దేవునికి మీ గురించి తెలుసా?
సృష్టి ద్వారా మనం ఏమి తెలుసుకోవచ్చు
మనుషుల మధ్య ఉండే బంధాలన్నిటిలో ఎక్కువ దగ్గరిగా ఉండేది ఒకేలా ఉండే కవలల బంధం. దాని గురించి ఒకసారి ఆలోచించండి. కవలలు చాలా దగ్గరిగా ఉంటారు. “మనం చెప్పిన విషయాన్ని అస్సలు వివరించాల్సిన అవసరం లేకుండా ఉన్నదున్నట్లుగా అర్థం చేసుకుంటే ఎలా ఉంటుందో” కొంతమంది కవలలకు తెలుసు అని ట్విన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ నాన్సీ సెగల్ అంటుంది. ఆమె కూడా ఒక కవలే. ఒక స్త్రీ ఆమెకు, ఆమెలా ఉండే ఆమె కవలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఇలా చెప్తుంది: “మాకు మా ఇద్దరి గురించి దాదాపు మొత్తం తెలుసు.”
వాళ్లు అంతబాగా అర్థం చేసుకోవడానికి కారణం ఏంటి? పరిశోధనలు చెప్తున్నట్లు పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల పెంపకం కొంతవరకు కారణమైనా, ఒకేలా ఉండే కవలల్లో జన్యు నిర్మాణం ఒకేలా ఉండడం వల్లే అది ముఖ్యంగా సాధ్యమౌతుంది.
ఆలోచించండి: ఇంత అద్భుతమైన జన్యు సమాచారం అంతటిని తయారు చేసిన సృష్టికర్తకు మనలో ప్రతి ఒక్కరి నిర్మాణం గురించి అందరికన్నా బాగా తెలుసు. అందుకే కీర్తనకర్త ఇలా అన్నాడు: “నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నేను రహస్యమందు పుట్టిననాడు . . . నాకు కలిగిన యెముకలును నీకు మరుగై యుండలేదు నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను . . . నీ గ్రంథములో లిఖితము లాయెను.” (కీర్తన 139:13, 15, 16) దేవునికి మాత్రమే మన జన్యు నిర్మాణం తెలుసు, ఆయన మాత్రమే వాటిని పూర్తిగా అర్థం చేసుకోగలడు. అంతేకాదు, మనం ఇలా ఉండడానికి కారణమైన మన జీవిత అనుభవాలు, మనల్ని మలచిన సంఘటనలు అన్నీ ఆయనకు తెలుసు, ఆయనే వాటిని అర్థం చేసుకోగలడు. మన గురించి, మన జన్యు నిర్మాణం గురించి దేవునికున్న ఈ ప్రత్యేకమైన జ్ఞానం మనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఆయన అర్థం చేసుకోగలడనే నమ్మకాన్ని కలిగిస్తుంది.
దేవుని పరిజ్ఞానం గురించి బైబిలు ఏమి నేర్పిస్తుంది
దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది.” (కీర్తన 139:1, 2, 4) అంతేకాదు, యెహోవాకు మన హృదయం లోపల ఉండే భావాలు కూడా తెలుసు, ఆయన మన “ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు.” (1 దినవృత్తాంతములు 28:9; 1 సమూయేలు 16:6, 7) ఈ వచనాలు దేవుని గురించి ఏమి చెప్తున్నాయి?
మనం మన ప్రార్థనలో చెప్పాలనుకున్న ఆలోచనలన్నిటినీ, భావాలన్నిటినీ మాటల్లో చెప్పలేకపోవచ్చు. కానీ మన సృష్టికర్త మనం చేసేవాటిని గమనిస్తాడు, అంతేకాదు మనం ఎందుకు అలా చేస్తామో కూడా అర్థం చేసుకుంటాడు. ఇంకా, మనం హృదయపూర్వకంగా కోరుకున్నవాటిని ఒకవేళ మన పరిమితుల వల్ల చేయలేకపోయినా మనం చేయాలనుకున్న మంచిని ఆయన అర్థం చేసుకుంటాడు. అసలు మన హృదయాల్లో ప్రేమను పెట్టిందే ఆయన, కాబట్టి తప్పకుండా ఆయన ప్రేమగల మన ఆలోచనలను, ఉద్దేశాలను గమనించడానికి, అర్థం చేసుకోవడానికి చాలా ఆసక్తి, ఇష్టం చూపిస్తాడు.—1 యోహాను 4:7-10.
దేవుడు చూడలేనిది అంటూ ఏదీ లేదు. ఇతరులకు మన బాధల గురించి తెలియకపోయినా లేదా వాటిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా ఆయనకు మన బాధల గురించి తెలుసు
లేఖనాలు మనకు నమ్మకాన్ని ఇస్తున్నాయి
-
“యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉంది, ఆయన చెవులు వాళ్ల అభ్యర్థనల వైపు ఉన్నాయి. అయితే యెహోవా ముఖం చెడు పనులు చేసేవాళ్లకు వ్యతిరేకంగా ఉంది.”—1 పేతురు 3:12.
-
“నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.—కీర్తన 32:8.
దేవుడు చాలా జాలిగలవాడు
దేవుడు మన పరిస్థితిని, మన భావాలను అర్థం చేసుకుంటాడని తెలుసుకోవడం వల్ల మనం కష్టాలను తట్టుకోవడం సాధ్యమౌతుందా? నైజీరియాకు చెందిన అన్నాకు ఏమి జరిగిందో చూడండి: “నా కష్టమైన పరిస్థితులను బట్టి అసలు నేను జీవించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని నేను అనుకునేదాన్ని. నా భర్త చనిపోయాడు. నేను నా కూతుర్ని చూసుకోవాలి. ఆమె హైడ్రోసిఫలస్ (ద్రవశీర్షం లేదా మెదడులో ఎక్కువ నీరు చేరడం) అనే వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్‌లో ఉంది. నాకు రొమ్ము క్యాన్సర్ ఉందని తెలిసినప్పుడు నాకు ఆపరేషన్, కీమోథెరపీ, రేడియోథెరపీ చేయాల్సివచ్చింది. నేనూ, జబ్బుతో బాధపడుతున్న నా కూతురూ ఒకేసారి హాస్పిటల్‌లో ఉన్నప్పుడు తట్టుకోవడం చాలా కష్టమైంది.”
అన్నాకు తట్టుకోవడానికి ఏమి సహాయం చేసింది? “నేను ఫిలిప్పీయులు 4:6, 7 లాంటి వచనాల గురించి ఆలోచించాను. అక్కడ ‘మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుంది’ అని ఉంది. నాకు ఆ వచనం గుర్తుకు వచ్చిన ప్రతీసారి నేను యెహోవాకు చాలా దగ్గరగా ఉన్నట్లు భావించాను. ఎందుకంటే నా గురించి నేను అర్థం చేసుకున్నదానికన్నా ఆయనే బాగా అర్థం చేసుకుంటాడని నాకు తెలుసు. నేను క్రైస్తవ సంఘంలో ఉన్న నా ప్రియమైన సహోదర, సహోదరీల నుండి కూడా చాలా ప్రోత్సాహాన్ని పొందాను.
“నేను నా ఆరోగ్యం విషయంలో ఇంకా పోరాడుతున్నప్పటికీ, నా పరిస్థితి, నా కూతురు పరిస్థితి మెరుగుపడింది. ఎందుకంటే యెహోవా మా పక్కన ఉన్నాడు, సమస్యలు ఎదురైనప్పుడు ప్రతికూలంగా ఆలోచించకుండా ఉండడం మేము నేర్చుకున్నాము. యాకోబు 5:11 ఈ అభయాన్ని ఇస్తుంది: ‘సహించినవాళ్లు సంతోషంగలవాళ్లని మనం అంటాం. యోబు సహనం గురించి మీరు విన్నారు, యెహోవా అతన్ని ఎలా దీవించాడో మీకు తెలుసు. యెహోవా దేవుడు అనురాగాన్ని ఎంతో సున్నితంగా చూపిస్తాడని, [లేదా “ఎంతో కనికరం గలవాడని,” ఫుట్‌నోట్] ఆయన కరుణామయుడని కూడా మీకు తెలుసు.’” యెహోవా యోబు పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నాడు, అలాగే మనం ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నా కూడా ఆయన అర్థం చేసుకుంటాడని నమ్మకంతో ఉండవచ్చు.