ఆత్మనిగ్రహం—యెహోవాను సంతోషపెట్టే లక్షణం
“ఒకసారి మా చుట్టాలబ్బాయి నాతో గొడవపడ్డాడు. అతన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. వెంటనే అతని గొంతు పట్టుకొని ఊపిరాడకుండా చేయడం మొదలుపెట్టాను.”—పాల్.
“ఇంట్లో ఉన్నప్పుడు చిన్నచిన్న విషయాలకు కూడా నాకు పిచ్చి కోపం వచ్చేది. అలాంటి సందర్భాల్లో కుర్చీల్ని, బొమ్మల్ని, చేతికి ఏది దొరికితే దాన్ని నేలకేసి కొట్టేవాడిని.”—మార్కో.
మనం వాళ్లంత క్రూరంగా ప్రవర్తించకపోవచ్చు. అయితే కొన్నిసార్లు, మనల్ని మనం అదుపు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. మొదటి మనిషైన ఆదాము నుండి వారసత్వంగా వచ్చిన పాపమే దానికి ప్రధాన కారణం. (రోమా. 5:12) కొంతమందికి పాల్, మార్కోలాగే కోపాన్ని అణచుకోవడం కష్టంగా ఉంటుంది. ఇంకొంతమందికి తమ ఆలోచనల్ని అదుపుచేసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటివాళ్లు తమను భయపెట్టే విషయాల గురించి, కృంగదీసే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరికొంతమందికి లైంగిక కోరికల్ని అణచుకోవడం; తాగుడుకు, డ్రగ్స్‌కు దూరంగా ఉండడం కష్టంగా ఉంటుంది.
ఆలోచనల్ని, కోరికల్ని, పనుల్ని అదుపు చేసుకోలేనివాళ్లు తమ జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. కానీ ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకుంటే ఆ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. ఆ లక్షణాన్ని అలవర్చుకోవడానికి సహాయం చేసే మూడు విషయాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. అవి: (1) ఆత్మనిగ్రహం అంటే ఏంటి? (2) అది ఎందుకు అవసరం? (3) “పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో” ఒకటైన దీన్ని ఎలా అలవర్చుకోవచ్చు? (గల. 5:22, 23) ఒకవేళ ఎప్పుడైనా ఆత్మనిగ్రహం చూపించడంలో విఫలమైతే ఏం చేయాలో కూడా ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
ఆత్మనిగ్రహం అంటే ఏంటి?
ఆత్మనిగ్రహం గల వ్యక్తి క్షణికావేశానికి లోనవ్వడు. అతను దేవున్ని బాధపెట్టేలా మాట్లాడకుండా, ప్రవర్తించకుండా జాగ్రత్తపడతాడు.
ఆత్మనిగ్రహం చూపించే విషయంలో యేసు అత్యుత్తమ ఆదర్శం ఉంచాడు. బైబిలు ఇలా చెప్తుంది: “ఇతరులు ఆయన్ని అవమానించినప్పుడు ఆయన తిరిగి వాళ్లను అవమానించలేదు. ఆయన బాధ అనుభవించినప్పుడు తనను బాధపెట్టినవాళ్లను బెదిరించలేదు. బదులుగా నీతిగా తీర్పుతీర్చే దేవునికే తనను తాను అప్పగించుకున్నాడు.” (1 పేతు. 2:23) హింసాకొయ్య మీద వేలాడుతున్న తనను చూసి వ్యతిరేకులు ఎగతాళి చేసినా యేసు వాళ్లను ఏమీ అనలేదు. (మత్త. 27:39-44) మతనాయకులు తన మాటల్లో తప్పులు పట్టడానికి ప్రయత్నించినప్పుడు కూడా యేసు ఆచితూచి మాట్లాడాడు. (మత్త. 22:15-22) అంతేకాదు, కొంతమంది యూదులు కోపంతో తన మీద రాళ్లు విసరడానికి ప్రయత్నించినా యేసు ఎదురుతిరగలేదు. బదులుగా, ఆయన “దాక్కొని, ఆలయంలో నుండి బయటికి వెళ్లిపోయాడు.”—యోహా. 8:57-59.
యేసులా మనం కూడా ఆత్మనిగ్రహం చూపించగలమా? కొంతవరకు చూపించగలం. అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు: “క్రీస్తు కూడా మీ కోసం బాధలు అనుభవించి, మీరు నమ్మకంగా తన అడుగుజాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచాడు.” (1 పేతు. 2:21) మనం అపరిపూర్ణులం అయినప్పటికీ యేసు అడుగుజాడల్లో నడుస్తూ ఆత్మనిగ్రహం చూపించడం సాధ్యమే. అలా చూపించడం ఎందుకు అవసరం?
ఆత్మనిగ్రహం ఎందుకు అవసరం?
మనకు ఆత్మనిగ్రహం ఉంటేనే యెహోవాను సంతోషపెట్టగలం. ఎన్నో సంవత్సరాలుగా యెహోవాను నమ్మకంగా సేవిస్తున్నప్పటికీ, మన పనుల్ని, మాటల్ని అదుపులో ఉంచుకోకపోతే ఆయనతో ఉన్న స్నేహాన్ని పాడుచేసుకునే ప్రమాదం ఉంది.
మోషే ఉదాహరణ పరిశీలించండి. ఆయన ఆ కాలంలో, “భూమ్మీద ఉన్న వాళ్లందరిలోకెల్లా అత్యంత సాత్వికుడు.” (సంఖ్యా. 12:3) ఇశ్రాయేలీయులు ఎన్నో సంవత్సరాలుగా ఫిర్యాదులు చేస్తున్నా మోషే ఓపిగ్గా సహించాడు. కానీ ఒకరోజు ఆయన తన ఆత్మనిగ్రహాన్ని కోల్పోయాడు. తమకు సరిపడా నీళ్లు లేవని ఇశ్రాయేలీయులు రెండోసారి ఫిర్యాదు చేసినప్పుడు మోషేకు చాలా కోపం వచ్చింది. ఆయన చాలా కఠినంగా వాళ్లతో ఇలా అన్నాడు: “తిరుగుబాటుదారులారా, వినండి! ఈ బండలో నుండి మేము మీ కోసం నీళ్లు రప్పించాలా?”—సంఖ్యా. 20:2-11.
మోషే తనను అదుపు చేసుకోలేకపోయాడు. వాళ్లకు అద్భుతరీతిలో నీళ్లిచ్చిన యెహోవాను ఆయన ఘనపర్చలేదు. (కీర్త. 106:32, 33) దాంతో యెహోవా మోషేను వాగ్దాన దేశంలో అడుగుపెట్టనివ్వలేదు. (సంఖ్యా. 20:12) ఆ రోజున తన కోపాన్ని అణుచుకోలేక పోయినందుకు మోషే జీవితాంతం బాధపడి ఉంటాడు.—ద్వితీ. 3:23-27.
దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? మనకు చిరాకు తెప్పించిన వాళ్లతో గానీ, ఏదైనా పొరపాటు చేసినవాళ్లతో గానీ ఎన్నడూ అమర్యాదగా మాట్లాడకూడదు. (ఎఫె. 4:32; కొలొ. 3:12) నిజమే, వయసుపైబడే కొద్దీ ఓపిక చూపించడం కొన్నిసార్లు కష్టంగా ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో మోషేను గుర్తుతెచ్చుకోండి. కేవలం ఒక్క సందర్భంలో ఆత్మనిగ్రహం కోల్పోయి, ఎంతోకాలంగా యెహోవా దగ్గరున్న మంచిపేరును పాడు చేసుకోవాలని మనలో ఎవ్వరం అనుకోం. ఈ ప్రాముఖ్యమైన లక్షణాన్ని ఎలా అలవర్చుకోవచ్చు?
ఆత్మనిగ్రహం అలవర్చుకోవాలంటే ఏం చేయాలి?
పవిత్రశక్తి కోసం ప్రార్థించండి. ఎందుకు? ఎందుకంటే ఆత్మనిగ్రహం పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో ఒకటి. యెహోవా తనను అడిగే వాళ్లందరికీ పవిత్రశక్తిని ఇస్తాడు. (లూకా 11:13) యెహోవా తన పవిత్రశక్తి ద్వారా, మనం ఆత్మనిగ్రహం చూపించడానికి కావల్సిన బలాన్ని ఇస్తాడు. (ఫిలి. 4:13) అంతేకాదు పవిత్రశక్తి పుట్టించే ప్రేమ లాంటి ఇతర లక్షణాల్ని అలవర్చుకోవడానికి మనకు సహాయం చేస్తాడు. అప్పుడు ఆత్మనిగ్రహం చూపించడం మనకు తేలికౌతుంది.—1 కొరిం. 13:5.
మీ ఆత్మనిగ్రహాన్ని బలహీనపర్చే దేనికైనా దూరంగా ఉండండి. ఉదాహరణకు, తప్పుడు పనుల్ని ప్రోత్సహించే వెబ్సైట్లకు, వినోదానికి దూరంగా ఉండండి. (ఎఫె. 5:3, 4) నిజానికి, తప్పు చేయాలనే కోరికను కలిగించే దేనికైనా మనం దూరంగా ఉండాలి. (సామె. 22:3; 1 కొరిం. 6:12) లైంగిక కోరికలకు తేలిగ్గా లొంగిపోయే వ్యక్తి అలాంటి కోరికల్ని రేకెత్తించే పుస్తకాల్ని చదవకూడదు, అలాంటి సినిమాల్ని చూడకూడదు; వాటి జోలికి అస్సలు వెళ్లకూడదు.
ఈ సలహాను పాటించడం కష్టంగా అనిపించవచ్చు. కానీ దాన్ని పాటించడానికి కృషిచేస్తే మనల్ని మనం అదుపు చేసుకోవడానికి కావల్సిన శక్తిని యెహోవా ఇస్తాడు. (2 పేతు. 1:5-8) మన ఆలోచనల్ని, మాటల్ని, పనుల్ని అదుపులో ఉంచుకోవడానికి ఆయన సహాయం చేస్తాడు. పాల్, మార్కో విషయంలో అదే జరిగింది. యెహోవా సహాయంతో వాళ్లు తమ విపరీతమైన కోపాన్ని అణచుకోవడం నేర్చుకున్నారు. మరో సహోదరుని అనుభవం పరిశీలించండి. ఆయన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఇతరుల మీద కోప్పడుతూ వాళ్లతో గొడవలకు దిగేవాడు. ఆయన ఆ అలవాటు నుండి ఎలా బయటపడ్డాడు? ఆ సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “నేను ప్రతీరోజు పట్టుదలగా ప్రార్థించాను. ఆత్మనిగ్రహానికి సంబంధించిన ఆర్టికల్స్‌ని చదివాను. అందుకు సహాయం చేసే బైబిలు వచనాల్ని కంఠస్థం చేశాను. ఇలా ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్నా, ఇప్పటికీ ప్రతీరోజు ఉదయం, రోజంతా ఆత్మనిగ్రహం చూపించాలని గుర్తుచేసుకుంటాను. అంతేకాదు, ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు, హడావిడిగా కాకుండా వీలైనంత తొందరగా బయల్దేరతాను.”
ఆత్మనిగ్రహం చూపించడంలో ఎప్పుడైనా విఫలమైతే . . .
మనం అప్పుడప్పుడు ఆత్మనిగ్రహం చూపించే విషయంలో విఫలమౌతుంటాం. అలా జరిగినప్పుడు, తప్పు చేశామనే భావంతో యెహోవాకు ప్రార్థించడానికి వెనకాడుతుంటాం. కానీ వాస్తవానికి అలాంటి సందర్భాల్లోనే మనం యెహోవాకు ఇంకా ఎక్కువగా ప్రార్థించాలి. కాబట్టి ఆలస్యం చేయకుండా యెహోవాకు ప్రార్థించండి. క్షమించమని వేడుకోండి, ఆయన సహాయం అడగండి, ఆ పొరపాటును ఇంకోసారి చేయకూడదని బలంగా నిర్ణయించుకోండి. (కీర్త. 51:9-11) కరుణ చూపించమని అడుగుతూ మీరు మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనను యెహోవా చిన్నచూపు చూడడు. (కీర్త. 102:17) దేవుని కుమారుడైన “యేసు రక్తం మన పాపాలన్నిటి నుండి మనల్ని పవిత్రుల్ని చేస్తుంది” అని అపొస్తలుడైన యోహాను చెప్తున్నాడు. (1 యోహా. 1:7; 2:1; కీర్త. 86:5) ఇతరులు ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తూ ఉండమని తన సేవకులకు చెప్పిన యెహోవా, మనల్ని క్షమించడా? ఖచ్చితంగా క్షమిస్తాడు.—మత్త. 18:21, 22; కొలొ. 3:13.
ఎడారిలో ఉన్నప్పుడు ఆత్మనిగ్రహం కోల్పోయిన మోషేను చూసి యెహోవా బాధపడ్డాడు. అయినా ఆయన మోషేను క్షమించాడు. అంతేకాదు, విశ్వాసం విషయంలో మోషే మంచి ఆదర్శం ఉంచాడని బైబిలు చెప్తుంది. (ద్వితీ. 34:10; హెబ్రీ. 11:24-28) యెహోవా మోషేను వాగ్దానదేశంలో అడుగుపెట్టనివ్వకపోయినా, పరదైసు భూమ్మీద నిరంతరం జీవించే అవకాశాన్ని ఆయనకు ఇస్తాడు. మనం కూడా ఆత్మనిగ్రహం అనే ప్రాముఖ్యమైన లక్షణాన్ని అలవర్చుకోవడానికి కృషిచేస్తే, పరదైసులో నిరంతరం జీవిస్తాం.—1 కొరిం. 9:25.