అధ్యయన ఆర్టికల్ 4
సాదాసీదాగా ఉండే ప్రభువు రాత్రి భోజనం మన పరలోక రాజు గురించి ఏం చెప్తుంది?
‘ఇది నా శరీరాన్ని సూచిస్తోంది. ఇది నా “ఒప్పంద రక్తాన్ని” సూచిస్తోంది.’—మత్త. 26:26-28.
పాట 16 అభిషిక్త కుమారుణ్ణి బట్టి యెహోవాను స్తుతించండి
ఈ ఆర్టికల్‌లో . . . a
1-2. (ఎ) తన మరణ జ్ఞాపకార్థ ఆచరణ కోసం యేసు ఒక సరళమైన, అర్థవంతమైన పద్ధతిని ఎందుకు ఎంచుకున్నాడు? (బి) ఈ ఆర్టికల్‌లో యేసుకున్న ఏ లక్షణాల గురించి చర్చించుకుంటాం?
ప్రతీ సంవత్సరం హాజరయ్యే యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణలో ఏం జరుగుతుందో వివరించగలరా? ఆ ఆచరణ గురించి వినగానే, ప్రభువు రాత్రి భోజనానికి సంబంధించిన విషయాలు మీకు గుర్తుకురావచ్చు. ఎందుకు? ఎందుకంటే, ఆ భోజనం చాలా సాదాసీదాగా ఉంటుంది. అయినప్పటికీ అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనకు ఈ ప్రశ్న రావచ్చు, ‘ప్రభువు రాత్రి భోజనం ఎందుకంత సాదాసీదాగా ఉంటుంది?’
2 యేసు భూమ్మీద పరిచర్య చేసినప్పుడు, ప్రజలకు ప్రాముఖ్యమైన సత్యాల్ని సరళంగా, స్పష్టంగా, తేలిగ్గా అర్థమయ్యేలా బోధించాడు. (మత్త. 7:28, 29) అదేవిధంగా, తన మరణ జ్ఞాపకార్థ b ఆచరణను కూడా యేసు ఒక సులభమైన, అర్థవంతమైన పద్ధతిలో చేసి చూపించాడు. ఈ ఆర్టికల్‌లో ప్రభువు రాత్రి భోజనం గురించి, యేసు చెప్పిన-చేసిన కొన్నిటి గురించి లోతుగా పరిశీలిద్దాం. అప్పుడు యేసు ఎంత వినయస్థుడో, ధైర్యవంతుడో, ప్రేమగలవాడో తెలుసుకుంటాం. అంతేకాదు, ఆయన్ని ఇంకా ఎక్కువగా ఎలా అనుకరించవచ్చో నేర్చుకుంటాం.
యేసు వినయస్థుడు
3. మత్తయి 26:26-28 ప్రకారం యేసు స్థాపించిన ప్రభువు రాత్రి భోజనం సాదాసీదాగా ఉందని ఎలా చెప్పవచ్చు? ఆయన ఉపయోగించిన రొట్టె, ద్రాక్షారసం దేన్ని సూచిస్తున్నాయి?
3 యేసు తన మరణ జ్ఞాపకార్థ ఆచరణను 11 మంది నమ్మకమైన అపొస్తలులతో స్థాపించాడు. పస్కా భోజనం చేశాక మిగిలిన వాటితో ఆ ఆచరణ ప్రారంభించాడు. (మత్తయి 26:26-28 చదవండి.) అక్కడున్న పులియని రొట్టెను, ద్రాక్షారసాన్ని మాత్రమే ఆయన ఆ ఆచరణ కోసం ఉపయోగించాడు. త్వరలో వాళ్లకోసం ఆయన బలిగా ఇవ్వబోయే తన పరిపూర్ణ శరీరాన్ని, రక్తాన్ని అవి సూచిస్తున్నాయని అపొస్తలులకు చెప్పాడు. యేసు ఏర్పాటు చేసిన ప్రాముఖ్యమైన ఆ కొత్త ఆచరణ సాదాసీదాగా ఉండడం చూసి అపొస్తలులు ఆశ్చర్యపోయి ఉండకపోవచ్చు. ఎందుకు?
4. యేసు మార్తకు ఇచ్చిన ఏ సలహాను బట్టి ప్రభువు రాత్రి భోజనాన్ని సాదాసీదాగా ఏర్పాటు చేశాడు?
4 కొన్ని నెలల క్రితం, అంటే యేసు పరిచర్య ప్రారంభించిన మూడో సంవత్సరంలో ఏం జరిగిందో పరిశీలించండి. యేసు తన సన్నిహిత స్నేహితులైన లాజరును, మార్తను, మరియను కలవడానికి వాళ్ల ఇంటికి వెళ్లాడు. యేసు ప్రశాంతమైన వాతావరణంలో బోధించడం మొదలుపెట్టాడు. మార్త అక్కడే ఉన్నప్పటికీ, ముఖ్య అతిథిగా వచ్చిన యేసు కోసం రకరకాల వంటకాలు చేయడంలో మునిగిపోయింది. అది గమనించిన యేసు, భోజనం కోసం ఎక్కువ వంటకాలు అవసరం లేదని ఆమెను దయగా సరిదిద్దాడు. (లూకా 10:40-42) కొంతకాలం తర్వాత, యేసు చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఆయనే స్వయంగా ఆ సలహాను పాటించాడు. ప్రభువు రాత్రి భోజనాన్ని సాదాసీదాగా ఏర్పాటు చేశాడు. దీన్నిబట్టి యేసు ఎలాంటి వ్యక్తని అర్థమౌతుంది?
5. సాదాసీదాగా ఉన్న ప్రభువు రాత్రి భోజనం బట్టి యేసు ఎలాంటి వ్యక్తని అర్థమౌతుంది? ఆ విషయాన్ని ఫిలిప్పీయులు 2:5-8లో ఉన్న మాటలు ఎలా రుజువుచేస్తున్నాయి?
5 యేసు ఎల్లప్పుడూ తన మాటల్లో, పనుల్లో వినయం చూపించాడు. కాబట్టి చనిపోవడానికి ముందురోజు రాత్రి ఆయన గొప్ప వినయం చూపించడం ఆశ్చర్యమేమీ కాదు. (మత్త. 11:29) మానవ చరిత్రలో ఎవ్వరూ చేయనంత గొప్ప త్యాగం ఆయన చేయబోతున్నాడనీ, యెహోవా ఆయన్ని పునరుత్థానం చేసి పరలోకంలో రాజుగా చేస్తాడనీ యేసుకు తెలుసు. అయినప్పటికీ, తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆర్భాటంగా ఏర్పాట్లు చేసి, తనవైపు అనవసరమైన అవధానం వచ్చేలా చేసుకోలేదు. బదులుగా, సాదాసీదాగా ఉండే ప్రభువు రాత్రి భోజనం ద్వారా ప్రతీ సంవత్సరం తనను జ్ఞాపకం చేసుకోమని శిష్యులకు చెప్పాడు. (యోహా. 13:15; 1 కొరిం. 11:23-25) సాదాసీదాగా, సందర్భానికి తగ్గట్లుగా ఉన్న ప్రభువు రాత్రి భోజనం, యేసు గర్విష్ఠి కాదని చూపిస్తుంది. మన పరలోక రాజైన యేసు చూపించిన గొప్ప లక్షణాల్లో వినయం ఒకటని తెలుసుకొని మనం సంతోషించవచ్చు.—ఫిలిప్పీయులు 2:5-8 చదవండి.
6. పరీక్షలు ఎదురైనప్పుడు యేసులా మనమెలా వినయం చూపించవచ్చు?
6 మనం యేసులా ఎలా వినయం చూపించవచ్చు? మన అవసరాల కన్నా ఇతరుల అవసరాలకు ప్రాముఖ్యతనివ్వడం ద్వారా వినయం చూపించవచ్చు. (ఫిలి. 2:3, 4) యేసు భూమ్మీద గడిపిన చివరి రాత్రి గురించి ఆలోచించండి. యేసు త్వరలో బాధ అనుభవించి చనిపోతాడని తెలిసినా, తన కోసం దుఃఖించే నమ్మకమైన అపొస్తలుల గురించే ఆయన ఎక్కువ ఆలోచించాడు. అందుకే ఆయన తన చివరి రాత్రి అపొస్తలులకు బోధిస్తూ, ప్రోత్సాహాన్నిస్తూ, ధైర్యం చెప్తూ గడిపాడు. (యోహా. 14:25-31) యేసు తన బాగోగుల కన్నా ఇతరుల బాగోగుల్ని ఎక్కువ పట్టించుకున్నాడు. ఆయన వినయం మనకు ఎంత చక్కని ఆదర్శమో కదా!
యేసు ధైర్యవంతుడు
7. ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపించిన తర్వాత, యేసు ఎలా అసాధారణ ధైర్యం చూపించాడు?
7 ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపించిన తర్వాత యేసు అసాధారణ ధైర్యం చూపించాడు. ఎలా? దైవదూషణ చేశాడనే నేరం మోపి, తనను అవమానించి చంపుతారని తెలిసినా యేసు తన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. (మత్త. 26:65, 66; లూకా 22:41, 42) యెహోవా పేరును ఘనపర్చడానికి, ఆయన సర్వాధిపత్యాన్ని సమర్థించడానికి, పశ్చాత్తాపపడే మనుషులు శాశ్వత జీవం పొందే మార్గాన్ని తెరవడానికి యేసు పరిపూర్ణ యథార్థతను చూపించాడు. అదే సమయంలో, తన అనుచరులు త్వరలో ఎదుర్కోబోయే వాటికోసం వాళ్లను సిద్ధం చేశాడు.
8. (ఎ) యేసు తన నమ్మకమైన అపొస్తలులకు ఏం చెప్పాడు? (బి) యేసు చనిపోయి చాలా సంవత్సరాలు గడిచాక కూడా శిష్యులు ఆయనలా ఎలా ధైర్యం చూపించారు?
8 తన ఆందోళనల మీద కాకుండా, నమ్మకమైన అపొస్తలుల అవసరాల మీద మనసుపెట్టడం ద్వారా కూడా యేసు ధైర్యం చూపించాడు. యూదాను పంపించేశాక యేసు ప్రభువు రాత్రి భోజనాన్ని ప్రారంభించాడు. తన అభిషిక్త అనుచరులుగా తయారయ్యేవాళ్లు, యేసు చిందించిన రక్తం వల్ల అలాగే కొత్త ఒప్పందంలో భాగంగా ఉండడం వల్ల పొందే ప్రయోజనాల్ని ఆ ఆచరణ గుర్తుచేస్తుంది. (1 కొరిం. 10:16, 17) వాళ్లు చివరివరకు నమ్మకంగా ఉండి, తనతోపాటు పరలోకంలో పరిపాలించాలంటే ఆయనా, ఆయన తండ్రి వాళ్లనుండి ఏం కోరుతున్నారో యేసు చెప్పాడు. (యోహా. 15:12-15) అంతేకాదు అపొస్తలులు ముందుముందు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొంటారో యేసు చెప్పాడు. ఆ తర్వాత, తన ఆదర్శాన్ని పాటించమని, ‘ధైర్యం తెచ్చుకోమని’ వాళ్లను ప్రోత్సహించాడు. (యోహా. 16:1-4ఎ, 33) చాలా సంవత్సరాలు గడిచాక కూడా యేసు శిష్యులు, ఆయన చూపించిన స్వయంత్యాగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, ధైర్యం చూపించారు. వాళ్లు బాధ అనుభవించాల్సి వస్తుందని తెలిసినా పరీక్షల్లో ఒకరికొకరు మద్దతిచ్చుకున్నారు.—హెబ్రీ. 10:33, 34.
9. మనం యేసులా ఎలా ధైర్యం చూపిస్తాం?
9 నేడు మనం కూడా యేసులా ధైర్యం చూపిస్తాం. ఉదాహరణకు, విశ్వాసం కారణంగా హింసలు అనుభవిస్తున్న సహోదరులకు సహాయం చేయాలంటే ధైర్యం అవసరం. కొన్నిసార్లు మన సహోదరుల్ని అన్యాయంగా జైల్లో వేయవచ్చు. అలాంటి సందర్భాల్లో వాళ్లకోసం మనం చేయగలినదంతా చేయాలి, అవసరమైతే వాళ్ల తరఫున మాట్లాడాలి కూడా. (ఫిలి. 1:14; హెబ్రీ. 13:19) అంతేకాదు మనం మంచివార్తను నిర్భయంగా ప్రకటిస్తూ “ధైర్యం” చూపిస్తాం. (అపొ. 14:3) ప్రజలు మనల్ని వ్యతిరేకించినా, హింసించినా యేసులా రాజ్య సందేశాన్ని ప్రకటించాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. కానీ కొన్నిసార్లు మనకు భయంగా అనిపించవచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయవచ్చు?
10. జ్ఞాపకార్థ ఆచరణకు కొన్ని వారాల ముందు మనం ఏం చేయాలి? ఎందుకు?
10 యేసుక్రీస్తు విమోచన క్రయధనం వల్ల సాధ్యమయ్యే మన నిరీక్షణ గురించి ఆలోచిస్తూ ధైర్యాన్ని పెంచుకోవచ్చు. (యోహా. 3:16; ఎఫె. 1:7) జ్ఞాపకార్థ ఆచరణకు కొన్ని వారాల ముందు, విమోచన క్రయధనం పట్ల మనకున్న కృతజ్ఞతను పెంచుకునే గొప్ప అవకాశం ఉంది. ఆ సమయంలో, జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన బైబిలు పఠనాన్ని చదవండి, యేసు మరణానికి ముందు జరిగిన సంఘటనల గురించి ప్రార్థనాపూర్వకంగా ధ్యానించండి. అలాచేస్తే ఆ ఆచరణకు హాజరైనప్పుడు జ్ఞాపకార్థ చిహ్నాలకు ఉన్న ప్రాముఖ్యతను, అవి సూచించే సాటిలేని త్యాగాన్ని ఇంకా బాగా అర్థంచేసుకోగలుగుతాం. యెహోవా, యేసు మనకోసం చేసినదాన్ని అలాగే మనమూ మన ప్రియమైనవాళ్లూ పొందే ప్రయోజనాల్ని అర్థంచేసుకున్నప్పుడు మన నిరీక్షణ బలపడుతుంది. అంతేకాదు, చివరివరకు ధైర్యంగా సహించాలనే ప్రోత్సాహం కలుగుతుంది.—హెబ్రీ. 12:3.
11-12. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం?
11 ప్రభువు రాత్రి భోజనం, అమూల్యమైన విమోచన క్రయధనాన్ని మాత్రమే కాదుగానీ యేసుకున్న వినయం, ధైర్యం వంటి అద్భుతమైన లక్షణాల్ని కూడా గుర్తుచేస్తుందని నేర్చుకున్నాం. పరలోకంలో మన తరఫున దేవున్ని వేడుకునే ప్రధాన యాజకుడైన యేసు ఇప్పటికీ ఆ లక్షణాల్ని చూపిస్తున్నందుకు మనమెంత కృతజ్ఞులమో కదా! (హెబ్రీ. 7:24, 25) మన హృదయపూర్వక కృతజ్ఞతను చూపించాలంటే, యేసు ఆజ్ఞాపించినట్లు ఆయన మరణాన్ని నమ్మకంగా జ్ఞాపకం చేసుకోవాలి. (లూకా 22:19, 20) దాన్ని నీసాను 14కు సరిసమానమైన తేదీన చేస్తాం, అది సంవత్సరమంతటిలో అత్యంత ప్రాముఖ్యమైన తేదీ.
12 సాదాసీదాగా ఉండే ప్రభువు రాత్రి భోజనం, యేసుకున్న మరో లక్షణాన్ని కూడా తెలియజేస్తుంది. నిజానికి ఆ లక్షణం వల్లే ఆయన మనకోసం చనిపోయాడు. భూమ్మీద మానవునిగా ఉన్నప్పుడు ఆ లక్షణాన్నే ఎక్కువ చూపించాడు. ఇంతకీ ఏంటా లక్షణం?
యేసు ప్రేమగలవాడు
13. యెహోవా, యేసు చూపించిన ప్రేమ గురించి యోహాను 15:9 అలాగే 1 యోహాను 4:8-10 ఏం చెప్తున్నాయి? వాళ్ల ప్రేమ నుండి ఎవరెవరు ప్రయోజనం పొందుతారు?
13 యెహోవా మనమీద ఎలాంటి ప్రేమ చూపించాడో యేసు కూడా ప్రతీ పనిలో అలాంటి ప్రేమనే చూపించాడు. (యోహాను 15:9; 1 యోహాను 4:8-10 చదవండి.) అన్నిటికన్నా ముఖ్యంగా, ఆ ప్రేమవల్లే యేసు మనకోసం తన ప్రాణం ఇచ్చాడు. మనం అభిషిక్తులమైనా, ‘వేరే గొర్రెలమైనా’ విమోచన క్రయధనం ద్వారా యెహోవా, యేసు చూపించిన ప్రేమ నుండి ప్రయోజనం పొందుతాం. (యోహా. 10:16; 1 యోహా. 2:2) జ్ఞాపకార్థ ఆచరణలో ఉపయోగించే చిహ్నాల గురించి కూడా ఆలోచించండి. అవి కూడా శిష్యుల మీద యేసుకున్న ప్రేమను, శ్రద్ధను తెలియజేస్తున్నాయి. ఎలా?
14. యేసు తన అభిషిక్త అనుచరుల పట్ల ఎలా ప్రేమ చూపించాడు?
14 ఒక కష్టమైన ఆచరణను కాకుండా, సాదాసీదాగా ఉండే ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపించడం ద్వారా యేసు తన అభిషిక్త అనుచరుల పట్ల ప్రేమ చూపించాడు. క్రీస్తు అభిషిక్త అనుచరులు ఆ తర్వాత కూడా ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకోవాలి. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఆఖరికి జైల్లో ఉన్నా దాన్ని జరుపుకోవాలి. (ప్రక. 2:10) మరి యేసు చెప్పినట్లు వాళ్లు దాన్ని జరుపుకోగలిగారా? అవును! వాళ్లు జరుపుకున్నారు.
15-16. కష్ట పరిస్థితుల్లో కొంతమంది ప్రభువు రాత్రి భోజనాన్ని ఎలా జరుపుకున్నారు?
15 మొదటి శతాబ్దం నుండి ఇప్పటివరకు నిజక్రైస్తవులు యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఎంతో కృషిచేశారు. యేసు స్థాపించిన పద్ధతిలోనే ప్రభువు రాత్రి భోజనాన్ని జరుపుకోవడానికి వాళ్లు చేయగలిగినదంతా చేశారు, కొన్నిసార్లు కష్ట పరిస్థితులు ఎదురైనా ఆ పద్ధతిలోనే జరుపుకున్నారు. ఈ ఉదాహరణ పరిశీలించండి: చైనాలో ఒంటరిగా జైల్లో ఉన్నప్పుడు సహోదరుడు హెరాల్డ్ కింగ్ జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకోవడానికి ఒక మార్గాన్ని కనిపెట్టాల్సివచ్చింది. ఆయన ఎవ్వరికీ తెలీకుండా తన దగ్గరున్న వాటితో జ్ఞాపకార్థ ఆచరణ చిహ్నాలను తయారు చేసుకున్నాడు. అంతేకాదు, వీలైనంత జాగ్రత్తగా జ్ఞాపకార్థ తేదీని లెక్కించాడు. ఆ తేదీ వచ్చినప్పుడు, ఆయన జైల్లో ఒంటరిగా పాట పాడి, ప్రార్థన చేసుకుని, లేఖనాల ఆధారంగా ఒక ప్రసంగం ఇచ్చుకున్నాడు.
16 ఇంకో ఉదాహరణ పరిశీలించండి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, కొంతమంది సహోదరీలను కాన్సంట్రేషన్ క్యాంపులో నిర్బంధించారు. వాళ్లు ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రభువు రాత్రి భోజనాన్ని ఆచరించారు. నిజానికి ప్రభువు రాత్రి భోజనం సాదాసీదాగా ఉండడం వల్లే వాళ్లు దాన్ని రహస్యంగా చేసుకోగలిగారు. వాళ్లిలా చెప్పారు, “మేం ఒక స్టూల్ మీద తెల్ల గుడ్డ వేసి రొట్టె, ద్రాక్షారసాన్ని పెట్టి, దాని చుట్టూ నిలబడ్డాం. లైట్ వేస్తే దొరికిపోతాం కాబట్టి క్యాండిల్ వెలిగించాం. . . . మన పరలోక తండ్రి పవిత్రమైన పేరును సమర్థించడానికి మా శక్తినంతా ఉపయోగిస్తామని ప్రమాణం చేసి, దాన్ని పదేపదే చెప్పాం.” వాళ్లు ఎంత అసాధారణ విశ్వాసం చూపించారో కదా! ప్రభువు రాత్రి భోజనాన్ని కష్ట పరిస్థితుల్లో కూడా ఆచరించగలిగేలా ఏర్పాటు చేసి యేసు ఎంతో ప్రేమ చూపించాడు.
17. మనం ఏ ప్రశ్నలు వేసుకోవచ్చు?
17 జ్ఞాపకార్థ ఆచరణ దగ్గరపడుతుండగా, ఈ ప్రశ్నలు వేసుకోవడం మంచిది: ‘ప్రేమ చూపించే విషయంలో నేను యేసును ఇంకా ఎక్కువగా ఎలా అనుకరించగలను? నేను నా అవసరాల కన్నా తోటి విశ్వాసుల అవసరాలకు ప్రాముఖ్యత ఇస్తున్నానా? నా సహోదరసహోదరీల నుండి మరీ ఎక్కువ ఆశిస్తున్నానా లేదా వాళ్ల పరిమితుల్ని అర్థంచేసుకుంటున్నానా?’ మనందరం యేసును ఆదర్శంగా తీసుకుని, “సహానుభూతిని” చూపిద్దాం.—1 పేతు. 3:8.
యేసులా వినయాన్ని, ధైర్యాన్ని, ప్రేమను చూపించండి
18-19. (ఎ) మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు? (బి) మీరు ఏం చేయాలని తీర్మానించుకున్నారు?
18 మనం జ్ఞాపకార్థ ఆచరణను ఎప్పటికీ చేస్తూనే ఉండాల్సిన అవసరంలేదు. మహాశ్రమ కాలంలో యేసు ‘వచ్చినప్పుడు,’ ఆయన ‘ఎంచుకున్నవాళ్లలో’ మిగిలినవాళ్లను పరలోకానికి సమకూరుస్తాడు. అప్పుడు ఇక జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకోవాల్సిన అవసరం ఉండదు.—1 కొరిం. 11:26; మత్త. 24:31.
19 ప్రభువు రాత్రి భోజనాన్ని జరుపుకోవడం ఆపేశాక కూడా, సాదాసీదాగా ఉండే ఆ ఏర్పాటు యేసు చూపించిన గొప్ప వినయానికి, ధైర్యానికి, ప్రేమకు సూచనగా ఉందని యెహోవా ప్రజలు తప్పకుండా గుర్తుంచుకుంటారు. ఇప్పుడు ఈ ఆచరణకు హాజరైనవాళ్లు, కొత్తలోకంలో ఉండే ప్రజల ప్రయోజనం కోసం ఈ ఆచరణ గురించి వాళ్లకు చెప్తారు. కానీ ప్రభువు రాత్రి భోజనం నుండి ఇప్పుడు ప్రయోజనం పొందాలంటే, యేసుకున్న వినయాన్ని, ధైర్యాన్ని, ప్రేమను అనుకరించాలని తీర్మానించుకోవాలి. అలాచేస్తే, యెహోవా నుండి బహుమానం పొందుతామనే నమ్మకంతో ఉండవచ్చు.—2 పేతు. 1:10, 11.
పాట 13 క్రీస్తు మన ఆదర్శం
a యేసుక్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం త్వరలో ప్రభువు రాత్రి భోజనానికి హాజరౌతాం. సాదాసీదాగా ఉండే ప్రభువు రాత్రి భోజనం యేసుకున్న వినయం, ధైర్యం, ప్రేమ గురించి బోధిస్తుంది. ఆయనకున్న ఆ విలువైన లక్షణాల్ని మనమెలా చూపించవచ్చో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.
b పదాల వివరణ: జ్ఞాపకార్థం అంటే ముఖ్యమైన సంఘటనను లేదా వ్యక్తిని గుర్తుచేసుకోవడానికి, గౌరవించడానికి చేసే ప్రత్యేక కార్యక్రమం.
c చిత్రాల వివరణ : నమ్మకమైన దేవుని సేవకులు ప్రభువు రాత్రి భోజనాన్ని జరుపుకున్న సన్నివేశాల్ని పునర్నటించి చూపిస్తున్న చిత్రాలు: మొదటి శతాబ్దంలో; 1800ల చివర్లో; నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో; వెచ్చని వాతావరణం ఉండే దక్షిణ అమెరికాలో గోడలులేని చిన్న రాజ్యమందిరంలో.