కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవితం మీద ఆశ ఎందుకు వదులుకోకూడదు?

జీవితం మీద ఆశ ఎందుకు వదులుకోకూడదు?

ఫైజల్‌ భార్య చనిపోయిన సంవత్సరంలోపే అతని గుండెకు పెద్ద సర్జరీ చేయాల్సి వచ్చింది. అతను ఇలా అంటున్నాడు: “నేను యోబు పుస్తకం చదివేటప్పుడు, దేవుడు ఒక కారణంతోనే ఆ పుస్తకాన్ని బైబిల్లో పెట్టాడని నాకు తెలుసు. మనం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు మనలాగే బాధ పడిన బైబిల్లోని ఒక వ్యక్తి గురించి చదివితే ఎంతో ఓదార్పుగా ఉంటుంది.” అతనింకా ఇలా అంటున్నాడు: “జీవితం మీద ఆశ వదులుకోనక్కర్లేదు.”

త్రిషా యౌవనస్థురాలిగా ఉన్నప్పుడే వాళ్లమ్మ చనిపోయింది. ఆమె ఇలా అంటోంది: “ఎన్ని సమస్యలున్నా, సృష్టికర్తను తెలుసుకోవడం వల్ల జీవితానికి ఒక అర్థం ఏర్పడుతుంది. దానివల్ల ఆశతో, సంతోషంగా జీవించగలుగుతాం. జీవితంలో ప్రతీరోజు ముందుకు సాగడానికి కావల్సిన శక్తిని, సహాయాన్ని యెహోవా తప్పకుండా ఇవ్వగలడు.”

ముందటి ఆర్టికల్స్‌లో జీవితం మీద ఆశ కోల్పోయేలా చేసే కొన్ని పరిస్థితుల్ని గమనించాం. మీ సమస్యల్ని సహిస్తుండగా, ‘అసలు నేనెందుకు జీవించాలి?’ అని, లేదా ‘నన్ను పట్టించుకునేవాళ్లు ఎవరైనా ఉన్నారా?’ అని మీకనిపించవచ్చు. అయితే దేవుడు మీ సమస్యల్ని పట్టించుకుంటున్నాడనే నమ్మకంతో ఉండండి. మీరు ఆయనకు చాలా విలువైనవాళ్లు.

86వ కీర్తన రాసిన వ్యక్తి దేవుని మీద తనకున్న నమ్మకాన్ని ఇలా చెప్తున్నాడు: “నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొఱ్ఱపెట్టెదను.” (కీర్తన 86:7) కష్టాల్లో ఉన్నప్పుడు, దేవుడు నాకెలా సహాయం చేయగలడని మీకు అనిపించవచ్చు.

దేవుడు మీ సమస్యల్ని వెంటనే తీసేయకపోయినా, మీ సమస్యల్ని తట్టుకునేలా మీకు ప్రశాంతతను ఇవ్వగలడని ఆయన వాక్యమైన బైబిలు మీకు భరోసా ఇస్తుంది: “ఏ విషయంలోనూ ఆందోళన పడకండి. కానీ ప్రతీ విషయంలో కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి; అప్పుడు, మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి . . . మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుంది.” (ఫిలిప్పీయులు 4:6, 7) దేవుడు మనల్ని నిజంగా పట్టించుకుంటున్నాడని భరోసానిచ్చే ఈ బైబిలు వచనాల్ని దయచేసి గమనించండి.

దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు

“ఒక్క [పిచ్చుకను] కూడా దేవుడు మర్చిపోడు. . . . మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు.” లూకా 12:6, 7.

దీన్ని పరిశీలించండి: పిచ్చుకలలాంటి చిన్నచిన్న పక్షుల్ని ప్రజలు అంతగా పట్టించుకోరు. కానీ దేవుడు వాటిని కూడా పట్టించుకుంటాడు. ప్రతీ చిన్న పిచ్చుకను దేవుడు గమనిస్తాడు. ప్రతీది ఆయన దృష్టిలో విలువైన ప్రాణే. పిచ్చుకల కన్నా మనుషులు ఆయనకు ఇంకెంతో విలువైనవాళ్లు. భూమ్మీద దేవుడు సృష్టించిన వాటన్నిటిలో మనుషులు అత్యంత ప్రాముఖ్యమైన వాళ్లు. ఎందుకంటే దేవుడు వాళ్లను తన “స్వరూపమందు” చేశాడు, వాళ్లు ఆయనకున్న అద్భుతమైన లక్షణాల్ని అలవర్చుకోగలరు, చూపించగలరు.—ఆదికాండము 1:26, 27.

“యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు . . . నా మనస్సు గ్రహించుచున్నావు . . . నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము.”కీర్తన 139:1, 2, 23.

దీన్ని పరిశీలించండి: దేవునికి మీరు బాగా తెలుసు. మీ లోలోపలి భావాలు, ఆందోళనలు కూడా ఆయనకు తెలుసు. మీ సమస్యల్ని, ఆందోళనల్ని ఇతరులు అర్థం చేసుకోకపోవచ్చు, అయితే దేవుడు మీ గురించి పట్టించుకుంటున్నాడు, సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు జీవితం మీద ఆశ కోల్పోనక్కర్లేదు.

మీ జీవితానికి ఒక అర్థం ఉంది

“యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱ నీయొద్దకు చేరనిమ్ము . . . నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు త్వరపడి నాకుత్తరమిమ్ము . . . ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన . . . వైపు తిరిగియున్నాడు.”కీర్తన 102:1, 2, 17.

దీన్ని పరిశీలించండి: బాధల వల్ల మనుషులు కార్చిన ప్రతీ కన్నీటి చుక్క గురించి యెహోవాకు తెలుసు. (కీర్తన 56:8) అంటే, మీ కన్నీళ్ల గురించి కూడా ఆయనకు తెలుసు. దేవుడు మీ కష్టాలన్నిటినీ, కన్నీళ్లన్నిటినీ గుర్తుపెట్టుకుంటాడు, ఎందుకంటే మీరు ఆయనకు చాలా అమూల్యమైనవాళ్లు.

“నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే . . . నీ దేవుడనైన యెహోవానగు నేను—భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు[న్నాను].” యెషయా 41:9, 10, 13.

దీన్ని పరిశీలించండి: దేవుడు మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ మీరు పడిపోతే, ఆయన మిమ్మల్ని పైకి లేపుతాడు.

మీరు మంచి భవిష్యత్తు కోసం ఎదురుచూడవచ్చు

“దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన మీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.”యోహాను 3:16.

దీన్ని పరిశీలించండి: దేవునికి మీరంటే ఎంతో ప్రేమ, అందుకే ఇష్టపూర్వకంగా తన కుమారుడైన యేసుని మీకోసం బలిగా ఇచ్చాడు. దానివల్ల ఎప్పటికీ సంతోషకరమైన, అర్థవంతమైన జీవితం గడిపే అవకాశం మీకు ఉంది. a

మీకు ఆందోళనగా ఉన్నాసరే, మీ జీవితం భారంగా తయారైనట్టు అనిపించినా సరే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయండి. భవిష్యత్తు కోసం ఆయన మాటిచ్చిన వాటిమీద విశ్వాసం పెంచుకోండి. అది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది, జీవితం మీద ఆశ కోల్పోకుండా మీలో ధైర్యం నింపుతుంది.

a యేసు బలి నుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చో ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి www.jw.org/teలో యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అనే వీడియో చూడండి. మా గురించి > జ్ఞాపకార్థ ఆచరణ కింద చూడండి.