అధ్యయన ఆర్టికల్ 39
మనం ప్రేమించేవాళ్లు ఎవరైనా యెహోవాకు దూరమైతే . . .
“వాళ్లు . . . ఎన్నోసార్లు ఆయన్ని బాధపెట్టారు!” —కీర్త. 78:40.
పాట 102 ‘బలహీనులకు సహాయం చేయండి’
ఈ ఆర్టికల్‌లో . . . a
1. కుటుంబంలో ఎవరైనా బహిష్కరించబడితే మిగతా కుటుంబ సభ్యులకు ఎలా అనిపిస్తుంది?
మీరు ప్రేమించే ఎవరైనా సంఘం నుండి బహిష్కరించబడ్డారా? ఒకవేళ అలా జరిగితే మీ గుండె పగిలిపోతుంది. హిల్డా అనే సహోదరి ఇలా చెప్తుంది: “పెళ్లైన 41 సంవత్సరాల తర్వాత నా భర్త చనిపోయినప్పుడు, అంతకుమించిన బాధ ఇంకొకటి లేదనిపించింది. b అయితే మా అబ్బాయి సంఘాన్ని, తన భార్యాపిల్లల్ని విడిచి వెళ్లినప్పుడు ఇంకా ఎక్కువ బాధగా అనిపించింది.”
2-3. కీర్తన 78:40, 41 ప్రకారం, తన సేవకులు బహిష్కరించబడితే యెహోవాకు ఎలా అనిపిస్తుంది?
2 తన పరలోక కుటుంబంలో కొంతమంది దేవదూతలు తిరుగుబాటు చేసినప్పుడు యెహోవా ఎంత బాధపడుంటాడో ఆలోచించండి. (యూదా 6) ఆయన ప్రేమించిన ఇశ్రాయేలు ప్రజలు పదేపదే ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆయన ఎంత వేదనపడుంటాడో ఊహించండి. (కీర్తన 78:40, 41 చదవండి.) నేడు కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సంఘం నుంచి బహిష్కరించబడితే యెహోవా ఖచ్చితంగా బాధపడతాడు. మీ బాధను ఆయన అర్థంచేసుకుంటాడు. ఆయన కనికరంతో మీకు కావాల్సిన ప్రోత్సాహాన్ని, మద్దతుని ఇస్తాడు.
3 మనం ప్రేమించే ఎవరైనా బహిష్కరించబడినప్పుడు యెహోవా సహాయం పొందడానికి మనమేం చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. బహిష్కరించబడిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సంఘంలోని మిగతావాళ్లు ఎలా సహాయం చేయవచ్చో తెలుసుకుంటాం. అయితే ముందుగా, మనమెలాంటి ఆలోచనలకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం.
మిమ్మల్ని మీరు నిందించుకోకండి
4. తమ పిల్లల్లో ఎవరైనా యెహోవాకు దూరమైతే చాలామంది తల్లిదండ్రులకు ఎలా అనిపిస్తుంది?
4 తమ పిల్లల్లో ఒకరు యెహోవాను విడిచిపెడితే, వాళ్లు సత్యంలో ఉండేలా ఇంకా ఏం చేస్తే బాగుండేదని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. తన కొడుకు బహిష్కరించబడిన తర్వాత లూక్ అనే సహోదరుడు ఇలా అంటున్నాడు: “తప్పంతా నాదేనని అనుకునేవాణ్ణి. ఆ విషయంలో నాకు పీడకలలు కూడా వచ్చేవి. కొన్నిసార్లు నేను వెక్కివెక్కి ఏడ్చేవాణ్ణి.” ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఎలిజబెత్ అనే సహోదరి ఇలా అనుకునేది: “నేను ఒక తల్లిగా ఏం తప్పు చేశాను? నేను మా అబ్బాయికి యెహోవా గురించి సరిగ్గా నేర్పించలేదు అనుకుంట!”
5. ఒక వ్యక్తి యెహోవాను సేవించడం ఆపేస్తే, అది ఎవరి తప్పు?
5 యెహోవా మనలో ప్రతిఒక్కరికీ స్వేచ్ఛాచిత్తం అనే బహుమానం ఇచ్చాడు. దానర్థం ఆయనకు లోబడతామా లేదా అనేది మనమే నిర్ణయించుకోవచ్చు. కొంతమంది పిల్లలు, తమ తల్లిదండ్రులు మంచి ఆదర్శం ఉంచకపోయినా యెహోవాను సేవించాలని నిర్ణయించుకుని, ఆయనకు నమ్మకంగా ఉంటారు. ఇంకొంతమందైతే, తమ తల్లిదండ్రులు యెహోవా గురించి ఎంత కష్టపడి నేర్పించినా, పెద్దయ్యాక యెహోవాను విడిచిపెడతారు. కాబట్టి, యెహోవాను సేవించాలా వద్దా అనేది ఎవరికివాళ్లే నిర్ణయించుకోవాలి. (యెహో. 24:15) అందుకే తల్లిదండ్రులారా మీ పిల్లలు యెహోవాను ఆరాధించడం మానేసినందుకు మీరు బాధపడుతుంటే, ఆ తప్పు మీదేనని అనుకోకండి.
6. తల్లిదండ్రుల్లో ఒకరు యెహోవాను ఆరాధించడం ఆపేస్తే వాళ్ల పిల్లలకు ఎలా అనిపిస్తుంది?
6 కొన్నిసార్లు తల్లిదండ్రుల్లో ఒకరు యెహోవాను ఆరాధించడం ఆపేస్తారు అలాగే తమ కుటుంబాన్ని వదిలేస్తారు. (కీర్త. 27:10) అలా జరిగినప్పుడు తమ తల్లిదండ్రుల్ని ఎంతో గౌరవించి, అభిమానించే పిల్లలకు చాలా బాధేస్తుంది. ఎస్టర్ వాళ్ల నాన్న బహిష్కరించబడినప్పుడు ఆమె ఇలా అంటుంది: “నేను తరచూ ఏడ్చేదాన్ని. ఎందుకంటే మా నాన్న కేవలం సత్యం నుండి దూరమవ్వట్లేదు కానీ కావాలనే యెహోవాను విడిచివెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయన బహిష్కరించబడినప్పుడు ఆయన గురించే ఆలోచిస్తూ ఉండేదాన్ని. దానివల్ల నాకు ఆందోళన కలిగి గుండె వేగంగా కొట్టుకోవడం, గాబరాగా ఉండడం, చెమటలు పట్టడం లాంటివి జరిగేవి.”
7. తల్లిదండ్రుల్లో ఒకరు బహిష్కరించబడితే వాళ్ల పిల్లల్ని చూసినప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది?
7 యౌవనులారా, మీ తల్లిదండ్రుల్లో ఒకరు బహిష్కరించబడితే మీతోపాటు మాకూ బాధేస్తుంది. మీ బాధ యెహోవాకు కూడా తెలుసనే నమ్మకంతో ఉండండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు ఆయనకు నమ్మకంగా ఉన్నందుకు సంతోషిస్తున్నాడు; అలాగే సంఘంలోని సహోదరసహోదరీలుగా మేము కూడా సంతోషిస్తున్నాం. మీ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయానికి మీరు బాధ్యులు కారని గుర్తుంచుకోండి. పైన ప్రస్తావించినట్టు, తనను ఆరాధించాలా వద్దా అని నిర్ణయించుకునే స్వేచ్ఛను యెహోవా ప్రతీఒక్కరికి ఇచ్చాడు. కాబట్టి సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్న ప్రతీవ్యక్తి “తన బాధ్యత అనే బరువు” తానే మోసుకోవాలి.—గల. 6:5, అధస్సూచి.
8. కుటుంబంలో ఒక వ్యక్తి బహిష్కరించబడితే మిగతా కుటుంబ సభ్యులు ఏం చేయొచ్చు? (“ యెహోవా దగ్గరకు తిరిగి రండి” అనే బాక్సు కూడా చూడండి.)
8 మీరు ప్రేమించేవ్యక్తి యెహోవాకు దూరమైనప్పుడు వాళ్లు ఏదోకరోజు ఆయన దగ్గరకు తిరిగొస్తారని మీరు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఈలోపు మీరేం చేయవచ్చు? మీ విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి చేయగలిగిందంతా చేయొచ్చు. మీరలా చేసినప్పుడు మీ కుటుంబంలోని మిగతా సభ్యులకి అలాగే బహిష్కరించబడిన వ్యక్తికి మంచి ఆదర్శంగా ఉంటారు. మీ బాధను తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని కూడా పొందుతారు. కాబట్టి మీ విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి ఏం చేయొచ్చో చూద్దాం.
మీ విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి మీరేం చేయవచ్చు?
9. యెహోవా నుండి బలం పొందడానికి మీరేం చేయవచ్చు? (“ మీ కుటుంబంలో ఒకరు యెహోవాకు దూరమైతే, ఈ లేఖనాలు మీకు ఓదార్పునిస్తాయి” అనే బాక్సు కూడా చూడండి.)
9 మీ విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి చేయగలిగిందంతా చేయండి. మీరు బలంగా ఉంటూ మీ కుటుంబ సభ్యుల్ని బలపరుస్తూ ఉండడం చాలా ప్రాముఖ్యం. దాన్ని మీరెలా చేయొచ్చు? యెహోవా నుండి బలం పొందడానికి క్రమంగా బైబిలు చదువుతూ దాన్ని ధ్యానించండి అలాగే కూటాలకు హాజరవ్వండి. జోయాన వాళ్ల నాన్న, అక్క సత్యాన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె ఇలా అంది: “బైబిల్లో అబీగయీలు, ఎస్తేరు, యోబు, యోసేపు, యేసు ఉదాహరణలను చదివినప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వాళ్ల ఉదాహరణలు నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వడంతోపాటు సరైన విధంగా ఆలోచించడానికి సహాయం చేస్తాయి. ప్రత్యేక పాటల వల్ల కూడా నేనెంతో ప్రోత్సాహం పొందుతున్నాను.”
10. కీర్తన 32:6-8 చెప్తున్నట్లు, బాధను తట్టుకోవడానికి మీరేం చేయవచ్చు?
10 మిమ్మల్ని ఆందోళనపెట్టే ప్రతీదాని గురించి యెహోవాకు చెప్పండి. మీరు బాధలో ఉన్నప్పుడు ప్రార్థించడం ఆపకండి. మీ పరిస్థితిని యెహోవా చూసినట్టు చూడడానికి సహాయం చేయమని అడగండి. అలాగే ‘మీకు లోతైన అవగాహనను ఇవ్వమని, మీరు నడవాల్సిన మార్గాన్ని మీకు ఉపదేశించమని’ ఆయన్ని వేడుకోండి. (కీర్తన 32:6-8 చదవండి.) మీ భావాల్ని యెహోవాకు చెప్తున్నప్పుడు జరిగిందంతా గుర్తొచ్చి మీకు చాలా బాధ కలగొచ్చు. కానీ యెహోవా మీ బాధను పూర్తిగా అర్థంచేసుకుంటాడు. ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అలాగే మీ హృదయాన్ని తన ముందు కుమ్మరించమని కోరుతున్నాడు.—నిర్గ. 34:6; కీర్త. 62:7, 8.
11. హెబ్రీయులు 12:11 ప్రకారం, యెహోవా చేసిన ప్రేమపూర్వక ఏర్పాటు మీద ఎందుకు నమ్మకం ఉంచాలి? (“ బహిష్కరించడం—యెహోవా చేసిన ప్రేమపూర్వక ఏర్పాటు” అనే బాక్సు కూడా చూడండి.)
11 పెద్దలు తీసుకున్న నిర్ణయానికి మద్దతివ్వండి. బహిష్కరించడం యెహోవా చేసిన ప్రేమపూర్వక ఏర్పాటు. ఆ ఏర్పాటువల్ల తప్పుచేసిన వ్యక్తి ప్రయోజనం పొందుతాడు అలాగే సంఘంలోని ఇతరులకు మేలు జరుగుతుంది. (హెబ్రీయులు 12:11 చదవండి.) ఒక వ్యక్తిని బహిష్కరించాలని పెద్దలు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని సంఘంలో కొంతమంది మాట్లాడొచ్చు. అలాంటి వ్యక్తులు సాధారణంగా తప్పుచేసిన వ్యక్తిని సమర్థిస్తూ మాట్లాడతారు. మనకు పూర్తి వివరాలు తెలీదు కాబట్టి న్యాయనిర్ణయ కమిటీలోని పెద్దలను నమ్మడం తెలివైనపని. ఎందుకంటే వాళ్లు బైబిలు సూత్రాల్ని జాగ్రత్తగా పాటించడానికి అలాగే “యెహోవా కోసం” న్యాయం తీర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు.—2 దిన. 19:6.
12. యెహోవా చేసిన ఏర్పాటుకు మద్దతివ్వడం ద్వారా కొంతమంది ఎలా ప్రయోజనం పొందారు?
12 సంఘపెద్దలు తీసుకున్న నిర్ణయానికి మీరు మద్దతిచ్చినప్పుడు, బహిష్కరించబడిన వ్యక్తి తిరిగి యెహోవా దగ్గరికి రావడానికి సహాయం చేస్తారు. పైన ప్రస్తావించిన ఎలిజబెత్ ఇలా చెప్తుంది: “మా అబ్బాయిని అస్సలు కలవకుండా, మాట్లాడకుండా ఉండడం చాలా కష్టంగా అనిపించింది. కానీ ఆయన యెహోవా దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు తనని బహిష్కరించాలని పెద్దలు తీసుకున్న నిర్ణయం సరైనదే అని ఒప్పుకున్నాడు. అంతేకాదు ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని కూడా చెప్పాడు. దీన్నిబట్టి యెహోవా ఇచ్చే క్రమశిక్షణ ఎప్పుడూ సరైనదేనని నేను అర్థంచేసుకున్నాను.” ఆమె భర్త మార్క్ ఇలా అంటున్నాడు: “మా అబ్బాయితో అస్సలు మాట్లాడకుండా, కలవకుండా ఉన్నాం కాబట్టి తనకు తిరిగి రావాలనిపించిందని ఆ తర్వాత చెప్పాడు. మేము పెద్దల నిర్ణయానికి లోబడి ఉండేలా యెహోవా మాకు సహాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.”
13. మీ బాధను తట్టుకోవడానికి మీకేది సహాయం చేస్తుంది?
13 మీ భావాల్ని అర్థంచేసుకునే స్నేహితులతో మాట్లాడండి. మీరు ఆశ వదులుకోకుండా ఉండడానికి సహాయపడే అనుభవంగల సహోదరసహోదరీలతో సమయం గడపండి. (సామె. 12:25; 17:17) పైన ప్రస్తావించిన జోయాన ఇలా అంటుంది: “నాకు ఒంటరిగా అనిపించింది. కానీ నమ్మకస్థులైన స్నేహితులతో మాట్లాడడం వల్ల ఆ బాధను తట్టుకోగలిగాను.” సంఘంలో ఎవరైనా మిమ్మల్ని ఇంకా బాధపెట్టేలా మాట్లాడితే అప్పుడేం చేయవచ్చు?
14. మనమెందుకు “ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ” ఉండాలి?
14 సహోదరసహోదరీల పట్ల ఓర్పు చూపించండి. ప్రతీఒక్కరు ఎప్పుడూ సరైన విధంగానే మాట్లాడతారని ఆశించలేం. (యాకో. 3:2) మనందరం అపరిపూర్ణులం కాబట్టి కొంతమందికి ఏం మాట్లాడాలో తెలీకపోవచ్చు లేదా అనుకోకుండా మనల్ని బాధపెట్టేలా మాట్లాడొచ్చు. అప్పుడు అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ సలహాను గుర్తుచేసుకోండి: “ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి. ఇతరుల మీద ఫిర్యాదు చేయడానికి కారణం ఉన్నాసరే అలా క్షమించండి.” (కొలొ. 3:13) తన కొడుకు బహిష్కరించబడినప్పుడు ఒక సహోదరి ఇలా అంది: “చాలాసార్లు సహోదరసహోదరీలు నన్ను ప్రోత్సహించాలని అనుకున్నారు. కానీ అలా చేసే క్రమంలో తెలీకుండానే వాళ్ల మాటల ద్వారా నన్ను బాధపెట్టారు. అప్పుడు యెహోవా సహాయంతో నేను వాళ్లని క్షమించగలిగాను.” బహిష్కరించబడిన వాళ్ల కుటుంబ సభ్యులకు సంఘంలోని వాళ్లు ఎలా సహాయం చేయవచ్చు?
సంఘం ఎలా సహాయం చేయవచ్చు?
15. బహిష్కరించబడిన వ్యక్తి కుటుంబ సభ్యులకు మనమెలా సహాయం చేయవచ్చు?
15 బహిష్కరించబడిన వ్యక్తి కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ, దయ చూపించండి. మిరీయం అనే సహోదరికి, తన తమ్ముడు బహిష్కరిచబడిన తర్వాత కూటాలకు వెళ్లాలంటే భయం వేసింది. “సంఘంలోనివాళ్లు ఏమంటారో అని భయపడ్డాను, కానీ జరిగినదాన్నిబట్టి చాలామంది సహోదరసహోదరీలు నాతోపాటు బాధపడ్డారు. అలాగే నా తమ్ముడు గురించి కూడా వాళ్లు చెడుగా మాట్లాడలేదు. వాళ్లవల్ల నాకు ఒంటరిగా అనిపించలేదు.” ఇంకొక సహోదరి ఇలా చెప్తుంది: “మా అబ్బాయి బహిష్కరించబడినప్పుడు సంఘంలోని ప్రియమైన స్నేహితులు మమ్మల్ని ఓదార్చడానికి వచ్చారు. కొంతమంది ఏం మాట్లాడాలో అర్థంకావట్లేదని నాతో అన్నారు. ఇంకొంతమంది నాతోపాటు ఏడ్చారు. మరికొంతమంది ప్రోత్సహించే ఉత్తరాలు రాశారు. వాళ్లు చేసినవన్నీ నాకెంతో సహాయం చేశాయి.”
16. బహిష్కరించబడిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సంఘంలోనివాళ్లు ఎలా మద్దతిస్తూనే ఉండాలి?
16 బహిష్కరించబడిన వ్యక్తి కుటుంబ సభ్యులకు మద్దతిస్తూనే ఉండండి. మీరు చూపించే ప్రేమ, ప్రోత్సాహం వాళ్లకు ఇప్పుడింకా ఎక్కువ అవసరం. (హెబ్రీ. 10:24, 25) సంఘంలోని కొంతమంది కొన్నిసార్లు తమను కూడా బహిష్కరించబడిన వాళ్లలా చూస్తూ, తమతో మాట్లాడట్లేదని బహిష్కరించబడిన వ్యక్తి కుటుంబ సభ్యులు గమనించారు. వాళ్లు అలా భావించేలా మనం చేయకూడదు. యెహోవాను సేవించడం ఆపేసిన తల్లిదండ్రులున్న యౌవనుల్ని మనం ముఖ్యంగా ప్రోత్సహించాలి, మెచ్చుకోవాలి. మరీయ భర్త బహిష్కరించబడ్డాడు అలాగే కుటుంబాన్ని వదిలేశాడు. ఆమె ఇలా అంటుంది: “కొంతమంది సహోదరసహోదరీలు మా ఇంటికి వచ్చి వంటచేసి పెట్టారు. అలాగే నా పిల్లలకి స్టడీ చేయడానికి సహాయం చేశారు. వాళ్లు నా బాధను అర్థంచేసుకుని నాతోపాటు ఏడ్చారు. నామీద పుకార్లు వచ్చినప్పుడు నా తరఫున మాట్లాడారు; నన్నెంతో ప్రోత్సహించారు.”—రోమా. 12:13, 15.
17. బాధలో ఉన్నవాళ్లను ఓదార్చడానికి పెద్దలు ఏం చేయవచ్చు?
17 పెద్దలారా, బహిష్కరించబడిన వ్యక్తి కుటుంబ సభ్యుల్ని ప్రోత్సహించడానికి మీకు దొరికే ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాంటివాళ్లను ఓదార్చే ప్రాముఖ్యమైన బాధ్యత మీకు ఉంది. (1 థెస్స. 5:14) కూటాలు మొదలవడానికి ముందు, అయిపోయాక వాళ్లతో మాట్లాడి వాళ్లను ప్రోత్సహించండి. వాళ్ల ఇంటికి వెళ్లి కలవండి, వాళ్లతో కలిసి ప్రార్థించండి. అలాగే వాళ్లతో కలిసి పరిచర్య చేయండి లేదా అప్పుడప్పుడూ మీ కుటుంబ ఆరాధనకు ఆహ్వానించండి. బాధపడుతున్న వాళ్లపట్ల పెద్దలు కనికరం, ప్రేమ, శ్రద్ధ చూపించాలి.—1 థెస్స. 2:7, 8.
ఆశ వదులుకోకుండా యెహోవా మీద నమ్మకం చూపిస్తూ ఉండండి
18. రెండో పేతురు 3:9 ప్రకారం, తనను విడిచివెళ్లినవాళ్లు ఏం చేయాలని యెహోవా కోరుతున్నాడు?
18 “ఎవ్వరూ నాశనమవ్వడం ఆయనకు [యెహోవాకు] ఇష్టంలేదు. ఆయన, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాడు.” (2 పేతురు 3:9 చదవండి.) ఒకవ్యక్తి గంభీరమైన పాపం చేసినా, అతని ప్రాణం దేవునికి ఇంకా విలువైనదే. యెహోవా తన ప్రియకుమారుని ప్రాణాన్ని ఒక గొప్ప మూల్యంగా మనలో ప్రతీఒక్కరి కోసం చెల్లించాడని గుర్తుంచుకోండి. తనకు దూరమైనవాళ్లు, తిరిగి తన దగ్గరికి వచ్చేలా యెహోవా ప్రేమతో సహాయం చేస్తాడు. ఆయన వాళ్లకోసం ఎదురుచూస్తూ ఉంటాడని యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉదాహరణ నుండి మనకు తెలుస్తుంది. (లూకా 15:11-32) సత్యాన్ని వదిలివెళ్లిన చాలామంది తిరిగి యెహోవా దగ్గరికి వచ్చారు. అలాగే సంఘంలోని సహోదరసహోదరీలు వాళ్లను సంతోషంగా ఆహ్వానించారు. ఎలిజబెత్ అనే సహోదరి తన కొడుకుని తిరిగి చేర్చుకున్నప్పుడు చాలా సంతోషించింది. దాన్ని గుర్తుచేసుకుంటూ ఇలా అంది: “ఆశ వదులుకోవద్దని మమ్మల్ని చాలామంది ప్రోత్సహించినందుకు మేమిప్పుడు సంతోషిస్తున్నాం.”
19. మనమెప్పుడూ యెహోవాపై ఎందుకు నమ్మకం ఉంచవచ్చు?
19 మనమెప్పుడూ యెహోవాపై నమ్మకం ఉంచవచ్చు. ఆయనిచ్చే సలహాల వల్ల మనకెప్పుడూ మంచే జరుగుతుంది. ఆయన ఉదారత, కనికరం ఉన్న తండ్రి. తనని ప్రేమించి, ఆరాధించే వాళ్లపట్ల ఆయనెంతో ప్రేమ చూపిస్తాడు. మీరు తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టడనే నమ్మకంతో ఉండండి. (హెబ్రీ. 13:5, 6) మార్క్ ఇలా చెప్తున్నాడు: “యెహోవా మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. మనం కష్టాల్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆయన మనకు దగ్గరగా ఉంటాడు.” యెహోవా మీకు “అసాధారణ శక్తి” ఇస్తూనే ఉంటాడు. (2 కొరిం. 4:7) మీ కుటుంబంలో ఎవరైనా యెహోవాను విడిచి వెళ్లినప్పటికీ మీరు మాత్రం యెహోవాకు నమ్మకంగా ఉండొచ్చు, వాళ్లు తిరిగి ఆయన దగ్గరకు వస్తారనే ఆశతో ఉండొచ్చు.
పాట 44 ఒక దీనుడి ప్రార్థన
a మనం ప్రేమించే ఎవరైనా యెహోవాకు దూరమైనప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఆ సమయంలో మన దేవునికి ఎలా అనిపిస్తుందో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. బహిష్కరించబడిన వ్యక్తి కుటుంబసభ్యులు ఓదార్పు పొందడానికి, తమ విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి ఏం చేయొచ్చో తెలుసుకుంటాం. బాధపడుతున్న ఆ కుటుంబాన్ని సంఘం ఎలా ఓదార్చవచ్చో, సహాయం చేయవచ్చో కూడా చర్చిస్తాం.
b కొన్ని అసలు పేర్లు కావు.