మన దేవుని వాక్యం ఎప్పటికీ నిలిచివుంటుంది
“గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.”—యెష. 40:8.
1, 2. (ఎ) బైబిలు లేకపోయుంటే జీవితం ఎలా ఉండేది? (బి) దేవుని వాక్యం నుండి ప్రయోజనం పొందాలంటే ఏమి చేయాలి?
ఒకవేళ బైబిలు లేకపోయుంటే మీ జీవితం ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. ప్రతీరోజు మిమ్మల్ని సరైన దారిలో నడిపించే జ్ఞానయుక్తమైన సలహాలు దొరికేవి కావు. దేవుని గురించి, జీవం గురించి, భవిష్యత్తు గురించి సత్యం తెలిసుండేది కాదు. గతంలో మనుషుల కోసం యెహోవా చేసినవేవీ మీకు తెలిసి ఉండేవికావు.
2 సంతోషకరమైన విషయమేమిటంటే, మనం అలాంటి పరిస్థితిలో లేము. యెహోవా మన కోసం తన వాక్యమైన బైబిల్ని ఇచ్చాడు. అందులోని సందేశం ఎప్పటికీ నిలిచివుంటుందని మాటిచ్చాడు. యెషయా 40:8వ వచనంలోని మాటల్ని అపొస్తలుడైన పేతురు ఎత్తిచెప్పాడు. అయితే పేతురు అన్నది బైబిలు గురించి కాకపోయినప్పటికీ, అతని మాటలు బైబిల్లోని సందేశానికి వర్తిస్తాయి. (1 పేతురు 1:24, 25 చదవండి.) బైబిల్ని మన సొంత భాషలో చదివినప్పుడు దాన్నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతాం. దేవుని వాక్యాన్ని ప్రేమించేవాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. ఎన్నో శతాబ్దాల క్రితం, తీవ్రమైన వ్యతిరేకత, ఇబ్బందులు ఉన్నప్పటికీ బైబిల్ని అనువదించేందుకు, దాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు కొంతమంది చాలా కష్టపడ్డారు. వీలైనంత ఎక్కువమంది “సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకొని రక్షించబడాలని” యెహోవా కోరుకుంటున్నాడు.—1 తిమో. 2:3, 4.
3. ఈ ఆర్టికల్‌లో మనమేమి చర్చిస్తాం? (ప్రారంభ చిత్రం చూడండి.)
3 అయితే (1) భాషలో మార్పులు, (2) రాజకీయ మార్పులు, (3) అనువాద పనికి వ్యతిరేకత వంటివి ఎదురైనప్పటికీ వాటన్నిటినీ తట్టుకుని దేవుని వాక్యం ఎలా నిలిచివుందో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. ఈ చర్చవల్ల బైబిలుపట్ల, దాన్ని రాయించిన వ్యక్తిపట్ల మనకున్న కృతజ్ఞత మరింత పెరుగుతుంది.—మీకా 4:2; రోమా. 15:4.
భాషలో వచ్చిన మార్పులు
4. (ఎ) కాలం గడిచేకొద్దీ భాషల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? (బి) భాషల విషయంలో యెహోవా పక్షపాతం చూపించడని మనకెలా తెలుసు? దానిగురించి మీకేమనిపిస్తుంది?
4 కాలం గడిచేకొద్దీ భాషల్లో మార్పులు వస్తుంటాయి. పదాల, పదబంధాల అర్థాలు మారిపోతుంటాయి. ఉదాహరణకు మీ భాషలోని కొన్ని పదాల గురించే ఒకసారి ఆలోచించండి. ప్రాచీన కాలంలోని భాషల్లో కూడా అలాంటి మార్పులే జరిగాయి. ఈరోజు ప్రజలు మాట్లాడే హీబ్రూ, గ్రీకు భాషలతో పోలిస్తే బైబిల్ని రాసిన కాలంలోని హీబ్రూ, గ్రీకు భాషలు చాలా వేరుగా ఉండేవి. ప్రాచీన భాషల్లో రాసిన బైబిల్ని చాలామంది అర్థం చేసుకోలేకపోయారు. వాళ్లకు ఒక అనువాదం అవసరమైంది. కొంతమందైతే ప్రాచీన హీబ్రూ, గ్రీకు భాషలను నేర్చుకుంటే బైబిల్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చని అనుకున్నారు. ఒకవేళ నేర్చుకున్నా, అనుకున్నంత బాగా అర్థంచేసుకుని ఉండేవాళ్లు కాదు. a సంతోషకరమైన విషయమేమిటంటే, మొత్తం బైబిలు లేదా దానిలోని కొన్ని పుస్తకాలు దాదాపు 3,000 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఎందుకంటే ‘ప్రతీ దేశానికి, తెగకు, భాషకు, జాతికి చెందిన ప్రజలు’ తన వాక్యం నుండి ప్రయోజనం పొందాలనేది యెహోవా కోరిక. (ప్రకటన 14:6 చదవండి.) ఈ వాస్తవాన్ని బట్టి పక్షపాతం చూపించని ప్రేమగల మన దేవునికి మరింత దగ్గరౌతాం.—అపొ. 10:34.
5. కింగ్ జేమ్స్ వర్షన్ ప్రాముఖ్యమైన అనువాదమని ఎందుకు చెప్పవచ్చు?
5 భాషల్లో వచ్చే మార్పులు బైబిలు అనువాదాలపై కూడా ప్రభావం చూపిస్తాయి. ఏదైనా ఒక అనువాదం, అది వచ్చిన కొత్తలో అర్థమైనంత బాగా కొంతకాలం తర్వాత అర్థంకాకపోవచ్చు. దానికొక ఉదాహరణ ఏమిటంటే, 1611లో ప్రచురించబడిన కింగ్ జేమ్స్ వర్షన్. ఎంతో ప్రసిద్ధి చెందిన ఇంగ్లీషు బైబిళ్లలో కింగ్ జేమ్స్ వర్షన్ కూడా ఒకటి. ఆ అనువాదంలో ఉపయోగించిన పదాలు ఇంగ్లీషు భాషలో ఎన్నో మార్పుల్ని తెచ్చాయి. b కానీ ఆ అనువాదంలో యెహోవా అనే పేరు కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తుంది. అంతేకాదు, హీబ్రూ లేఖనాల్లో చాలా చోట్ల దేవుని పేరు ఉండాల్సిన చోట “ప్రభువు” అనే అర్థాన్నిచ్చే మాటను పెద్దక్షరాల్లో (capital letters) ఉపయోగించారు. ఆ తర్వాత ప్రచురితమైన క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని కొన్ని వచనాల్లో కూడా “ప్రభువు” అనే అర్థాన్నిచ్చే మాటనే ఉపయోగించారు. ఈ విధంగా, కొత్త నిబంధన అని పిలువబడే పుస్తకంలో కూడా దేవుని పేరు ఉందనే వాస్తవాన్ని కింగ్ జేమ్స్ వర్షన్ గుర్తించింది.
6. కొత్త లోక అనువాదం ఉన్నందుకు మనమెందుకు కృతజ్ఞులం?
6 కింగ్ జేమ్స్ వర్షన్ వచ్చిన కొత్తలో అందులోని పదాలు ఆధునికంగా అనిపించాయి. కానీ కాలం గడిచేకొద్దీ అవి గ్రాంథికంగా మారాయి, మన కాలంలో వాటిని చదివి అర్థంచేసుకోవడం కష్టంగా తయారైంది. ఇతర ప్రాచీన భాషల్లో ఉన్న బైబిలు అనువాదాలతో కూడా అలాంటి సమస్యే తలెత్తింది. కాబట్టి ఆధునిక ఇంగ్లీషు భాషలో పవిత్ర లేఖనాల కొత్త లోక అనువాదం అందుబాటులో ఉన్నందుకు మనమెంతో కృతజ్ఞులం. ఈ అనువాదం మొత్తంగా లేదా కొన్ని భాగాలుగా 150 కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉంది. దానివల్ల ప్రపంచంలోని చాలామంది తమ సొంత భాషలో ఆ అనువాదాన్ని చదవగలుగుతున్నారు. ఆ అనువాదం ఆధునిక భాషలో, స్పష్టంగా ఉండడం వల్ల దేవుని సందేశం తేలిగ్గా హృదయాల్లోకి చేరుతోంది. (కీర్త. 119:97) అయితే కొత్త లోక అనువాదం ప్రత్యేకత ఏమిటంటే, దేవుని పేరు ఉండాల్సిన ప్రతీచోట ఆ పేరును తిరిగి చేర్చారు.
సామాన్య భాష
7, 8. (ఎ) సా.శ.పూ. మూడవ శతాబ్దంలో చాలామంది యూదులు హీబ్రూ లేఖనాల్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? (బి) గ్రీకు సెప్టువజింటు అంటే ఏమిటి?
7 ప్రపంచ రాజకీయాల్లో వచ్చిన మార్పుల వల్ల కూడా ఒకానొక కాలంలో ప్రజలు మాట్లాడే భాష మారింది. కానీ ప్రజలకు అర్థమయ్యే భాషలో బైబిలు అందుబాటులో ఉండేలా యెహోవా చేశాడు. ఉదాహరణకు బైబిల్లోని మొదటి 39 పుస్తకాల్ని యూదులు లేదా ఇశ్రాయేలీయులు రాశారు. “దేవుని పవిత్ర సందేశాలు” అందుకున్న మొదటివాళ్లు ఇశ్రాయేలీయులే. (రోమా. 3:1, 2) వాళ్లు ఆ పుస్తకాల్ని హీబ్రూ లేదా అరామిక్ భాషల్లో రాశారు. కానీ సా.శ.పూ. మూడవ శతాబ్దం నాటికి చాలామంది యూదులకు హీబ్రూ భాష అర్థమయ్యేది కాదు. ఎందుకంటే, అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచంలోని చాలా భాగాన్ని జయించడంతో గ్రీకు సామ్రాజ్యం విస్తరించింది. దానివల్ల గ్రీకు పరిపాలన ఉన్న ప్రాంతాల్లో గ్రీకు భాషే అక్కడి సామాన్య భాషగా మారింది. దాంతో చాలామంది తమ సొంత భాషకు బదులు గ్రీకు మాట్లాడడం మొదలుపెట్టారు. (దాని. 8:5-7, 20, 21) చాలామంది యూదులు కూడా ఎక్కువగా గ్రీకు భాషనే మాట్లాడేవాళ్లు, హీబ్రూ భాషలో ఉన్న బైబిల్ని అర్థంచేసుకోవడం వాళ్లకు కష్టంగా తయారైంది. దానికి పరిష్కారం ఏమిటి?
8 యేసు పుట్టడానికి దాదాపు 250 ఏళ్ల ముందు, బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలు గ్రీకు భాషలోకి అనువదించబడ్డాయి. ఆ తర్వాత మిగిలిన హీబ్రూ లేఖనాలు కూడా అనువదించబడ్డాయి. ఆ అనువాదం గ్రీకు సెప్టువజింటుగా పేరు పొందింది. మొత్తం హీబ్రూ లేఖనాలన్నీ చేతితో అనువదించబడిన మొట్టమొదటి అనువాదం అదే.
9. (ఎ) ప్రజలు దేవుని వాక్యాన్ని చదవగలిగేలా సెప్టువజింటు అలాగే ఇతర ప్రాచీన అనువాదాలు ఎలా సహాయం చేశాయి? (బి) హీబ్రూ లేఖనాల్లో మీకు బాగా నచ్చిన పుస్తకం ఏమిటి?
9 సెప్టువజింటు అందుబాటులోకి రావడం వల్ల గ్రీకు మాట్లాడే యూదులు హీబ్రూ లేఖనాలను గ్రీకు భాషలో చదవగలిగారు. దేవుని వాక్యాన్ని తమ సొంత భాషలో విన్నప్పుడు లేదా చదివినప్పుడు ఆ యూదులు ఎంత సంతోషించివుంటారో ఊహించుకోగలరా? చివరికి, బైబిల్లోని కొన్ని పుస్తకాల్ని లేదా పూర్తి బైబిల్ని ప్రజలు ఎక్కువగా మాట్లాడే సిరియక్, గాతిక్, లాటిన్ భాషల్లోకి కూడా అనువదించారు. దేవుని వాక్యాన్ని తమ భాషలో చదివి, అర్థంచేసుకోగలిగిన ఎంతోమంది ప్రజలకు అది చాలా నచ్చింది. బైబిల్లో మనకు బాగా నచ్చిన కొన్ని లేఖనాలు ఉన్నట్లే వాళ్లకు కూడా నచ్చిన లేఖనాలు ఉండేవి. (కీర్తన 119:162-165 చదవండి.) వీటన్నిటినిబట్టి దేవుని వాక్యం రాజకీయ మార్పుల్ని, సామాన్య భాషలో వచ్చిన మార్పుల్ని తట్టుకుని నిలబడిందని చెప్పవచ్చు.
బైబిలు అనువాద పనికి వ్యతిరేకత
10. జాన్ విక్లిఫ్ కాలంలో, చాలామంది బైబిల్ని ఎందుకు చదవలేకపోయారు?
10 కొన్ని సంవత్సరాలపాటు, ఎంతోమంది శక్తిమంతమైన నాయకులు ప్రజల్ని బైబిలు చదవనివ్వకుండా అడ్డుపడ్డారు. కానీ దైవభక్తిగల కొంతమంది బైబిల్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచేందుకు కృషిచేస్తూనే వచ్చారు. అలాంటి ఒక వ్యక్తి ఎవరంటే జాన్ విక్లిఫ్, ఇతను 14వ శతాబ్దంలో ఇంగ్లండులో జీవించాడు. ప్రతీఒక్కరు బైబిల్ని చదవగలగాలని అతను నమ్మాడు. అతను జీవించిన కాలంలో ఇంగ్లండులోని చాలామంది బైబిలు సందేశాన్ని తమ భాషలో ఎన్నడూ వినలేదు. పైగా అప్పట్లో బైబిల్ని చేతితో నకలు రాయాల్సి వచ్చేది కాబట్టి అవి చాలా ఖరీదు ఉండేవి. దాంతో కేవలం కొద్దిమంది దగ్గరే బైబిలు ఉండేది. అంతేకాదు ఆ కాలంలోని చాలామందికి చదువురాదు. చర్చికి వెళ్లేవాళ్లు అక్కడ బైబిల్ని లాటిన్లో చదివి వినిపిస్తే వినేవాళ్లు, కాకపోతే అది పాత భాష కావడంతో సామాన్య ప్రజలకు అర్థమయ్యేది కాదు. అయితే, ప్రజల సొంత భాషలో బైబిలు అందుబాటులో ఉండేలా యెహోవా ఏ ఏర్పాటు చేశాడు?—సామె. 2:1-5.
11. విక్లిఫ్ బైబిలు ఎలాంటి ప్రభావం చూపించింది?
11 జాన్ విక్లిఫ్, అలాగే ఇంకొంతమంది కలిసి 1382లో బైబిల్ని ఇంగ్లీషులోకి అనువదించారు. విక్లిఫ్ అనుచరుల్ని లోలర్డ్లు అని పిలిచేవాళ్లు, వాళ్లకు ఆ బైబిలు బాగా సుప్రసిద్ధమైంది. వాళ్లు బైబిల్ని చాలా ఇష్టపడ్డారు. దాంతో కాలినడకన ఇంగ్లండులోని ప్రతీ పల్లెకి వెళ్తూ, ప్రజలకు బైబిల్ని చదివి వినిపించేవాళ్లు, అందులోని కొన్ని పుస్తకాల నకల్ని ప్రజలకు ఇచ్చేవాళ్లు. వాళ్లు చేసిన కృషితో బైబిలు మళ్లీ ప్రసిద్ధి చెందింది.
12. విక్లిఫ్ చేసిన కృషికి మతనాయకుల నుండి ఎలాంటి స్పందన వచ్చింది?
12 విక్లిఫ్పై, అతని బైబిలుపై, అతని అనుచరులపై మతనాయకులకు ద్వేషం పెరిగింది. వాళ్లు విక్లిఫ్ అనుచరుల్ని హింసించారు, దొరికిన విక్లిఫ్ బైబిళ్లన్నిటినీ కాల్చేశారు. అంతేకాదు అప్పటికే విక్లిఫ్ చనిపోయినప్పటికీ, మతనాయకులు అతన్ని మతభ్రష్టునిగా, చర్చికి శత్రువుగా ప్రకటించారు. అతని సమాధిలో నుండి ఎముకలు తీసి, వాటిని కాల్చి, ఆ బూడిదను స్విఫ్ట్ నదిలో పడేశారు. కానీ దేవుని వాక్యాన్ని చదివి అర్థంచేసుకోవాలనే కోరిక ఉన్న ప్రజల్ని మతనాయకులు ఆపలేకపోయారు. ఆ తర్వాత వందల సంవత్సరాలవరకు, యూరప్‌లోని అలాగే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనివాళ్లు బైబిల్ని ఎక్కువమంది ప్రజలు అర్థంచేసుకోగలిగే భాషల్లోకి అనువదించి, ముద్రించడం మొదలుపెట్టారు.
నీకు ప్రయోజనం కలిగేలా నీకు ఉపదేశం చేసేవాడు
13. మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు? అది మన విశ్వాసాన్ని ఎలా బలపరుస్తుంది?
13 దేవుని ప్రేరేపణతోనే బైబిలు రాయబడింది. అంతమాత్రాన సెప్టువజింటు, విక్లిఫ్ బైబిలు, కింగ్ జేమ్స్ వర్షన్ లేదా ఇతర అనువాదాలు కూడా నేరుగా దేవుని ప్రేరేపణతోనే తయారు చేయబడ్డాయని కాదు. అయితే ఆ అనువాదాల్ని తయారుచేసిన విధానాన్ని గమనిస్తే యెహోవా మాటిచ్చినట్లే, ఆయన వాక్యం అన్నిటినీ తట్టుకుని నిలబడిందని స్పష్టంగా అర్థమౌతుంది. కాబట్టి దేవుడు చేస్తానని మాటిచ్చిన ఇతర విషయాలు కూడా ఖచ్చితంగా నిజమౌతాయనే మన విశ్వాసాన్ని అది బలపరుస్తుంది.—యెహో. 23:14.
14. బైబిలు గురించి మనం నేర్చుకునే విషయాలు యెహోవా పట్ల మనకున్న ప్రేమను ఎలా మరింతగా పెంచుతాయి?
14 యెహోవా తన వాక్యాన్ని సంరక్షించిన విధానం గురించి తెలుసుకున్నప్పుడు ఆయనపై మనకున్న విశ్వాసం మరింత బలపడుతుంది, ప్రేమ మరింత ఎక్కువౌతుంది. c అసలు యెహోవా మనకు తన వాక్యమైన బైబిల్ని ఎందుకు ఇచ్చాడు? ఆ తర్వాత దాన్ని సంరక్షిస్తానని ఎందుకు మాటిచ్చాడు? ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకు ప్రయోజనం కలిగేలా బోధించాలనుకుంటున్నాడు. (యెషయా 48:17, 18 చదవండి.) ఆయన్ను ప్రేమించి, ఆయనకు లోబడాలనే ప్రోత్సాహాన్ని అది మనలో కలిగించాలి.—1 యోహా. 4:19; 5:3.
15. తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చర్చించుకుంటాం?
15 మనం దేవుని వాక్యాన్ని ఎంతో ప్రేమిస్తాం. మరి మన వ్యక్తిగత బైబిలు అధ్యయనం నుండి వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందాలంటే ఏమి చేయాలి? బైబిలుపట్ల కృతజ్ఞత పెంచుకునేలా మనం ప్రీచింగ్‌లో కలిసేవాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు? సంఘంలో బోధించేవాళ్లు తాము బోధించే ప్రతీది బైబిలు ఆధారంగా ఉండేలా ఎలా జాగ్రత్తపడవచ్చు? ఈ ప్రశ్నలకు జవాబుల్ని తర్వాతి ఆర్టికల్‌లో చర్చించుకుంటాం.
a 2009, నవంబరు 1 కావలికోట (ఇంగ్లీషు) సంచికలోని, “మీరు హీబ్రూ, గ్రీకు భాషలు నేర్చుకోవాలా?” అనే ఆర్టికల్ చూడండి.
b ప్రసిద్ధి చెందిన ఎన్నో ఇంగ్లీషు జాతీయాలు కింగ్ జేమ్స్ వర్షన్ నుండే పుట్టుకొచ్చాయి.
c “ మీరే వచ్చి చూడండి!” అనే బాక్సు చూడండి.