కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండడం అంటే ఏమిటి?

ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండడం అంటే ఏమిటి?

“దేవుడు మీకందరికీ క్రీస్తుయేసుకు ఉన్నలాంటి మనోవైఖరిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.”రోమా. 15:5.

పాటలు: 17, 13

1, 2. (ఎ) ఆధ్యాత్మిక వ్యక్తులుగా ఉండడం గురించి చాలామంది ఎలా భావిస్తున్నారు? (బి) ఈ ఆర్టికల్‌లో ప్రాముఖ్యమైన ఏ ప్రశ్నల గురించి చర్చిస్తాం?

 “ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండడంవల్ల చాలా సంతోషంగా ఉంటున్నాను, ప్రతీరోజు ఎదురయ్యే సమస్యల్ని చక్కగా పరిష్కరించుకోగలుగుతున్నాను” అని కెనడాకు చెందిన ఒక సహోదరి చెప్పింది. “నేనూ, నా భార్య ఆధ్యాత్మిక వ్యక్తులుగా ఉండడానికి కృషిచేయడం వల్ల 23 ఏళ్ల మా వివాహ జీవితం చాలా సాఫీగా సాగింది” అని బ్రెజిల్‌కు చెందిన ఒక సహోదరుడు చెప్పాడు. “ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండడంవల్ల మనశ్శాంతిని పొందాను; వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చిన తోటి సహోదరులతో చక్కగా ప్రవర్తించడం నేర్చుకోగలిగాను” అని ఫిలిప్పీన్స్‌​కు చెందిన మరో సహోదరుడు అన్నాడు.

2 దీన్నిబట్టి, ఆధ్యాత్మిక వ్యక్తులుగా ఉండడంవల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉంటూ, దానివల్ల వచ్చే ప్రయోజనాల్ని పూర్తిగా ఆనందించాలంటే ఏమి చేయవచ్చు? మొదటిగా, ఆధ్యాత్మిక వ్యక్తుల గురించి బైబిలు ఏమి చెప్తుందో మనం అర్థంచేసుకోవాలి. ఈ ఆర్టికల్‌లో ప్రాముఖ్యమైన మూడు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం. (1) ఆధ్యాత్మిక వ్యక్తులుగా ఉండడం అంటే ఏమిటి? (2) ఆధ్యాత్మిక వ్యక్తులుగా ఎదగడానికి ఎవరి ఉదాహరణలు సహాయం చేస్తాయి? (3) “క్రీస్తు మనసు” కలిగివుండడానికి కృషి చేయడం ద్వారా ఆధ్యాత్మిక వ్యక్తులుగా ఎలా తయారౌతాం?

ఆధ్యాత్మిక వ్యక్తిని ఎలా గుర్తించవచ్చు?

 3. సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తికీ, ఆధ్యాత్మిక వ్యక్తికీ మధ్య ఉన్న తేడా గురించి బైబిలు ఏమి చెప్తుంది?

3 సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తికీ, ఆధ్యాత్మిక వ్యక్తికీ మధ్య తేడాను అర్థంచేసుకోవడానికి అపొస్తలుడైన పౌలు మనకు సహాయం చేస్తున్నాడు. (1 కొరింథీయులు 2:14-16 చదవండి.) సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తి, “దేవుని పవిత్రశక్తికి సంబంధించిన విషయాల్ని అంగీకరించడు. ఎందుకంటే, అతనికి అవి మూర్ఖత్వంగా కనిపిస్తాయి; అతను వాటిని అర్థంచేసుకోలేడు.” దానికి భిన్నంగా ఆధ్యాత్మిక వ్యక్తి, “అన్ని విషయాల్ని సరిగ్గా అంచనా వేస్తాడు,” “క్రీస్తు మనసు” కలిగివుండడానికి అంటే క్రీస్తులా ఆలోచించడానికి కృషిచేస్తాడు. మనల్ని ఆధ్యాత్మిక వ్యక్తులుగా ఉండమని పౌలు ప్రోత్సహిస్తున్నాడు. సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తికీ, ఆధ్యాత్మిక వ్యక్తికీ మధ్య ఉన్న ఇతర తేడాలు ఏమిటి?

4, 5. సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు? ఎలా ప్రవర్తిస్తాడు?

4 సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు? అతను లోకస్థుల వైఖరిని అలవర్చుకుంటాడు, మరో మాటలో చెప్పాలంటే శరీర కోరికలు తీర్చుకోవడం మీదే మనసుపెడతాడు. అలాంటి వైఖరి, “అవిధేయుల మీద ప్రభావం చూపిస్తోంది” అని పౌలు చెప్తున్నాడు. (ఎఫె. 2:2) నిజమే, అలాంటి వైఖరిగలవాళ్లను చూసినప్పుడు, వాళ్లను అనుకరించాలనే కోరిక చాలామందిలో కలుగుతుంది. దానివల్ల వాళ్లు తమకు నచ్చిందే చేస్తారు తప్ప దేవుని ప్రమాణాల్ని పట్టించుకోరు. సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తి, తన హోదా, డబ్బు, హక్కులే అన్నిటికన్నా ప్రాముఖ్యమని భావిస్తాడు.

5 అంతేకాదు, “పాపపు శరీరం చేసే పనులు” అని బైబిలు వర్ణిస్తున్న వాటిని చేస్తాడు. (గల. 5:19-21) సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తి చేసే ఇతర పనులను, పౌలు కొరింథులోని క్రైస్తవులకు రాసిన మొదటి ఉత్తరంలో ప్రస్తావించాడు. ఆ పనులు ఏమిటంటే: పక్షపాతం చూపించడం, విభజనలు సృష్టించడం, తిరుగుబాటు చేసేలా ఇతరుల్ని రెచ్చగొట్టడం, ఇతరుల్ని కోర్టుకు ఈడ్చడం, శిరస్సత్వాన్ని గౌరవించకపోవడం, తినడాన్ని-తాగడాన్ని అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎంచడం. అంతేకాదు అలాంటి వ్యక్తి తప్పుచేయాలనే శోధన ఎదురైనప్పుడు దాన్ని ఎదిరించడు. (సామె. 7:21, 22) అలాంటివాళ్లలో దేవుని పవిత్రశక్తి ఉండదని యూదా చెప్పాడు.—యూదా 18, 19.

 6. ఆధ్యాత్మిక వ్యక్తిని ఎలా గుర్తించవచ్చు?

6 మరి ఆధ్యాత్మిక వ్యక్తిని ఎలా గుర్తించవచ్చు? అతను దేవునితో తనకున్న సంబంధాన్ని చాలా విలువైనదిగా ఎంచుతాడు. దేవుని పవిత్రశక్తి ఇచ్చే నిర్దేశం ప్రకారం నడుస్తాడు, యెహోవాను అనుకరించడానికి కృషిచేస్తాడు. (ఎఫె. 5:1) అంతేకాదు యెహోవా ఆలోచనల్ని తెలుసుకోవడానికి, విషయాల్ని యెహోవా దృష్టితో చూడడానికి ప్రయత్నిస్తాడు. అలాగే యెహోవాను నిజమైన వ్యక్తిగా చూస్తాడు. ఆధ్యాత్మిక వ్యక్తి ప్రతీ చిన్న విషయంలో యెహోవా ప్రమాణాల్ని పాటిస్తాడు. (కీర్త. 119:33; 143:10) “పాపపు శరీరం చేసే పనులు” చేసే బదులు “పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు” అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. (గల. 5:22, 23) సూటిగా చెప్పాలంటే, దేవుని ఆరాధనను నిజంగా ప్రాముఖ్యంగా ఎంచే వ్యక్తే ఆధ్యాత్మిక వ్యక్తి.

 7. ఆధ్యాత్మిక వ్యక్తుల గురించి బైబిలు ఏమి చెప్తుంది?

7 ఆధ్యాత్మిక వ్యక్తులు సంతోషంగా ఉంటారని యేసు చెప్పాడు. మత్తయి 5:3⁠లో మనమిలా చదువుతాం: “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్లది.” యెహోవాలా ఆలోచించడం వల్ల జీవాన్ని పొందుతామని రోమీయులు 8:6 వివరిస్తుంది. అక్కడిలా ఉంది, “శరీర కోరికల మీద మనసుపెడితే మరణాన్ని పొందుతాం, కానీ పవిత్రశక్తికి సంబంధించిన విషయాల మీద మనసుపెడితే జీవాన్ని పొందుతాం, దేవునితో శాంతియుత సంబంధాన్ని కలిగివుంటాం.” కాబట్టి ఆధ్యాత్మిక వ్యక్తులుగా ఉంటే ఇప్పుడు దేవునితో శాంతియుత సంబంధాన్ని కలిగివుంటాం, మనశ్శాంతిని పొందుతాం, భవిష్యత్తులో శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకుంటాం.

 8. ఈ లోకంలో మన ఆధ్యాత్మికతను కాపాడుకోవడం ఎందుకు కష్టం కావచ్చు?

8 మనం ప్రమాదకరమైన లోకంలో జీవిస్తున్నాం. మన చుట్టూ ఉన్న ప్రజల ఆలోచనలు దేవునికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి మన మనసును కాపాడుకోవడానికి తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మన మనసును యెహోవా ఆలోచనలతో నింపుకోకపోతే, లోకం శారీరక ఆలోచనల్ని మన మనసులో నింపేస్తుంది. అలా జరగకూడదంటే మనమేమి చేయాలి? ఆధ్యాత్మికంగా మనమెలా ఎదగవచ్చు?

ఆదర్శవంతులైన వ్యక్తుల నుండి నేర్చుకోండి

 9. (ఎ) ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మనమేమి చేయాలి? (బి) మనం ఎవరి ఉదాహరణల్ని పరిశీలిస్తాం?

9 పిల్లలు పరిణతి సాధించాలంటే వాళ్లు తమ అమ్మానాన్నల్ని గమనిస్తూ, వాళ్ల మంచి ఆదర్శాన్ని అనుకరించాలి. అదేవిధంగా, మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే యెహోవాతో దగ్గరి సంబంధం కలిగివున్న వ్యక్తుల జీవితాల్ని గమనించాలి, వాళ్లను అనుకరించాలి. అయితే, శరీర కోరికల ప్రకారం ప్రవర్తించిన వ్యక్తుల జీవితాల్ని గమనించినప్పుడు ఎలాంటి ప్రవర్తనకు దూరంగా ఉండాలో తెలుసుకుంటాం. (1 కొరిం. 3:1-4) బైబిల్లో మంచివాళ్ల ఉదాహరణలతోపాటు, చెడ్డవాళ్ల ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం, ఆదర్శవంతులైన కొంతమంది గురించి పరిశీలిద్దాం. వాళ్లెవరంటే: యాకోబు, మరియ, యేసు.

యాకోబు ఆదర్శం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (10 పేరా చూడండి)

10. తాను ఆధ్యాత్మిక వ్యక్తినని యాకోబు ఎలా చూపించాడు?

10 ముందుగా యాకోబు గురించి పరిశీలిద్దాం. మనలో చాలామందిలాగే, యాకోబు జీవితం కూడా సాఫీగా సాగలేదు. ఒకవైపు, సొంత అన్న అయిన ఏశావు ఆయన్ని చంపాలని చూశాడు; మరోవైపు తన మామయ్య మోసం చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. చుట్టూ ఉన్న ప్రజలు తమ సొంత కోరికల ప్రకారం జీవిస్తున్నా యాకోబు మాత్రం ఆధ్యాత్మిక వ్యక్తిగా జీవించాడు. అయినాగానీ, యెహోవా అబ్రాహాముకు చేసిన వాగ్దానం మీద యాకోబుకు ఉన్న నమ్మకం చెక్కుచెదరలేదు. ఆ అద్భుతమైన వాగ్దాన నెరవేర్పులో తన కుటుంబసభ్యులు కూడా ఉంటారని యాకోబుకు తెలుసు కాబట్టి ఆయన వాళ్లను శ్రద్ధగా చూసుకున్నాడు. (ఆది. 28:10-15) దేవుని ప్రమాణాల్ని, చిత్తాన్ని యాకోబు మర్చిపోలేదని ఆయన మాటలు, పనులు చూపించాయి. ఉదాహరణకు, తన అన్న నుండి ఆయనకు ప్రాణహాని ఉందని గ్రహించినప్పుడు తనను కాపాడమని యెహోవాకు ప్రార్థన చేస్తూ యాకోబు ఇలా అన్నాడు, ‘నువ్వు నాతో ఇలా అన్నావు: “నేను నీకు ఖచ్చితంగా మేలు చేస్తాను, నీ సంతానాన్ని సముద్రతీరాన ఉండే ఇసుక రేణువుల్లా లెక్కపెట్టలేనంత మంది అయ్యేలా చేస్తాను.”’ (ఆది. 32:6-12, NW) యెహోవా వాగ్దానాలపై యాకోబుకు బలమైన విశ్వాసం ఉంది, దాన్ని తన జీవన విధానం ద్వారా నిరూపించాడు.

మరియ ఆదర్శం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (11 పేరా చూడండి)

11. మరియ ఆధ్యాత్మిక వ్యక్తి అని ఎలా చెప్పవచ్చు?

11 ఇప్పుడు మరియ గురించి పరిశీలిద్దాం. మరియ ఆధ్యాత్మిక వ్యక్తి కాబట్టే యేసుకు తల్లిగా ఉండడానికి యెహోవా ఆమెను ఎన్నుకున్నాడు. మరియ తన బంధువులైన జెకర్యా, ఎలీసబెతులను కలవడానికి వెళ్లినప్పుడు అన్న మాటల్ని చదవండి. (లూకా 1:46-55 చదవండి.) మరియ మాటల్నిబట్టి, ఆమెకు దేవుని వాక్యమంటే చాలా ఇష్టమని, హీబ్రూ లేఖనాలు బాగా తెలుసని అర్థమౌతుంది. (ఆది. 30:13; 1 సమూ. 2:1-10; మలా. 3:12) అంతేకాదు యోసేపు, మరియలు వివాహం చేసుకున్న తర్వాత కూడా, యేసు పుట్టేంత వరకు లైంగిక సంబంధం పెట్టుకోలేదు. దీన్నిబట్టి మనమేమి తెలుసుకోవచ్చు? యోసేపు, మరియలు తమ సొంత కోరికల కన్నా యెహోవా ఇష్టానికి, ఆయన ప్రమాణాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. (మత్త. 1:25) యేసు పెరిగి పెద్దవాడౌతుండగా, ఆయన జీవితంలో జరిగే ప్రతీ సంఘటనను మరియ జాగ్రత్తగా గమనించింది, ఆయన బోధించిన విషయాల్ని జాగ్రత్తగా వింది. తర్వాత వాటిని “తన హృదయంలో దాచుకుంది.” (లూకా 2:51) దీన్నిబట్టి, మెస్సీయకు సంబంధించిన దేవుని వాగ్దానాలపట్ల ఆమెకు చాలా ఆసక్తి ఉందని చెప్పవచ్చు. మనం ఎల్లప్పుడూ దేవుని ఇష్టానికి మొదటిస్థానం ఎలా ఇవ్వవచ్చో తెలుసుకోవడానికి మరియ ఆదర్శం సహాయం చేయదంటారా?

12. (ఎ) యేసు తన తండ్రిని ఎలా అనుకరించాడు? (బి) మనమెలా యేసును అనుకరించవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

12 భూమ్మీద జీవించిన వాళ్లందరిలోకెల్లా ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక వ్యక్తి యేసు. భూమ్మీద ఆయన జీవితం, పరిచర్య అంతటిలో తన తండ్రిని అనుకరించాలని కోరుకుంటున్నట్లు చూపించాడు. యేసు యెహోవాలా ఆలోచించాడు, భావించాడు, ప్రవర్తించాడు. అంతేకాదు దేవుని ఇష్టాన్ని చేశాడు, ఆయన ప్రమాణాల్ని గౌరవించాడు. (యోహా. 8:29; 14:9; 15:10) ఉదాహరణకు యెషయా తన పుస్తకంలో యెహోవా కనికరాన్ని వర్ణించిన తీరును, మార్కు తన సువార్తలో యేసు భావాల్ని వర్ణించిన తీరును పోల్చి చూడండి. (యెషయా 63:9; మార్కు 6:34 చదవండి.) మనం యేసును అనుకరిస్తూ, అవసరంలో ఉన్నవాళ్లపై కనికరం చూపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామా? యేసులా మనం మంచివార్త ప్రకటించడం పై, బోధించడం పై మనసుపెడుతున్నామా? (లూకా 4:43) ఆధ్యాత్మిక వ్యక్తులు కనికరం చూపిస్తారు, ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు.

13, 14. (ఎ) మనకాలంలోని ఆధ్యాత్మిక వ్యక్తుల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (బి) ఒక అనుభవం చెప్పండి.

13 మనకాలంలోని సహోదరసహోదరీల్లో, క్రీస్తును అనుకరించడానికి కృషిచేసే ఆధ్యాత్మిక వ్యక్తులు చాలామంది ఉన్నారు. పరిచర్యలో వాళ్లు చూపించే ఉత్సాహం, వాళ్ల ఆతిథ్య స్ఫూర్తి, కనికరం మీరు గమనించే ఉంటారు. వాళ్లు పరిపూర్ణులు కాకపోయినా మంచి లక్షణాల్ని అలవర్చుకోవడానికి, యెహోవా కోరుకుంటున్నట్లు చేయడానికి చాలా తీవ్రంగా కృషిచేస్తారు. బ్రెజిల్‌కు చెందిన రేచల్‌​ అనే సహోదరి ఇలా చెప్పింది, “నేను లోకంలో ఉన్న ఫ్యాషన్‌కు తగ్గట్లు ఉండడానికి ఇష్టపడేదాన్ని. దానివల్ల నా బట్టలు గౌరవపూర్వకంగా ఉండేవి కావు. కానీ సత్యం తెలుసుకోవడం వల్ల ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండడానికి కృషి చేశాను. మార్పులు చేసుకోవడం తేలిగ్గా అనిపించలేదు. కానీ ఎంతో సంతోషాన్ని, జీవితానికి నిజమైన అర్థాన్ని కనుగొన్నాను.”

14 ఫిలిప్పీన్స్‌కు చెందిన రేలీన్‌​ అనే సహోదరి మరో రకమైన సమస్యను ఎదుర్కొంది. ఆమె యెహోవాసాక్షే అయినప్పటికీ ఆమె ధ్యాసంతా పైచదువులు, మంచి ఉద్యోగం మీదే ఉండేది. కాలం గడిచేకొద్దీ తన ఆధ్యాత్మిక లక్ష్యాలకున్న ప్రాముఖ్యతను మర్చిపోయింది. ఆమె ఇలా చెప్పింది, “ఉద్యోగం కన్నా ప్రాముఖ్యమైనదేదో నా జీవితంలో కోల్పోతున్నట్లు గుర్తించడం మొదలుపెట్టాను. దానివల్ల యెహోవా సేవ మీద మళ్లీ ధ్యాస నిలపగలిగాను.” అప్పటినుండి మత్తయి 6:33, 34⁠లో యెహోవా చేసిన వాగ్దానం మీద నమ్మకం ఉంచిన రేలీన్‌ ఇలా అంటోంది, “యెహోవా నన్ను చూసుకుంటాడని నాకు ఖచ్చితంగా తెలుసు.” అలాంటి నమ్మకమే ఉన్న సహోదరసహోదరీలు మీ సంఘంలో కూడా ఉండేవుంటారు. క్రీస్తును వాళ్లెలా అనుకరిస్తున్నారో చూసినప్పుడు, వాళ్ల నమ్మకమైన ఆదర్శాన్ని అనుకరించాలనే కోరిక మనలో కూడా కలుగుతుంది.—1 కొరిం. 11:1; 2 థెస్స. 3:7.

“క్రీస్తు మనసు” కలిగివుండండి

15, 16. (ఎ) క్రీస్తులా ఉండాలంటే మనమేమి చేయాలి? (బి) యేసులా ఆలోచించడం మనమెలా నేర్చుకోవచ్చు?

15 క్రీస్తును మనమెలా అనుకరించవచ్చు? 1 కొరింథీయులు 2:16 మనల్ని “క్రీస్తు మనసు” కలిగివుండమని ప్రోత్సహిస్తుంది. అంతేకాదు రోమీయులు 15:5, “క్రీస్తుయేసుకు ఉన్నలాంటి మనోవైఖరిని” వృద్ధి చేసుకోమని మనకు గుర్తుచేస్తుంది. క్రీస్తులా ఉండాలంటే ఆయనెలా ఆలోచించాడో, భావించాడో, ప్రవర్తించాడో మనం తెలుసుకోవాలి. దేవునితో ఉన్న సంబంధానికే యేసు అన్నిటికన్నా ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. యేసులా ఉండడానికి ప్రయత్నిస్తే యెహోవా లక్షణాల్ని అలవర్చుకోగలుగుతాం. అందుకే యేసులా ఆలోచించడం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం.

16 మరి యేసులా ఆలోచించడం మనమెలా నేర్చుకోవచ్చు? శిష్యులు, యేసు అద్భుతాలు చేయడం చూశారు, గుంపులుగా వచ్చిన ప్రజలకు బోధించడం విన్నారు, అన్నిరకాల ప్రజలతో ఆయన ఎలా ప్రవర్తించాడో అలాగే యెహోవా ఆలోచనల ప్రకారం ఎలా నడుచుకున్నాడో గమనించారు. అందుకే వాళ్లిలా అన్నారు, “ఆయన చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం.” (అపొ. 10:39) నేడు మనం యేసును చూడలేం. కానీ ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి సహాయం చేసే సువార్త వృత్తాంతాలు మనకు అందుబాటులో ఉన్నాయి. మత్తయి,మార్కు,లూకా,యోహాను సువార్తలను చదివి ధ్యానించినప్పుడు “క్రీస్తు మనసు” మనకు బాగా తెలుస్తుంది. దానివల్ల క్రీస్తు “అడుగుజాడల్లో” నమ్మకంగా నడవగలుగుతాం, ఆయనలా ఆలోచించగలుగుతాం.—1 పేతు. 2:21; 4:1.

17. క్రీస్తులా ఆలోచించడం వల్ల మనమెలాంటి ప్రయోజనం పొందుతాం?

17 క్రీస్తులా ఆలోచించడం వల్ల మనమెలాంటి ప్రయోజనం పొందుతాం? పౌష్టికాహారం మన శరీరాన్ని బలంగా చేసినట్లే, క్రీస్తు ఆలోచనలతో నిండిన మనసు మనల్ని ఆధ్యాత్మికంగా బలంగా చేస్తుంది. ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు యేసు ఏమి చేసేవాడో క్రమక్రమంగా గ్రహించగలుగుతాం. అప్పుడు దేవున్ని సంతోషపెట్టే తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం, మంచి మనస్సాక్షితో ఉండగలుగుతాం. ‘ప్రభువైన యేసుక్రీస్తును అనుకరించడానికి’ ఇవి మంచి కారణాలు కాదంటారా?—రోమా. 13:14.

18. ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండడం గురించి మీరు ఏ విషయాలు తెలుసుకున్నారు?

18 ఈ ఆర్టికల్‌ ద్వారా, ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండడం అంటే ఏమిటో అర్థంచేసుకున్నాం. పవిత్రశక్తి ఇచ్చే నిర్దేశం ప్రకారం నడుచుకునేవాళ్ల మంచి ఆదర్శం నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకున్నాం. “క్రీస్తు మనసు” కలిగివుండడం వల్ల యెహోవాలా ఆలోచించగలుగుతామని, ఆయనతో దగ్గరి సంబంధం కలిగివుంటామని కూడా తెలుసుకున్నాం. అయితే ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండాలంటే ఇవి మాత్రమే సరిపోవు. ఉదాహరణకు, మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నామో లేదో ఎలా తెలుసుకోవచ్చు? ఆధ్యాత్మికంగా మరింత బలంగా తయారవ్వాలంటే మనమేమి చేయాలి? ఆధ్యాత్మికత మన జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? తర్వాతి ఆర్టికల్‌లో వీటికి జవాబులు తెలుసుకుందాం.