ప్రపంచ విశేషాలు
స్త్రీ, పురుషుల సంబంధాల గురించి కొన్ని విశేషాలు
మీకు ఇతరులతో ఉన్న సంబంధాలు పాడవకుండా కాపాడుకోవడానికి బైబిలు సలహాల్ని మీరు ముందే తీసుకుంటారా లేక చివర్లో తీసుకుంటారా? ప్రాచీన కాలం నుండి బైబిల్లో ఉన్న మంచి విషయాలను ఈ మధ్యకాలంలో పరిశోధించిన విషయాలతో పోల్చి చూడండి.
భారతదేశం
2014లో చేసిన ఒక సర్వే ప్రకారం పెళ్లికి ముందు “శారీరక సంబంధాలు పెట్టుకోవడం ఇండియాలో ఇప్పుడు పెద్ద విషయం కాదు” అని 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసువాళ్లు 61 శాతం మంది అన్నారు. ముంబయికి చెందిన ఒక డాక్టర్ Hindustan Times అనే పత్రికకు తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు—అమ్మాయిలు అబ్బాయిలు సంబంధాలు పెట్టుకుంటున్నారంటే వాళ్లు పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు అని కాదు. ఒక్క రాత్రి గడిపేవాళ్లు, మామూలుగా, సరదా కోసం సంబంధాలు పెట్టుకునే వాళ్లు, సహజీవనం చేసేవాళ్లు, పెళ్లి గురించి గానీ, ఒక ఒప్పందం గురించి గానీ అసలు ఆలోచించరు.
ఒకసారి ఆలోచించండి: లైంగిక వ్యాధులు, మనో వేదన ఎక్కువగా పెళ్లికి ముందు సెక్స్ వల్ల వస్తాయా, పెళ్లి తర్వాత సెక్స్ వల్ల వస్తాయా?—1 కొరింథీయులు 6:18.
డెన్మార్క్
కుటుంబ సభ్యులతో తరచుగా గొడవలు, వాదనలు పెట్టుకుంటూ ఉంటే మధ్య వయసులోనే చనిపోయే ప్రమాదం రెండింతలు పెరుగుతుంది. కోపెన్‌హాగన్ యూనివర్సిటీలో పరిశోధకులు 10,000 మంది మధ్య వయస్కులను 11 సంవత్సరాల పాటు పరిశీలించారు. దగ్గరవాళ్లతో తరచుగా వాదనలు పెట్టుకునే వాళ్లు, గొడవలు పడనివాళ్లకన్నా ముందే చనిపోయే అవకాశం ఎక్కువగా ఉందని తెలుసుకున్నారు. ఈ పరిశోధకుల్లో ఒకరు చెప్తున్నదేంటంటే “మధ్య వయసులో మరణాలను తగ్గించుకోవాలంటే,” గొడవల్ని, సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి.
పవిత్ర పుస్తకాల్లో ఏముంది: “మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణముగలవాడు వివేకముగలవాడు.”—సామెతలు 17:27.
అమెరికా
“సైక్లికల్ కపుల్స్” అంటే ప్రేమించుకుంటున్నప్పుడు విడిపోయి మళ్లీ కలిసి, మళ్లీ విడిపోయి, మళ్లీ కలిసేపోయేవాళ్లు. ఇలాంటి వాళ్లు పెళ్లి చేసుకున్న మొదటి ఐదేళ్లలోనే వేరుపడే ప్రమాదం ఎక్కువని, లుయీసియానాలో కొత్తగా పెళ్లైన 564 జంటలపై చేసిన సర్వేలో తేలింది. ఇలాంటి జంటలు ఎక్కువ గొడవలు పడతారు. వాళ్లకు వివాహంలో సంతృప్తి ఉండదు.
పవిత్ర పుస్తకాల్లో ఏముంది: “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.”—మత్తయి 19:6.