కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 21

దేవుడిచ్చిన బహుమతుల పట్ల కృతజ్ఞత చూపించండి

దేవుడిచ్చిన బహుమతుల పట్ల కృతజ్ఞత చూపించండి

“యెహోవా, నా దేవా, నువ్వు మా కోసం ఎన్నో అద్భుతమైన పనులు చేశావు, మా విషయంలో నీకున్న ఆలోచనలు ఎన్నెన్నో.”—కీర్త. 40:5.

పాట 5 దేవుని అద్భుత కార్యాలు

ఈ ఆర్టికల్‌లో . . . a

1-2. కీర్తన 40:5 ప్రకారం యెహోవా మనకిచ్చిన బహుమతులు ఏంటి? వాటి గురించి ఎందుకు పరిశీలిస్తాం?

 యెహోవా ఉదారతగల దేవుడు. ఆయన మనకిచ్చిన బహుమతుల్లో కొన్నింటి గురించి ఆలోచించండి: మొదటిగా, మనకు అందమైన భూమిని ఇచ్చాడు, దానివల్ల మనం జీవించడానికి అనువైన చోటును పొందాం; రెండవదిగా, అద్భుతమైన సామర్థ్యం గల మెదడును ఇచ్చాడు, దానివల్ల ఆలోచించగలిగే, మాట్లాడగలిగే సామర్థ్యాన్ని పొందాం; మూడవదిగా, తన విలువైన మాటలు ఉన్న బైబిలును ఇచ్చాడు; దానివల్ల కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబుల్ని పొందాం.—కీర్తన 40:5 చదవండి.

2 ఈ మూడు బహుమతులకు సంబంధించిన కొన్ని విషయాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. ఆ బహుమతుల గురించి లోతుగా ఆలోచించే కొద్దీ వాటిపట్ల మనకున్న కృతజ్ఞత, మన ప్రేమగల సృష్టికర్తను సంతోషపెట్టాలనే కోరిక మరింత పెరుగుతాయి. (ప్రక. 4:11) అంతేకాదు, పరిణామ సిద్ధాంతాన్ని (evolution theory) నమ్మి మోసపోతున్న ప్రజలతో అర్థవంతంగా మాట్లాడగలుగుతాం.

సాటిలేని మన భూగ్రహం

3. మన భూగ్రహం ఎందుకు ప్రత్యేకమైనది?

3 దేవుడు భూమిని తయారుచేసిన విధానాన్ని పరిశీలిస్తే, ఆయనకు ఎంత తెలివి ఉందో అర్థమౌతుంది. (రోమా. 1:20; హెబ్రీ. 3:4) సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నిటిలో మన భూగ్రహం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, మనుషులు జీవించడానికి వీలుగా ఉండే వాతావరణం భూమ్మీద మాత్రమే ఉంది.

4. మనిషి తయారుచేసిన పడవకు, భూమికి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు ఏంటి?

4 మన భూగ్రహం, మహాసముద్రంలో తేలుతున్న పడవ లాంటిదని చెప్పవచ్చు. అయితే మనిషి తయారుచేసిన పడవకు, మన భూమికి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇలా ఊహించుకోండి: కొంతమంది ఒక పడవలో ప్రయాణిస్తున్నారు. వాళ్లు తమకు అవసరమైన ఆక్సిజన్‌ను, ఆహారాన్ని, నీటిని వాళ్లంతట వాళ్లే తయారుచేసుకోవాలి; పైగా వ్యర్థాలన్నిటినీ సముద్రంలో పడేయకుండా తమ పడవలోనే ఉంచుకోవాలి. అలాంటి పరిస్థితుల మధ్య వాళ్లు ఎంతకాలం జీవిస్తారు? కొన్ని రోజులకు ఆ పడవలోని వాళ్లందరూ ఖచ్చితంగా చనిపోతారు. కానీ భూమి మీద కొన్ని వందల కోట్ల ప్రాణులు జీవిస్తున్నాయి. ఆ ప్రాణులకు అవసరమైన ఆక్సిజన్‌ను, ఆహారాన్ని, నీటిని భూమే ఇస్తోంది. వాటికి ఎప్పుడూ కొరత ఉండదు. పైగా వ్యర్థాలన్నిటినీ భూమి మీదే వేస్తున్నా అది ఇప్పటికీ అందంగా, ప్రాణులు జీవించడానికి వీలుగా ఉంది. అదెలా సాధ్యం? యెహోవా ఈ భూమికి వ్యర్థాల్ని రీసైకిల్‌ చేసే సామర్థ్యాన్ని ఇచ్చాడు, అంటే వ్యర్థాల్ని మళ్లీ పనికొచ్చేవాటిగా మార్చే సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఉదాహరణకు యెహోవా ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ చక్రం, నీటిచక్రం గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

5. ఆక్సిజన్‌ చక్రం అంటే ఏంటి? అది ఏం రుజువు చేస్తుంది?

5 మనుషులు, జంతువులు జీవించి ఉండాలంటే ఆక్సిజన్‌ లేదా ప్రాణవాయువు అవసరం. ప్రతీ సంవత్సరం ప్రాణులన్నీ వంద కోట్ల టన్నుల ఆక్సిజన్‌ను పీల్చుకుంటాయని ఒక అంచనా. ఆ ప్రాణులు తిరిగి కార్బన్‌ డై ఆక్సైడ్‌ అనే వ్యర్థ వాయువును విడుదల చేస్తాయి. ఇన్ని ప్రాణులు పీల్చుకుంటున్నా ఆక్సిజన్‌ అయిపోవట్లేదు, కార్బన్‌ డై ఆక్సైడ్‌తో భూమి నిండిపోవట్లేదు. ఎందుకో ఆలోచించారా? ఎందుకంటే, కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేసే వివిధ రకాల మొక్కల్ని యెహోవా ఈ భూమ్మీద సృష్టించాడు. ‘దేవుడు అందరికి ప్రాణాన్ని, ఊపిరిని ఇస్తున్నాడు’ అని అపొస్తలుల కార్యాలు 17:24, 25 లో ఉన్న మాటలు ఎంత నిజమో ఆక్సిజన్‌ చక్రం రుజువు చేస్తుంది.

6. నీటిచక్రం అంటే ఏంటి? అది ఏం రుజువు చేస్తుంది? (“ నీటిచక్రం యెహోవా ఇచ్చిన బహుమతి” అనే బాక్సు చూడండి.)

6 మన భూగ్రహం సూర్యుని నుండి సరైన దూరంలో ఉండడం వల్లే, భూమ్మీదున్న నీరు ద్రవరూపంలో ఉంది. ఒకవేళ భూమి సూర్యునికి కాస్త దగ్గరగా ఉంటే నీరంతా ఆవిరైపోతుంది, ప్రాణులు జీవించడానికి వీల్లేనంత వేడిగా మారిపోతుంది. ఒకవేళ భూమి సూర్యునికి కాస్త దూరంగా ఉంటే నీరంతా గడ్డకట్టిపోతుంది, భూమి పెద్ద ఐస్‌గడ్డలా మారిపోతుంది. కానీ యెహోవా భూమిని సరైన దూరంలో ఉంచాడు కాబట్టే, నీటిచక్రం అనే ప్రక్రియ జరిగి ప్రాణులు జీవించగలుగుతున్నాయి. ఇంతకీ నీటిచక్రం అంటే ఏంటి? సూర్యుని వేడికి సముద్రాల్లో, అలాగే భూమి ఉపరితలం మీద ఉన్న నీరు ఆవిరిగా మారి మేఘాలు ఏర్పడుతున్నాయి. ఇలా ప్రతీ సంవత్సరం కొన్ని కోట్ల లీటర్ల నీరు ఆవిరిగా మారుతోంది. అలా ఆవిరిగా మారిన నీరు సుమారు పది రోజుల తర్వాత వర్షం రూపంలో లేదా మంచు రూపంలో భూమ్మీద పడి తిరిగి సముద్రాల్లో, నదుల్లో, చెరువుల్లో కలిసిపోతుంది. మళ్లీ ఆ నీరు ఆవిరిగా మారడం, వర్షం పడడం ఇలా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. యెహోవా ఏర్పాటు చేసిన ఈ చక్రం వల్ల ప్రాణులన్నిటికీ అవసరమైన నీరు భూమ్మీద ఎల్లప్పుడూ ఉంటోంది. యెహోవాకు ఎంత తెలివి, శక్తి ఉన్నాయో నీటిచక్రం రుజువు చేస్తుంది.—యోబు 36:27, 28; ప్రసం. 1:7.

7. కీర్తన 115:16 లో ఉన్న బహుమతి పట్ల మనం ఏయే విధాలుగా కృతజ్ఞత పెంచుకోవచ్చు?

7 మన అందమైన భూగ్రహం పట్ల, భూమ్మీదున్న ఇతర వాటిపట్ల కృతజ్ఞతను ఏయే విధాలుగా పెంచుకోవచ్చు? (కీర్తన 115:16 చదవండి.) మొదటిగా, యెహోవా సృష్టించిన వాటన్నిటి గురించి ధ్యానించాలి. అలా ధ్యానిస్తే, మన మంచికోసం యెహోవా చేసిన వాటన్నిటి బట్టి ఆయనకు ప్రతీరోజు కృతజ్ఞతలు చెప్తాం. రెండవదిగా, మనం ఉంటున్న ప్రాంతాన్ని వీలైనంత శుభ్రంగా ఉంచుకోవాలి.

అద్భుతమైన మన మెదడు

8. మనిషి మెదడు తయారయ్యే విధానం ఒక అద్భుతం అని ఎందుకు చెప్పవచ్చు?

8 మనిషి మెదడు తయారయ్యే విధానం ఒక అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే, మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు, మీ మెదడు దేవుడు తయారుచేసిన డిజైన్‌ ప్రకారమే రూపుదిద్దుకుంది, ప్రతీ నిమిషానికి కొన్ని వేల కణాలు ఏర్పడ్డాయి. పూర్తిగా ఎదిగిన మనిషి మెదడులో సుమారు లక్ష కోట్ల నాడీ కణాలు (న్యూరాన్‌లు) ఉంటాయని పరిశోధకుల అంచనా. ఈ నాడీ కణాలన్నీ కలిసి సుమారు ఒకటిన్నర కేజీలు ఉన్న మనిషి మెదడు తయారౌతుంది. మన మెదడు చేయగల అద్భుతమైన పనుల్లో కొన్నిటిని ఇప్పుడు పరిశీలిద్దాం.

9. మనకున్న మాట్లాడే సామర్థ్యం దేవుడిచ్చిన బహుమతి అని ఎలా చెప్పవచ్చు?

9 మనకున్న మాట్లాడే సామర్థ్యం నిజంగా ఒక అద్భుతం. మీరు మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుందో కాసేపు ఆలోచిద్దాం. మీరు ఒక మాట మాట్లాడిన ప్రతీసారి మీ నాలుకలో, గొంతులో, పెదవుల్లో, దవడలో, ఛాతిలో ఉండే సుమారు 100 కండరాలు కదులుతాయి. ఆ కదలికలు అన్నిటినీ మీ మెదడు నియంత్రిస్తుంది. ఆ కండరాలు ఒక నిర్దిష్టమైన పద్ధతిలో కదిలితేనే మీరు స్పష్టంగా మాట్లాడగలుగుతారు. వివిధ భాషలు మాట్లాడగలిగే సామర్థ్యం విషయానికొస్తే, అప్పుడే పుట్టిన పిల్లలు సైతం చిన్నచిన్న పదాలను గుర్తించి వాటికి స్పందిస్తారని 2019 లో ప్రచురించబడిన ఒక అధ్యయనం తెలియజేసింది. ఈ అధ్యయనం, మనుషులకు పుట్టుకతోనే పదాల్ని గుర్తించే సామర్థ్యం, వివిధ భాషల్ని నేర్చుకునే సామర్థ్యం ఉంటుందనే పరిశోధకుల నమ్మకానికి మరింత బలాన్నిస్తోంది. అవును, మనకున్న మాట్లాడే సామర్థ్యం దేవుడిచ్చిన బహుమతి.—నిర్గ. 4:11.

10. మాట్లాడే సామర్థ్యం పట్ల మనకు కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు?

10 మాట్లాడే సామర్థ్యం పట్ల మనకు కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు? దేవుడే అన్నిటినీ సృష్టించాడు అనడానికి గల కారణాల్ని, పరిణామ సిద్ధాంతాన్ని నమ్మే ప్రజలకు వివరించాలి. (కీర్త. 9:1; 1 పేతు. 3:15) భూమిని, దాని మీదున్న ప్రాణుల్ని ఒక సృష్టికర్త చేశాడని వాళ్లు నమ్మరు. కాబట్టి మనం బైబిల్ని, ఈ ఆర్టికల్‌లో పరిశీలించిన కొన్ని విషయాల్ని ఉపయోగించి మన పరలోక తండ్రి గురించి వాళ్లతో మాట్లాడవచ్చు. ఒకవేళ ఎవరైనా ఆసక్తి చూపిస్తే, దేవుడే భూమిని, ఆకాశాన్ని చేశాడని మనం ఎందుకు నమ్ముతున్నామో వివరించవచ్చు.—కీర్త. 102:25; యెష. 40:25, 26.

11. మనిషి జ్ఞాపకశక్తి ఎందుకు ఆశ్చర్యకరమైనది?

11 మనిషికి ఉన్న జ్ఞాపకశక్తి ఆశ్చర్యకరమైనది. రెండు కోట్ల పుస్తకాల్లో పట్టేంత సమాచారాన్ని మనిషి మెదడు గుర్తుంచుకోగలదని గతంలో ఒక పరిశోధకుడు చెప్పాడు. నిజానికి, అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ సమాచారాన్ని మనిషి గుర్తుంచుకోగలడని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ జ్ఞాపకశక్తి వల్ల మనుషులు ఒక ప్రత్యేకమైన సామర్థ్యాన్ని పొందారు. ఏంటది?

12. మనుషులకు మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఏంటి?

12 గతంలో ఎదురైన అనుభవాల్ని గుర్తుంచుకొని, వాటి ఆధారంగా గుణపాఠాలు నేర్చుకోగల సామర్థ్యం మనుషులకు మాత్రమే ఉంది. ఫలితంగా మంచి విలువల్ని అలవర్చుకుని మన ఆలోచనా విధానాన్ని, జీవన విధానాన్ని మార్చుకోవడం సాధ్యపడుతోంది. (1 కొరిం. 6:9-11; కొలొ. 3:9, 10) అంతేకాదు, మంచిచెడులను గుర్తించగలిగేలా మన మనస్సాక్షికి శిక్షణ ఇవ్వగలుగుతున్నాం. (హెబ్రీ. 5:14) ప్రేమ, కనికరం, కరుణ చూపించడానికి; యెహోవాలా న్యాయంగా ప్రవర్తించడానికి కృషి చేయగలుగుతున్నాం.

13. కీర్తన 77:11, 12 ప్రకారం, జ్ఞాపకశక్తి అనే బహుమతిని మనం ఎలా ఉపయోగించాలి?

13 దేవుడు బహుమతిగా ఇచ్చిన జ్ఞాపకశక్తి పట్ల మనకు కృతజ్ఞత ఉందని చూపించే విధానాలు ఏంటి? మొదటిగా, గతంలో మనకు యెహోవా ఏయే విధాలుగా సహాయం చేశాడో, ఊరటను ఇచ్చాడో ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. అలా గుర్తుంచుకుంటే, భవిష్యత్తులో కూడా ఆయన మనకు సహాయం చేస్తాడనే నమ్మకం బలపడుతుంది. (కీర్తన 77:11, 12 చదవండి; 78:4, 7) రెండవదిగా, ఇతరులు మనకు చేసిన మంచిని గుర్తుంచుకుని వాళ్లకు కృతజ్ఞత చూపించాలి. కృతజ్ఞత చూపించే వ్యక్తులు ఎక్కువ సంతోషంగా ఉంటారని పరిశోధకులు కనుగొన్నారు. అయితే మనం యెహోవాను అనుకరిస్తూ కొన్ని విషయాలను మర్చిపోవడం కూడా మంచిదే. యెహోవాకు పరిపూర్ణ జ్ఞాపకశక్తి ఉన్నా, మనం పశ్చాత్తాపం చూపిస్తే మన పొరపాట్లను క్షమించి వాటిని మర్చిపోతున్నాడు. (కీర్త. 25:7; 130:3, 4) అదేవిధంగా, మనల్ని బాధపెట్టినవాళ్లు ఎవరైనా క్షమించమని అడిగితే, మనం కూడా వాళ్లను క్షమించి, దాన్ని మర్చిపోవాలని యెహోవా కోరుకుంటున్నాడు.—మత్త. 6:14; లూకా 17:3, 4.

మన మెదడును యెహోవాకు ఘనత తెచ్చేలా ఉపయోగించడం ద్వారా కృతజ్ఞత చూపించవచ్చు (14వ పేరా చూడండి) b

14. యెహోవా ఇచ్చిన మెదడు అనే అద్భుతమైన బహుమతి పట్ల మనకు కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు?

14 యెహోవా ఇచ్చిన మెదడు అనే అద్భుతమైన బహుమతి పట్ల మనకు కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు? యెహోవాకు ఘనత తెచ్చేలా దాన్ని ఉపయోగించడం ద్వారా కృతజ్ఞత చూపించవచ్చు. అయితే కొంతమంది స్వార్థంగా ఆలోచిస్తూ మంచిచెడుల విషయంలో తమ సొంత ప్రమాణాల్ని ఏర్పర్చుకుంటారు. కానీ మనల్ని సృష్టించింది యెహోవా కాబట్టి, ఆయన ప్రమాణాలే అన్నిటికన్నా శ్రేష్ఠమైనవని అనడం సరైనదే. (రోమా. 12:1, 2) యెహోవా ప్రమాణాల ప్రకారం నడుచుకుంటే మనం మనశ్శాంతిగా జీవిస్తాం. (యెష. 48:17, 18) అంతేకాదు, మనం ఏం చేయాలని ఆయన కోరుకుంటున్నాడో తెలుసుకుని దాన్ని చేస్తాం. అంటే, మన సృష్టికర్త, తండ్రి అయిన దేవునికి ఘనత తెస్తాం; మనల్ని చూసి ఆయన గర్వపడేలా జీవిస్తాం.—సామె. 27:11.

ఎంతో అమూల్యమైన బైబిలు

15. యెహోవాకు మనుషుల మీద ప్రేమ ఉందని బైబిలు ఎలా రుజువు చేస్తుంది?

15 బైబిలు దేవుడు మనకు ప్రేమతో ఇచ్చిన బహుమతి. మన పరలోక తండ్రికి మనమీద ఎంతో శ్రద్ధ ఉంది కాబట్టి, కొంతమంది మనుషులను ప్రేరేపించి బైబిల్ని రాయించాడు. యెహోవా బైబిలు ద్వారా కొన్ని అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబిస్తున్నాడు. మనం ఎక్కడినుండి వచ్చాం? మన జీవితానికి ఉన్న అర్థం ఏంటి? మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? లాంటి ప్రశ్నలకు తన పిల్లలందరూ జవాబు తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. అందుకే తన వాక్యమైన బైబిలు ఎన్నో భాషల్లోకి అనువదించబడేలా ఆయన చూస్తున్నాడు. నేడు పూర్తి బైబిలు లేదా అందులోని కొంతభాగం దాదాపు 3,000 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించబడింది. చరిత్రలోనే అన్నిటికన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించబడిన, పంచిపెట్టబడిన పుస్తకం బైబిలు. దేశం ఏదైనా, భాష ఏదైనా చాలామంది ప్రజలు బైబిల్ని తమ సొంత భాషలో చదవగలుగుతున్నారు.—“ ఆఫ్రికన్‌ భాషల్లోకి బైబిల్ని అనువదించడం” అనే బాక్సు చూడండి.

16. మత్తయి 28:19, 20 ప్రకారం, మనకు బైబిలు పట్ల కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు?

16 మనం ప్రతీరోజు బైబిలు చదవడం ద్వారా, అందులోని విషయాల్ని ధ్యానించడం ద్వారా, నేర్చుకున్నవాటిని పాటించడం ద్వారా బైబిలు పట్ల కృతజ్ఞత ఉందని చూపించవచ్చు. అంతేకాదు, అందులోని సందేశాన్ని వీలైనంత ఎక్కువమందికి చెప్పడం ద్వారా దేవుని పట్ల కూడా కృతజ్ఞత ఉందని చూపిస్తాం.—కీర్త. 1:1-3; మత్త. 24:14; మత్తయి 28:19, 20 చదవండి.

17. ఈ ఆర్టికల్‌లో ఏ బహుమతుల గురించి పరిశీలించాం? తర్వాతి ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

17 ఈ ఆర్టికల్‌లో దేవుడు మనకు బహుమతిగా ఇచ్చిన అందమైన భూమి గురించి; అద్భుతమైన మెదడు గురించి; అమూల్యమైన బైబిలు గురించి పరిశీలించాం. అయితే ఆయనిచ్చిన కొన్ని బహుమతులు మన కంటికి కనిపించవు. కంటికి కనిపించని ఆ సంపదల గురించి తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

పాట 12 యెహోవా గొప్ప దేవుడు

a ఈ ఆర్టికల్‌ యెహోవా పట్ల, ఆయన మనకిచ్చిన మూడు బహుమతుల పట్ల కృతజ్ఞతను పెంచుతుంది. అంతేకాదు, దేవుణ్ణి నమ్మనివాళ్లతో ఎలాంటి విషయాలు మాట్లాడవచ్చో తెలియజేస్తుంది.

b చిత్రాల వివరణ: ఒక సహోదరి వలస వచ్చిన ప్రజలకు దేవుని వాక్యంలోని సత్యాల్ని బోధించేలా కొత్త భాష నేర్చుకుంటోంది.