4
బాధ్యతగా ఉండడం ఎలా నేర్చుకోవాలి?
బాధ్యతగా ఉండడం అంటే ఏంటి?
బాధ్యతగా ఉండేవాళ్ల మీద మనం ఆధారపడవచ్చు. వాళ్లకు ఏదైనా పనిని అప్పగిస్తే దాన్ని సరిగ్గా చేస్తారు, సమయానికి పూర్తి చేస్తారు.
అన్నీ పనులు చేసే సామర్థ్యం లేకపోయినా, చాలా చిన్న వయసు నుండే పిల్లలు బాధ్యతగా ఉండడం నేర్చుకోగలరు. “పిల్లలు 15 నెలల వయసు నుండే తల్లిదండ్రులు చెప్పిన వాటిని చేస్తారు, 18 నెలల వయసు నుండే తల్లిదండ్రులు చేసేవాటిని చేయాలనుకుంటారు,” అని పేరెంటింగ్ వితౌట్ బోర్డర్స్ అనే పుస్తకం చెప్తుంది. “చాలా సంస్కృతుల్లో 5 నుండి 7 ఏళ్లు వయసున్న పిల్లలకు వాళ్ల తల్లిదండ్రులు ఇంటి పనుల్లో ఎలా సహాయం చేయవచ్చో నేర్పించడం మొదలుపెడతారు. ఇంత చిన్న వయసున్న పిల్లలు కూడా చాలా రకాల ఇంటి పనుల్లో చక్కగా సహాయం చేస్తారు.”
బాధ్యతగా ఉండడం ఎందుకు ముఖ్యం?
కొన్ని ప్రాంతాల్లో చాలామంది యౌవనులు వాళ్లంతట వాళ్లు బ్రతకాలని ఇల్లు వదిలి వెళ్తారు. కానీ కష్టాలు రాగానే మళ్లీ అమ్మానాన్నల దగ్గరికి తిరిగి వచ్చేస్తారు. డబ్బులు ఎలా సరిగ్గా ఉపయోగించుకోవాలో, ఇంటిని ఎలా నడిపించాలో, లేదా రోజువారీ జీవితంలో ఉండే బాధ్యతల్ని ఎలా చేయాలో తల్లిదండ్రులు ఎప్పుడూ నేర్పించలేదు కాబట్టి కొంతమంది విషయంలో ఇలా జరుగుతుంది.
కాబట్టి మీ పిల్లలకు ఇప్పుడే బాధ్యతగా ఎలా ఉండాలో నేర్పిస్తే పెద్దవాళ్లైన తర్వాత ఎలా ఉండాలో వాళ్లకు తెలుస్తుంది. “18 ఏళ్లు వచ్చే వరకు మీ మీదే ఆధారపడేలా పెంచి, ఆ తర్వాత ఒక్కసారిగా వాళ్లను బయట ప్రపంచంలోకి నెట్టేయకూడదు,” అని హౌ టు రెయిజ్ యాన్ అడల్ట్ అనే పుస్తకం చెప్తుంది.
బాధ్యత ఎలా నేర్పించాలి?
ఇంటి పనులు అప్పగించండి.
మంచి సూత్రాలు: “ఏ కష్టము చేసినను లాభమే కలుగును.”—సామెతలు 14:23.
తల్లిదండ్రులతో కలిసి పని చేయడమంటే చిన్నపిల్లలకు చాలా ఇష్టం. వాళ్లలో సహజంగా ఉండే ఈ ఆసక్తిని ఉపయోగించుకొని మీరు వాళ్లకు ఇంటి పనులను అప్పగించవచ్చు.
కొంతమంది తల్లిదండ్రులు అలా చేయడానికి ఇష్టపడరు. అసలే స్కూల్లో ప్రతీరోజు చాలా హోంవర్క్ ఇస్తారు, మళ్లీ ఇంటి పనులు కూడా చెప్తే పిల్లలకు చాలా కష్టం అవుతుందని తల్లిదండ్రులు అనుకోవచ్చు.
అయితే, ఇంటి పనులు చేసే పిల్లలు స్కూల్లో కూడా చక్కగా చదువుకునే అవకాశం ఉంది. ఎందుకంటే, ఇంటి పనులు చేయడం వల్ల పిల్లలు, ఇచ్చిన పనుల్ని ఎలా మొదలుపెట్టాలో, ఎలా పూర్తి చేయాలో నేర్చుకుంటారు. పేరెంటింగ్ వితౌట్ బోర్డర్స్ అనే పుస్తకం ఇంకా ఇలా చెప్తుంది, “పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే సహాయం చేయాలనే వాళ్ల కోరికను మనం పట్టించుకోకపోతే, ఇతరులకు సహాయం చేయడం అంత ముఖ్యం కాదని వాళ్లు అనుకోవడం మొదలుపెడతారు . . . అంతేకాదు వాళ్ల పనుల్ని కూడా వేరేవాళ్లే చేస్తారు అని అనుకోవడం మొదలుపెడతారు.”
ఈ పుస్తకం చెప్తున్నట్లు ఇంటి పనులు చేస్తే పిల్లలు తీసుకునేవాళ్లుగా కాకుండా ఇచ్చేవాళ్లుగా, చేయించుకునేవాళ్లు కాకుండా చేసేవాళ్లుగా తయారౌతారు. ఇంటి పనులు చేయడం వల్ల తమకు ఇంట్లో విలువైన స్థానం ఉందని, తమకు కూడా కుటుంబం పట్ల బాధ్యత ఉందని పిల్లలు గుర్తించగలుగుతారు.
వాళ్ల పొరపాట్ల విషయంలో వాళ్లే బాధ్యత తీసుకునేలా పిల్లలకు సహాయం చేయండి.
మంచి సూత్రాలు: “నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము.”—సామెతలు 19:20.
మీ పిల్లలు పొరపాట్లు చేసినప్పుడు, ఉదాహరణకు మీ బాబు లేదా పాప అనుకోకుండా ఇతరుల వస్తువులను పాడు చేస్తే, జరిగిన తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేయకండి. పిల్లలు తప్పు చేసినప్పుడు దానివల్ల వచ్చే నష్టాన్ని కూడా భరించగలరు, అలాంటప్పుడు వాళ్లు క్షమాపణ అడిగి, బహుశా నష్టపరిహారాన్ని కూడా చెల్లించవచ్చు.
తాము చేసిన పొరపాట్లకు తామే బాధ్యత తీసుకోవాలని పిల్లలు గ్రహించినప్పుడు వాళ్లు
-
నిజాయితీగా ఉంటూ, వాళ్ల తప్పుల్ని ఒప్పుకోవడం నేర్చుకుంటారు
-
వాళ్ల తప్పుల్ని ఇతరుల మీదకు నెట్టేయరు
-
సాకులు చెప్పకుండా ఉంటారు
-
అడగాల్సినప్పుడు క్షమాపణ అడుగుతారు