ఎంతో వివరంగా, పద్ధతిగా పరిశోధన చేశాడు. ఆయన పాటించిన పద్ధతిని ఆ రోజుల్లో ఎవ్వరూ పాటించేవాళ్లు కాదు. థియరీలను ప్రయోగాల ద్వారా పరీక్షించి కనిపెట్టిన వాళ్లలో ఇతను మొదటివాడు. అప్పటికే జ్ఞానంగా అనుకుంటున్న విషయాలకు రుజువులు లేకపోతే వాటిని ప్రశ్నించడానికి ఆయన భయపడలేదు.

ఆధునిక సైన్స్‌కున్న నియమాన్ని ఈ ఒక్క సూక్తితో చెప్పవచ్చు: “మీరు నమ్మేదాన్ని రుజువు చేయండి.” కొంతమంది అల్హాజెన్‌ను “ఆధునిక శాస్త్రీయ పద్ధతికి పితామహుడు” అని భావిస్తారు. ఆ విషయంలో మనం ఆయనకు రుణపడి ఉండాలి.

a కెమెరా అబ్స్‌క్యూరాకూ కంటికీ ఉన్న పోలికల్ని 17వ శతాబ్దంలో యొహానస్‌ కెప్లర్‌ వివరించే వరకు పశ్చిమ దేశాల్లో సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు.