‘ఆయన నీ ప్రణాళికలన్నిటినీ సఫలం చేయాలి’
“యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.”—కీర్త. 37:4.
1. భవిష్యత్తు గురించి యౌవనులు ఏ నిర్ణయం తీసుకోవాలి? భవిష్యత్తు గురించి భయపడకుండా ఉండడానికి వాళ్లకేమి సహాయం చేస్తుంది? (ప్రారంభ చిత్రం చూడండి.)
యౌవనస్థులారా, ఏదైనా ఒక ప్రయాణం మొదలుపెట్టే ముందు చేరుకోవాల్సిన గమ్యం గురించి ప్రణాళిక వేసుకోవడం తెలివైన పనని మీరు ఒప్పుకుంటారు కదా! జీవితం కూడా ఒక ప్రయాణం లాంటిదే. జీవితంలో మీరు చేరుకోవాల్సిన గమ్యం గురించి ప్రణాళికలు వేసుకోవడానికి యౌవ్వనమే సరైన సమయం. నిజమే అలా ప్రణాళిక వేసుకోవడం అంత తేలిక కాకపోవచ్చు. హెతర్ అనే సహోదరి ఇలా అంటోంది, “మిగిలిన జీవితమంతా ఏమి చేయాలో నిర్ణయించుకోవాలి కాబట్టి చాలా భయమేస్తుంది.” మీకు కూడా అలా అనిపిస్తే, యెహోవా చెప్తున్న ఈ మాటల్ని గుర్తుచేసుకోండి, “భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే.”—యెష. 41:9, 10.
2. యెహోవా మీ సంతోషాన్ని కోరుకుంటున్నాడని ఎలా చెప్పవచ్చు?
2 భవిష్యత్తు గురించి తెలివిగా ప్రణాళిక వేసుకోమని యెహోవా ప్రోత్సహిస్తున్నాడు. (ప్రసం. 12:1; మత్త. 6:20) మీరు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన చేసిన సృష్టిని చూసినప్పుడు, వాటి శబ్దాల్ని విన్నప్పుడు, ఆహారాన్ని రుచి చూసినప్పుడు మీకు ఆ విషయం అర్థమౌతుంది. అయితే వేరే విధాలుగా కూడా యెహోవా మనపట్ల శ్రద్ధ చూపిస్తున్నాడు. ఆయన మనకు సలహాల్ని ఇస్తూ ఉత్తమమైన విధంగా ఎలా జీవించవచ్చో నేర్పిస్తున్నాడు. అందుకే ఎవరైనా ఆ తెలివైన సలహాల్ని పాటించకపోతే ఆయన బాధపడతాడు. అలాంటివాళ్లతో యెహోవా ఇలా అంటున్నాడు, ‘నాకు నచ్చనివాటిని మీరు ఎంచుకున్నారు. ఇదిగో! నా సేవకులు సంతోషిస్తారు, కానీ మీరు అవమానం పాలౌతారు. ఇదిగో! నా సేవకులు మనోల్లాసంతో సంతోషంగా కేకలు వేస్తారు, కానీ మీరు హృదయ వేదనతో ఏడుస్తారు.’ (యెష. 65:12-14, NW) మనం తెలివైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, యెహోవాకు మహిమ తీసుకొస్తాం.—సామె. 27:11.
సంతోషాన్నిచ్చే ప్రణాళికలు
3. మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలని యెహోవా చెప్తున్నాడు?
3 మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలని యెహోవా చెప్తున్నాడు? మీరు సంతోషంగా ఉండాలంటే, యెహోవాను తెలుసుకొని ఆయన సేవ చేయాలి. ఆ విధంగానే యెహోవా మనల్ని సృష్టించాడు. (కీర్త. 128:1; మత్త. 5:3) జంతువులు కేవలం తింటాయి, తాగుతాయి, పిల్లల్ని కంటాయి. కానీ మీ జీవితం సంతోషంగా, అర్థవంతంగా ఉండేలా ప్రణాళిక వేసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. మిమ్మల్ని “తన స్వరూపంలో” చేసిన సృష్టికర్త ‘ప్రేమగల,’ “సంతోషంగల దేవుడు.” (2 కొరిం. 13:11; 1 తిమో. 1:11; ఆది. 1:27) మీరు మన ప్రేమగల దేవున్ని అనుకరించినప్పుడే సంతోషంగా ఉంటారు. బైబిలు ఇలా చెప్తోంది, “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.” (అపొ. 20:35) మీకు కూడా అలా అనిపించే ఉంటుంది. ఎందుకంటే అది జీవిత సత్యం. కాబట్టి భవిష్యత్తు గురించిన మీ ప్రణాళికల్లో ఇతరుల మీద, దేవుని మీద మీకున్న ప్రేమ కనిపించాలని యెహోవా కోరుకుంటున్నాడు.—మత్తయి 22:36-39 చదవండి.
4, 5. యేసు ఎందుకు సంతోషంగా జీవించాడు?
4 యౌవనులారా యేసే మీకు అత్యుత్తమ ఆదర్శం. ఆయన పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆడుకొని ఉంటాడు, సరదాగా సమయం గడిపి ఉంటాడు. అయితే దేవుని వాక్యం చెప్తున్నట్లు, ‘ఏడ్వడానికి, నాట్యమాడడానికి’ సమయం ఉంది. (ప్రసం. 3:4) ఆ వయసులో లేఖనాలను లోతుగా చదవడం ద్వారా యేసు యెహోవాకు దగ్గరయ్యాడు. ఆయనకు 12 ఏళ్లు ఉన్నప్పుడు, “ఆయన అవగాహనను, ఆయన చెప్తున్న జవాబుల్ని చూసి” ఆలయంలోని బోధకులు ఆశ్చర్యపోయారు.—లూకా 2:42, 46, 47.
5 యేసు పెరిగి పెద్దవాడైనప్పుడు, దేవుడు చెప్పింది చేయడంవల్ల సంతోషాన్ని పొందాడు. ఉదాహరణకు, యేసు ‘పేదవాళ్లకు మంచివార్త ప్రకటించాలని, గుడ్డివాళ్లకు చూపు వస్తుందని ప్రకటించాలని’ దేవుడు కోరుకున్నాడు. (లూకా 4:18) దేవుడు చెప్పింది చేయడంలో యేసుకున్న భావాల గురించి కీర్తన 40:8 ఇలా చెప్తోంది, “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము.” తన తండ్రి గురించి ప్రజలకు బోధిస్తూ యేసు సంతోషించాడు. (లూకా 10:21 చదవండి.) ఒక సందర్భంలో, సత్యారాధన గురించి ఒక స్త్రీతో మాట్లాడాక యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు, “నన్ను పంపించిన వ్యక్తి ఇష్టాన్ని చేయడం, ఆయనిచ్చిన పనిని పూర్తిచేయడమే నా ఆహారం.” (యోహా. 4:31-34) దేవునిపట్ల, ఇతరులపట్ల ప్రేమ చూపించాడు కాబట్టి యేసు సంతోషంగా జీవించాడు. మీరు కూడా అలా చేస్తే సంతోషంగా ఉంటారు.
6. మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి ఇతరులతో మాట్లాడడం ఎందుకు మంచిది?
6 చాలామంది క్రైస్తవులు తమ యౌవనంలోనే పయినీరు సేవ మొదలుపెట్టారు, దానివల్ల సంతోషాన్ని పొందారు. అలాంటి కొంతమందితో మీ ప్రణాళికల గురించి మాట్లాడగలరా? “ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.” (సామె. 15:22) పయినీరు సేవ ఒక విద్య లాంటిదని, అది మీకు జీవితాంతం ఉపయోగపడుతుందని ఆ సహోదరసహోదరీలు చెప్తారు. యేసు పరలోకంలో ఉన్నప్పుడు తన తండ్రి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత, తన భూపరిచర్యలో కూడా ఆయన నేర్చుకుంటూనే వచ్చాడు. ఆయన ఇతరులకు మంచివార్త చెప్పడం ద్వారా, కష్టసమయాల్లో దేవునికి నమ్మకంగా ఉండడం ద్వారా సంతోషాన్ని సొంతం చేసుకున్నాడు. (యెషయా 50:4 చదవండి; హెబ్రీ. 5:8; 12:2) పూర్తికాల సేవలో మీకు సంతోషం ఉంటుందని ఎందుకు చెప్పవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.
శిష్యుల్ని చేసే పనికన్నా మించిన పని లేదని ఎందుకు చెప్పవచ్చు
7. చాలామంది యౌవనులకు శిష్యుల్ని చేయడమంటే ఎందుకు ఇష్టం?
7 ప్రజల్ని ‘శిష్యులుగా చేసి,’ వాళ్లకు బోధించమని యేసు మనకు చెప్పాడు. (మత్త. 28:19, 20) ఈ పనినే మీ కెరీర్‌గా చేసుకుంటే, దేవున్ని ఘనపర్చే సంతృప్తికరమైన జీవితాన్ని ఆనందిస్తారు. ఏ కెరీర్‌లోనైనా నైపుణ్యత సాధించడానికి సమయం పడుతుంది. టీనేజీలో పయినీరు సేవ మొదలుపెట్టిన తిమోతి అనే సహోదరుడు ఇలా చెప్పాడు, “పూర్తికాల సేవ చేయడం నాకిష్టం ఎందుకంటే అలా చేయడం ద్వారా యెహోవాపట్ల నా ప్రేమను చూపించగలుగుతాను. పయినీరు సేవ మొదలుపెట్టిన కొత్తలో నాకు ఒక్క బైబిలు స్టడీ కూడా దొరకలేదు. కానీ కొంతకాలం తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు, అక్కడ ఒక నెలలోనే చాలా బైబిలు స్టడీలు దొరికాయి. ఒక బైబిలు విద్యార్థి మీటింగ్స్‌కి రావడం కూడా మొదలుపెట్టాడు. ఆ తర్వాత, నేను రెండు నెలలపాటు జరిగే ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాలకు హాజరయ్యాను. a ఆ పాఠశాల తర్వాత నన్ను వేరే ప్రాంతానికి నియమించారు. అక్కడ నేను నాలుగు బైబిలు స్టడీలు ప్రారంభించాను. పవిత్రశక్తి సహాయంతో ప్రజలు తమ జీవితాల్ని మార్చుకోవడం నేను చూస్తున్నప్పుడు, వాళ్లకు ఇంకా నేర్పించాలని అనిపిస్తుంది.”—1 థెస్స. 2:19.
8. ఎక్కువమందికి ప్రీచింగ్ చేసేలా కొంతమంది యౌవనులు ఏమి చేశారు?
8 కొంతమంది యౌవనులు వేరే భాష నేర్చుకున్నారు. ఉదాహరణకు, ఉత్తర అమెరికాకు చెందిన జేకబ్ ఇలా రాస్తున్నాడు, “నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు నా తోటి విద్యార్థులు చాలామంది వియత్నాంకి చెందినవాళ్లే ఉండేవాళ్లు. వాళ్లకు యెహోవా గురించి చెప్పాలనుకున్నాను. అందుకే కొంతకాలం తర్వాత వాళ్ల భాష నేర్చుకోవాలని ప్రణాళిక వేసుకున్నాను. వాళ్ల భాషలో ఉన్న కావలికోటల్ని ఇంగ్లీష్ భాషలో ఉన్న కావలికోటలతో పోల్చి చూడడంవల్ల చాలావరకు భాష నేర్చుకున్నాను. అలాగే మాకు దగ్గరో ఉన్న ఆ భాషా సంఘంలోని వాళ్లతో స్నేహం చేయడం మొదలుపెట్టాను. నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడు పయినీరు సేవ మొదలుపెట్టాను. కొంతకాలం తర్వాత, ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాలకు హాజరయ్యాను. అలా హాజరవ్వడం ప్రస్తుతం నేను పనిచేస్తున్న నియామకానికి ఉపయోగపడింది. ఎందుకంటే వియత్నామీస్ భాషా గుంపుకు నేనొక్కడినే పెద్దగా సేవచేస్తున్నాను. నేను ఆ భాష నేర్చుకున్నందుకు అక్కడి ప్రజలు చాలామంది ఆశ్చర్యపోయారు. వాళ్లు నన్ను తమ ఇంటికి ఆహ్వానించేవాళ్లు అప్పుడు నేను వాళ్లతో బైబిలు స్టడీ మొదలుపెట్టేవాణ్ణి. కొంతమంది బాప్తిస్మం కూడా తీసుకున్నారు.”—అపొ. 2:7, 8 పోల్చండి.
9. శిష్యుల్ని చేసే పని మనకేమి నేర్పిస్తుంది?
9 శిష్యుల్ని చేసే పని ఒక చక్కని విద్య లాంటిది. ఉదాహరణకు, దానివల్ల మీరు మంచి పని అలవాట్లు నేర్చుకుంటారు, ఇతరులతో చక్కగా, ధైర్యంగా, నేర్పుగా మాట్లాడడం నేర్చుకుంటారు. (సామె. 21:5; 2 తిమో. 2:24) ఈ పనిలో సంతోషాన్ని పొందడానికిగల ప్రత్యేకమైన కారణమేమిటంటే మీ నమ్మకాల్ని లేఖనాల నుండి ఎలా నిరూపించాలో నేర్చుకుంటారు. అంతేకాదు, యెహోవాకు దగ్గరగా పనిచేయడం కూడా నేర్చుకుంటారు.—1 కొరిం. 3:9.
10. మీరు ప్రీచింగ్ చేస్తున్న ప్రాంతంలో ఎక్కువమంది మంచివార్త వినకపోయినా సంతోషాన్ని ఎలా పొందవచ్చు?
10 మీరు ప్రీచింగ్ చేసే ప్రాంతంలో బైబిలు స్టడీ తీసుకోవడానికి కొంతమందే ఇష్టపడినప్పటికీ ఆ పనిలో సంతోషం పొందవచ్చు. శిష్యుల్ని చేసే పనిలో సంఘమంతా ఒక జట్టులా పనిచేస్తుంది. కేవలం ఒక సహోదరునికే లేదా సహోదరికే బైబిలు స్టడీ దొరికినా మనందరం సంతోషిస్తాం ఎందుకంటే ఆసక్తిగలవాళ్లను వెదికే పనిలో అందరం భాగంవహించాం కాబట్టి. ఉదాహరణకు, తొమ్మిదేళ్లుగా పయినీరు సేవచేస్తున్న బ్రాడన్ అనే సహోదరుడినే తీసుకోండి. అతను సేవచేస్తున్న ప్రాంతంలో కొంతమందే బైబిలు స్టడీ తీసుకుంటున్నారు. అతనిలా చెప్తున్నాడు, “నాకు మంచివార్త ప్రకటించడమంటే ఇష్టం ఎందుకంటే ఆ పని చేయమని యెహోవాయే చెప్పాడు. నేను నా స్కూల్ విద్య పూర్తి చేసుకున్న వెంటనే పయినీరు సేవ మొదలుపెట్టాను. మా సంఘంలో ఉన్న యౌవన సహోదరుల్ని ప్రోత్సహించినప్పుడు, వాళ్లు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడం చూసినప్పుడు నాకు సంతోషంగా ఉండేది. ఆ తర్వాత, నేను ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాలకు హాజరయ్యాను. ఆ పాఠశాల తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లి సేవచేసే నియామకం పొందాను. నిజానికి నా బైబిలు స్టడీ వాళ్లెవ్వరూ ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకోలేదు, కానీ వేరే సహోదరుల బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకున్నారు. అయితే, శిష్యుల్ని చేసే పనిలో పూర్తిగా భాగం వహించేలా ప్రణాళిక వేసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది.”—ప్రసం. 11:6.
మీ ప్రణాళికల వల్ల వచ్చే ఫలితాలు
11. చాలామంది యౌవనులు ఏ విధమైన పూర్తికాల సేవలో ఆనందించారు?
11 యెహోవా సేవచేయడానికి మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు, చాలామంది యౌవనులు నిర్మాణ పనిలో సహాయం చేస్తారు. నిజానికి, వందల కొలది కొత్త రాజ్యమందిరాలు అవసరం. రాజ్యమందిరాలు యెహోవాకు ఘనత తెస్తాయి కాబట్టి వాటిని కట్టే పనిలో సహాయం చేస్తే మీకు సంతోషం కలుగుతుంది. సహోదరసహోదరీలతో కలిసి పనిచేయడంలో ఉన్న ఆనందాన్ని కూడా ఆస్వాదించవచ్చు. అంతేకాదు ఒక పనిని చక్కగా, సురక్షితమైన విధంగా ఎలా చేయవచ్చు, పర్యవేక్షకులకు ఎలా సహకరించవచ్చు వంటివి కూడా మీరు నేర్చుకోగలుగుతారు.
12. పయినీరు సేవ చేయడంవల్ల ఎలాంటి వేరే అవకాశాలు కూడా వస్తాయి?
12 కెవిన్ అనే సహోదరుడు ఏమంటున్నాడంటే, “ఏదోక రోజు పూర్తికాల సేవ మొదలుపెట్టాలనే కోరిక నాకు చిన్నతనం నుండే ఉండేది. చివరికి, నాకు 19 ఏళ్లు ఉన్నప్పుడు పయినీరు సేవ మొదలుపెట్టాను. బిల్డర్‌గా పనిచేస్తున్న ఒక సహోదరుని దగ్గర పార్ట్-టైమ్ ఉద్యోగం చేస్తూ నా ఖర్చుల కోసం డబ్బు సంపాదించుకునేవాణ్ణి. పైకప్పులను, కిటికీలను, తలుపులను బిగించడం నేర్చుకున్నాను. ఆ తర్వాత, రెండేళ్ల పాటు హరికేన్ సహాయక బృందంతో కలిసి రాజ్యమందిరాలను, సహోదరుల ఇళ్లను మళ్లీ కట్టడంలో సహాయం చేశాను. దక్షిణ ఆఫ్రికాలో నిర్మాణ పని చేసేవాళ్ల అవసరం ఎక్కువ ఉందని తెలిసి అఫ్లికేషన్ పంపాను నాకు ఆహ్వానం వచ్చింది. ఆఫ్రికాలో, కొన్ని వారాలపాటు ఒక రాజ్యమందిర నిర్మాణంలో పనిచేశాక మరోచోట రాజ్యమందిర నిర్మాణానికి వెళ్తుంటాను. ఈ పని చేసేవాళ్లమంతా ఒకే కుటుంబంలా ఉంటాం. మేము కలిసి జీవిస్తాం, కలిసి బైబిలు అధ్యయనం చేస్తాం, కలిసి పని చేస్తాం. నేను ప్రతీవారం స్థానిక సహోదరులతో పరిచర్యలో కూడా ఆనందిస్తాను. నా చిన్నతనంలో వేసుకున్న ప్రణాళికలు నేను ఊహించనిరీతిలో నాకు సంతోషాన్ని తీసుకొచ్చాయి.”
13. బెతెల్‌లో యెహోవా సేవచేస్తున్న చాలామంది యౌవనులు ఎందుకు సంతోషంగా ఉన్నారు?
13 పయినీర్లుగా సేవచేసిన కొంతమంది ఇప్పుడు బెతెల్‌లో సేవచేస్తున్నారు. ఆ సేవ చాలా సంతోషాన్నిస్తుంది ఎందుకంటే అక్కడ మీరు ప్రతీ పని యెహోవా కోసమే చేస్తారు. సత్యం నేర్చుకోవడానికి ప్రజలకు సహాయపడే బైబిళ్లను, ప్రచురణలను తయారుచేయడంలో బెతెల్ కుటుంబసభ్యులు సహాయం చేస్తారు. డస్టన్ అనే బెతెల్ సభ్యుడు ఇలా చెప్పాడు, “నాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు, పుర్తికాల సేవ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాను. నా స్కూల్ చదువు అయిపోయాక పయినీరు సేవ మొదలుపెట్టాను. ఒకటిన్నర సంవత్సరం తర్వాత, బెతెల్‌కు రమ్మనే ఆహ్వానం వచ్చింది. అక్కడ నేను ప్రింటింగ్ ప్రెస్‌లను ఆపరేట్ చేయడం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయడం నేర్చుకున్నాను. ప్రపంచవ్యాప్త ప్రకటనాపని వల్ల జరుగుతున్న ప్రగతి గురించి ముందుగా వినే అవకాశం దొరుకుతున్నందుకు సంతోషంగా ఉంది. నాకు బెతెల్‌లో సేవ చేయడం చాలా ఇష్టం ఎందుకంటే మేము చేసే పని ప్రజల్ని యెహోవాకు దగ్గర చేస్తోంది.”
మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?
14. పూర్తికాల సేవచేయడానికి మీరు ఇప్పుడే ఎలా సిద్ధపడవచ్చు?
14 పూర్తికాల సేవ చేయడానికి మీరు ఎలా సిద్ధపడవచ్చు? యెహోవాను శ్రేష్ఠమైన విధంగా సేవించాలంటే, మీరు క్రైస్తవ లక్షణాలను అలవర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేయాలి, అధ్యయనం చేసిన వాటిగురించి లోతుగా ఆలోచించాలి అంతేకాదు మీటింగ్స్‌లో కామెంట్స్ ద్వారా మీ విశ్వాసాన్ని తెలియజేయాలి. మీరు స్కూల్లో ఉండగానే మంచివార్త గురించి ఇతరులతో మాట్లాడే సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. ఇతరుల అభిప్రాయం తెలుసుకోవడానికి మీరు తెలివిగా ఒక ప్రశ్న వేసి, వాళ్లు చెప్పే జవాబులను వినాలి. అలా ఇతరులపట్ల శ్రద్ధ చూపించడం నేర్చుకోవచ్చు. అంతేకాదు, ముందుకొచ్చి రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడం, అది మంచిస్థితిలో ఉండేలా చూసుకోవడం వంటి సంఘ పనులు చేయవచ్చు. వినయస్థులను, సహాయం చేయడానికి ముందుకొచ్చేవాళ్లను ఉపయోగించుకోవడానికి యెహోవా ఇష్టపడుతున్నాడు. (కీర్తన 110:3 చదవండి; అపొ. 6:1-3) తిమోతికి “సోదరుల దగ్గర మంచి పేరుంది” కాబట్టే అపొస్తలుడైన పౌలు తనతోపాటు అతన్ని మిషనరీ సేవచేయమని ఆహ్వానించాడు.—అపొ. 16:1-5.
15. ఒక ఉద్యోగం సంపాదించడానికి మీరెలా ప్రణాళిక వేసుకోవాలి?
15 చాలామంది పూర్తికాల సేవకులకు ఒక ఉద్యోగం అవసరమౌతుంది. (అపొ. 18:2, 3) కాబట్టి, మీరు ఉంటున్న ప్రాంతంలోనే ఒక పార్ట్‌టైమ్ ఉద్యోగం సంపాదించుకునేలా బహుశా కొన్ని నెలల్లో పూర్తి చేయగల కోర్సును మీరు నేర్చుకోవచ్చు. మీ ప్రణాళికల గురించి మీ ప్రాంతీయ పర్యవేక్షకునితో, ఇతర పయినీర్లతో మాట్లాడి సలహాలు అడగండి. ఆ తర్వాత బైబిలు చెప్తున్నట్లు, ‘మీ పనుల భారం యెహోవామీద ఉంచండి అప్పుడు మీ ఉద్దేశాలు సఫలమౌతాయి.’—సామె. 16:3; 20:18.
16. భవిష్యత్తులో ఇతర బాధ్యతలను చేపట్టడానికి పూర్తికాల సేవ మిమ్మల్ని ఎలా సిద్ధం చేయగలదు?
16 మీరు సంతోషకరమైన భవిష్యత్తు మీద “గట్టి పట్టు” కలిగివుండాలనేదే యెహోవా కోరిక అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. (1 తిమోతి 6:18, 19 చదవండి.) మీలాగే పూర్తికాల సేవ చేస్తున్న ఇతరులతో కలిసి పనిచేసే అవకాశం దొరుకుతుంది కాబట్టి మీరు పరిణతిగల క్రైస్తవులుగా తయారవుతారు. అంతేకాదు యౌవనంలోనే పూర్తికాల సేవలో అడుగుపెట్టిన అనుభవం పెళ్లయ్యాక ఉపయోగపడిందని చాలామంది గుర్తించారు. పెళ్లికాక ముందు పయినీరు సేవ చేసినవాళ్లు, పెళ్లయ్యాక జంటగా ఆ సేవను కొనసాగిస్తున్నారు.—రోమా. 16:3, 4.
17, 18. ప్రణాళికలు వేసుకోవడమనేది హృదయంతో చేసేపని అని ఎలా చెప్పవచ్చు?
17 కీర్తన 20:4, NW యెహోవా గురించి ఇలా చెప్తోంది, ‘ఆయన నీ హృదయ కోరికలను అనుగ్రహించాలి నీ ఆలోచనలన్నిటినీ [లేదా, ప్రణాళికలన్నిటినీ] సఫలం చేయాలి.’ మీ భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకుంటుండగా, మీరు జీవితంలో నిజంగా ఏమి చేయాలనుకుంటున్నారో ఆలోచించండి. మనకాలంలో యెహోవా ఏమి చేస్తున్నాడో, ఆ పనికి మీరెలా మద్దతివ్వగలరో ఆలోచించండి. ఆ తర్వాత, ఆయనకు సంతోషం కలిగించే పనిచేయడానికి ప్రణాళిక వేసుకోండి.
18 మీ జీవితాన్ని యెహోవా సేవచేయడానికే ఉపయోగించండి. అలా యెహోవాను ఘనపర్చినప్పుడు మీకు చెప్పలేనంత సంతోషం కలుగుతుంది. అవును, ‘యెహోవానుబట్టి సంతోషించండి ఆయన మీ హృదయవాంఛలను తీరుస్తాడు.’—కీర్త. 37:4.
a ఇప్పుడు ఆ పాఠశాల స్థానంలో రాజ్య సువార్తికుల కోసం పాఠశాలను నిర్వహిస్తున్నారు.