అధ్యయన ఆర్టికల్ 14
“మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది”
“మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.”—యోహా. 13:35.
పాట 106 ప్రేమను అలవర్చుకుందాం
ఈ ఆర్టికల్‌లో a
1. మొదటిసారి మన మీటింగ్స్‌కి వచ్చినప్పుడు చాలామందికి ఏది నచ్చుతుంది? (చిత్రం కూడా చూడండి.)
ఒక జంట మొదటిసారి యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి వచ్చినట్టు ఊహించుకోండి. వాళ్లు రాగానే అందరూ ఆప్యాయంగా, చిరునవ్వుతో పలకరించారు. రాజ్యమందిరంలో అందరూ ఒకరితోఒకరు చాలా ప్రేమగా ఉన్నారు. అది వాళ్లకు బాగా నచ్చింది. మీటింగ్ నుండి ఇంటికి వెళ్లేటప్పుడు, ఆ భార్య తన భర్తతో ఇలా అంది: ‘వీళ్లలాంటి వాళ్లను నేను ఎక్కడా చూడలేదు. వీళ్లు నాకు బాగా నచ్చారు.’
2. కొంతమంది ఎందుకు యెహోవా సేవను ఆపేశారు?
2 క్రైస్తవ సంఘంలో మన మధ్య ఉన్న ప్రేమ చాలా ప్రత్యేకమైనది. అయితే యెహోవాసాక్షులు అందరూ అపరిపూర్ణులే. (1 యోహా. 1:8) కాబట్టి సంఘంతో మనం ఎంతెక్కువ సహవసిస్తే, ఇతరుల్లో ఉన్న లోపాలు అంతెక్కువ తెలుస్తాయి. (రోమా. 3:23) విచారకరంగా, కొంతమంది తోటివాళ్ల లోపాల మీదే దృష్టిపెట్టి యెహోవా సేవను ఆపేశారు.
3. నిజక్రైస్తవులను ఎలా గుర్తుపట్టవచ్చు? (యోహాను 13:34, 35)
3 ఈ ఆర్టికల్ ముఖ్య వచనాన్ని ఇంకోసారి గమనించండి. (యోహాను 13:34, 35 చదవండి.) నిజక్రైస్తవులను ఎలా గుర్తుపట్టవచ్చు? వాళ్ల ప్రేమను బట్టే గానీ వాళ్ల పరిపూర్ణతను బట్టి కాదు. అయితే, ఆ లేఖనంలో ‘దీన్నిబట్టి మీరు నా శిష్యులని మీకు తెలుస్తుంది’ అని యేసు అనలేదు గానీ, ‘దీన్నిబట్టి మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది’ అని అన్నాడని గమనించండి. అలా చెప్పడం వల్ల తన అనుచరులే కాదు, బయటివాళ్లు కూడా సాక్షుల మధ్య ఉన్న నిస్వార్థమైన ప్రేమను చూసి, వీళ్లే నిజక్రైస్తవులు అని గుర్తించగలుగుతారు.
4. యెహోవాసాక్షులు కానివాళ్లు ఏ ప్రశ్నల గురించి ఆలోచిస్తారు?
4 కొంతమంది యెహోవాసాక్షులు కానివాళ్లు ఇలా ఆలోచించవచ్చు: ‘ప్రేమనుబట్టి నిజక్రైస్తవులను ఎలా గుర్తుపడతాం? అపొస్తలుల పట్ల యేసు ఎలా ప్రేమ చూపించాడు? నేడు యేసును ఎలా అనుకరించవచ్చు?’ యెహోవాసాక్షులమైన మనం కూడా ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం మంచిది. అలా చేస్తే, ఇతరుల్లో లోపాలున్నా వాళ్లను సహిస్తాం, వాళ్లమీద ప్రేమను పెంచుకుంటాం.—ఎఫె. 5:2.
నిజక్రైస్తవుల్ని ప్రేమను బట్టే ఎందుకు గుర్తుపట్టవచ్చు?
5. యోహాను 15:12, 13లోని యేసు మాటలకు అర్థమేంటి?
5 తనను అనుసరించే వాళ్ల మధ్య ప్రత్యేకమైన ప్రేమ ఉంటుందని యేసు చెప్పాడు. (యోహాను 15:12, 13 చదవండి.) వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు: “నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి.” దానికి అర్థమేంటి? యేసు తర్వాత అన్న మాటల్నిబట్టి, అది త్యాగం చేయడానికి కూడా వెనకాడని ప్రేమ. అంటే అవసరమైతే ఒక క్రైస్తవుని కోసం చనిపోవడానికైనా సిద్ధపడేంత ప్రేమ అని అర్థం. b
6. ప్రేమ అనే లక్షణం చాలా ప్రాముఖ్యమని బైబిలు ఎలా చూపిస్తుంది?
6 ప్రేమ గురించి బైబిల్లో చాలా చోట్ల ఉంది. చాలామందికి ఇష్టమైన లేఖనాల్లో ఇవి కూడా ఉంటాయి: “దేవుడు ప్రేమ.” (1 యోహా. 4:8) “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ సాటిమనిషిని ప్రేమించాలి.” (మత్త. 22:39) “ప్రేమ చాలా పాపాల్ని కప్పుతుంది.” (1 పేతు. 4:8) “ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.” (1 కొరిం. 13:8) ఈ లేఖనాల్ని అలాగే వేరే లేఖనాల్ని బట్టి ప్రేమను పెంచుకోవడం, చూపించడం ఎంత ప్రాముఖ్యమో తెలుస్తుంది.
7. సాతాను ఎన్నటికీ చేయలేనిది ఏంటి?
7 చాలామంది ఇలా అనుకుంటారు: ‘నిజమైన మతాన్ని ఎలా గుర్తుపట్టవచ్చు? అన్ని మతాల వాళ్లు సత్యమే బోధిస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ దేవుని గురించి ఒక్కో మతం ఒక్కోలా చెప్తుంది.’ నిజమే, సాతాను ప్రజల్ని తికమకపెట్టే ఎన్నో నకిలీ మత సంస్థలు పుట్టుకొచ్చేలా చేయగలిగాడు గానీ, భూవ్యాప్తంగా ఒకరిమీద ఒకరు ప్రేమ చూపించుకునే గుంపును ఎన్నటికీ తయారు చేయలేడు. అది యెహోవా మాత్రమే చేయగలడు. ఎందుకంటే నిజమైన ప్రేమకు ఆయనే మూలం. ఆయన పవిత్రశక్తి, ఆశీర్వాదం వల్లే అలాంటి గుంపు తయారౌతుంది. (1 యోహా. 4:7) కాబట్టి నిస్వార్థమైన ప్రేమను బట్టే నిజక్రైస్తవులను గుర్తుపట్టవచ్చని యేసు చెప్పడంలో ఆశ్చర్యంలేదు.
8-9. యెహోవాసాక్షుల మధ్య ప్రేమను చూసినప్పుడు చాలామందికి ఎలా అనిపించింది?
8 యేసు చెప్పినట్టు తన అనుచరులు ఒకరిమీద ఒకరు నిజమైన ప్రేమ చూపించుకుంటున్నారని చాలామంది గుర్తించారు. ఉదాహరణకు, ఇయాన్ అనే బ్రదర్ సత్యంలోకి రాకముందు, తన ఇంటి దగ్గరి స్టేడియంలో జరిగే సమావేశానికి మొట్టమొదటిసారి హాజరయ్యాడు. అంతకుముందే ఆ స్టేడియంలో జరిగే ఒక ఆట చూడడానికి ఆయన వెళ్లాడు. దాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఇలా అంటున్నాడు: “ఈ సమావేశానికి, ఇంతకుముందు ఈ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి అసలు పోలికేలేదు. సాక్షులు చాలా మర్యాదగా, పద్ధతిగా బట్టలు వేసుకున్నారు. వాళ్ల పిల్లలు కూడా అల్లరి చేయకుండా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా నా జీవితంలో ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సంతృప్తి, ప్రశాంతత వాళ్ల ముఖాల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆ రోజు నేను విన్న ప్రసంగాలేవీ నాకు గుర్తులేవు కానీ సాక్షులు ప్రవర్తించిన తీరు మాత్రం నా మనసులో చెరగని ముద్ర వేసింది.” c నిజానికి అలా ప్రవర్తించాలంటే ఒకరిమీద ఒకరికి నిజమైన ప్రేమ ఉండాలి. మనకు మన బ్రదర్ సిస్టర్స్ మీద ప్రేమ ఉంది కాబట్టి మనం వాళ్లతో దయగా, మర్యాదగా ప్రవర్తిస్తాం.
9 జాన్ అనే బ్రదర్‌కి కూడా మొదటిసారి మీటింగ్స్‌కి వెళ్లినప్పుడు అలాంటి అనుభవమే ఎదురైంది. ఆయన ఇలా అంటున్నాడు: “అక్కడ అందరూ ఆప్యాయంగా ఒకరితోఒకరు పలకరించుకోవడం చూసినప్పుడు, వాళ్లు మనుషుల రూపంలో ఉన్న దేవదూతల్లా అనిపించారు. వాళ్ల మధ్యున్న ప్రేమను చూశాక, నేను నిజమైన మతాన్ని కనుగొన్నానని అనిపించింది.” d ఇలాంటి అనుభవాలు విన్నప్పుడల్లా యెహోవాసాక్షులే నిజక్రైస్తవులని మళ్లీమళ్లీ నిరూపించబడుతుంది.
10. నిజమైన ప్రేమ చూపించే అవకాశం మనకు ఎప్పుడు దొరుకుతుంది? (అధస్సూచి కూడా చూడండి.)
10 ఈ ఆర్టికల్ మొదట్లో అనుకున్నట్టు మన బ్రదర్స్, సిస్టర్స్ ఎవ్వరూ పరిపూర్ణులు కారు. కాబట్టి కొన్నిసార్లు వాళ్ల మాటలు, పనులు మనల్ని బాధపెట్టవచ్చు. e (యాకో. 3:2) అలాంటప్పుడు, మనం స్పందించే విధానాన్నిబట్టి వాళ్లమీద మనకు నిజమైన ప్రేమ ఉందో లేదో చూపించవచ్చు. ఈ విషయంలో యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?—యోహా. 13:15.
యేసు తన అపొస్తలుల మీద ఎలా ప్రేమ చూపించాడు?
11. యాకోబు, యోహానుల్లో ఏ లోపాలు ఉన్నాయి? (చిత్రం కూడా చూడండి.)
11 యేసు తన అనుచరుల నుండి పరిపూర్ణతను ఆశించలేదు. బదులుగా, యెహోవాకు నచ్చేలా జీవించడానికి వాళ్ల లోపాల్ని సరిచేసుకునేలా ఆయన ప్రేమతో సహాయం చేశాడు. ఒక సందర్భంలో యాకోబు, యోహానులు రాజ్యంలో ముఖ్యమైన స్థానాల కోసం వాళ్ల అమ్మతో యేసును అడిగించారు. (మత్త. 20:20, 21) అలా చేయడంవల్ల వాళ్లకు గర్వం, అలాగే ఇతరులకన్నా గొప్పవాళ్లుగా ఉండాలనే కోరిక ఉన్నాయని చూపించారు.—సామె. 16:18.
12. యాకోబు, యోహానుల్లో మాత్రమే లోపాలున్నాయా? వివరించండి.
12 ఈ సందర్భంలో యాకోబు, యోహానుల లోపాలే కాదు, మిగతావాళ్ల లోపాలు కూడా బయటపడ్డాయి. ఇతర అపొస్తలులు ఎలా స్పందించారో ఒకసారి గమనించండి: “మిగతా పదిమంది ఆ విషయం గురించి విన్నప్పుడు, వాళ్లు ఆ ఇద్దరు అన్నదమ్ముల మీద మండిపడ్డారు.” (మత్త. 20:24) వాళ్లమధ్య జరిగిన మాటల యుద్ధాన్ని ఒకసారి ఊహించుకోండి. బహుశా వాళ్లు ఇలా అని ఉంటారు: ‘మీరు మాకన్నా అంత గొప్పవాళ్లా, వెళ్లి రాజ్యంలో ముఖ్యమైన స్థానాల కోసం అడిగారు. యేసుతో కలిసి మీరొక్కరే కష్టపడ్డారా? ముఖ్యమైన స్థానాల విషయానికొస్తే మేము కూడా అర్హులమే.’ ఏదేమైనా కాసేపు ఆ అపొస్తలుల మధ్య ప్రేమ చల్లారిపోయింది.
13. శిష్యుల్లో ఉన్న లోపాల్ని గమనించినప్పుడు యేసు ఏం చేశాడు? (మత్తయి 20:25-28)
13 అలాంటప్పుడు యేసు ఏం చేశాడు? వాళ్లమీద కోప్పడలేదు, లేదా వాళ్లకన్నా ఇంకా ఎక్కువ వినయం చూపించే, ఒకరిమీద ఒకరు ప్రేమ చూపించుకునే మంచి అపొస్తలులను ఎంచుకుంటాను అని అనలేదు. బదులుగా వాళ్ల మనసు మంచిదే కాబట్టి, యేసు వాళ్లతో ఓపిగ్గా మాట్లాడాడు. (మత్తయి 20:25-28 చదవండి.) తమలో ఎవరు గొప్ప అనే విషయం గురించి అపొస్తలులు మాట్లాడుకోవడం ఇది మొదటిసారి కాదు, అలాగని చివరిసారి కూడా కాదు. అయినాసరే యేసు వాళ్లతో ప్రేమగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు.—మార్కు 9:34; లూకా 22:24.
14. అపొస్తలులు ఎలాంటి వాతావరణంలో పుట్టిపెరిగారు?
14 అపొస్తలులు పుట్టిపెరిగిన వాతావరణం గురించి యేసు ఖచ్చితంగా ఆలోచించి ఉంటాడు. (యోహా. 2:24, 25) అధికారం కోసం, ప్రత్యేక స్థానాల కోసం ప్రాకులాడే మతనాయకుల్ని చూసి వాళ్లు పెరిగారు. (మత్త. 23:6; 2010, ఏప్రిల్ 1 కావలికోట సంచికలో “సమాజమందిరం యేసు, ఆయన శిష్యులు ప్రకటించిన స్థలం” అనే ఆర్టికల్‌లోని 16-18 పేజీలతో పోల్చండి.) అలాగే యూదా మతనాయకులు తమకంటే నీతిమంతులు ఎవ్వరూ లేరని అనుకునేవాళ్లు. f (లూకా 18:9-12) అలాంటివాళ్ల మధ్య పెరిగిన తన శిష్యులు ఎలా ఉంటారో యేసు అర్థం చేసుకున్నాడు. (సామె. 19:11) ఆయన తన శిష్యుల నుండి మరీ ఎక్కువ ఆశించలేదు, అలాగని వాళ్లలో లోపాలు కనిపించినప్పుడు అతిగా స్పందించలేదు. బదులుగా వాళ్ల మనసు మంచిదని అర్థంచేసుకుని వాళ్లలో ఉన్న గర్వం, అధికార దాహం అనే విషాన్ని తీసేసి, ఓపిగ్గా ప్రేమను నింపాడు.
మనం యేసును ఎలా అనుకరించవచ్చు?
15. యాకోబు, యోహానుల సంఘటన నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
15 యాకోబు, యోహానుల సంఘటన నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. రాజ్యంలో ముఖ్యమైన స్థానాల్ని అడగడం వాళ్ల తప్పయితే, ఆ పరిస్థితినిబట్టి తమ మధ్యున్న ఐక్యతను దెబ్బ తీసేలా మాట్లాడడం మిగతా అపొస్తలుల తప్పు. అయినాసరే యేసు ఆ 12 మందితో దయగా, ప్రేమగా ఉన్నాడు. దీన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇతరులు ఏం చేశారు అన్నదే కాదు, దానికి మనమెలా స్పందిస్తాం అన్నది కూడా ముఖ్యమే. అలాంటప్పుడు మనం ఏం చేయవచ్చు? ఎవరైనా మనల్ని బాధపెట్టారనిపిస్తే, మనం ఈ ప్రశ్నల గురించి ఆలోచించవచ్చు: ‘వాళ్లు చేసిన తప్పు నన్ను ఎందుకు అంతగా బాధపెడుతుంది? అలా బాధపడుతున్నాను అంటే సరిచేసుకోవాల్సిన లోపం ఏదైనా నాలో ఉందా? నన్ను బాధపెట్టిన వ్యక్తి ఏదైనా సమస్యతో పోరాడుతున్నాడా? బాధపడడానికి నాకు సరైన కారణం ఉందని అనిపించినా, ఆ వ్యక్తి మీద ప్రేమ చూపిస్తూ క్షమించగలనా?’ మనం ఒకరిమీద ఒకరం ప్రేమ చూపించుకుంటే యేసు నిజ అనుచరులమని నిరూపిస్తాం.
16. యేసు నుండి ఇంకా ఏం నేర్చుకోవచ్చు?
16 మన బ్రదర్స్, సిస్టర్స్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని కూడా యేసు నుండి నేర్చుకుంటాం. (సామె. 20:5) నిజమే, యేసులా మనం మనసుల్ని చదవలేం. కానీ మన బ్రదర్స్, సిస్టర్స్ లోపాల్ని సహించేంత పెద్ద మనసు చేసుకోవచ్చు. (ఎఫె. 4:1, 2; 1 పేతు. 3:8) వాళ్లు పుట్టిపెరిగిన వాతావరణం గురించి తెలుసుకుంటే అలా చేయడం తేలికౌతుంది. దీనిగురించి ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం.
17. ఒక ప్రాంతీయ పర్యవేక్షకుని అనుభవం చెప్పండి.
17 తూర్పు ఆఫ్రికాలో ఒక బ్రదర్ చాలా మొరటుగా ఉండేవాడని ప్రాంతీయ పర్యవేక్షకుడు గుర్తుచేసుకుంటున్నాడు. అతన్ని చూసి ఆ ప్రాంతీయ పర్యవేక్షకుడు ఎలా స్పందించాడు? ఆయనిలా అంటున్నాడు: “ఆ బ్రదర్‌ని దూరం పెట్టే బదులు, అతని గురించి ఎక్కువ తెలుసుకోవాలని అనుకున్నాను.” అలా చేయడంవల్ల, ఆ బ్రదర్ తాను పుట్టిపెరిగిన వాతావరణంవల్లే అలా ఉన్నాడని ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ ప్రాంతీయ పర్యవేక్షకుడు ఇంకా ఇలా చెప్తున్నాడు: “అందరితో మంచిగా ఉండేలా అతను ఇప్పటికే చాలా మార్పులు చేసుకున్నాడని తెలుసుకున్నాక, అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. అలాగే మేము మంచి స్నేహితులమయ్యాం.” మనం కూడా మన బ్రదర్, సిస్టర్స్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ల మీద ప్రేమ చూపించడం తేలికౌతుంది.
18. మనల్ని బాధపెట్టిన వాళ్లతో మాట్లాడే ముందు మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి? (సామెతలు 26:20)
18 కొన్నిసార్లు ఎవరైనా మనల్ని బాధపెడితే, వాళ్లతో వెళ్లి మాట్లాడాలని అనిపించవచ్చు. కానీ దానికన్నా ముందు మనం ఈ ప్రశ్నల గురించి ఆలోచించవచ్చు: ‘జరిగిన దానిగురించి నా దగ్గర పూర్తి వాస్తవాలు ఉన్నాయా?’ (సామె. 18:13) ‘ఆ వ్యక్తి కావాలనే పొరపాటు చేశాడా లేదా అనుకోకుండా చేశాడా?’ (ప్రసం. 7:20) ‘నేను ఇలాంటి పొరపాటును ఎప్పుడూ చేయలేదా?’ (ప్రసం. 7:21, 22) ‘ఒకవేళ నేను వెళ్లి మాట్లాడితే సమస్య పెద్దది అవుతుందా?’ (సామెతలు 26:20 చదవండి.) సమయం తీసుకుని ఈ ప్రశ్నల గురించి ఆలోచించినప్పుడు, ఆ వ్యక్తి మీద ప్రేమతో అతన్ని క్షమించాలని అనుకుంటాం.
19. మనం ఏమని నిశ్చయించుకోవాలి?
19 ఒక గుంపుగా యెహోవాసాక్షులు, యేసు నిజ అనుచరులని నిరూపిస్తున్నారు. అయితే మన బ్రదర్స్, సిస్టర్స్‌లో ఉన్న లోపాల్ని పట్టించుకోకుండా వాళ్లమీద నిస్వార్థమైన ప్రేమను చూపించినప్పుడు మనం వ్యక్తిగతంగా కూడా యేసు నిజ అనుచరులమని నిరూపిస్తాం. అలా చేయడానికి ప్రయత్నించినప్పుడు వేరేవాళ్లు కూడా నిజమైన మతాన్ని తెలుసుకుని, ప్రేమకు మూలమైన యెహోవాను ఆరాధించేలా సహాయం చేయగలుగుతాం. కాబట్టి నిజక్రైస్తవుల గుర్తింపు చిహ్నమైన ప్రేమను చూపిస్తూ ఉండాలని నిశ్చయించుకుందాం.
పాట 17 “నాకు ఇష్టమే”
a మన మధ్య ఉన్న నిజమైన ప్రేమను చూసి చాలామంది సత్యం తెలుసుకోవడానికి ఇష్టపడతారు. కానీ మనందరం అపరిపూర్ణులం. కాబట్టి ఇతరులతో ప్రేమగా ఉండడం కొన్నిసార్లు మనకు కష్టమవ్వొచ్చు. అయితే ప్రేమ ఎందుకంత ప్రాముఖ్యమో, ఇతరులు పొరపాట్లు చేస్తే యేసు ఏం చేశాడో, ఆయన్ని మనం ఎలా అనుకరించవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
b “యేసే మార్గం, సత్యం, జీవం” పుస్తకంలోని 120వ అధ్యాయం, 6-7 పేరాలు చూడండి.
c 2012 నవంబరు 1, కావలికోట (ఇంగ్లీష్) 13-14 పేజీల్లో ఉన్న “ఇప్పుడు నా జీవితానికి కూడా ఒక అర్థం ఉంది” అనే ఆర్టికల్ చూడండి.
d 2012 కావలికోట బ్రోషురులో “నా జీవితం బాగుందని అనిపించింది” అనే ఆర్టికల్ చూడండి.
e ఈ ఆర్టికల్, 1 కొరింథీయులు 6:9, 10లో ఉన్నలాంటి ఘోరమైన పాపాల గురించి మాట్లాడట్లేదు. వాటిని పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి.
f ఒక నివేదిక ప్రకారం, ఒక రబ్బీ ఇలా అంటున్నాడు: “ప్రపంచంలో అబ్రాహాము అంత నీతిమంతులు కనీసం ముప్పై మంది ఉంటే, వాళ్లలో ఇద్దరం నేనూ నా కొడుకు. ఒకవేళ పదిమంది ఉంటే, అందులో ఇద్దరం నేనూ నా కొడుకు. ఐదుగురు ఉంటే, అందులో ఇద్దరు నేనూ నా కొడుకు. ఒకవేళ ఇద్దరే ఉంటే, ఆ ఇద్దరం నేనూ నా కొడుకే. ఒకవేళ ఒక్కరే ఉంటే, అది నేనే.”