అధ్యయన ఆర్టికల్ 21
పాట 107 దేవునిలా ప్రేమ చూపిద్దాం
మీకు తగిన జోడీ దొరికేది ఎలా?
“సమర్థురాలైన భార్య దొరకడం అరుదు. ఆమె పగడాల కన్నా చాలాచాలా విలువైనది.” —సామె. 31:10.
ముఖ్యాంశం
మీకు తగిన జోడీ ఎవరో తెలుసుకోవడానికి సహాయం చేసే బైబిలు సూత్రాల్ని చూస్తాం. అలాగే పెళ్లి చేసుకోవాలని అనుకునే వాళ్లకు సంఘంలో ఉన్న బ్రదర్స్-సిస్టర్స్ ఎలా సహాయం చేయవచ్చో కూడా చూస్తాం.
1-2. (ఎ) పెళ్లికాని క్రైస్తవులు పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకోవడానికి ముందే ఏ విషయాల గురించి ఆలోచించాలి? (బి) ఈ ఆర్టికల్‌లో అలాగే తర్వాతి ఆర్టికల్‌లో దేనిగురించి చూస్తాం? (అధస్సూచి చూడండి.)
మీకు పెళ్లి చేసుకోవాలని ఉందా? పెళ్లి చేసుకుంటేనే సంతోషంగా ఉంటామని కాదు. అయినా, చాలామంది పెళ్లికాని క్రైస్తవులు యౌవనులైనా, పెద్దవాళ్లయినా తమకు ఓ తోడు కావాలని అనుకుంటారు. అయితే, పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకునే ముందు మీరు కొన్ని విషయాల గురించి ఆలోచించాలి. యెహోవాతో నా సంబంధం బలంగా ఉందా? కుటుంబ అవసరాల్ని తీర్చే స్తోమత నాకుందా? పెళ్లితో వచ్చే బాధ్యతల్ని మోయడానికి నేను రెడీనా? a (1 కొరిం. 7:36) ఒకవేళ వీటన్నిటికీ మీ జవాబు ‘అవును’ అయితే, మీ పెళ్లి జీవితం బాగుండే అవకాశాలు ఎక్కువ.
2 కానీ, మీకు తగిన జోడీ దొరకడం మీరు అనుకున్నంత ఈజీ కాకపోవచ్చు. (సామె. 31:10) ఒకవేళ ఫలానా వాళ్లు మీకు సరైన జోడీ అనిపించినా, వాళ్ల గురించి ఎక్కువ తెలుసుకోవడం, వాళ్లకు మీ మనసులో మాట చెప్పడం అంత ఈజీ కాకపోవచ్చు. b ఈ ఆర్టికల్‌లో, పెళ్లికాని క్రైస్తవులు తమకు తగిన జోడీని ఎలా వెతకవచ్చో చూస్తాం. అలాగే పెళ్లిచేసుకోవాలని అనుకునేవాళ్లకు సంఘంలోవాళ్లు ఎలా సహాయం చేయవచ్చో కూడా చూస్తాం.
తగిన జోడీని వెతకడం
3. మీకు తగిన వ్యక్తిని వెతుకుతున్నప్పుడు ఏ ప్రశ్నలు వేసుకోవచ్చు?
3 మీరు పెళ్లిచేసుకోవాలని అనుకుంటే, మీకు ఎలాంటి వ్యక్తి కావాలో ముందుగానే ఆలోచించుకోవడం మంచిది. లేదంటే, మీకు తగిన వ్యక్తి మీ కళ్లముందే ఉన్నా మీరు చూడలేకపోవచ్చు. లేదా, తొందరపడి మీకు సరిపోని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకోవచ్చు. నిజమే, మీరు పెళ్లి చేసుకోవాలని అనుకునే వ్యక్తి ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకుని ఉండాలి. (1 కొరిం. 7:39) అలాగని, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన అతను లేక ఆమె మీకు తగిన వ్యక్తి కాకపోవచ్చు. కాబట్టి ఇలా ప్రశ్నించుకోండి: ‘జీవితంలో నేను ఏం సాధించాలని అనుకుంటున్నాను? నాకు కాబోయే భర్తలో లేదా భార్యలో ఏ లక్షణాలు ఉండాలని అనుకుంటున్నాను? నేను మరీ ఎక్కువ ఆశిస్తున్నానా?’
4. తగిన జోడీని వెతుకుతున్నప్పుడు కొంతమంది వేటిగురించి ప్రార్థించారు?
4 మీకు పెళ్లిచేసుకోవాలనే కోరిక ఉంటే, దానిగురించి మీరు ఖచ్చితంగా ప్రార్థించి ఉంటారు. (ఫిలి. 4:6) అయితే మీకు ఒక జోడీని ఇస్తానని యెహోవా మాటివ్వట్లేదు. కానీ ఆయన మీ అవసరాల్ని, మీ ఫీలింగ్స్‌ని పట్టించుకుంటాడు. అలాగే మీరు జత కోసం వెదుకుతున్నప్పుడు ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి మీ కోరికల్ని, ఫీలింగ్స్‌ని ఆయనతో చెప్తూనే ఉండండి. (కీర్త. 62:8) ఓర్పు కోసం, తెలివి కోసం ప్రార్థించండి. (యాకో. 1:5) అమెరికాలో ఉంటున్న జాన్ c అనే బ్రదర్ ఎలాంటి విషయాల గురించి ప్రార్థిస్తాడో చెప్తూ ఇలా అంటున్నాడు: “నాకు కావాల్సిన అమ్మాయిలో ఫలానాఫలానా లక్షణాలు ఉండాలని యెహోవాకు చెప్తాను. నాకు సరిగ్గా సరిపోయే అమ్మాయిని కలిసే అవకాశాలు ఇవ్వమని అడుగుతాను. నేనొక మంచి భర్తగా ఉండడానికి కావాల్సిన లక్షణాల్ని పెంచుకునేలా సహాయం చేయమని కూడా అడుగుతాను.” శ్రీలంకలో ఉంటున్న తాన్యా అనే సిస్టర్ ఇలా చెప్తుంది: “నాకు సరిపోయే అబ్బాయిని వెతుకుతూనే యెహోవాకు నమ్మకంగా ఉండేలా, నా ఆనందాన్ని కోల్పోకుండా ఉండేలా సహాయం చేయమని ప్రార్థిస్తాను.” మీకు సరిగ్గా సరిపోయే వ్యక్తి వెంటనే దొరక్కపోయినా, మీ అవసరాల్ని పట్టించుకుంటానని, మీకు కావాల్సిన ప్రేమానురాగాలు పంచుతానని యెహోవా మాటిస్తున్నాడు.—కీర్త. 55:22.
5. యెహోవాను ప్రేమిస్తున్న పెళ్లికానివాళ్లను కలిసే అవకాశాలు మీకు ఎప్పుడు దొరుకుతాయి? (1 కొరింథీయులు 15:58) (చిత్రం కూడా చూడండి.)
5 “ప్రభువు సేవలో నిమగ్నమై ఉండండి” అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. (1 కొరింథీయులు 15:58 చదవండి.) మీరు యెహోవా సేవలో బిజీగా ఉన్నప్పుడు, రకరకాల బ్రదర్స్‌సిస్టర్స్‌తో సమయం గడుపుతున్నప్పుడు మీకు మంచి స్నేహితులు దొరుకుతారు. అంతేకాదు, మీలాగే యెహోవా సేవను ముందుంచుతున్న పెళ్లికాని బ్రదర్స్-సిస్టర్స్‌ని కలిసే అవకాశాలు కూడా మీకు దొరుకుతాయి. మీరు యెహోవాను సంతోషపెట్టడానికి మీ బెస్ట్ ఇస్తూ ఉంటే, నిజమైన సంతోషాన్ని రుచిచూస్తారు.
6. పెళ్లికానివాళ్లు తమకోసం జతను వెతుకుతున్నప్పుడు ఏం గుర్తుంచుకోవాలి?
6 అయితే జాగ్రత్త! ఎప్పుడూ తగిన జోడీని వెతుక్కోవడంలోనే మునిగిపోకండి. (ఫిలి. 1:10) నిజమైన సంతోషం మీకు పెళ్లయిందా కాలేదా అనే దానిమీద కాదుగానీ, యెహోవాతో మీకున్న మంచి సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. (మత్త. 5:3) మీరు పెళ్లి చేసుకోనంతవరకు యెహోవా సేవ ఎక్కువ చేసే స్వేచ్ఛ ఉంటుంది. (1 కొరిం. 7:32, 33) కాబట్టి ఇప్పుడు మీకున్న సమయాన్ని మంచిగా ఉపయోగించుకోండి. అమెరికాలో ఉంటున్న జెస్సికా అనే సిస్టర్ దాదాపు 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. ఆమె ఇలా అంటుంది: “నాకు పెళ్లి చేసుకోవాలని ఉన్నా ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉండిపోలేదు. బదులుగా ప్రీచింగ్‌లో బిజీగా ఉన్నాను. కాబట్టి నా సంతోషాన్ని కాపాడుకోగలిగాను.”
గమనించడానికి సమయం తీసుకోండి
7. మీరు ఒకరిని ఇష్టపడుతున్నారని చెప్పేముందు గమనించడం ఎందుకు తెలివైన పని? (సామెతలు 13:16)
7 మీ కలల రాకుమారుడు లేదా రాకుమారి మీకు దొరికినట్టు అనిపిస్తే అప్పుడేంటి? వెంటనే మీ మనసులో ఉన్న మాట వాళ్లకు వెళ్లి చెప్పేస్తారా? తెలివైనవాళ్లు ఏదైనా పనిచేసే ముందు దానిగురించి తెలుసుకుంటారు లేదా జ్ఞానంతో నడుచుకుంటారు అని బైబిలు చెప్తుంది. (సామెతలు 13:16 చదవండి.) కాబట్టి వెంటనే వాళ్లంటే మీకు ఇష్టమని చెప్పే బదులు, వాళ్లను గమనించడానికి టైమ్ తీసుకోండి. నెదర్లాండ్స్‌లో ఉంటున్న అశ్విన్ ఇలా అంటున్నాడు: “ఫీలింగ్స్ అనేవి ఎంత త్వరగా పుడతాయో అంతే త్వరగా మాయమైపోతాయి. కాబట్టి ఆ క్షణంలో మీకున్న ఫీలింగ్స్‌ని బట్టి మీ ఇష్టాన్ని వ్యక్తం చేయకుండా ఉండాలంటే గమనించడానికి టైమ్ తీసుకోవాలి.” పైగా మీరలా గమనించేకొద్దీ, కొన్నిసార్లు వాళ్లు మీకు సరైన జోడీ కాదని అర్థం కావచ్చు.
8. తగిన జోడీ అని అనిపించినవాళ్లను ఎలా గమనించవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
8 మరి మీరెలా గమనించవచ్చు? మీటింగ్స్‌లో లేదా బ్రదర్స్‌సిస్టర్స్ అందరూ సరదాగా సమయం గడుపుతున్నప్పుడు వాళ్లు ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నారో, వాళ్లు అసలు ఎలాంటి వ్యక్తులో, ఎలా ప్రవర్తిస్తారో మీరు గమనించవచ్చు. ఇంకా వాళ్ల ఫ్రెండ్స్ ఎవరు? వేటిగురించి మాట్లాడతారు? (లూకా 6:45) మీలాంటి లక్ష్యాలే వాళ్లకు కూడా ఉన్నాయా? సంఘపెద్దలతో లేదా వాళ్లగురించి బాగా తెలిసిన పరిణతిగల క్రైస్తవులతో మాట్లాడండి. (సామె. 20:18) వాళ్లకు ఎలాంటి పేరుందో, ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అడిగి తెలుసుకోండి. (రూతు 2:11) అయితే మీరలా ఒకరిని గమనిస్తున్నప్పుడు వాళ్లు ఇబ్బందిపడకుండా చూసుకోవాలి, వాళ్ల ఫీలింగ్స్‌ని గౌరవించాలి. 24 గంటలు వాళ్ల చుట్టే తిరుగుతూ, వాళ్లగురించి ప్రతీ చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకండి.
9. మీ మనసులోని మాట చెప్పేముందు మీకు ఏ నమ్మకం కుదరాలి?
9 మీ మనసులో మాట చెప్పేముందు వాళ్లను ఎంతకాలం గమనించాలి? మరీ ముందే చెప్పేస్తే, మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారని వాళ్లు అనుకోవచ్చు. (సామె. 29:20) అలాగని మీరు వాళ్లను ఇష్టపడుతున్నారని అవతలి వ్యక్తికి తెలిసిన తర్వాత కూడా చెప్పకపోతుంటే, మీరు నిర్ణయాలు తీసుకోవడానికి జంకుతారని వాళ్లకు అనిపించవచ్చు. (ప్రసం. 11:4) అయితే ఒకటి గుర్తుంచుకోండి, మీ మనసులో మాట ఎదుటివ్యక్తికి చెప్పడానికి ముందు, మీరు ఖచ్చితంగా వాళ్లనే పెళ్లిచేసుకుంటారనే నమ్మకం కుదరాల్సిన అవసరం లేదు. కానీ మీరు పెళ్లికి రెడీగా ఉన్నారని, ఆ వ్యక్తి మీకు సరైన జోడీ అయ్యే అవకాశం ఉందనే నమ్మకం మాత్రం కుదరాలి.
10. వేరేవాళ్లు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని గమనించినప్పుడు మీకు అలాంటి ఫీలింగ్స్ లేకపోతే ఏం చేయాలి?
10 వేరేవాళ్లు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని మీకు అనిపిస్తే అప్పుడేం చేయాలి? ఒకవేళ మీకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేకపోతే మీకు ఇష్టం లేదనే విషయాన్ని మీ పనుల ద్వారా స్పష్టంగా చూపించండి. అలా చేయకపోతే వాళ్లలో లేనిపోని ఆశల్ని పుట్టించి, వాళ్ల ఫీలింగ్స్‌తో ఆడుకున్నట్టు అవుతుంది!—1 కొరిం. 10:24; ఎఫె. 4:25.
11. తమకు పెళ్లి సంబంధాలు చూడమని ఎవరైనా అడిగితే మీరు ఏం చేయవచ్చు?
11 కొన్ని దేశాల్లో అమ్మానాన్నలు లేదా పెద్దవాళ్లే పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఇంకొన్ని దేశాల్లో, బంధువులు లేదా స్నేహితులు పెళ్లి సంబంధాలు చూస్తారు. అలా చూశాక అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు సరిపోతారా లేదా అని తెలుసుకోవడానికి వాళ్లు మాట్లాడుకునేలా ఏర్పాట్లు చేస్తారు. ఒకవేళ మిమ్మల్నే పెళ్లి సంబంధాలు చూడమని ఎవరైనా అడిగితే ఏం చేయవచ్చు? ముందు అమ్మాయి, అబ్బాయి ఎలాంటి వాళ్లకోసం చూస్తున్నారో, వాళ్ల ఇష్టాయిష్టాలేమిటో తెలుసుకోండి. ఫలానా వ్యక్తి వీళ్లకు సరైన జోడీ అని మీకు అనిపిస్తే వాళ్ల లక్షణాలు ఏంటో, వాళ్లు ఎలాంటివాళ్లో, అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవాతో వాళ్ల సంబంధం ఎలా ఉందో వీలైనంత తెలుసుకోండి. ఎందుకంటే డబ్బు, చదువు, పలుకుబడి కన్నా యెహోవాతో ఉండే సంబంధమే చాలా ప్రాముఖ్యం. అయితే పెళ్లి చేసుకోవాలా లేదా అనే చివరి నిర్ణయం మాత్రం ఆ అమ్మాయిది, అబ్బాయిదే అని గుర్తుంచుకోండి.—గల. 6:5.
మీ మనసులో మాట ఎలా చెప్పవచ్చు?
12. ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని మీకు అనిపిస్తే, వాళ్లకు మీ మనసులో మాట ఎలా చెప్పవచ్చు?
12 ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని మీకు అనిపిస్తే, వాళ్లకు మీ మనసులో మాట ఎలా చెప్పవచ్చు? d ఫోన్‌లో మాట్లాడవచ్చు లేదా బయట ఎక్కడైనా కలిసి మాట్లాడవచ్చు. అప్పుడు మీ ఫీలింగ్స్‌ని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. (1 కొరిం. 14:9) అవసరమైతే ఆలోచించుకోవడానికి వాళ్లకు కాస్త టైమ్ ఇవ్వండి. (సామె. 15:28) ఒకవేళ అవతలి వ్యక్తికి మీ మీద ఆసక్తి లేకపోతే వాళ్ల అభిప్రాయాన్ని గౌరవించండి.
13. మీరంటే ఇష్టమని ఎవరైనా చెప్తే ఏం చేయాలి? (కొలొస్సయులు 4:6)
13 మీరంటే ఇష్టమని ఎవరైనా చెప్తే అప్పుడేం చేయాలి? వాళ్లు ఎంతో ధైర్యం తెచ్చుకుని మనసులోని మాట మీకు చెప్పారు కాబట్టి వాళ్లతో దయగా, గౌరవంగా ఉండండి. (కొలొస్సయులు 4:6 చదవండి.) దానిగురించి ఆలోచించుకోవడానికి మీకు టైమ్ కావాల్సివస్తే ఆ విషయాన్ని వాళ్లకు చెప్పండి. అయితే జవాబు చెప్పడానికి మరీ ఎక్కువ టైమ్ తీసుకోకండి. (సామె. 13:12) ఒకవేళ మీకు ఇష్టంలేకపోతే దయగా, వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. ఆస్ట్రియాలో ఉంటున్న హాన్స్ అనే బ్రదర్ గురించి ఆలోచించండి. ఆయనంటే ఇష్టమని ఒక సిస్టర్ చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడో చెప్తూ ఇలా అన్నాడు: “నేను నా నిర్ణయాన్ని దయగా, ఆమెకు అర్థమయ్యేలా చెప్పాను. అప్పటికప్పుడే నా నిర్ణయం చెప్పేశాను. ఎందుకంటే ఆమెలో లేనిపోని ఆశల్ని పుట్టించాలని నేను అనుకోలేదు. ఆ తర్వాత కూడా ఆమె ఎదురుపడినప్పుడు లేదా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, నేను నా మనసు మార్చుకున్నాననే ఆలోచన ఆమెకు రానివ్వకుండా జాగ్రత్తపడ్డాను.” ఇంకోవైపు, ఆ వ్యక్తిని మీరు కూడా ఇష్టపడితే ఆ విషయం వాళ్లకు చెప్పండి. అలాగే ఏ లక్ష్యంతో మీరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలనుకుంటున్నారో మాట్లాడుకోండి. మీరిద్దరు పుట్టిపెరిగిన వాతావరణం, పరిస్థితులు వేరుగా ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో మీ ఇద్దరి అభిప్రాయం వేరుగా ఉండవచ్చు.
పెళ్లికానివాళ్లకు సంఘంలోవాళ్లు ఎలా సహాయం చేయవచ్చు?
14. పెళ్లికానివాళ్లకు మన మాటల ద్వారా ఎలా సహాయం చేయవచ్చు?
14 పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నవాళ్లకు మనందరం ఎలా మద్దతివ్వవచ్చు? మనం ఆచితూచి మాట్లాడడం ద్వారా! (ఎఫె. 4:29) మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘పెళ్లిచేసుకోవాలి అనుకుంటున్న వాళ్లమీద సెటైర్లు వేస్తున్నానా? ఒక పెళ్లికాని బ్రదర్ అలాగే పెళ్లికాని సిస్టర్ ఒకరితోఒకరు మాట్లాడడం చూసినప్పుడు వాళ్లమధ్య ఏదో నడుస్తుందని ఊహించుకుంటున్నానా?’ (1 తిమో. 5:13) అంతేకాదు పెళ్లిచేసుకోకపోతే వాళ్ల జీవితాల్లో ఏదో వెలితి ఉంటుంది అని అనిపించేలా మనం ఎప్పుడూ చేయకూడదు. ముందు పేరాలో చెప్పిన హాన్స్ అనే బ్రదర్ ఇలా అంటున్నాడు: “‘నీ వయసైపోతుంది ఇంకెప్పుడు పెళ్లిచేసుకుంటావు?’ అని కొంతమంది బ్రదర్స్ నాతో అనేవాళ్లు. అలాంటి మాటలు, పెళ్లి చేసుకోకపోతే ఇంకే విలువలేదని అనిపించేలా చేస్తాయి. అలాగే పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడిని కూడా పెంచుతాయి.” కాబట్టి, మనందరం పెళ్లికానివాళ్లను మెచ్చుకునే అవకాశాల కోసం చూడాలి.—1 థెస్స. 5:11.
15. (ఎ) బహుశా ఒక బ్రదర్, ఒక సిస్టర్ మంచి ఈడు-జోడు అవుతారని మనకు అనిపిస్తే రోమీయులు 15:2 లో ఉన్న సూత్రాన్ని ఎలా పాటించవచ్చు? (చిత్రం కూడా చూడండి.) (బి) అధస్సూచిలో ఉన్న వీడియో నుండి ఏ ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నారు?
15 బహుశా ఒక బ్రదర్, ఒక సిస్టర్ మంచి ఈడు-జోడు అవుతారని మనకు అనిపిస్తే అప్పుడేంటి? ఇతరుల ఫీలింగ్స్ కూడా పట్టించుకోమని బైబిలు చెప్తుంది. (రోమీయులు 15:2 చదవండి.) చాలామందికి పెళ్లి సంబంధాలు చూపించడం అస్సలు నచ్చదు. కాబట్టి మనం వాళ్ల అభిప్రాయాన్ని గౌరవించాలి. (2 థెస్స. 3:11) ఇంకొంతమందికి అలా నచ్చుతుంది. కానీ వాళ్లకు చెప్పకుండా మనం అలా చేయకూడదు. e (సామె. 3:27) మరికొంతమందికైతే, చెప్పాపెట్టకుండా నేరుగా పరిచయాలు చేయడం ఇబ్బందిగా అనిపించవచ్చు. జర్మనీలో ఉంటున్న లిడియా అనే పెళ్లికాని సిస్టర్ ఇలా చెప్తుంది: “మీరు పార్టీలు చేసుకుంటున్నప్పుడో లేదా పిక్‌నిక్‌లకు వెళ్లినప్పుడో ఆ బ్రదర్‌ని అలాగే ఆ సిస్టర్‌ని పిలిచి, వాళ్లు మాట్లాడుకునేలా అవకాశం కల్పించి మిగతాదంతా వాళ్లకే వదిలేయడం తెలివైన పని.”
16. పెళ్లికానివాళ్లు ఏం గుర్తుంచుకోవాలి?
16 పెళ్లికానివాళ్లయినా, పెళ్లయినవాళ్లయినా మనందరం సంతోషంగా, సంతృప్తిగా జీవించవచ్చు. (కీర్త. 128:1) ఒకవేళ మీకు పెళ్లిచేసుకోవాలని ఉన్నా, మీకు తగిన వ్యక్తి దొరకకపోతే యెహోవా సేవ మీద మనసుపెట్టండి. మకావులో ఉంటున్న సీన్-యీ అనే సిస్టర్ ఇలా చెప్తుంది: “పరదైసులో మీరు, మీ భాగస్వామి కలిసి ఉండడంతో పోలిస్తే ఇప్పుడు మీరు పెళ్లికాకుండా ఉండే సమయమే చాలా తక్కువ. కాబట్టి ఇప్పుడు మీకున్న టైమ్‌ని ఎంజాయ్ చేయండి. దాన్ని బాగా ఉపయోగించుకోండి.” కానీ ఒకవేళ ఎవరైనా మీ మనసును గెలిచి, వాళ్ల గురించి ఎక్కువ తెలుసుకోవడానికి మీరు సమయం వెచ్చించాలనుకుంటే, అప్పుడేంటి? ఆ సమయమంతా సాఫీగా సాగిపోయి, మీరొక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఏం చేయాలో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.
పాట 137 నమ్మకమైన స్త్రీలు, క్రైస్తవ సహోదరీలు
a మీరు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి, jw.orgలో “డేటింగ్—1వ భాగం: నేను డేటింగ్ చేయడానికి రెడీగా ఉన్నానా?” అనే ఆర్టికల్ చూడండి.
b ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో ఒక అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోకముందు, వాళ్లు ఒకరికొకరు సరిపోతారో లేదో అర్థం చేసుకోవడానికి గడిపే సమయం గురించి చూస్తాం. ఒక అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారని చెప్పుకున్న తర్వాతే అలా సమయం గడపడం మొదలౌతుంది. ఇక వాళ్ల బంధాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్లాలా లేక మధ్యలోనే ఆపేయాలా అని నిర్ణయించుకునే వరకు అది కొనసాగుతుంది.
c కొన్ని పేర్లను మార్చాం.
d కొన్ని సంస్కృతుల్లో, సాధారణంగా ఒక బ్రదరే సిస్టర్ దగ్గరికి వెళ్లి తన మనసులో మాట చెప్తాడు. అయితే, ఒక సిస్టర్ కూడా అలా ముందుకెళ్లి చెప్పడంలో తప్పు లేదు. (రూతు 3:1-13) దీనిగురించి ఎక్కువ తెలుసుకోవడానికి, తేజరిల్లు! అక్టోబరు 22, 2004 (ఇంగ్లీష్) పత్రికలో ఉన్న “యువత అడిగే ప్రశ్నలు . . . నా మనసులో మాట ఎలా చెప్పవచ్చు?” అనే ఆర్టికల్ చూడండి.
e jw.orgలో విశ్వాసం కోసం విజయవంతంగా పోరాడుతున్నవాళ్లు—పెళ్లికాని క్రైస్తవులు అనే వీడియో చూడండి.