కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘దేవుని వాక్యం శక్తివంతమైనది’

‘దేవుని వాక్యం శక్తివంతమైనది’

“దేవుని వాక్యం సజీవమైనది, శక్తివంతమైనది.”హెబ్రీ. 4:12.

పాటలు: 96, 94

 1. దేవుని వాక్యానికి శక్తి ఉందని మీరు ఎందుకు నమ్ముతున్నారు? (ప్రారంభ చిత్రం చూడండి.)

 దేవుని వాక్యం “సజీవమైనది, శక్తివంతమైనది” అని యెహోవా సేవకులు నమ్ముతారు. (హెబ్రీ. 4:12) మన జీవితాల్లో, ఇతరుల జీవితాల్లో దేవుని వాక్యానికున్న శక్తి పనిచేయడాన్ని మనం చూశాం. యెహోవాసాక్షులు కాకముందు కొంతమంది దొంగలుగా, డ్రగ్స్‌కు బానిసలుగా ఉండేవాళ్లు; లైంగిక అనైతికతకు పాల్పడ్డారు. ఇంకొంతమందికి పేరు, డబ్బు ఉన్నప్పటికీ జీవితం వెలితిగా అనిపించింది. (ప్రసం. 2:3-11) సంతోషకరమైన విషయమేమిటంటే నిస్సహాయంగా, సర్వస్వం కోల్పోయినట్టుగా అనిపించిన చాలామందికి ఇప్పుడు నడిపింపు, నిరీక్షణ ఉన్నాయి. అలాంటి ఎన్నో అనుభవాల్ని “బైబిలు జీవితాలను మారుస్తుంది” అనే శీర్షికతో వచ్చిన కావలికోట ఆర్టికల్స్‌లో చదివాం, ఆనందించాం. అయితే, క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా యెహోవాతో తమకున్న స్నేహాన్ని బైబిలు సహాయంతో బలపర్చుకుంటూ ఉండాలి.

 2. దేవుని వాక్యానికున్న శక్తి మొదటి శతాబ్దంలోని ప్రజలపై ఎలా పనిచేసింది?

2 చాలామంది సత్యం నేర్చుకున్న తర్వాత తమ జీవితంలో పెద్దపెద్ద మార్పులు చేసుకుంటారు. పరలోక నిరీక్షణ ఉన్న మొదటి శతాబ్దంలోని మన సహోదరసహోదరీలు అలాంటి మార్పులే చేసుకున్నారు. (1 కొరింథీయులు 6:9-11 చదవండి.) దేవుని రాజ్యంలో ఎలాంటివాళ్లు ఉండరో చెప్పిన తర్వాత పౌలు ఇలా అన్నాడు, “మీలో కొందరు ఒకప్పుడు అలాంటివాళ్లే.” అయితే దేవుని వాక్యం, పవిత్రశక్తి సహాయంతో వాళ్లు మార్పులు చేసుకున్నారు. కానీ కొంతమంది క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా యెహోవాతో తమ స్నేహం పాడయ్యేంత ఘోరమైన తప్పులు చేశారు. ఉదాహరణకు, ఒక అభిషిక్త సహోదరుణ్ణి బహిష్కరించాల్సి వచ్చిందని బైబిలు చెప్తోంది. కొంతకాలానికి, అతను మార్పులు చేసుకోవడంతో మళ్లీ క్రైస్తవ సంఘంలో చేర్చుకున్నారు. (1 కొరిం. 5:1-5; 2 కొరిం. 2:5-8) దేవుని వాక్యానికున్న శక్తివల్ల చాలామంది సహోదరసహోదరీలు మార్పులు చేసుకోగలిగారని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహాన్నిస్తుందో కదా!

 3. ఈ ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?

3 దేవుని వాక్యానికి చాలా శక్తి ఉంది. ఆ వాక్యాన్ని యెహోవా మనకు ఇచ్చాడు కాబట్టి దాన్ని వీలైనంత చక్కగా ఉపయోగించాలని మనం ఖచ్చితంగా కోరుకుంటాం. (2 తిమో. 2:15) (1) మన జీవితంలో, (2) మన పరిచర్యలో, (3) స్టేజీమీద నుండి బోధిస్తున్నప్పుడు దేవుని వాక్యానికి ఉన్న శక్తి పనిచేయాలంటే ఏమి చేయాలో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. మనం నేర్చుకునే ఈ విషయాలు మనకు ప్రయోజనం కలిగేలా బోధించే మన పరలోక తండ్రిపట్ల ప్రేమ, కృతజ్ఞత చూపించడానికి సహాయం చేస్తాయి.—యెష. 48:17.

మన జీవితంలో

 4. (ఎ) దేవుని వాక్యం మనమీద పనిచేయాలంటే మనమేమి చేయాలి? (బి) మీరు బైబిలు చదవడానికి సమయం ఎలా కుదుర్చుకుంటారు?

4 దేవుని వాక్యం మన మీద పనిచేసేలా అనుమతించాలంటే, దాన్ని క్రమంగా అంటే రోజూ చదవడానికి ప్రయత్నించాలి. (యెహో. 1:8) మనలో చాలామందిమి ఎంతో బిజీగా ఉంటాం. అయినప్పటికీ మన బాధ్యతలేగానీ, ఇతర ఏ విషయాలేగానీ మనల్ని బైబిలు చదవనివ్వకుండా చేసేందుకు అనుమతించకూడదు. (ఎఫెసీయులు 5:15, 16 చదవండి.) బహుశా ఉదయాన్నేగానీ, పగలు ఏదోక సమయంలోగానీ, రాత్రిగానీ మనం బైబిలు చదవవచ్చు. అప్పుడు, “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను” అని రాసిన కీర్తనకర్తతో మనమూ ఏకీభవిస్తాం.—కీర్త. 119:97.

5, 6. (ఎ) చదివిన వాటిగురించి మనమెందుకు లోతుగా ఆలోచించాలి? (బి) లోతుగా ఆలోచించడం నుండి ప్రయోజనం పొందాలంటే ఏమి చేయాలి? (సి) బైబిలు చదవడం, చదివినవాటి గురించి లోతుగా ఆలోచించడం వల్ల మీరెలా ప్రయోజనం పొందారు?

5 బైబిల్ని మనం కేవలం చదివితే సరిపోదు. చదివిన వాటిగురించి జాగ్రత్తగా, లోతుగా ఆలోచించాలి. (కీర్త. 1:1-3) అప్పుడే మనం బైబిలు నుండి నేర్చుకున్న వాటిని జీవితంలో పాటించగలుగుతాం. కాబట్టి బైబిల్ని ముద్రిత రూపంలోగానీ ఎలక్ట్రానిక్‌ రూపంలోగానీ ఎలా చదివినప్పటికీ అందులోని విషయాలు మన హృదయంలోకి చేరేందుకు అనుమతించాలి.

6 చదివినవాటి గురించి లోతుగా ఆలోచించడం నుండి ప్రయోజనం పొందాలంటే ఏమి చేయాలి? బైబిలు చదువుతున్నప్పుడు కాస్త ఆగి ఈ ప్రశ్నల గురించి ఆలోచించాలి: ‘ఇది యెహోవా గురించి ఏమి చెప్తోంది? దీన్ని నేను ఇప్పటికే ఎలా పాటిస్తున్నాను? నేను ఇంకా ఎలాంటి మార్పులు చేసుకోవాలి?’ అలా లోతుగా ఆలోచించి, చదివిన వాటిగురించి ప్రార్థన చేసుకున్నప్పుడు, వాటిని పాటించాలనే కోరిక మనలో కలుగుతుంది. అప్పుడు దేవుని వాక్యానికున్న శక్తి మన జీవితంలో పనిచేయడాన్ని చూస్తాం.—2 కొరిం. 10:4, 5.

మన పరిచర్యలో

 7. మన పరిచర్యలో బైబిల్ని చక్కగా ఎలా ఉపయోగించవచ్చు?

7 పరిచర్యలో బైబిల్ని ఎక్కువగా ఉపయోగించడం ప్రాముఖ్యం. ఒక సహోదరుడు ఇలా అన్నాడు, “ఒకవేళ మీరు యెహోవాతో కలిసి ప్రీచింగ్‌ చేస్తుంటే, మీరే అంతా మాట్లాడతారా లేదా ఆయన్ని కూడా మాట్లాడనిస్తారా?” ఎవరికైనా బైబిలు నుండి చదివి వినిపించినప్పుడు, మాట్లాడే అవకాశాన్ని యెహోవాకు ఇస్తున్నట్లు. మనం చెప్పే విషయాల కన్నా చక్కగా ఎంపిక చేసుకున్న లేఖనం ఇంటివ్యక్తిపై చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. (1 థెస్స. 2:13) మీరు పరిచర్యలో ఉన్నప్పుడు, వీలైన ప్రతీచోట బైబిలు నుండి చదవడానికి ప్రయత్నిస్తారా?

 8. ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు లేఖనాన్ని చదవడం మాత్రమే ఎందుకు సరిపోదు?

8 ఇంటివ్యక్తులకు బైబిలు లేఖనాన్ని చదివి వినిపిస్తే సరిపోదు. ఎందుకంటే చాలామందికి బైబిల్లో ఉన్న విషయాలు అర్థంకావు. మొదటి శతాబ్దంలోని ప్రజలకు అలాగే జరిగింది, మనకాలంలో కూడా అంతే. (రోమా. 10:2) కాబట్టి మనం చదివిన లేఖనం ఇంటివ్యక్తికి అర్థమై ఉంటుందనే ముగింపుకు రాకూడదు. బదులుగా ముఖ్యమైన పదాలను లేదా భావాలను మళ్లీ చదివి, వాటి అర్థాన్ని వివరించడం ద్వారా వాళ్లకు సహాయం చేయవచ్చు. అలాచేస్తే దేవుని వాక్యం ప్రజల మనసులకు, హృదయాలకు చేరుకుంటుంది.—లూకా 24:32 చదవండి.

 9. ప్రజలకు బైబిలు మీద గౌరవం కలిగేలా మనమెలా సహాయం చేయవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.

9 లేఖనాన్ని పరిచయం చేయడానికి మనం చెప్పే మాటల్నిబట్టి కూడా ఇంటివ్యక్తికి బైబిలు మీద గౌరవం కలుగుతుంది. ఉదాహరణకు మనమిలా అనవచ్చు, “ఈ విషయం గురించి మన సృష్టికర్త ఏమంటున్నాడో చూద్దాం.” ఒకవేళ మనం క్రైస్తవులుకాని వాళ్లతో మాట్లాడుతుంటే, “పవిత్ర గ్రంథం ఏమి చెప్తుందో చూద్దాం” అని అనవచ్చు. ఒకవేళ మతం అంటే ఆసక్తిలేని వ్యక్తిని కలిస్తే, “ప్రాచీనకాలంనాటి ఈ మాటల్ని మీరెప్పుడైనా విన్నారా?” అని అడగవచ్చు. ప్రతీఒక్కరి నేపథ్యం, నమ్మకాలు వేరుగా ఉంటాయని మనం గుర్తుంచుకుంటే, మన ఉపోద్ఘాతం ఆసక్తికరంగా ఉండడానికి చేయగలిగినదంతా చేస్తాం.—1 కొరిం. 9:22, 23.

10. (ఎ) ఒక సహోదరునికి ఎలాంటి అనుభవం ఎదురైంది? (బి) మీరు పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని వాక్యానికి ఉన్న శక్తిని చూశారా?

10 ప్రీచింగ్‌లో దేవుని వాక్యాన్ని ఉపయోగించడం ఇంటివ్యక్తి మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందని చాలామంది గమనించారు. ఉదాహరణకు, ఎన్నో సంవత్సరాలపాటు మన పత్రికల్ని చదివిన ఒక పెద్దాయనను ఒక సహోదరుడు కలిశాడు. అప్పుడు కొత్తగా వచ్చిన కావలికోట పత్రికను ఇవ్వడంతోపాటు, ఒక లేఖనం కూడా చదివి వినిపించాలని సహోదరుడు నిర్ణయించుకున్నాడు. ఆ సహోదరుడు 2 కొరింథీయులు 1:3, 4 లో ఉన్న ఈ మాటల్ని చదివాడు, “ఎంతో కరుణగల తండ్రి, ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు. . . . మన కష్టాలన్నిటిలో మనల్ని ఓదారుస్తాడు.” ఆ మాటలు పెద్దాయన హృదయాన్ని ఎంతగా హత్తుకున్నాయంటే ఆ లేఖనాన్ని మళ్లీ చదవమని సహోదరుణ్ణి అడిగాడు. అతను, అతని భార్య ఓదార్పు కోసం నిజంగా ఎదురుచూస్తున్నారని ఆ పెద్దాయన చెప్పాడు. ఆ లేఖనంవల్ల బైబిలు గురించి ఎక్కువ తెలుసుకోవాలనే కోరిక అతనిలో కలిగింది. పరిచర్యలో దేవుని వాక్యాన్ని ఉపయోగించడంవల్ల చక్కని ఫలితాలు వస్తాయి.—అపొ. 19:20.

స్టేజీమీద నుండి బోధిస్తున్నప్పుడు

11. స్టేజీమీద నుండి బోధించే సహోదరులకు ఎలాంటి బాధ్యత ఉంది?

11 మీటింగ్స్‌కు, సమావేశాలకు వెళ్లడమంటే మనకు చాలా ఇష్టం. యెహోవాను ఆరాధించాలనే ముఖ్య కారణంతోనే మనం అలా వెళ్తాం. అంతేకాదు మనం అక్కడ నేర్చుకునే విషయాల వల్ల ప్రయోజనం పొందుతాం. దీనంతటినీ బట్టి, స్టేజీమీద నుండి బోధించడం సహోదరులకు ఒక గొప్ప అవకాశం, బాధ్యత అని చెప్పవచ్చు. (యాకో. 3:1) ఖచ్చితంగా, వాళ్లు దేవుని వాక్యం ఆధారంగా బోధించాలి. ఒకవేళ మీకు ఆ గొప్ప అవకాశం ఉంటే, బైబిలుకున్న శక్తిని ఉపయోగించి మీరు ప్రేక్షకుల హృదయాన్ని ఎలా చేరవచ్చు?

12. తన ప్రసంగం లేఖనాల ఆధారంగా ఉండేలా ప్రసంగీకుడు ఎలా సిద్ధపడవచ్చు?

12 మీ ప్రసంగం ముఖ్యంగా లేఖనాల మీద ఆధారపడి ఉండాలి. (యోహా. 7:16) కాబట్టి మీరు ప్రసంగం ఇచ్చేటప్పుడు, ప్రేక్షకుల అవధానం మీరు ఉపయోగించే అనుభవాల మీదకు లేదా ఉపమానాల మీదకు కాకుండా బైబిలు మీదకు వెళ్లేలా చూడండి. అంతేకాదు, బైబిలు నుండి చదవడం, బైబిలు నుండి బోధించడం ఒకటి కాదని గుర్తుంచుకోండి. నిజానికి, మీరు ఎక్కువ లేఖనాల్ని చదివితే, చాలామంది వాటిని గుర్తుపెట్టుకోలేరు. కాబట్టి మీరు ఉపయోగించాలనుకున్న లేఖనాలను జాగ్రత్తగా ఎంచుకోండి. తర్వాత, సమయం తీసుకొని వాటిని చదవండి, వివరించండి, ఉదాహరించండి, చక్కగా అన్వయించండి. (నెహె. 8:8) మీ ప్రసంగానికి సంక్షిప్త ప్రతి ఉంటే ఆ ప్రతిని, దానిలో ఉన్న లేఖనాల్ని అధ్యయనం చేయండి. ఆ ప్రతిలో ఉన్న సమాచారానికి, లేఖనాలకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత, అందులోని కొన్ని లేఖనాల్ని ఉపయోగించి, సంక్షిప్త ప్రతిలోని విషయాల్ని బోధించండి. (దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి పుస్తకంలోని 21 నుండి 23 అధ్యయనాల్లో మీకు ఉపయోగపడే చక్కని సలహాలు ఉన్నాయి.) మరిముఖ్యంగా, తన వాక్యంలో ఉన్న విలువైన ఆలోచనల్ని ఇతరులకు చెప్పడానికి సహాయం చేయమని యెహోవాను అడగండి.—ఎజ్రా 7:10; సామెతలు 3:13, 14 చదవండి.

13. (ఎ) మీటింగ్‌లో విన్న లేఖనం ఒక సహోదరిపై ఎలాంటి ప్రభావం చూపించింది? (బి) మీటింగ్స్‌లో మీరు విన్న లేఖనాలు మీపై ఎలాంటి ప్రభావం చూపించాయి?

13 ఆస్ట్రేలియాలో ఉంటున్న ఒక సహోదరి అనుభవాన్ని పరిశీలించండి. ఆమె చిన్నతనంలో ఎన్నో విషాద సంఘటనల్ని ఎదుర్కొంది. కొంతకాలానికి ఆమె యెహోవా గురించి నేర్చుకుంది. కానీ ఆయన తనను ప్రేమిస్తున్నాడనే వాస్తవాన్ని చాలాకాలంపాటు నమ్మలేకపోయింది. ఒకసారి మీటింగ్‌లో విన్న ఒక లేఖనం ఆ సహోదరి మీద ఎంతో ప్రభావం చూపించింది. ఆ లేఖనం గురించి ఆమె లోతుగా ఆలోచించింది, పరిశోధన చేసింది. దాంతో బైబిల్లోని ఇతర లేఖనాలు కూడా ఆమెకు చదవాలనిపించింది. వాటిని చదివాక, యెహోవా తనను ప్రేమిస్తున్నాడనే నమ్మకం ఆమెకు కుదిరింది. a మీటింగ్‌లోగానీ, సమావేశంలోగానీ విన్న ఏదైనా లేఖనం మీపై కూడా అలాంటి ప్రభావమే చూపించిందా?—నెహె. 8:12.

14. మనం దేవుని వాక్యాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని, దాన్ని ప్రేమిస్తున్నామని ఎలా చూపించవచ్చు?

14 తన వాక్యమైన బైబిలును మనకోసం రాయించినందుకు యెహోవాకు మనమెంతో కృతజ్ఞులం కదా! తన వాక్యం ఎప్పటికీ నిలిచివుంటుందని ఆయన మాటిచ్చాడు, దాన్ని నిలబెట్టుకున్నాడు కూడా. (1 పేతు. 1:24, 25) కాబట్టి మనం ఖచ్చితంగా బైబిల్ని రోజూ చదువుదాం, చదివినవాటిని పాటిద్దాం, ఇతరులకు సహాయం చేయడానికి దాన్ని ఉపయోగిద్దాం. అలా చేసినప్పుడు ఈ సంపదపట్ల, మరిముఖ్యంగా దాని గ్రంథకర్త అయిన యెహోవా దేవునిపట్ల మనకు ప్రేమ, కృతజ్ఞత ఉన్నాయని చూపిస్తాం.

a నా జీవితం మలుపు తిరిగింది” అనే బాక్సు చూడండి.