కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాను ఎందుకు స్తుతించాలి?

యెహోవాను ఎందుకు స్తుతించాలి?

“యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము.”కీర్త. 147:1.

పాటలు: 59, 3

1-3. (ఎ) 147వ కీర్తనను ఏ కాలంలో రాసివుండవచ్చు? (బి) 147వ కీర్తన నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

 ఎవరైనా ఒక పనిని చక్కగా చేసినప్పుడు లేదా మంచి లక్షణాన్ని చూపించినప్పుడు మనం వాళ్లను మెచ్చుకుంటాం. మనుషులను మెచ్చుకోవడానికే మనకు కారణాలు ఉన్నప్పుడు, యెహోవా దేవున్ని స్తుతించడానికి ఇంకెన్ని కారణాలు ఉన్నాయో కదా! ఉదాహరణకు, యెహోవాకు ఉన్న గొప్ప శక్తి ఆయన చేసిన అద్భుతమైన సృష్టిలో కనిపిస్తుంది. ఆయనకు మనమీద ఉన్న అపారమైన ప్రేమ, ఆయన మనకోసం తన సొంత కుమారుణ్ణి బలిగా అర్పించడంలో కనిపిస్తుంది. వీటన్నిటినిబట్టి మనం ఆయన్ను స్తుతిస్తాం.

2 మనం 147వ కీర్తనను పరిశీలిస్తే, దాన్ని రాసిన వ్యక్తికి యెహోవాను స్తుతించాలనే బలమైన కోరిక ఉన్నట్లు అర్థమౌతుంది. పైగా ఇతరుల్ని కూడా తనతో కలిసి దేవున్ని స్తుతించమని అతను ప్రోత్సహించాడు.—కీర్తన 147:1, 7, 12 చదవండి.

3 నిజానికి 147వ కీర్తనను ఎవరు రాశారో మనకు తెలీదు. కాకపోతే, ఇశ్రాయేలీయులు బబులోను నుండి విడుదల పొంది యెరూషలేముకు తిరిగివెళ్లిన కాలంలో ఆ కీర్తనకర్త జీవించివుండవచ్చు. (కీర్త. 147:2) దేవుని ప్రజలకు, మరొకసారి తమ సొంత దేశంలో యెహోవాను ఆరాధించే అవకాశం వచ్చినందుకు ఆ కీర్తనకర్త యెహోవాను స్తుతించాడు. కేవలం అదొక్కటే కాదు, యెహోవాను స్తుతించడానికి మరెన్నో కారణాలను ఆ కీర్తనకర్త వివరించాడు. ఏమిటా కారణాలు? “హల్లెలూయా” లేదా ‘యెహోవాను స్తుతించండి’ అని చెప్పడానికి ఏ కారణాలు ఉన్నాయి?—కీర్త. 147:1; ప్రక. 19:1, అధస్సూచి.

విరిగిన హృదయము గలవాళ్లను యెహోవా ఓదారుస్తాడు

 4. రాజైన కోరెషు ఇశ్రాయేలీయుల్ని విడుదల చేసినప్పుడు వాళ్లకు ఎలా అనిపించి ఉంటుంది? ఎందుకు?

4 బబులోనులో బంధీలుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు ఎలా అనిపించివుంటుందో ఒకసారి ఊహించండి. వాళ్లను బంధీలుగా తీసుకొచ్చినవాళ్లు, “సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి” అని అంటూ వాళ్లను ఎగతాళి చేశారు. కానీ ఆ యూదులకు పాడడానికి మనసురాలేదు. ఎందుకంటే వాళ్లకు ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చిన యెరూషలేము నాశనమైపోయింది. (కీర్త. 137:1-3, 6) కృంగిపోయి ఉన్న వాళ్లకు ఓదార్పు అవసరమైంది. అయితే యెహోవా ముందే చెప్పినట్లు వాళ్లకు సహాయం చేశాడు. ఎలా? పారసీక రాజైన కోరెషు బబులోనును జయించాడు. అతను యెహోవా గురించి ఇలా చెప్పాడు, “యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.” అంతేకాదు కోరెషు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాడు, “మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు బయలుదేరవచ్చును; వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక.” (2 దిన. 36:23) పరిస్థితుల్లో వచ్చిన మార్పు వల్ల బబులోనులో ఉన్న ఇశ్రాయేలీయులు ఎంత ఓదార్పు పొందుంటారో కదా!

 5. మనల్ని ఓదార్చే విషయంలో యెహోవాకున్న శక్తి గురించి కీర్తనకర్త ఏమన్నాడు?

5 యెహోవా ఇశ్రాయేలు జనాంగంలోని ప్రతీ ఒక్కర్నీ ఓదార్చాడు. మనకాలంలో కూడా యెహోవా అలాగే చేస్తాడు. దేవుడు, ‘గుండె చెదరినవాళ్లను బాగుచేయువాడు వాళ్ల గాయాలు కట్టువాడు’ అని కీర్తనకర్త రాశాడు. (కీర్త. 147:3) మన ఆరోగ్యం బాలేనప్పుడు లేదా మనం కృంగిపోయినప్పుడు యెహోవా మనపట్ల శ్రద్ధ చూపిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. మనల్ని ఓదార్చాలని, మన మనసుకు అయిన గాయాల్ని మాన్పాలని ఆయన ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాడు. (కీర్త. 34:18; యెష. 57:15) అంతేకాదు మనకొచ్చే ఎలాంటి కష్టాలనైనా తట్టుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని, బలాన్ని ఆయన మనకిస్తాడు.—యాకో. 1:5.

 6. కీర్తన 147:4 వ వచనం నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

6 ఆ తర్వాత కీర్తనకర్త ఆకాశం వైపు చూస్తూ, యెహోవా ‘నక్షత్రాల సంఖ్యను నియమించాడు, వాటికన్నిటికి పేర్లు పెడుతున్నాడు’ అని అన్నాడు. (కీర్త. 147:4) కీర్తనకర్త నక్షత్రాలను చూడగలుగుతున్నాడు గానీ, అవి ఎన్ని ఉన్నాయో మాత్రం అతనికి తెలీదు. నేడు, మన నక్షత్రవీధిలో కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయని, విశ్వంలో కోటానుకోట్ల నక్షత్రవీధులు ఉండవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. మనుషులు నక్షత్రాలన్నిటినీ లెక్కపెట్టలేరు, కానీ యెహోవా లెక్కపెట్టగలడు. నిజానికి ఆయనకు ప్రతీ నక్షత్రం గురించి ఎంత బాగా తెలుసంటే ఆయన ప్రతీ దానికి ఒక పేరు పెట్టాడు. (1 కొరిం. 15:41) ఏ నక్షత్రం ఎక్కడుందో తెలిసిన యెహోవాకు, మీ గురించి కూడా తెలుసు. మీరు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నారో, మీకెలా అనిపిస్తుందో, మీకేమి అవసరమో ఆయనకు బాగా తెలుసు.

7, 8. (ఎ) మనం ఎలాంటివాళ్లమని యెహోవా అర్థంచేసుకుంటాడు? (బి) యెహోవా కనికరంగల వాడని చూపించే ఒక అనుభవం చెప్పండి.

7 మీరు ఎలాంటి కష్టాల్ని అనుభవిస్తున్నారో యెహోవా అర్థంచేసుకుంటాడు. వాటిని తట్టుకోవడానికి సహాయం చేసే శక్తి ఆయనకు ఉంది. (కీర్తన 147:5 చదవండి.) మీకు వచ్చిన కష్టం చాలా పెద్దదని, దాన్ని తట్టుకోవడం మీ వల్లకాదని మీకనిపించవచ్చు. ‘మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ’ మన పరిమితుల్ని అర్థంచేసుకుంటాడు. (కీర్త. 103:14) మనం అపరిపూర్ణులం కాబట్టి చేసిన తప్పుల్నే మళ్లీమళ్లీ చేసి నిరుత్సాహపడుతుంటాం. కొన్నిసార్లు మనం గతంలో అన్న మాటల్నిబట్టి, ఒకప్పుడు కలిగివున్న తప్పుడు కోరికలు, అసూయలు బట్టి చాలా పశ్చాత్తాపపడుతుంటాం. అయితే యెహోవాలో ఏ లోపం లేదు, అయినప్పటికీ ఆయన మన భావాల్ని పూర్తిగా అర్థంచేసుకుంటాడు.—యెష. 40:28.

8 యెహోవా తన బలమైన చేయి అందించి మిమ్మల్ని కష్టాల్లో నుండి ఆదుకున్నట్లు మీకెప్పుడైనా అనిపించిందా? (యెష. 41:9, 10, 13) కీయోకో అనే ఓ పయినీరు సహోదరికి అలా అనిపించింది. కొత్త నియామకం మొదలుపెట్టాక ఆమె చాలా నిరుత్సాహపడింది. మరి తన కష్టాల్ని యెహోవా అర్థంచేసుకున్నాడని కీయోకో ఎలా తెలుసుకుంది? ఆమె హాజరౌతున్న కొత్త సంఘంలో తన భావాల్ని అర్థంచేసుకోగల ఎంతోమంది ఉండేవాళ్లు. అప్పుడు ఆమెకు యెహోవాయే స్వయంగా “నువ్వంటే నాకిష్టం. నువ్వు పయినీరుగా సేవ చేస్తున్నందుకు మాత్రమే కాదు. నువ్వు నా కూతురివి, నాకు సమర్పించుకున్న అమ్మాయివి. నా సాక్షుల్లో ఒకరిగా నువ్వు జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను” అని చెప్తున్నట్లు అనిపించింది. తన “జ్ఞానమునకు మితిలేదు” అని యెహోవా ఎలా చూపించాడు?

యెహోవా మన అవసరాల్ని తీరుస్తాడు

9, 10. అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవా ముందు ఏ అవసరాన్ని తీరుస్తాడు? ఒక అనుభవం చెప్పండి.

9 మనందరికీ ఆహారం, బట్టలు, ఇల్లు అవసరం. బహుశా మీకు కడుపునిండా ఆహారం దొరకదని మీరు ఆందోళన పడుతుండవచ్చు. నిజానికి అందరికీ సరిపోయేంత ఆహారం పండేలా యెహోవా ఈ భూమిని చేశాడు. చివరికి ‘పిల్లకాకులకు ఆయన ఆహారమిస్తున్నాడు.’ (కీర్తన 147:8, 9 చదవండి.) యెహోవా కాకులకే ఆహారాన్ని ఇస్తున్నాడంటే, మన అవసరాల్ని కూడా ఖచ్చితంగా తీరుస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—కీర్త. 37:25.

10 అన్నిటికన్నా ముఖ్యంగా, విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి అవసరమైన వాటిని యెహోవా మనకిస్తాడు. అంతేకాదు ‘మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతిని’ ఆయన మనకిస్తాడు. (ఫిలి. 4:6, 7) మూస్తూవో, అతని భార్య యెహోవా తమకు ఏవిధంగా సహాయం చేశాడో గుర్తించారు. 2011లో జపాన్‌ దేశాన్ని సునామీ అతలాకుతలం చేసినప్పుడు, ఈ జంట తమ ఇంటి పైకప్పు మీదికి ఎక్కి ప్రాణాలతో బయటపడింది. కానీ ఆ రోజున వాళ్లు తమకున్న సర్వస్వాన్ని కోల్పోయారు. ఆ రాత్రంతా కటిక చీకటిగా, చల్లగా ఉన్న తమ ఇంటి రెండవ అంతస్తులో తలదాచుకున్నారు. ఉదయాన్నే, తమను ఆధ్యాత్మికంగా బలపర్చేది ఏమైనా దొరుకుతుందేమోనని వెదికారు. వాళ్లకు 2006 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం మాత్రమే దొరికింది. మూస్తూవో ఆ పుస్తకాన్ని తీసుకుని పేజీలు తిరగేస్తుండగా, ‘అత్యంత వినాశనకరమైన సునామీ’ అనే అంశం కనిపించింది. 2004లో సుమత్రా దీవుల్లో వచ్చిన అత్యంత భయంకరమైన సునామీ గురించి అందులో వివరించారు. ఆ సునామీ సృష్టించిన భీభత్సంవల్ల నష్టపోయిన సహోదరసహోదరీల అనుభవాలు చదివినప్పుడు మూస్తూవో, అతని భార్య కంటతడి పెట్టుకున్నారు. ఆ సమయంలో సరిగ్గా తమకు అవసరమైన సహాయాన్ని యెహోవా ఇస్తున్నట్లు ఆ జంటకు అనిపించింది. ఇతర విధాల్లో కూడా యెహోవా వాళ్లపై శ్రద్ధ చూపించాడు. జపాన్‌లోని వేరే ప్రాంతాల్లో ఉన్న సహోదరసహోదరీలు వాళ్లకు ఆహారాన్ని, బట్టల్ని పంపించారు. సునామీ వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లోని సంఘాల్ని సందర్శించమని సంస్థ కొంతమంది సహోదరుల్ని పంపించింది. సహోదరులు అలా రావడమే వాళ్లకు అన్నిటికన్నా ఎక్కువ బలాన్నిచ్చింది. మూస్తూవో ఇలా చెప్తున్నాడు, “యెహోవా మా పక్కనే ఉండి, మా బాగోగులు చూసుకుంటున్నట్లు నాకనిపించింది. అప్పుడు మేము ఎంతో ఊరటను పొందాం.” అవును, యెహోవా ముందు మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి కావాల్సినవాటిని ఇస్తాడు, ఆ తర్వాత మన భౌతిక అవసరాల్ని తీరుస్తాడు.

దేవుడు చేసే సహాయాన్ని పొందండి

11. దేవుడు చేసే సహాయం పొందాలంటే మనమేమి చేయాలి?

11 “యెహోవా దీనులను లేవనెత్తువాడు.” ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. (కీర్త. 147:6ఎ) మరి ఆయన చేసే సహాయాన్ని పొందాలంటే మనమేమి చేయాలి? ఆయనతో బలమైన సంబంధం కలిగివుండాలి. అలా కలిగివుండాలంటే మనం సాత్వికులుగా ఉండాలి. (జెఫ. 2:3) సాత్వికులు తమకు జరిగిన అన్యాయాన్ని, దానివల్ల కలిగిన నష్టాన్ని యెహోవా తీసివేసే వరకు ఓపిగ్గా ఎదురుచూస్తారు. అలాంటివాళ్లను చూసి యెహోవా సంతోషిస్తాడు.

12, 13. (ఎ) దేవుని సహాయాన్ని పొందాలంటే మనం వేటికి దూరంగా ఉండాలి? (బి) ఎలాంటి వాళ్లను చూసి యెహోవా ఆనందిస్తాడు?

12 అంతేకాదు “భక్తిహీనులను ఆయన నేలను కూల్చును.” (కీర్త. 147:6బి) ఆ భక్తిహీనుల్లో మనం ఉండాలని కోరుకోం. బదులుగా మనపట్ల యెహోవా తన విశ్వసనీయ ప్రేమను చూపించాలని కోరుకుంటాం. కాబట్టి ఆయన అసహ్యించుకునేవాటిని మనం కూడా అసహ్యించుకోవాలి. (కీర్త. 97:10) ఉదాహరణకు, మనం లైంగిక పాపాలను అసహ్యించుకోవాలి. దానర్థం, లైంగిక పాపాలకు నడిపించే అశ్లీల చిత్రాలకు మాత్రమే కాదు మిగతా వాటన్నిటికీ మనం దూరం ఉండాలి. (కీర్త. 119:37; మత్త. 5:28) అలా దూరంగా ఉండడానికి మనం చాలా కృషిచేయాల్సి ఉంటుంది. అయితే మనం చేసే కృషి వృథాకాదు ఎందుకంటే అది మనకు యెహోవా దీవెనల్ని తెస్తుంది.

13 అయితే చెడు కోరికలతో మనం ఒంటరిగా పోరాడలేం, దానికి యెహోవా సహాయం కావాలి. ఒకవేళ మనం సొంత శక్తిపైగానీ, ఇతరులపైగానీ ఆధారపడితే యెహోవా సంతోషిస్తాడా? “గుఱ్ఱముల బలమునందు ఆయన సంతోషించడు నరులకాలిసత్తువయందు ఆయన ఆనందించడు.” (కీర్త. 147:10) కాబట్టి మనం సహాయం కోసం పట్టుదలగా ఆయనకు ప్రార్థిస్తూ ఉండాలి, మన బలహీనతల్ని అధిగమించడానికి సహాయం చేయమని ప్రాధేయపడుతూ ఉండాలి. అలాంటి ప్రార్థనల్ని వినడంవల్ల యెహోవా ఎన్నడూ విసిగిపోడు. బదులుగా “తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు.” (కీర్త. 147:11) యెహోవా నమ్మకమైనవాడు, పైగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, తప్పుడు కోరికలతో పోరాడి గెలవడానికి ఆయన సహాయం చేస్తూనే ఉంటాడని మనకు తెలుసు.

14. కీర్తనకర్త ఏ భరోసా కలిగివున్నాడు?

14 సమస్యలు వచ్చినప్పుడు సహాయం చేస్తానని యెహోవా మనకు హామీ ఇస్తున్నాడు. యెరూషలేముకు తిరిగొచ్చిన ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన సహాయం గురించి ఆలోచిస్తూ కీర్తనకర్త ఇలా పాడాడు, “ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి యున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి యున్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే.” (కీర్త. 147:13, 14) నగర గుమ్మాల్ని యెహోవా బలపరుస్తాడనే వాస్తవం కీర్తనకర్తలో భద్రతా భావాన్ని నింపింది. అంతేకాదు యెహోవా తన ప్రజల్ని కాపాడతాడనే భరోసాను ఇచ్చింది.

కష్టాలవల్ల చాలా ఆందోళనగా అనిపిస్తున్నప్పుడు దేవుని వాక్యం మనకెలా సహాయం చేయగలదు? (15-17 పేరాలు చూడండి)

15-17. (ఎ) కష్టాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకెలా అనిపిస్తుంది? కానీ యెహోవా మనకు సహాయం చేయడానికి తన వాక్యమైన బైబిల్ని ఏవిధంగా ఉపయోగిస్తాడు? (బి) మనకు సహాయం చేయడానికి దేవుని వాక్యం ‘వేగంగా పరుగెత్తుతుందని’ తెలియజేసే ఒక అనుభవం చెప్పండి.

15 కష్టాలు మీలో ఆందోళనను కలిగిస్తుంటాయి, కానీ వాటిని తట్టుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని యెహోవా మీకివ్వగలడు. దేవుని గురించి కీర్తనకర్త ఇలా రాశాడు, “భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును.” ఆ తర్వాత అతను హిమము, మంచు, వడగండ్లు గురించి ప్రస్తావించి, “ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు?” అని అడిగాడు. అంతేకాదు యెహోవా “ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవును” అని అతను అన్నాడు. (కీర్త. 147:15-18) వండగండ్లను, హిమమును నియంత్రించగల మన దేవునికి అన్నీ తెలుసు, ఆయనకు అసాధ్యమైనది అంటూ ఏదీ లేదు. అలాంటి దేవుడు, మీకు వచ్చే ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి ఖచ్చితంగా సహాయం చేయగలడు.

16 నేడు యెహోవా తన వాక్యమైన బైబిలు ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. మనకు సహాయం చేయడానికి దేవుని వాక్యం “వేగముగా పరుగెత్తును” అని కీర్తనకర్త చెప్పాడు. దేవుడు సరైన దారిలో, సరైన సమయంలో మనకు నడిపింపు ఇస్తాడు. బైబిలు ద్వారా, “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” ఇస్తున్న ప్రచురణల ద్వారా, JW బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా, jw.org వెబ్‌సైట్‌ ద్వారా, సంఘపెద్దల ద్వారా, తోటి సహోదరసహోదరీల ద్వారా మీరెలా ప్రయోజనం పొందుతున్నారో ఒకసారి ఆలోచించండి. (మత్త. 24:45) యెహోవా మీకు ‘వేగంగా’ సహాయం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?

17 సైమోనా అనే సహోదరి దేవుని వాక్యానికి ఉన్న శక్తిని స్వయంగా రుచిచూసింది. తాను ఎందుకూ పనికిరానిదాన్నని, యెహోవా తనను చూసి సంతోషించట్లేదని ఆమె అనుకునేది. అయితే నిరుత్సాహంగా అనిపించిన ప్రతీసారి ఆమె యెహోవాకు ప్రార్థన చేస్తూ సహాయం కోసం వేడుకునేది. దాంతోపాటు బైబిలు కూడా లోతుగా చదువుతూ ఉండేది. సైమోనా ఇలా చెప్పింది, “యెహోవా నాకు బలాన్ని ఇవ్వనట్లుగానీ, నన్ను నడిపించనట్లుగానీ నాకెప్పుడూ అనిపించలేదు.” తనలో ఉన్న మంచి విషయాలపై మనసుపెట్టడానికి అది ఆమెకెంతో సహాయం చేసింది.

18. దేన్నిబట్టి మీరు యెహోవాతో దగ్గరి సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు? ‘యెహోవాను స్తుతించడానికి’ మీకెలాంటి కారణాలు ఉన్నాయి?

18 ప్రాచీన కాలంలోని ఇశ్రాయేలు జనాంగాన్ని యెహోవా ఎంత ప్రత్యేకంగా చూశాడో కీర్తనకర్తకు తెలుసు. ‘ఆయన వాక్యాన్ని,’ “కట్టడలను” పొందిన ఏకైక జనాంగం ఇశ్రాయేలు జనాంగమే. (కీర్తన 147:19, 20 చదవండి.) నేడు మనకు దేవుని పేరు కలిగివుండే గొప్ప అవకాశం దొరికింది. ఆయన్ను తెలుసుకోగలిగినందుకు, మనల్ని నడిపించడానికి ఆయన వాక్యం ఉన్నందుకు, ఆయనతో దగ్గరి సంబంధం కలిగి ఉండగలుగుతున్నందుకు మనమెంతో కృతజ్ఞులం. 147వ కీర్తనకర్తలాగే మనకు కూడా, ‘యెహోవాను స్తుతించడానికి,’ ఆయన్ను స్తుతించమని ఇతరుల్ని ప్రోత్సహించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.