అధ్యయన ఆర్టికల్ 13
సత్యారాధన మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది
“యెహోవా మా దేవా, … మహిమ, ఘనత, శక్తి పొందడానికి నువ్వు అర్హుడవు.”—ప్రక. 4:11.
పాట 31 దేవునితో నడవండి!
ఈ ఆర్టికల్‌లో . . . a
1-2. యెహోవా మన ఆరాధనను ఎప్పుడు అంగీకరిస్తాడు?
“ఆరాధన” అనే పదం వినగానే మీకేం గుర్తొస్తుంది? బహుశా ఒక సహోదరుడు పడుకునేముందు మోకాళ్లమీద ఉండి ప్రార్థిస్తూ, యెహోవా ముందు తన హృదయాన్ని కుమ్మరించడం మీకు గుర్తుకురావచ్చు. లేదా కుటుంబమంతా కలిసి సంతోషంగా బైబిల్ని లోతుగా పరిశీలించడం మీకు గుర్తుకురావచ్చు.
2 వాళ్లు యెహోవాను ఆరాధిస్తున్నారని ఆ రెండు సందర్భాలు చూపిస్తున్నాయి. వాళ్ల ఆరాధనను యెహోవా అంగీకరిస్తాడా? తన సంకల్పానికి తగ్గట్టు దాన్ని చేస్తూ ఆయన్ని ప్రేమించి, గౌరవిస్తే ఆయన అంగీకరిస్తాడు. మనం యెహోవాను ఎంతో ప్రేమిస్తాం; ఆయన మన ఆరాధనకు అర్హుడని మనకు తెలుసు. అందుకే వీలైనంత శ్రేష్ఠమైన విధంగా ఆయన్ని ఆరాధించాలని కోరుకుంటాం.
3. ఈ ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం?
3 బైబిలు కాలాల్లో యెహోవా ఎలాంటి ఆరాధనను అంగీకరించాడో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. అలాగే నేడు యెహోవా అంగీకరించే ఆరాధనలో భాగంగా మనం చేసే 8 పనుల గురించి చూస్తాం. వీటిని చర్చిస్తున్నప్పుడు మన ఆరాధనను ఎలా మెరుగుపర్చుకోవచ్చో ఆలోచిద్దాం. అంతేకాదు, యెహోవాను సరైన విధంగా ఆరాధించినప్పుడు మనమెందుకు సంతోషంగా ఉంటామో చూద్దాం.
బైబిలు కాలాల్లో యెహోవా అంగీకరించిన ఆరాధన
4. బైబిలు కాలాల్లో యెహోవాను ఆరాధించినవాళ్లు ఆయనపట్ల గౌరవాన్ని, ప్రేమను ఎలా చూపించారు?
4 బైబిలు కాలాల్లో జీవించిన హేబెలు, నోవహు, అబ్రాహాము, యోబులాంటి నమ్మకమైన పురుషులు యెహోవాపట్ల ప్రేమను, గౌరవాన్ని చూపించారు. వాళ్లు ఆయనకు లోబడడం ద్వారా, విశ్వాసం చూపించడం ద్వారా, బలులు అర్పించడం ద్వారా అలా చేశారు. యెహోవాను ఆరాధించే విషయంలో వాళ్లు చేసిన ప్రతీది బైబిలు చెప్పట్లేదు. కానీ వాళ్లు యెహోవాను ఘనపర్చడానికి చేయగలిగినదంతా చేశారు. అందుకే ఆయన వాళ్ల ఆరాధనను అంగీకరించాడు. కొంతకాలానికి యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో తనకు నచ్చిన విధంగా ఎలా ఆరాధించాలో తెలియజేసే ఎన్నో నియమాలు కూడా ఉన్నాయి.
5. క్రీస్తు చనిపోయి పునరుత్థానమైన తర్వాత, ప్రజలు తనను ఎలా ఆరాధించాలని యెహోవా కోరుకున్నాడు?
5 యేసు చనిపోయి పునరుత్థానమైన తర్వాత, ప్రజలు తనను మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆరాధించాలని యెహోవా కోరుకోలేదు. (రోమా. 10:4) క్రైస్తవులు ఒక కొత్త నియమాన్ని అంటే “క్రీస్తు నియమాన్ని” పాటించాలి. (గల. 6:2) ఈ “నియమాన్ని” పాటించడమంటే దాన్ని కంఠస్తం చేయడం అలాగే మనల్ని ఏం చేయమని, ఏం చేయకూడదని చెప్తున్నారో వాటిని చేసుకుంటూ వెళ్లడం కాదు. బదులుగా, యేసు ఆదర్శాన్ని అనుకరిస్తూ ఆయన బోధల్ని పాటించాలి. నేడు కూడా క్రైస్తవులు యెహోవాను సంతోషపెట్టేలా, తాము ‘సేదదీర్పు పొందేలా’ క్రీస్తును అనుసరించడానికి చేయగలిగినదంతా చేస్తారు.—మత్త. 11:29.
6. ఈ ఆర్టికల్ నుండి ప్రయోజనం పొందాలంటే మనమేం చేయాలి?
6 మన ఆరాధనలో భాగంగా చేసే కొన్ని పనుల గురించి ఇప్పుడు చూస్తాం. వీటిలో ఒక్కోదాన్ని పరిశీలిస్తుండగా మీరిలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఇప్పటివరకు దీన్ని నేనెంత బాగా చేశాను? నేను చేసే ఆరాధనను ఇంకా మెరుగుపర్చుకోగలనా?’ యెహోవాను ఆరాధించే విషయంలో మీరిప్పటికే చేస్తున్నదాన్ని బట్టి సంతోషించొచ్చు. అయితే మీరు ఏ విషయాల్లో మెరుగవ్వాలో తెలుసుకోవడానికి, ప్రార్థనలో యెహోవా సహాయాన్ని కూడా అడగాలి.
మన ఆరాధనలో భాగంగా చేసే కొన్ని పనులు
7. మనం హృదయపూర్వకంగా చేసే ప్రార్థనల్ని యెహోవా ఎలా చూస్తాడు?
7 మనం ప్రార్థించినప్పుడు యెహోవాను ఆరాధిస్తాం. మన ప్రార్థనల్ని, గుడారంలో అలాగే ఆలయంలో వేయడానికి జాగ్రత్తగా సిద్ధం చేసిన ధూపంతో లేఖనాలు పోలుస్తున్నాయి. (కీర్త. 141:2) ఆ ధూపం నుండి వచ్చే సువాసన వల్ల యెహోవా సంతోషించేవాడు. అదేవిధంగా మనం మామూలు మాటలు ఉపయోగించినా, హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలు “ఆయనకు సంతోషాన్నిస్తాయి.” (సామె. 15:8; ద్వితీ. 33:10) ఆయనపట్ల మనకున్న ప్రేమను, కృతజ్ఞతను ప్రార్థనలో చెప్పినప్పుడు, అది ఆయన హృదయాన్ని ఖచ్చితంగా సంతోషపెడుతుందని నమ్మొచ్చు. మనం ఏ విషయాల గురించి ఆందోళన పడుతున్నామో, వేటికోసం ఎదురుచూస్తున్నామో, మనకేం కావాలో తనకు చెప్పాలని యెహోవా కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ప్రార్థించే ముందు, వేటి గురించి చెప్పాలని అనుకుంటున్నామో జాగ్రత్తగా ఆలోచించవచ్చు. అప్పుడు మన ప్రార్థన యెహోవాకు శ్రేష్ఠమైన “ధూపంలా” ఉంటుంది.
8. యెహోవాను స్తుతించడానికి మనకు ఏ మంచి అవకాశముంది?
8 మనం యెహోవాను స్తుతించినప్పుడు ఆయన్ని ఆరాధిస్తాం. (కీర్త. 34:1) యెహోవాకున్న అద్భుతమైన లక్షణాల్ని, ఆయన పనుల్ని మనమెంత ప్రేమిస్తున్నామో, గౌరవిస్తున్నామో ఇతరులకు చెప్పినప్పుడు ఆయన్ని స్తుతిస్తాం. సాధారణంగా, మన హృదయం కృతజ్ఞతతో నిండినప్పుడు ఎవరినైనా స్తుతిస్తాం. కాబట్టి మనం సమయం తీసుకుని యెహోవా మంచితనం గురించి, అంటే ఆయన మనకోసం చేసిన వాటన్నిటి గురించి ధ్యానించినప్పుడు ఆయన్ని స్తుతించడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మనం ప్రకటించినప్పుడు, మన పెదాలతో ‘దేవునికి స్తుతి బలిని అర్పించే’ మంచి అవకాశం దొరుకుతుంది. (హెబ్రీ. 13:15) ఆ “స్తుతి బలి” చాలా శ్రేష్ఠమైనదిగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి మనం ప్రార్థించే ముందు ఎలాగైతే జాగ్రత్తగా ఆలోచిస్తామో, అలాగే పరిచర్యలో ప్రజలతో ఏం మాట్లాడాలో ముందే జాగ్రత్తగా ఆలోచించాలి. అలాచేస్తే మనం ఉత్సాహంగా ప్రకటిస్తాం.
9. ప్రాచీన ఇశ్రాయేలీయుల్లాగే, మనం కూటాలకు హాజరైనప్పుడు ఎలా ప్రయోజనం పొందుతాం? మీరేలా ప్రయోజనం పొందారో ఒక ఉదాహరణ చెప్పండి.
9 మనం కూటాలకు హాజరైనప్పుడు యెహోవాను ఆరాధిస్తాం. ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పబడింది: “నీ మధ్య ఉన్న పురుషులందరూ సంవత్సరానికి మూడుసార్లు . . . నీ దేవుడైన యెహోవా ఎంచుకునే చోట ఆయన ముందు కనిపించాలి.” (ద్వితీ. 16:16) అక్కడికి వెళ్తున్నప్పుడు తమ ఇంటి దగ్గర, పొలాల దగ్గర ఎవర్నీ కాపలా పెట్టకూడదు. ఎందుకంటే యెహోవా వాళ్లకు ఇలా మాటిచ్చాడు: “యెహోవా ముఖం చూడడానికి మీరు వెళ్తున్నప్పుడు ఎవ్వరూ మీ భూమిని ఆశించరు.” (నిర్గ. 34:24) ఇశ్రాయేలీయులు యెహోవాను పూర్తిగా నమ్మారు కాబట్టి ఆ పండుగలకు హాజరయ్యారు. దానివల్ల వాళ్లు ఎన్నో ప్రయోజనాలు పొందారు. ఉదాహరణకు, వాళ్లు దేవుని ధర్మశాస్త్రాన్ని ఇంకా ఎక్కువ అర్థంచేసుకున్నారు; ఆయన మంచితనం గురించి ధ్యానించారు; తోటి విశ్వాసులతో ప్రోత్సాహకరమైన సహవాసాన్ని ఆనందించారు. (ద్వితీ. 16:15) మనం కూడా కూటాలకు హాజరవ్వడానికి చేయగలిగినదంతా చేసినప్పుడు ప్రయోజనాలు పొందుతాం. అలాగే కూటాల్లో చిన్నచిన్న, అర్థవంతమైన వ్యాఖ్యానాలు చేయడానికి సిద్ధపడి వస్తే యెహోవా ఎంతో సంతోషిస్తాడు.
10. పాటలు పాడడం మన ఆరాధనలో ముఖ్యమైన భాగమని ఎందుకు చెప్పవచ్చు?
10 సహోదరసహోదరీలతో కలిసి మనం పాడినప్పుడు యెహోవాను ఆరాధిస్తాం. (కీర్త. 28:7) ఇశ్రాయేలీయులు పాటలు పాడడాన్ని తమ ఆరాధనలో ముఖ్యమైన భాగంగా ఎంచారు. ఆలయంలో పాటలు పాడడానికి రాజైన దావీదు 288 మంది లేవీయులను నియమించాడు. (1 దిన. 25:1, 6-8) మనం కూడా స్తుతిగీతాలు పాడడం ద్వారా, దేవుని మీద ఉన్న ప్రేమను చూపిస్తాం. అలా పాడాలంటే మన స్వరం ఎలా ఉందనేది ముఖ్యం కాదు. ఒకసారి దీనిగురించి ఆలోచించండి: మాట్లాడుతున్నప్పుడు “మనందరం తరచూ తడబడుతుంటాం.” అలాగని సంఘంలో, పరిచర్యలో మాట్లాడడం ఆపేయం కదా! (యాకో. 3:2, అధస్సూచి) అదేవిధంగా, మనం అంత బాగా పాడలేమని అనిపించినా యెహోవాను స్తుతించడానికి పాటలు పాడొచ్చు.
11. కీర్తన 48:13 చెప్పినట్టు, మనం కుటుంబంగా బైబిల్ని అధ్యయనం చేయడానికి ఎందుకు సమయం వెచ్చించాలి?
11 మనం బైబిల్ని అధ్యయనం చేసినప్పుడు, మన పిల్లలకు యెహోవా గురించి నేర్పించినప్పుడు ఆయన్ని ఆరాధిస్తాం. విశ్రాంతి రోజున ఇశ్రాయేలీయులు రోజువారీ పనుల్ని పక్కనపెట్టి, ఆ సమయాన్ని యెహోవాతో తమకున్న సంబంధాన్ని బలపర్చుకోవడానికి ఉపయోగించేవాళ్లు. (నిర్గ. 31:16, 17) ఆ రోజున వాళ్లు యెహోవా గురించి, ఆయన మంచితనం గురించి వాళ్ల పిల్లలకు నేర్పించేవాళ్లు. మనం కూడా దేవుని వాక్యాన్ని చదివి, అధ్యయనం చేయడానికి సమయం వెచ్చించాలి. ఎందుకంటే అది మన ఆరాధనలో భాగం. అలాగే దానివల్ల మనం యెహోవాకు ఇంకా దగ్గరౌతాం. (కీర్త. 73:28) అంతేకాదు మనం కుటుంబంగా అధ్యయనం చేసినప్పుడు, ప్రేమగల మన పరలోక తండ్రితో దగ్గరి సంబంధాన్ని ఏర్పర్చుకునేలా మన పిల్లలకు సహాయం చేస్తాం.—కీర్తన 48:13 చదవండి.
12. గుడారాన్ని, దానిలోని వస్తువుల్ని తయారుచేసే పనిని యెహోవా ఎలా చూశాడు? దాన్నుండి మనమేం నేర్చుకుంటాం?
12 మనం రాజ్యమందిరాల్ని, సంస్థకు సంబంధించిన ఇతర భవనాల్ని నిర్మించినప్పుడు, వాటిని మంచి స్థితిలో ఉంచినప్పుడు యెహోవాను ఆరాధిస్తాం. గుడారాన్ని, దానిలోని వస్తువుల్ని తయారుచేసే పనిని “పవిత్రమైన పని” అని బైబిలు పిలుస్తుంది. (నిర్గ. 36:1, 4) నేడు కూడా రాజ్యమందిరాలను, సంస్థకు సంబంధించిన ఇతర భవనాలను కట్టే పనిని యెహోవా పవిత్ర సేవగా చూస్తాడు. కొంతమంది సహోదరసహోదరీలు ఎక్కువ సమయాన్ని వెచ్చించి, ఈ నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. రాజ్యపనికి మద్దతిస్తూ వాళ్లు చేసే ఈ ప్రాముఖ్యమైన పనినిబట్టి మనం వాళ్లను మెచ్చుకుంటాం. వాళ్లు పరిచర్యలో కూడా పాల్గొంటారు. వాళ్లలో కొందరు పయినీరు సేవచేయాలని కోరుకుంటారు. కష్టపడి పనిచేసే ఈ సహోదరసహోదరీలు పయినీరు సేవచేయడానికి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్లు అర్హులైతే, వాళ్లను నియమించడానికి పెద్దలు వెనకాడకూడదు. ఆ విధంగా పెద్దలు నిర్మాణ పనులపట్ల తమ మద్దతును చూపించవచ్చు. నిర్మాణ పనిలో మనకు నైపుణ్యం ఉన్నా లేకపోయినా రాజ్యమందిరాల్ని, సంస్థకు సంబంధించిన భవనాల్ని శుభ్రం చేయడానికి, వాటిని మంచిస్థితిలో ఉంచడానికి మనవంతు మనం చేయవచ్చు.
13. రాజ్యపనికి మద్దతుగా ఇచ్చే విరాళాల్ని మనమెలా చూడాలి?
13 రాజ్యపనికి మద్దతిస్తూ మనం విరాళాలు ఇచ్చినప్పుడు యెహోవాను ఆరాధిస్తాం. ఇశ్రాయేలీయులు వట్టి చేతులతో యెహోవా ఆలయానికి రాకూడదు. (ద్వితీ. 16:16) తమ పరిస్థితినిబట్టి వాళ్లు ఏదోక కానుక తీసుకురావాలి. అలా ఇవ్వడం ద్వారా, ఆధ్యాత్మికంగా ప్రయోజనం పొందడానికి యెహోవా చేసిన ఏర్పాట్లన్నిటి పట్ల కృతజ్ఞత ఉందని వాళ్లు చూపించారు. యెహోవామీద ప్రేమను, ఆయన మనకోసం చేసిన ఆధ్యాత్మిక ఏర్పాట్లపట్ల కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు? ఒక మార్గం ఏంటంటే, మన పరిస్థితుల్ని బట్టి స్థానిక సంఘానికి అలాగే ప్రపంచవ్యాప్త పనికి విరాళాలు ఇవ్వడం. అపొస్తలుడైన పౌలు దీనిగురించి ఇలా అన్నాడు: “ఇవ్వాలనే మనసు ఒక వ్యక్తికి ఉంటే, అతను ఇవ్వగలిగింది ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని సంతోషంగా అంగీకరిస్తాడు, అతను ఇవ్వలేని దాన్ని ఆయన ఆశించడు.” (2 కొరిం. 8:4, 12) మనం హృదయపూర్వకంగా విరాళం ఇచ్చినప్పుడు, అది తక్కువైనా యెహోవా విలువైనదిగా ఎంచుతాడు.—మార్కు 12:42-44; 2 కొరిం. 9:7.
14. సామెతలు 19:17 ప్రకారం, అవసరంలో ఉన్న తోటి సహోదరసహోదరీలకు మనం చేసే సహాయాన్ని యెహోవా ఎలా చూస్తాడు?
14 అవసరంలో ఉన్న తోటి క్రైస్తవులకు మనం సహాయం చేసినప్పుడు యెహోవాను ఆరాధిస్తాం. పేదవాళ్ల పట్ల ఉదారత చూపించిన ఇశ్రాయేలీయుల్ని ఆశీర్వదిస్తానని యెహోవా మాటిచ్చాడు. (ద్వితీ. 15:7, 10) అవసరంలో ఉన్న తోటి సహోదరసహోదరీలకు మనం సహాయం చేసిన ప్రతీసారి, దాన్ని తనకిచ్చే కానుకగా యెహోవా భావిస్తాడు. (సామెతలు 19:17 చదవండి.) ఉదాహరణకు ఫిలిప్పీలోని క్రైస్తవులు జైల్లో ఉన్న పౌలుకు ఒక బహుమతిని పంపించినప్పుడు, ఆయన దాన్ని ‘దేవుడు అంగీకరించే, ఇష్టపడే బలి’ అని అన్నాడు. (ఫిలి. 4:18) ఒకసారి మీ సంఘంలో ఉన్నవాళ్ల గురించి ఆలోచించి, ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను ఎవరికైనా సహాయం చేయగలనా?’ మన సమయాన్ని, శక్తిని, నైపుణ్యాల్ని, డబ్బును, వస్తువుల్ని అవసరంలో ఉన్నవాళ్ల కోసం ఉపయోగించినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. ఆయన దాన్ని, మనం చేసే ఆరాధనలో భాగంగా చూస్తాడు.—యాకో. 1:27.
యెహోవాను ఆరాధించడం మనకు సంతోషాన్నిస్తుంది
15. యెహోవాను ఆరాధించడానికి సమయాన్ని, శక్తిని వెచ్చించడం ఎందుకు భారమైనది కాదు?
15 మనం యెహోవాను ఆరాధించాలంటే సమయాన్ని, శక్తిని వెచ్చించాలి. కానీ అది భారమైనది కాదు. (1 యోహా. 5:3) ఎందుకంటే మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి ఆయన్ని ఆరాధిస్తాం. ఒకసారి ఇలా ఊహించుకోండి. ఒక పిల్లవాడు వాళ్ల నాన్నకి బహుమతి ఇవ్వాలనుకున్నాడు. దానికోసం అతను ఎన్నో గంటలు వెచ్చించి ఒక బొమ్మ గీయవచ్చు. దానికి అంత సమయం పెట్టినందుకు ఆ పిల్లవాడు బాధపడడు. ఎందుకంటే అతనికి తన నాన్నంటే ఇష్టం కాబట్టి ఆ బహుమతిని సంతోషంగా ఇస్తాడు. అదేవిధంగా, మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి ఆయన్ని ఆరాధించడానికి మన సమయాన్ని, శక్తిని సంతోషంగా వెచ్చిస్తాం.
16. హెబ్రీయులు 6:10 ప్రకారం, మనలో ప్రతీఒక్కరం తనను సంతోషపెట్టడానికి చేసే పనుల్నిబట్టి యెహోవా ఎలా భావిస్తాడు?
16 ప్రేమగల తల్లిదండ్రులు తమ పిల్లలందరూ ఒకేలాంటి బహుమతి ఇవ్వాలని ఆశించరు. పిల్లలందరూ ఒకేలా ఉండరని, ఒక్కొక్కరికి ఒక్కో సామర్థ్యం ఉంటుందని తల్లిదండ్రులు గుర్తిస్తారు. అదేవిధంగా, మనలో ప్రతీఒక్కరం ఏం చేయగలమో మన పరలోక తండ్రి అర్థంచేసుకుంటాడు. మీరు తోటి సహోదరసహోదరీల కన్నా ఎక్కువ సేవ చేయొచ్చు. లేదా మీ వయసు, ఆరోగ్యం, కుటుంబ బాధ్యతల్ని బట్టి ఎక్కువ సేవ చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు నిరుత్సాహపడకండి. (గల. 6:4) మీరు చేసే పనిని యెహోవా మర్చిపోడు. మీరు సరైన ఉద్దేశంతో చేయగలిగినదంతా చేస్తూ ఉంటే ఆయన సంతోషిస్తాడు. (హెబ్రీయులు 6:10 చదవండి.) మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో కూడా యెహోవాకు తెలుసు. ఆయన్ని ఆరాధించడానికి మీరు చేయగల్గుతున్న దాన్నిబట్టి మీరు సంతోషించాలని, తృప్తిపొందాలని ఆయన కోరుకుంటున్నాడు.
17. (ఎ) మన ఆరాధనలో భాగంగా చేసే పనుల్లో ఏదైన చేయడం కష్టంగా ఉంటే ఏం చేయాలి? (బి) “ మీ సంతోషాన్ని రెట్టింపు చేసుకోండి” అనే బాక్సులో ఉన్న ఏదైన పని చేయడం వల్ల మీరెలా ప్రయోజనం పొందారు?
17 మన ఆరాధనలో భాగంగా చేసే కొన్ని పనుల గురించి ఇప్పటివరకు చర్చించాం. ఉదాహరణకు, వాటిలో వ్యక్తిగత బైబిలు అధ్యయనం లేదా ప్రీచింగ్కు వెళ్లడం కష్టంగా అనిపిస్తే ఏం చేయాలి? మనం ఆ పనుల్ని ఎంతెక్కువ చేస్తే అంతెక్కువ ఆనందిస్తాం అలాగే ప్రయోజనం పొందుతాం. మన ఆరాధనను వ్యాయామం చేయడంతో లేదా గిటారు నేర్చుకోవడంతో పోల్చవచ్చు. వాటిని క్రమంగా చేయకపోతే అంత ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ ప్రతీరోజు వాటిని చేస్తే ఏం జరుగుతుంది? బహుశా మొదట్లో కొన్ని నిమిషాలే చేయొచ్చు. ఆ తర్వాత సమయాన్ని పెంచుకుంటూ వెళ్లొచ్చు. మన ప్రయత్నాలకు మంచి ఫలితాలు రావడం చూసినప్పుడు, ఆ పనుల్ని ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఎదురుచూస్తాం అలాగే ఆనందిస్తాం. మన ఆరాధన విషయంలో కూడా అంతే.
18. మనం చేయగల అత్యంత ప్రాముఖ్యమైన పనేంటి? దాన్ని చేస్తే ఏం జరుగుతుంది?
18 యెహోవాను ఆరాధించడానికి శాయశక్తులా కృషి చేయడమే, మనం చేయగల అత్యంత ప్రాముఖ్యమైన పని. అలాచేస్తే మనం సంతోషంగా, సంతృప్తిగా జీవిస్తాం అలాగే భవిష్యత్తులో శాశ్వత కాలం యెహోవాను ఆరాధించే నిరీక్షణ కలిగివుంటాం. (సామె. 10:22) మనం ఇప్పటికే ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే తన ఆరాధకులు సమస్యల్లో ఉన్నప్పుడు యెహోవా సహాయం చేస్తాడని మనకు తెలుసు. (యెష. 41:9, 10) తన సృష్టంతటి నుండి ‘మహిమ, ఘనత పొందడానికి అర్హుడైన’ మన ప్రేమగల తండ్రిని ఆరాధించినప్పుడు, మనం సంతోషించడానికి నిజంగా మంచి కారణాలున్నాయి.—ప్రక. 4:11.
పాట 24 యెహోవా పర్వతానికి రండి
a విశ్వం మొత్తాన్ని యెహోవా సృష్టించాడు కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. ఆయనిచ్చిన నియమాల్ని, సూత్రాల్ని పాటించినప్పుడు మాత్రమే మన ఆరాధనను ఆయన అంగీకరిస్తాడు. యెహోవాను ఆరాధించడంలో భాగంగా మనం చేసే 8 పనుల గురించి ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. వాటిని పరిశీలిస్తున్నప్పుడు వాటిని ఎలా మెరుగుపర్చుకోవచ్చో, వాటివల్ల మన సంతోషాన్ని ఎలా రెట్టింపు చేసుకోవచ్చో తెలుసుకుంటాం.