పరిపాలక సభలో కొత్త సభ్యుడు
2018, జనవరి 24 బుధవారం ఉదయం, అమెరికా అలాగే కెనడా బెతెల్ కుటుంబ సభ్యులు ఒక ప్రత్యేక ప్రకటన విని సంతోషించారు. అదేంటంటే, సహోదరుడు జూ. కెన్నెత్ కుక్ యెహోవాసాక్షుల పరిపాలక సభలో కొత్త సభ్యుడయ్యాడు.
సహోదరుడు కుక్ అమెరికాలోని పెన్సిల్వేనియాలో పుట్టిపెరిగాడు. హైస్కూల్ చదువులు పూర్తి చేసుకోవడానికి కాస్త ముందు, ఆయన తన తోటి విద్యార్థి దగ్గర సత్యం నేర్చుకున్నాడు. ఆ తర్వాత 1980, జూన్ 7న బాప్తిస్మం తీసుకున్నాడు. 1982, సెప్టెంబరు 1న క్రమ పయినీరు సేవ ప్రారంభించి పూర్తికాల సేవలో అడుగుపెట్టాడు. రెండు సంవత్సరాలు పయినీరు సేవచేశాక, బెతెల్‌కి ఆహ్వానం రావడంతో 1984, అక్టోబరు 12న న్యూయార్క్‌లోని వాల్‌కిల్‌లో బెతెల్ సేవ ప్రారంభించాడు.
ఆ తర్వాత 25 సంవత్సరాల పాటు సహోదరుడు కుక్ ప్రింటరీలో, బెతెల్ ఆఫీసులో వేర్వేరు నియామకాల్లో సేవచేశాడు. 1996లో జేమీ అనే సహోదరిని పెళ్లి చేసుకున్నాడు, దాంతో ఆమె కూడా ఆయనతో కలిసి వాల్కిల్ బెతెల్‌లో సేవ చేయడం మొదలుపెట్టింది. 2009 డిసెంబరులో, వాళ్లిద్దర్నీ న్యూయార్క్‌లోని ప్యాటర్సన్లో ఉన్న వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్‌కు పంపించారు. అక్కడ సహోదరుడు కుక్, రైటింగ్ కరెస్పాండెన్స్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేయడానికి నియమించబడ్డాడు. ఆ తర్వాత వాల్కిల్ బెతెల్‌కి తిరిగొచ్చి కొంతకాలంపాటు సేవచేశాక, 2016 ఏప్రిల్‌లో వాళ్లిద్దర్నీ న్యూయార్క్‌లోని బ్రూక్లిన్కు పంపించారు. ఐదు నెలల తర్వాత, వాళ్లు అక్కడి నుండి న్యూయార్క్‌లోని వార్విక్లో ఉన్న ప్రపంచ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. 2017 జనవరిలో సహోదరుడు కుక్, పరిపాలక సభలో రైటింగ్ కమిటీకి సహాయకునిగా నియమించబడ్డాడు.