కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

“నెలలు నిండకముందే పుట్టినట్టున్న నాకు” అని అపొస్తలుడైన పౌలు అన్న మాటలకు అర్థం ఏంటి? (1 కొరింథీయులు 15:8)

మొదటి కొరింథీయులు 15:8 లో పౌలు ఇలా చెప్పాడు: “చిట్టచివరిగా, నెలలు నిండకముందే పుట్టినట్టున్న నాకు కూడా ఆయన కనిపించాడు.” పరలోకంలో మహిమగల యేసును, దర్శనంలో చూసిన తన అనుభవం గురించి పౌలు చెప్తున్నాడని గతంలో మనం అనుకున్నాం. ఒకవిధంగా, ఆత్మ ప్రాణిగా పుట్టే లేదా పునరుత్థానం అయ్యే గౌరవం ఆయన ముందే పొందాడని అనుకున్నాం. ఎందుకంటే, అలాంటి పునరుత్థానం ఎన్నో వందల సంవత్సరాల తర్వాతే మొదలైంది. అయితే మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత, ఈ లేఖనానికి మనం ఇదివరకు ఇచ్చిన వివరణను మార్చుకోవాలని అర్థమైంది.

పౌలు ఈ వచనంలో, తాను క్రైస్తవునిగా మారినప్పుడు జరిగినదాని గురించి చెప్తున్నాడు. కానీ ‘నెలలు నిండకముందే పుట్టాను’ అని అన్నప్పుడు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు? ఆయన మాటల్ని వేర్వేరు విధాలుగా అర్థంచేసుకోవచ్చు. వాటిగురించి ఇప్పుడు చూద్దాం.

ఆయన క్రైస్తవునిగా మారడం ఉన్నట్టుండి జరిగింది, అప్పుడు ఆయన అవాక్కయ్యాడు. నెలలు నిండకుండా బిడ్డ పుట్టడం అనేది, ఉన్నట్టుండి అనుకోకుండా జరుగుతుంది. సౌలు (తర్వాత పౌలుగా పిలవబడ్డాడు) దమస్కులోని క్రైస్తవుల్ని హింసించడానికి వెళ్తునప్పుడు, పునరుత్థానమైన యేసును దర్శనంలో చూస్తానని అనుకోలేదు. పౌలు క్రైస్తవునిగా మారినప్పుడు ఆయన ఒక్కడే ఆశ్చర్యపోలేదు, దమస్కులో ఆయన హింసించాలనుకున్న క్రైస్తవులు కూడా ఆశ్చర్యపోయారు. అంతేకాదు జరిగినదాన్ని బట్టి ఆయన ఎంతో అవాక్కయ్యాడు, కొన్ని రోజులపాటు చూపు కోల్పోయాడు.—అపొ. 9:1-9, 17-19.

ఆయన క్రైస్తవునిగా మారడం “సరైన సమయంలో” జరగలేదు. “నెలలు నిండకముందే పుట్టినట్టు” అని అనువదించిన గ్రీకు మాటకు “సరైన సమయంలో పుట్టలేదు” అనే అర్థం కూడా ఉంది. ద జెరూసలేమ్‌ బైబిల్‌ ఆ లేఖనాన్ని ఇలా అనువదించింది: ‘ఎవ్వరూ ఊహించనప్పుడు, నేను పుట్టినట్టు ఉంది.’ పౌలు క్రైస్తవునిగా మారిన సమయానికి, యేసు పరలోకానికి వెళ్లిపోయాడు. కొంతమంది, పునరుత్థానమైన యేసును, ఆయన పరలోకానికి వెళ్లకముందే చూశారని ముందున్న లేఖనాల్లో పౌలు చెప్పాడు. కానీ పౌలుకు ఆ అవకాశం దొరకలేదు. (1 కొరిం. 15:4-8) ఎవ్వరూ ఊహించనప్పుడు యేసు పౌలుకు కనిపించాడు. అది “సరైన సమయంలో” జరిగినట్టు అనిపించకపోయినా, దానివల్ల పునరుత్థానమైన యేసును చూసే అవకాశం పౌలుకు దొరికింది.

ఆయన తననుతాను తగ్గించుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు తననుతాను నిందించుకుంటూ మాట్లాడాడని కొంతమంది పండితులు అంటారు. ఒకవేళ పౌలు అలానే మాట్లాడివుంటే, అపొస్తలునిగా ఉండే అర్హత తనకు లేదని ఒప్పుకుంటున్నట్టు అవుతుంది. నిజానికి ఆయన ఇలా అన్నాడు: “నేను అపొస్తలులందరిలో తక్కువవాణ్ణి. నేను దేవుని సంఘాన్ని హింసించాను, కాబట్టి అపొస్తలుణ్ణని పిలవబడే అర్హత కూడా నాకు లేదు. అయితే దేవుని అపారదయ వల్లే నేను అపొస్తలుణ్ణి అయ్యాను.”—1 కొరిం. 15:9, 10.

కాబట్టి నెలలు నిండకముందే పుట్టినట్టుగా ఉన్నానని పౌలు చెప్పినప్పుడు, బహుశా తాను ఊహించనప్పుడు యేసు ఉన్నట్టుండి కనపడ్డాడని, తను క్రైస్తవునిగా మారడం సరైన సమయంలో జరగలేదని, లేదా ఆ గొప్ప దర్శనాన్ని చూసే అర్హత తనకు లేదని చెప్తుండవచ్చు. కారణం ఏదైనా, పౌలు తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ఎంతో విలువైనదిగా చూశాడు. ఆ దర్శనం వల్ల, యేసు పునరుత్థానం అయ్యాడని పౌలు పూర్తిగా నమ్మగలిగాడు. అందుకే యేసు పునరుత్థానం గురించి ఇతరులకు ప్రకటించేటప్పుడు, తనకు అనుకోకుండా ఎదురైన ఈ అనుభవం గురించి ఆయన ఎన్నోసార్లు చెప్పాడు.—అపొ. 22:6-11; 26:13-18.