అధ్యయన ఆర్టికల్ 22
పాట 127 నేను ఇలాంటి వ్యక్తిగా ఉండాలి
ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా వద్దా అనే నిర్ణయానికి ముందు వేసే అడుగులు
“హృదయ అలంకరణ . . . చాలా విలువైనది.”—1 పేతు. 3:4.
ముఖ్యాంశం
ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం కోసం గడిపే సమయంలో ఎలా తెలివిగా నడుచుకోవాలో, అలాంటివాళ్లకు సంఘం ఎలా సహాయం చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
1-2. పెళ్లి చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం కోసం గడిపే సమయం గురించి కొంతమంది ఏమంటున్నారు?
పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడానికి ఒక అమ్మాయి, అబ్బాయి గడిపే సమయం సంతోషంలో తేలిపోయే సమయం. మీరే అలాంటి పరిస్థితిలో ఉన్న ఒక అమ్మాయి, అబ్బాయి అయితే అంతా హాయిగా సాగిపోవాలని ఖచ్చితంగా కోరుకుంటారు. చాలామంది జంటలకు అవి మరపురాని రోజులు. ఇతియోపియాలో ఉంటున్న సీయాన్ a అనే సిస్టర్ ఇలా అంటుంది: “నేను ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను. నేను అప్పుడు చాలా సంతోషంగా గడిపాను. మేము కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం. అలాగే చాలా నవ్వుకున్నాం కూడా. నేను ప్రేమించే అలాగే నన్ను ప్రేమించే వ్యక్తి దొరికాడని నాకు అర్థమైనప్పుడు నేను ఆనందం పట్టలేకపోయాను.”
2 అయితే నెదర్లాండ్స్‌లో ఉంటున్న యెలిసియో అనే బ్రదర్ అలా అంటున్నాడు: “ఆ సమయంలో నా భార్య గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడం నాకు నచ్చింది. కానీ మాకు కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యాయి.” అయితే, పెళ్లి చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం కోసం గడిపే సమయంలో ఎదురయ్యే కొన్ని సవాళ్లు ఏంటో అలాగే వాళ్లకు ఉపయోగపడే కొన్ని బైబిలు సలహాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అంతేకాదు ఆ అమ్మాయికి, అబ్బాయికి సంఘంలోవాళ్లు ఎలా సహాయం చేయవచ్చో కూడా చూస్తాం.
వాళ్లు గడిపే సమయం ఉద్దేశం ఏంటి?
3. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి గడిపే సమయం ఉద్దేశం ఏంటి? (సామెతలు 20:25)
3 అది మీరు చాలా సంతోషంగా గడిపే సమయమే అయినా, అది ఆషామాషీ విషయం కాదు. ఎందుకంటే అది పెళ్లికి నడిపించవచ్చు. పెళ్లి రోజున వధూవరులు తాము కలిసి జీవించినంతకాలం ఒకరినొకరు ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఉంటామని యెహోవా ముందు ప్రమాణం చేస్తారు. మనం దేని గురించైనా ప్రమాణం చేసే ముందు దానిగురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. (సామెతలు 20:25 చదవండి.) పెళ్లి ప్రమాణాల విషయంలో కూడా అంతే. పెళ్లి చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం కోసం గడిపే సమయం అమ్మాయి, అబ్బాయి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి, అలాగే మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో, వాళ్లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో, వాళ్లు ఆ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేయాలని నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ ఆ ప్రయాణం మధ్యలోనే ఆగిపోతే, వాళ్లు వెచ్చించిన టైమ్ అంతా వేస్ట్ అయినట్టేనా? కాదు. ఎందుకంటే, ఎదుటివ్యక్తిని పెళ్లి చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి ఆ సమయం ఉపయోగపడింది.
4. వాళ్లు అలా గడిపే సమయం విషయంలో ఎందుకు సరైన ఆలోచన ఉండాలి?
4 ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం కోసం గడిపే సమయం విషయంలో సరైన ఆలోచనను కలిగి ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? ఎందుకంటే సరైన ఆలోచన ఉన్నప్పుడు వాళ్లు ఏదో సరదా కోసం కాదుగానీ పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే అలా సమయం గడుపుతారు. పెళ్లికానివాళ్లు మాత్రమే కాదు మనందరం కూడా ఆ విషయంలో సరైన ఆలోచన కలిగివుండాలి. ఉదాహరణకు అలా సమయం గడుపుతున్నవాళ్లు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అని కొంతమంది అనుకుంటారు. ఈ ఆలోచన పెళ్లికానివాళ్లపై ఎలాంటి ఒత్తిడిని తీసుకొస్తుంది? అమెరికాలో ఉంటున్న మెలిస్సా అనే పెళ్లికాని సిస్టర్ ఇలా అంటుంది: “ఒక బ్రదర్ అలాగే సిస్టర్ అలా సమయం గడుపుతున్నారంటే వాళ్లు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అని ఇతరులు ఎదురుచూస్తారు. దానివల్ల ఒకరికొకరు సరిపోరని తెలిసినా కొందరు ఆ ప్రయాణాన్ని అలాగే కొనసాగిస్తారు. ఇంకొందరైతే అసలు అలా సమయం గడపాలంటేనే భయపడతారు.”
ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోండి
5-6. అలా సమయం గడుపుతున్నప్పుడు ఒకరి గురించి ఒకరు ఏయే విషయాలు తెలుసుకోవాలి? (1 పేతు. 3:4)
5 మీరు అలా సమయం గడుపుతున్నప్పుడు ఎదుటివ్యక్తిని పెళ్లి చేసుకోవాలా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోండి. మీరు అలా సమయం గడపడం మొదలుపెట్టకముందే వాళ్లగురించి కొన్ని విషయాల్ని తెలుసుకుని ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ల ‘హృదయం’ ఎలాంటిదో తెలుసుకునే అవకాశం ఉంది. (1 పేతురు 3:4 చదవండి.) అంటే వాళ్లకు దేవునితో ఎలాంటి సంబంధం ఉంది? వాళ్లు ఎలాంటివాళ్లో, అసలు వాళ్లు ఎలా ఆలోచిస్తారో మీరింకా ఎక్కువ తెలుసుకోవచ్చు. కాలం గడుస్తుండగా మీరు ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పగలగాలి: ‘వాళ్లు మీకు మంచి భార్యగా లేదా భర్తగా ఉండగలరా?’ (సామె. 31:26, 27, 30; ఎఫె. 5:33; 1 తిమో. 5:8) ‘ఒకరిమీద ఒకరు ప్రేమ, ఆప్యాయతలు చూపించగలరా? ఇద్దరిలో ఉన్న చిన్నచిన్న లోపాల్ని చూసీచూడనట్టు వదిలేయగలరా?’ b (రోమా. 3:23) కానీ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి: మీరు ఒకరికొకరు సరిపోతారా లేదా అనేది మీ ఇష్టాయిష్టాలు ఎంత కలిశాయి అనే దాన్నిబట్టి కాదుగానీ, మీ ఆలోచనలు కలవనప్పుడు కూడా ఎంతగా అర్థం చేసుకుని కలిసి ఉంటారు అనే దానిమీదే ఉంటుంది. మీరు అలా సమయం గడుపుతున్నప్పుడు వాళ్ల గురించి మీకింకా ఏ విషయాలు తెలుసుండాలి?
6 వాళ్లమీద మీకున్న ఫీలింగ్స్ ఇంకా పెరగక ముందే, కొన్ని ప్రాముఖ్యమైన విషయాల గురించి అంటే వాళ్ల లక్ష్యాలు ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకోవచ్చు. మరి వాళ్ల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా గతంలో వాళ్లకు ఎదురైన చేదు అనుభవాలు లాంటి వ్యక్తిగత విషయాల మాటేంటి? అలా సమయం గడపడం మొదలు పెట్టీపెట్టంగానే పూసగుచ్చినట్లు అన్ని విషయాలు చెప్పేయాల్సిన అవసరంలేదు. (యోహాను 16:12 తో పోల్చండి.) ఆ విషయాలు చెప్పడానికి మీకు ఇంకొంచెం టైమ్ కావాలనిపిస్తే వాళ్లతో చెప్పండి. ఏదేమైనా ఎదుటివ్యక్తి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే ఆ విషయాలన్నీ వాళ్లకు తెలుసుండాలి. కాబట్టి సమయం వచ్చినప్పుడు నిజాయితీగా వాటి గురించి చెప్పండి.
7. వాళ్లు ఒకరి గురించి ఒకరు ఎలా తెలుసుకోవచ్చు? (“ మీరు ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే . . . ” అనే బాక్స్ కూడా చూడండి.) (చిత్రాలు కూడా చూడండి.)
7 వాళ్లు లోపల ఎలాంటివాళ్లో మనకెలా తెలుస్తుంది? వాళ్లతో నిజాయితీగా మనసువిప్పి మాట్లాడాలి. ప్రశ్నలు వేయాలి, వాళ్లు చెప్పేది జాగ్రత్తగా వినాలి. (సామె. 20:5; యాకో. 1:19) దానికోసం మనం కొన్ని పనులు చేయవచ్చు. అంటే వాళ్లతో కలిసి భోజనం చేయడం, ప్రజలు ఎక్కువగా ఉండే చోట్ల వాళ్లతో కలిసి నడవడం, ఇంకా వాళ్లతో కలిసి ప్రీచింగ్‌లో పాల్గొనడం వంటివి చేసినప్పుడు మీరిద్దరూ ఫ్రీగా మాట్లాడుకోగలుగుతారు. ఫ్రెండ్స్‌తో, కుటుంబంతో కలిసి సమయం గడిపినప్పుడు కూడా ఒకరి గురించి ఒకరికి ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి. ఇంకా వాళ్లు వేర్వేరు వ్యక్తులతో అలాగే వేర్వేరు సమయాల్లో ఎలా ఉంటారో తెలుసుకోవడానికి సరదాగా ఏమైనా పనులు కలిసి చేయండి. అలీషా అనే అమ్మాయితో సమయం గడుపుతున్నప్పుడు, నెదర్లాండ్స్‌లో ఉంటున్న అశ్విన్ ఏం చేశాడో చెప్తూ ఇలా అన్నాడు: “మేము ఒకరి గురించి ఒకరం ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి కొన్ని పనులు చేశాం. అంటే కలిసి వంట వండడం లేదా అలాంటి ఇంకొన్ని పనులు కలిసి చేశాం. అలాంటివి చేసినప్పుడు మా ఇద్దరిలో ఉన్న బలాలు, బలహీనతలు మాకు అర్థమయ్యాయి.”
8. కలిసి అధ్యయనం చేయడం ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏంటి?
8 ఒకరి గురించి ఒకరు ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి మీరిద్దరు కలిసి కొన్ని బైబిలు విషయాల్ని మాట్లాడుకోవచ్చు. ఒకవేళ మీకు పెళ్లయితే యెహోవాను మూడోపేటగా చేసుకోవడానికి మీరిద్దరు కుటుంబ ఆరాధనకు టైమ్ ఇవ్వాల్సి ఉంటుంది. (ప్రసం. ) కాబట్టి మీరిద్దరు పెళ్లి చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం కోసం సమయం గడుపుతున్నప్పుడే కలిసి అధ్యయనం చేయడానికి టైమ్ తీసుకుంటే బాగుంటుంది. నిజమే ఆ బ్రదర్‌సిస్టర్ అప్పుడే ఒక కుటుంబం అయిపోలేదు. ఇంకా ఆ బ్రదర్, సిస్టర్‌కి శిరస్సు కాదు. అయినా ఇద్దరు కలిసి అధ్యయనం చేయడం ద్వారా ఒకరి ఆధ్యాత్మికత గురించి ఇంకొకరికి అర్థమౌతుంది. అమెరికాలో ఉంటున్న మ్యాక్స్ అలాగే లైసా అనే ఒక జంట వాళ్లు పొందిన ఒక ప్రయోజనం గురించి పంచుకున్నారు. ఆయన ఇలా అంటున్నాడు: “మేము కలిసి సమయం గడపడం మొదలుపెట్టిన కొన్ని రోజులకే మన ప్రచురణల్లో ఆ సమయం ఎలా గడపాలన్న దాని గురించి, పెళ్లి ఇంకా కుటుంబ జీవితం గురించి అధ్యయనం చేశాం. దానివల్ల సాధారణంగా మాట్లాడుకోవడానికి ఇబ్బందిపడే విషయాల్ని కూడా ఈజీగా మాట్లాడుకోగలిగాం.” 4:12
ఆలోచించాల్సిన ఇంకొన్ని విషయాలు
9. ఆ విషయాన్ని ఎవరెవరికి చెప్పాలో నిర్ణయించుకునేటప్పుడు వేటి గురించి ఆలోచించాలి?
9 మీరు ఆ విషయం గురించి ఎవరెవరికి చెప్పాలి? దీని గురించి కూడా మీరిద్దరే కలిసి మాట్లాడుకోవచ్చు. కొత్తలో మీరు ఆ విషయాన్ని కేవలం కొంతమందికే చెప్పాలని నిర్ణయించుకోవచ్చు. (సామె. 17:27) దానివల్ల అనవసరమైన ఒత్తిడిని, ప్రశ్నల్ని మీరు తప్పించుకుంటారు. అలాగని మీరు ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకపోతే, దాక్కునిదాక్కుని కలుసుకోవాల్సి రావచ్చు. ఆ విషయం ఎక్కడ అందరికి తెలిసిపోతుందో అని మీరిద్దరూ ఒంటరిగా సమయం గడిపితే మీరు తప్పుచేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీకు మంచి సలహాల్ని, ఇంకా సహాయాన్ని ఇచ్చే కొంతమందికైనా ఆ విషయాన్ని చెప్పడం తెలివైన పని. (సామె. 15:22) ఉదాహరణకు మీరు కొంతమంది కుటుంబ సభ్యులతో, పరిణతిగల స్నేహితులతో లేదా సంఘపెద్దలతో ఆ విషయాన్ని చెప్పవచ్చు.
10. ఆ సమయంలో యెహోవాకు ఎలా ఘనత తీసుకురావచ్చు? (సామెతలు 22:3)
10 మీరు ఆ సమయంలో యెహోవాకు ఎలా ఘనత తీసుకురావచ్చు? మీ ఫీలింగ్స్ పెరిగేకొద్దీ సహజంగానే మీరు ఎదుటివ్యక్తికి ఇంకా దగ్గరవ్వాలని అనుకుంటారు. అలాంటప్పుడు మీరు నైతికంగా పవిత్రంగా ఉండడానికి ఏది సహాయం చేస్తుంది? (1 కొరిం. 6:18) లైంగిక కోరికల్ని రేపే మాటలు, ఒంటరిగా సమయం గడపడం అలాగే అతిగా తాగడం వంటివి అస్సలు చేయకండి. (ఎఫె. 5:3) ఇలాంటి పనులు మీలో లైంగిక కోరికల్ని పెంచి, సరైనది చేయాలనే మీ నిర్ణయాన్ని బలహీనపరుస్తాయి. కాబట్టి పెళ్లి చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం కోసం సమయం గడుపుతున్నప్పుడు మీరు యెహోవాకు ఘనతను తీసుకొచ్చేలా ఎలాంటి హద్దులు పెట్టుకోవాలనే దానిగురించి తరచూ మాట్లాడుకోండి. (సామెతలు 22:3 చదవండి.) ఇతియోపియాలో ఉంటున్న డావీట్, ఆల్మాజ్‌లకు ఏం సహాయం చేసిందో గమనించండి. వాళ్లు ఇలా అంటున్నారు: “మేము ఎప్పుడూ జనాలు ఉన్నచోట లేదా మా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మాత్రమే కలిసేవాళ్లం. మేము ఎప్పుడూ ఒంటరిగా కారులోగానీ, ఇంట్లోగానీ లేము. దీనివల్ల తప్పుచేసే పరిస్థితుల్ని రానివ్వలేదు.”
11. ప్రేమానురాగాన్ని చూపించుకునే విషయంలో వేటిగురించి ఆలోచించాలి?
11 ప్రేమానురాగాలను చూపించుకునే మాట ఏంటి? మీ స్నేహం పెరిగే కొద్దీ కొంతవరకు చూపించుకోవచ్చు. కానీ అది మీలో లైంగిక కోరికల్ని పెంచితే, ఎదుటి వ్యక్తి మీకు సరిపోతారో లేదో అంచనా వేయడం కష్టమవ్వచ్చు. (పరమ. 1:2; 2:6) అలాగే కొన్నిసార్లు ప్రేమానురాగాల్ని చూపించుకుంటున్నప్పుడు మీరు కంట్రోల్ తప్పి, చేయకూడని పని చేసే ప్రమాదం ఉంది. (సామె. 6:27) కాబట్టి మీరు సమయం గడపడం మొదలుపెట్టిన కొత్తలోనే, ప్రేమానురాగాల్ని చూపించే విషయంలో లేఖన ప్రమాణాల ప్రకారం ఎలాంటి హద్దులు పెట్టుకుంటే బాగుంటుందో మాట్లాడుకోండి. c (1 థెస్స. 4:3-7) మీరిద్దరు ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి: ‘ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమానురాగాల్ని చూపించుకోవడం గురించి మన సమాజంలో ఎలాంటి అభిప్రాయం ఉంది? అలా చూపించుకుంటే మనలో లైంగిక కోరికలు పెరిగే అవకాశం ఉందా?’
12. అభిప్రాయభేదాలు వస్తే వాళ్లు ఏ విషయాల గురించి ఆలోచించాలి?
12 సమస్యలు, అభిప్రాయభేదాలు వస్తే అప్పుడేంటి? మీకు అప్పుడప్పుడు అభిప్రాయభేదాలు వస్తే మీరిద్దరు సరైన జోడీ కాదని దానర్థమా? కానేకాదు. అభిప్రాయభేదాలు రావడం సహజమే. కానీ ఎవరైతే వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకుంటారో వాళ్లే గట్టి వివాహ బంధాన్ని ఆనందిస్తారు. కాబట్టి మీరు ఇప్పుడు సమస్యల్ని ఎలా పరిష్కరించుకుంటారనే దాన్నిబట్టే పెళ్లయ్యాక మీ జీవితం ఎలా ఉంటుందో అర్థమౌతుంది. మీరిద్దరు ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి: ‘మేము విషయాల్ని ప్రశాంతంగా, గౌరవపూర్వకంగా మాట్లాడుకోగలుగుతున్నామా? మేము మా లోపాల్ని వెంటనే ఒప్పుకొని, మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటున్నామా? వెంటనే ఎదుటి వ్యక్తితో సమ్మతించడానికి సిద్ధంగా ఉంటున్నానా? సారీ చెప్తున్నానా? క్షమిస్తున్నానా?’ (ఎఫె. 4:31, 32) అయితే ఇప్పుడు మీరు చీటికిమాటికి గొడవపడుతుంటే పెళ్లయిన తర్వాత కూడా మీ జీవితం అలాగే ఉండొచ్చు. ఒకవేళ ఎదుటివ్యక్తి మీకు సరైన జోడీ కాదనిపిస్తే, ఆ ప్రయాణాన్ని అక్కడితోనే ఆపేయడం మీ ఇద్దరికీ మంచిది. d
13. ఎంతకాలం ఆ ప్రయాణం చేయాలో ఎలా నిర్ణయించుకోవచ్చు?
13 పెళ్లి చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి మీరు ఎంత టైం తీసుకోవాలి? తొందరపాటు నిర్ణయాలు కొంపలు ముంచుతాయి. (సామె. 21:5) కాబట్టి మీరు ఆ వ్యక్తి గురించి బాగా తెలుసుకునేంత వరకు టైం తీసుకోండి. కానీ మీరు దాన్ని అనవసరంగా సాగదీయకూడదు. బైబిలు ఇలా చెప్తుంది: “ఎదురుచూసింది ఆలస్యమైనప్పుడు బాధ కలుగుతుంది.” (సామె. 13:12) అంతేకాదు మీరలా టైం తీసుకునేకొద్దీ, లైంగిక కోరికల్ని అణచుకోవడం కూడా కష్టమవ్వచ్చు. (1 కొరిం. 7:9) కాబట్టి మీరు ఎంతకాలంగా ఈ ప్రయాణంలో ఉన్నారని ఆలోచించే బదులు, ‘నేను ఒక నిర్ణయం తీసుకునేలా ఆ వ్యక్తి గురించి నేను తెలుసుకోవాల్సింది ఇంకేమైనా ఉందా?’ అని ఆలోచించండి.
సంఘంలోవాళ్లు ఎలా సహాయం చేయవచ్చు?
14. ఆ అమ్మాయికి, అబ్బాయికి మనం ఎలా సహాయం చేయవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
14 సంఘంలో ఒక బ్రదర్‌సిస్టర్ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మొదలుపెట్టారని విన్నప్పుడు మనం ఎలా సహాయం చేయవచ్చు? వాళ్లని భోజనానికి, కుటుంబ ఆరాధనకు లేదా సరదాగా సమయం గడపడానికి పిలవొచ్చు. (రోమా. 12:13) అలాంటి సందర్భాల్లో వాళ్లు ఒకరి గురించి ఒకరు ఇంకా బాగా తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. మరోవైపున, ఎప్పుడైనా అవసరం పడితే వాళ్లకు తోడుగా వెళ్లగలమా? వాళ్లు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే, వాళ్లకు రవాణా ఏర్పాటు చేయగలమా? లేదా వాళ్లు కాస్త ఏకాంతంగా మాట్లాడుకోవడానికి ఏదైనా ఒక చోటును ఏర్పాటు చేయగలమా? (గల. 6:10) ముందు పేరాల్లో చూసిన అలీషా, అలాగే తన భర్త అశ్విన్ ఎలాంటి సహాయాన్ని పొందారో చెప్పారు. అలీషా ఇలా అంది: “మేము కలిసి సమయం గడపాలనుకుంటే వాళ్లింటికి రావచ్చని కొంతమంది బ్రదర్స్‌సిస్టర్స్ చెప్పారు. దాన్ని విని మేము చాలా హ్యాపీగా ఫీలయ్యాం.” కాబట్టి వాళ్లు కలిసి సమయం గడపాలనుకున్నప్పుడు మిమ్మల్ని తమతోపాటు తోడుగా రమ్మని అడిగితే, సంతోషంగా ముందుకెళ్లగలరా? వాళ్లు కొన్ని విషయాల్ని ఏకాంతంగా మాట్లాడుకోవాలనుకుంటే, దాన్ని గమనించి అక్కడినుండి పక్కకు వెళ్లండి. అలాగని వాళ్లను పూర్తిగా ఒంటరిగా వదిలేయకుండా జాగ్రత్తపడండి.—ఫిలి. 2:4.
15. వాళ్లకోసం మనం ఇంకా ఏమేం చేయవచ్చు? (సామెతలు 12:18)
15 అయితే ఆ అబ్బాయికి, అమ్మాయికి మనం మన మాటల ద్వారా కూడా సహాయం చేయవచ్చు. కొన్నిసార్లు మనం మాట్లాడకుండా మనల్ని మనం నిగ్రహించుకోవాల్సి రావచ్చు. (సామెతలు 12:18 చదవండి.) ఉదాహరణకు, ఫలానా వాళ్లు పెళ్లి ఉద్దేశంతో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మొదలుపెట్టారనే విషయాన్ని వేరేవాళ్లకు చెప్పాలని మనకు ఆత్రంగా ఉండొచ్చు. కానీ వాళ్లే స్వయంగా ఆ విషయాన్ని చెప్పాలనుకుంటున్నారేమో ఆలోచించండి. అలాగే మనం వాళ్ల గురించి లేనిపోని పుకార్లు పుట్టించకూడదు లేదా వాళ్ల వ్యక్తిగత విషయాల గురించి విమర్శిస్తూ మాట్లాడకూడదు. (సామె. 20:19; రోమా. 14:10; 1 థెస్స. 4:11) అంతేకాదు, ‘మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడు’ అని, లేదా మీరు పెళ్లి చేసుకోవాల్సిందే అనేలాంటి మాటలు వాళ్లకు నచ్చకపోవచ్చు. ఎలీస్ అనే సిస్టర్ అలాగే ఆమె భర్త ఇలా గుర్తుచేసుకుంటున్నారు: “మేము ఇంకా పెళ్లి గురించి మాట్లాడుకోకముందే, మీ పెళ్లి పనులు ఎక్కడిదాకా వచ్చాయని ఇతరులు అడిగినప్పుడు మాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది.”
16. ఆ ఇద్దరు తమ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేయాలని నిర్ణయించుకుంటే మనం ఏం చేయాలి? ఏం చేయకూడదు?
16 ఒకవేళ ఆ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేయాలని ఆ బ్రదర్‌సిస్టర్ నిర్ణయించుకుంటే అప్పుడేంటి? అది వాళ్ల వ్యక్తిగత విషయం కాబట్టి మనం అందులో తలదూర్చకూడదు, లేదా ఇద్దరిలో ఎవరి తరఫునా మాట్లాడకూడదు. (1 పేతు. 4:15) లియా అనే సిస్టర్ ఇలా అంటుంది: “నేను, ఒక బ్రదర్ ఆ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసినప్పుడు కొంతమంది ఏవేవో ఊహించుకుంటున్నారని తెలిసి నాకు చాలా బాధేసింది.” మనం ముందే అనుకున్నట్టు వాళ్ల ప్రయాణం ఒకవేళ మధ్యలోనే ఆగిపోతే ఆ కాలమంతా వేస్ట్ అయినట్టు కాదు. బదులుగా ఎదుటివ్యక్తిని పెళ్లి చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి ఆ సమయం ఉపయోగపడింది. ఏదేమైనా వాళ్లు ఆ నిర్ణయంవల్ల కుమిలిపోతుండవచ్చు, ఒంటరిగా ఫీలౌతుండవచ్చు. కాబట్టి మనం వాళ్లకు సహాయం చేసే మార్గాల కోసం చూడాలి.—సామె. 17:17.
17. ప్రస్తుతం ఆ ప్రయాణంలో ఉన్నవాళ్లు ఏం చేయడానికి గట్టిగా ప్రయత్నించాలి?
17 మనం ఇప్పటివరకు చూసినట్లు పెళ్లి చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి సమయం గడుపుతున్నప్పుడు కొన్ని ఆందోళనలు ఎదురుకావచ్చు. మరోవైపున, ఆ సమయం ఎంతో సంతోషాన్ని కూడా ఇవ్వగలదు. జెస్సికా ఇలా గుర్తుచేసుకుంటుంది: “అబ్బో, అదంత చిన్న విషయం కాదు. కానీ అది నూటికి నూరుపాళ్లు నాకు మంచే చేసింది.” ఒకవేళ మీరిప్పుడు ఆ ప్రయాణంలో ఉంటే, ఒకరి గురించి ఒకరు ఎక్కువగా తెలుసుకోవడానికి గట్టిగా ప్రయత్నించండి. అప్పుడు మీరిద్దరూ తెలివైన నిర్ణయం తీసుకోగలుగుతారు!
పాట 49 యెహోవా హృదయాన్ని సంతోషపెడదాం
a కొన్ని పేర్లను మార్చాం.
b మీరు ఇంకా ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలో తెలుసుకోవడానికి ఇంగ్లీష్‌లో ఉన్న యువత అడిగే ప్రశ్నలు, విభాగం 2 లోని 39-40 పేజీలు చూడండి.
c ఎదుటివ్యక్తి మర్మాంగాలను నిమరడం కూడా ఒకవిధమైన లైంగిక పాపమే. దానికి సంఘపెద్దలు న్యాయనిర్ణయ చర్య తీసుకోవాల్సి రావచ్చు. రొమ్ముల్ని నిమరడం, అనైతిక విషయాల గురించి ఫోన్‌లో, మెసేజ్‌లో మాట్లాడుకోవడం లాంటివి చేస్తే పరిస్థితుల్ని బట్టి న్యాయనిర్ణయ చర్య అవసరం కావచ్చు.
d ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి కావలికోట ఆగస్టు 15, 1999 పత్రికలో ఉన్న “పాఠకుల ప్రశ్నలు” చూడండి.