కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 6

పాట 10 మన దేవుడైన యెహోవాను స్తుతించండి!

“యెహోవా పేరును స్తుతించండి”

“యెహోవా పేరును స్తుతించండి”

“యెహోవా సేవకులారా, స్తుతులు చెల్లించండి, యెహోవా పేరును స్తుతించండి.”కీర్త. 113:1.

ముఖ్యాంశం

అన్ని సమయాల్లో యెహోవా పవిత్రమైన పేరును స్తుతించడానికి ఈ ఆర్టికల్‌ మనల్ని కదిలిస్తుంది.

1-2. తన పేరు గురించిన అబద్ధాల్ని విన్నప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుందో అర్థం చేసుకోవడానికి మనకేం సహాయం చేస్తుంది?

 మీకు బాగా ఇష్టమైనవాళ్లు మీ గురించి చెడుగా చెప్పారని ఊహించుకోండి. అది అబద్ధమని మీకు తెలుసు. అయినప్పటికీ కొంతమంది దాన్ని నమ్ముతారు. ఘోరమైన విషయం ఏంటంటే, వాళ్లు ఆ అబద్ధాన్ని పదేపదే చెప్పి దాన్ని నిజం చేస్తారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ప్రజల గురించి, మీకున్న మంచి పేరు గురించి ఆలోచించే వాళ్లయితే, అది చూసి మీ గుండె పగిలిపోతుంది కదా!—సామె. 22:1.

2 యెహోవాకున్న మంచి పేరు మీద మరక పడినప్పుడు, ఆయన ఎంత కుమిలిపోయి ఉంటాడో పైనున్న సన్నివేశాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తన కొడుకులాంటి ఒక దేవదూత మొదటి స్త్రీయైన హవ్వకు ఆయన గురించి అబద్ధం చెప్పాడు. ఆమె ఆ అబద్ధాన్ని నమ్మింది. ఆ అబద్ధం వల్లే మన మొదటి తల్లిదండ్రులైన ఆదాముహవ్వలు యెహోవాకు ఎదురుతిరిగారు. ఆ కారణంగా మనుషులందరికీ పాపం, మరణం వచ్చాయి. (ఆది. 3:1-6; రోమా. 5:12) అంతేకాదు, లోకంలో ఉన్న సమస్యలన్నీ అంటే మరణాలు, యుద్ధాలు, బాధలు అన్నీ సాతాను ఏదెను తోటలో చెప్పిన అబద్ధాల వల్లే మొదలయ్యాయి. మరి ఈ అబద్ధాల్ని, దానివల్ల వచ్చిన నష్టాల్ని చూసినప్పుడు యెహోవా బాధపడ్డాడా? ఖచ్చితంగా. అయినప్పటికీ యెహోవా అలా బాధపడుతూ కోపంతో రగిలిపోలేదు. నిజానికి, ఆయన “సంతోషంగా” ఉన్నాడు.—1 తిమో. 1:11.

3. మనకు ఎలాంటి గొప్ప అవకాశం ఉంది?

3 యెహోవా గురించి సాతాను చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని నిరూపించే గొప్ప అవకాశం మనందరికీ ఉంది. “యెహోవా పేరును స్తుతించండి” అనే ఆజ్ఞకు లోబడడం ద్వారా మనం అలా చేయగలం. (కీర్త. 113:1) యెహోవా గురించిన నిజాల్ని ఇతరులకు చెప్పడం ద్వారా మనం ఆ పేరును స్తుతిస్తాం. మరి మీరలా చేస్తారా? మన నిండుహృదయంతో యెహోవా పేరును స్తుతించడానికి ఉన్న మూడు కారణాల్ని ఇప్పుడు చూద్దాం.

తన పేరును స్తుతించినప్పుడు యెహోవా సంతోషిస్తాడు

4. యెహోవాను స్తుతించినప్పుడు ఎందుకు ఆయన సంతోషిస్తాడో ఒక ఉదాహరణ చెప్పండి. (చిత్రం కూడా చూడండి.)

4 మనం తనను స్తుతించినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. (కీర్త. 119:108) సాధారణంగా అపరిపూర్ణ మనుషులు కొత్త ఉత్తేజం, ప్రోత్సాహం కోసం పొగడ్తల్ని కోరుకుంటారు. మరి, సర్వశక్తిగల దేవుడైన యెహోవా కూడా అంతేనా? అస్సలు కాదు! ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. ఒక చిన్నపాప వాళ్ల నాన్న దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఆయన్ని హత్తుకొని “డాడీ నువ్వే అందరికన్నా బెస్ట్‌!” అన్నప్పుడు ఆ పాప బుజ్జిబుజ్జి మాటలకు తండ్రి చాలా మురిసిపోతాడు. అయితే, ఆ పాప పొగడ్తల కోసం ఆ తండ్రి కాచుకొని కూర్చుంటాడా? లేదు కదా! నిజానికి ఆయన తన కూతురిని ఎంతో ప్రేమిస్తాడు. ఆ పాప కూడా తనంతట తానే ప్రేమను, కృతజ్ఞతను తండ్రిపట్ల చూపించినప్పుడు ఆయనకు పట్టలేనంత ఆనందం కలుగుతుంది! పసితనం నుండే అలాంటి లక్షణాలు చూపించడం వల్ల, పెరిగి పెద్దయ్యేకొద్దీ ఆ పాప సంతోషంగా ఉంటుందని ఆయనకు బాగా తెలుసు. మనం కూడా మన గొప్ప తండ్రియైన యెహోవాను స్తుతించినప్పుడు ఆయనకు కూడా అచ్చం అలానే అనిపిస్తుంది!

పిల్లలు తన మీద ప్రేమాప్యాయతలు చూపిస్తే ఒక తండ్రి చాలా మురిసిపోతాడు. అలాగే యెహోవా పేరును మనం స్తుతిస్తే ఆయన కూడా చాలా సంతోషిస్తాడు (4వ పేరా చూడండి)


5. యెహోవాను స్తుతించినప్పుడు ఏ అబద్ధాన్ని మనం తిప్పి కొట్టవచ్చు?

5 మన పరలోక తండ్రిని స్తుతించినప్పుడు, మనలో ప్రతీఒక్కరి గురించి సాతాను చెప్పిన ఒక అబద్ధాన్ని తిప్పి కొట్టవచ్చు. అదేంటంటే, విశ్వాసం పరీక్షించబడినప్పుడు ఏ మనిషి, దేవునికి నమ్మకంగా ఉండలేడని సాతాను అంటున్నాడు. అంతేకాదు, మనకు ఏదైనా లాభం ఉంటేనే దేవున్ని ఆరాధిస్తామని, లేదంటే ఆయన్ని పట్టించుకోమని సాతాను నిందిస్తున్నాడు. (యోబు 1:9-11; 2:4) కానీ నమ్మకస్థుడైన యోబు సాతాను చెప్పేది పచ్చి అబద్ధమని నిరూపించాడు. మరి మీరేం చేస్తారు? మన యథార్థతను నిరూపించుకొని, మన తండ్రైన యెహోవాను సంతోషపెట్టే అవకాశం మనలో ప్రతీఒక్కరికి ఉంది. (సామె. 27:11) అది మనకు దొరికిన గొప్ప గౌరవం.

6. రాజైన దావీదును, లేవీయుల్ని మనం ఎలా అనుకరించగలం? (నెహెమ్యా 9:5)

6 దేవుని నమ్మకమైన సేవకులు ఆయన మీదున్న ప్రేమ వల్ల ఆయన్ని నిండుహృదయంతో స్తుతిస్తారు. రాజైన దావీదు ఇలా రాశాడు: “నా ప్రాణమా, యెహోవాను స్తుతించు; నాలో ఉన్న సమస్తమా, ఆయన పవిత్రమైన పేరును స్తుతించు.” (కీర్త. 103:1) యెహోవా పేరును స్తుతించడం అంటే యెహోవాను స్తుతించడం అనే విషయం దావీదు అర్థం చేసుకున్నాడు. మనం యెహోవా పేరు గురించి ఆలోచించినప్పుడు ఆయన వ్యక్తిత్వం, ఆయన అద్భుతమైన లక్షణాలు, ఆయన గొప్ప పనులు గుర్తొస్తాయి. దావీదు యెహోవా పేరును పవిత్రంగా ఎంచి, దాన్ని స్తుతించాలి అనుకున్నాడు. తనలో ఉన్న ‘సమస్తాన్ని’ అంటే నిండుహృదయంతో యెహోవాను స్తుతించాలని కోరుకున్నాడు. లేవీయులు కూడా యెహోవాను స్తుతించే విషయంలో అలాంటి స్ఫూర్తినే చూపించారు. యెహోవా పవిత్రమైన పేరును స్తుతించడానికి తమ పెదాలు పలికే మాటలు సరిపోవని వినయంగా ఒప్పుకున్నారు. (నెహెమ్యా 9:5 చదవండి.) అలా వినయంగా, మనస్ఫూర్తిగా స్తుతించినప్పుడు యెహోవా ఎంతో మురిసిపోతాడు.

7. ప్రీచింగ్‌లో, మన రోజువారీ జీవితంలో యెహోవాను ఎలా స్తుతించవచ్చు?

7 యెహోవా గురించి ఇతరులకు చెప్పినప్పుడు ఆయన మీద మనకు ఎంత ప్రేమ, కృతజ్ఞత ఉన్నాయో చూపిస్తాం. దాన్నిబట్టి యెహోవా కూడా సంతోషిస్తాడు. మనం ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు ప్రజలు యెహోవాకు దగ్గరవ్వాలి, మనలాగే వాళ్లు కూడా యెహోవాను ఒక ప్రేమగల తండ్రిలా చూడాలి అన్నదే మన ముఖ్య ఉద్దేశం! (యాకో. 4:8) బైబిల్లో యెహోవా గురించి, ఆయనకున్న ప్రేమ, న్యాయం, తెలివి, శక్తి, అలాగే ఎన్నో ఇతర అద్భుతమైన లక్షణాల గురించి ఉంది. వాటి గురించి ప్రజలకు చెప్పడం మనకు చాలా ఇష్టం. అంతేకాదు, యెహోవాను అనుకరించడానికి మనం చేయగలిగినదంతా చేసినప్పుడు ఆయన్ని స్తుతిస్తాం, ఆయన్ని సంతోషపెడతాం. (ఎఫె. 5:1) అలా చేసినప్పుడు, మనం గుంపులో కొట్టుకుపోకుండా ఈ చెడ్డ లోకానికి వేరుగా ఉన్నామని ప్రజలు గమనిస్తారు. మనం ఎందుకు అలా ఉన్నామని వాళ్లు ఆశ్చర్యపోవచ్చు కూడా. (మత్త. 5:14-16) మనం రోజూ ఇరుగుపొరుగు వాళ్లను కలిసినప్పుడు, అలా ఎందుకు వేరుగా ఉన్నామో వాళ్లకు వివరించవచ్చు. ఫలితంగా, మంచి మనసు ఉన్నవాళ్లు దేవునికి దగ్గరౌతారు. ఇవన్నీ చేసి, మనం యెహోవాను స్తుతించినప్పుడు ఆయన హృదయాన్ని సంతోషపెడతాం.—1 తిమో. 2:3, 4.

యెహోవాను స్తుతించినప్పుడు యేసు సంతోషిస్తాడు

8. యెహోవా పేరును స్తుతించే విషయంలో యేసు ఎలా ముందున్నాడు?

8 యెహోవా గురించి యేసుకు తెలిసినంత బాగా పరలోకంలో గానీ భూమ్మీద గానీ ఇంకెవ్వరికీ తెలీదు. (మత్త. 11:27) యేసుకు తన తండ్రంటే ప్రాణం. అలాగే యెహోవా పేరును స్తుతించే విషయంలో ఆయన అందరికన్నా ముందున్నాడు. (యోహా. 14:31) చనిపోయే ముందురోజు రాత్రి చేసిన ప్రార్థనలో, యేసు తన పరిచర్య అంతటిని ఒక్కమాటలో ఇలా వివరించాడు: “నీ పేరును వీళ్లకు తెలియజేశాను.” (యోహా. 17:26) ఆ మాటలకు అర్థమేంటి?

9. తన తండ్రి గురించి వివరించడానికి యేసు ఏ ఉదాహరణ ఉపయోగించాడు?

9 యేసు ప్రజలకు దేవుని పేరు యెహోవా అని చెప్పడం కన్నా ఎక్కువే చేశాడు. యేసు బోధించిన యూదులకు దేవుని పేరు ముందే తెలుసు. కానీ యేసు వాళ్లకు ‘దేవుని గురించి వివరించాడు.’ (యోహా. 1:17, 18) ఉదాహరణకు యెహోవా కరుణ, కనికరంగల దేవుడని హీబ్రూ లేఖనాలు చెప్తున్నాయి. (నిర్గ. 34:5-7) యేసు ఈ విషయాన్ని ఎవ్వరూ వివరించలేనంత స్పష్టంగా చెప్పడానికి, తప్పిపోయిన కుమారుని ఉదాహరణ ఉపయోగించాడు. పశ్చాత్తాపపడిన తన కొడుకు “ఇంకా దూరంగా ఉన్నప్పుడే” తండ్రి చూసి, పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకొని, ముద్దుపెట్టుకున్నాడు. మనస్ఫూర్తిగా అతన్ని క్షమించాడు. ఈ వృత్తాంతంలో యెహోవాకున్న కరుణ, కనికరం మన కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. (లూకా 15:11-32) తన తండ్రి నిజంగా ఎలాంటి వ్యక్తో యేసు చూపించాడు.

10. (ఎ) యేసు తన తండ్రి పేరును ఉపయోగించాడని, ఇతరులు కూడా అలా ఉపయోగించాలని ఆయన కోరుకున్నట్లు మనకెలా తెలుసు? (మార్కు 5:19) (చిత్రం కూడా చూడండి.) (బి) ఈరోజుల్లో మనమేం చేయాలని యేసు కోరుకుంటున్నాడు?

10 తనలాగే ఇతరులు కూడా తన తండ్రి పేరును ఉపయోగించాలని యేసు కోరుకున్నాడా? నిస్సందేహంగా! అప్పట్లో కొంతమంది మతనాయకులు పవిత్రమైన దేవుని పేరును పలికితే దాన్ని అవమానించినట్లు అని నమ్మి ఉంటారు. కానీ లేఖన విరుద్ధమైన అలాంటి నమ్మకాల్ని బట్టి యేసు తన తండ్రి పేరును ఘనపర్చకుండా ఆగిపోలేదు. ఆయన గెరస ప్రాంతంలో చెడ్డదూత పట్టిన ఒకతన్ని బాగుచేసిన సందర్భాన్ని గమనించండి. ఆ సంఘటనను చూసి చాలామంది భయపడి యేసును అక్కడి నుండి వెళ్లిపొమ్మని బ్రతిమాలారు. కాబట్టి యేసు ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయాడు. (మార్కు 5:16, 17) అయినప్పటికీ, అక్కడున్న ప్రజలు యెహోవా పేరును తెలుసుకోవాలని యేసు కోరుకున్నాడు. అందుకే బాగైన వ్యక్తికి, తనేం చేశాడో కాకుండా యెహోవా ఏం చేశాడో ప్రజలకు చెప్పమని అన్నాడు. (మార్కు 5:19 చదవండి.) ఈరోజుల్లో కూడా యేసు కోరిక అదే. మనం చేసే ప్రీచింగ్‌ వల్ల, తన తండ్రి పేరు భూమంతటా మారుమ్రోగిపోవాలని యేసు కోరుకుంటున్నాడు! (మత్త. 24:14; 28:19, 20) మనం అలా చేసినప్పుడు, మన రాజైన యేసును సంతోషపెడతాం.

చెడ్డదూతను వెళ్లగొట్టిన తర్వాత, యెహోవా అతనికి ఎలా సహాయం చేశాడో ప్రజలకు చెప్పమని యేసు అతనికి చెప్పాడు (10వ పేరా చూడండి)


11. తన శిష్యులు దేనిగురించి ప్రార్థించాలని యేసు నేర్పించాడు? అది ఎందుకు ప్రాముఖ్యం? (యెహెజ్కేలు 36:23)

11 తన పేరును పవిత్రపర్చడం, ఆ పేరు మీద పడ్డ నిందల్ని తీసేయడమే యెహోవా ఉద్దేశమని యేసుకు తెలుసు. అందుకే మన నాయకుడు తన అనుచరులకు ఇలా ప్రార్థించమని నేర్పించాడు: “పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి.” (మత్త. 6:9) సృష్టి మొత్తంలో ఇదే పెద్ద వివాదం అని యేసు అర్థం చేసుకున్నాడు. (యెహెజ్కేలు 36:23 చదవండి.) యెహోవా పేరును పవిత్రపర్చడానికి యేసు చేసినంత పని ఈ విశ్వంలో ఎవ్వరూ చేయలేదు. కానీ యేసును అరెస్ట్‌ చేసినప్పుడు, తన కలలో కూడా ఊహించని కారణం వాళ్లు చెప్పారు. యేసు, దేవుని పేరును దూషిస్తున్నాడని శత్రువులు నిందించారు. తన తండ్రి పవిత్ర పేరును అగౌరవపర్చడం కన్నా ఘోరమైన పాపం ఇంకొకటి లేదని యేసుకు అనిపించింది. అయితే, ఆ నిందతోనే ఆయన్ని బంధించడం, ఆయన అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. అందుకే, ఆయన్ని బంధించడానికి కొన్ని గంటల ముందు, యేసు “ఎంతో ఆవేదనతో” ఉన్నాడు.—లూకా 22:41-44.

12. యేసు తన తండ్రి పేరును పవిత్రపర్చాడని ఎలా నిరూపించాడు?

12 తన తండ్రి పేరును పవిత్రపర్చడానికి యేసు అన్నిరకాల హింసను, అవమానాన్ని, అబద్ధ ఆరోపణల్ని సహించాడు. యేసు అన్ని విషయాల్లో తన తండ్రికి లోబడ్డాడు కాబట్టి దేనికీ తల దించుకోవాల్సిన అవసరం లేదని ఆయనకు తెలుసు. (హెబ్రీ. 12:2) తన చివరి గడియల్లో సాతాను నేరుగా దాడి చేస్తున్నాడని కూడా యేసుకు తెలుసు. (లూకా 22:2-4; 23:33, 34) యేసు ఎలాగైనా తన యథార్థతను కోల్పోతాడని సాతాను కొండంత ఆశతో ఉన్నాడు. కానీ పాపం, అతని ఆశలు అడియాశలు అయ్యాయి! సాతాను అబద్ధాలకోరు అని, ఎన్ని పరీక్షలు వచ్చినా దేవుని నమ్మకమైన సేవకులు యథార్థతను కోల్పోరని యేసు తిరుగులేని విధంగా నిరూపించాడు!

13. మీ రాజును మీరెలా సంతోషపెట్టవచ్చు?

13 మీ రాజును మీరు సంతోషపెట్టాలని అనుకుంటున్నారా? అయితే, యెహోవా పేరును స్తుతిస్తూ, ఆయన ఎలాంటి వ్యక్తో అందరికీ చాటి చెప్తూ ఉండండి. అలా చేసినప్పుడు మీరు యేసు అడుగులో అడుగు వేసినట్టే! (1 పేతు. 2:21) అప్పుడు యేసులాగే మీరు కూడా యెహోవాను సంతోషపెడతారు, దేవుని శత్రువైన సాతాను ఒక సిగ్గులేని అబద్ధికుడని నిరూపిస్తారు!

యెహోవాను స్తుతించినప్పుడు ప్రాణాల్ని కాపాడుతాం

14-15. యెహోవా గురించి ఇతరులకు చెప్పినప్పుడు ఎలాంటి అద్భుతమైన విషయాలు జరగవచ్చు?

14 మనం యెహోవాను స్తుతించినప్పుడు ప్రాణాల్ని కాపాడుతాం. అదెలా? సాతాను “అవిశ్వాసుల మనసులకు గుడ్డితనం కలగజేశాడు” అని మనకు తెలుసు. (2 కొరిం. 4:4) దానివల్ల అతను నూరిపోసే అబద్ధాల్ని ప్రజలు నమ్ముతున్నారు. వాటిలో కొన్ని ఏంటంటే: దేవుడు లేడు, దేవుడు మనకు అందనంత దూరంగా ఉన్నాడు, ఆయన మనల్ని పట్టించుకోడు, ఆయన చాలా క్రూరుడు, తప్పుచేసినవాళ్లను నిరంతరం చిత్రహింసలు పెడతాడు. అలాంటి అబద్ధాలు యెహోవా పేరు మీద బురద జల్లుతాయి, ప్రజల మనసును విరిచేసి దేవునికి దూరం చేస్తాయి. కానీ మనం ప్రీచింగ్‌ చేసినప్పుడు సాతాను అబద్ధాలకు అడ్డుకట్ట వేస్తాం. ప్రజలకు మన తండ్రి గురించిన నిజాన్ని చెప్తాం, ఆయన పవిత్ర పేరును స్తుతిస్తాం. దాని ఫలితం ఏంటి?

15 దేవుని వాక్యంలో ఉన్న సత్యాలకు చాలా శక్తి ఉంది. ప్రజలకు యెహోవా గురించి, ఆయన ఎలాంటి వ్యక్తి అనే దానిగురించి నేర్పించినప్పుడు అబద్ధాలు పోయి, అద్భుతాలు జరుగుతాయి. ప్రజల కళ్లకు సాతాను అబద్ధాలతో ఏర్పడిన పొరలు రాలిపోయి, వాళ్లు కూడా మనలాగే మన ప్రేమగల తండ్రిని చూడగలుగుతారు. ఆయనకున్న అంతులేని శక్తిని చూసి వాళ్లు ఆశ్చర్యపోతారు. (యెష. 40:26) ఆయనకున్న పరిపూర్ణ న్యాయాన్ని బట్టి వాళ్లు ఆయన మీద భరోసా ఉంచుతారు. (ద్వితీ. 32:4) ఆయనకున్న అపారమైన తెలివి నుండి వాళ్లు ఎంతో నేర్చుకుంటారు. (యెష. 55:9; రోమా. 11:33) అలాగే ఆయన ప్రేమకు ప్రతిరూపం అని తెలుసుకుని ఎంతో ఊరటను పొందుతారు. (1 యోహా. 4:8) అలా వాళ్లు ఆయనకు దగ్గరౌతున్నప్పుడు, తన పిల్లలుగా నిరంతరం జీవించే వాళ్ల నిరీక్షణ ఇంకా బలపడుతుంది. తమ తండ్రికి దగ్గరవ్వడానికి ప్రజలకు సహాయం చేయడం మనకు దొరికిన ఎంత గొప్ప అవకాశమో కదా! మనం అలా చేసినప్పుడు, యెహోవా మనల్ని తన “తోటి పనివాళ్లుగా” చూస్తాడు.—1 కొరిం. 3:5, 9.

16. దేవుని పేరు తెలుసుకున్నప్పుడు కొంతమందికి ఎలా అనిపించింది? ఉదాహరణలు చెప్పండి.

16 మొదట్లో మనం ప్రజలకు దేవుని పేరు యెహోవా అని మాత్రమే చెప్పొచ్చు. కానీ మంచి మనసున్న వాళ్లమీద అది చెరగని ముద్రను వేస్తుంది. ఉదాహరణకు, ఆలియా a అనే అమ్మాయి గురించి ఆలోచించండి. ఆమె, ఆమె కుటుంబం వేరే మతానికి చెందినవాళ్లు. అయితే తన మతం గానీ, తను ఆరాధించే దేవుడు గానీ ఆమె హృదయాన్ని తాకలేకపోయాయి. కానీ సాక్షులతో బైబిలు స్టడీ మొదలుపెట్టినప్పుడు ఆమె కథ మారింది. ఆమె దేవుణ్ణి తన ఫ్రెండ్‌గా చూడడం మొదలుపెట్టింది. చాలా బైబిల్లో దేవుని పేరును తీసేసి, ప్రభువు లాంటి బిరుదుల్ని పెట్టారని తెలుసుకున్నప్పుడు ఆమె అవాక్కయింది. యెహోవా పేరును తెలుసుకోవడం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అందుకే సంతోషంతో ఆమె ఇలా అంటుంది: “నా బెస్ట్‌ ఫ్రెండ్‌కి ఒక పేరుంది. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాంటి ఫ్రెండ్‌ దొరికినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.” సంగీతం వాయించే స్టీవ్‌ అనే వ్యక్తి, నిష్ఠగా ఉండే యూదా మతంలో పెరిగాడు. తన మతంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటని గమనించి ఆయనకు మతమంటేనే విరక్తి వచ్చింది. కానీ వాళ్ల అమ్మ చనిపోయిన బాధలో ఉన్నప్పుడు, ఒక యెహోవాసాక్షితో బైబిలు స్టడీ తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. దేవుని పేరును తెలుసుకోవడం ఆయన హృదయాన్ని ఎంతగానో కదిలించింది. ఆయన ఇలా అంటున్నాడు: “నేను ఇప్పటివరకు దేవునికి ఒక పేరు ఉందని వినలేదు. మొదటిసారి ఆ పేరు విన్నప్పుడు దేవుడు నిజంగా ఉన్నాడని అనిపించింది. ఆయన్ని ఒక వ్యక్తిగా చూడగలిగాను. ఇప్పుడు నాకొక మంచి ఫ్రెండ్‌ దొరికాడు.”

17. యెహోవా పేరును స్తుతిస్తూ ఉండాలని మీరెందుకు నిర్ణయించుకున్నారు? (చిత్రం కూడా చూడండి.)

17 ప్రకటిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు యెహోవా అనే పవిత్రమైన పేరును మీరు ప్రజలకు చెప్తున్నారా? దేవుడు నిజంగా ఎలాంటి వ్యక్తో తెలుసుకునేలా మీరు వాళ్లకు సహాయం చేస్తున్నారా? అలా చేస్తుంటే, మీరు దేవుని పేరును స్తుతిస్తున్నారు. ఆ పేరు వెనకున్న వ్యక్తిని ప్రజలకు పరిచయం చేయడం ద్వారా మీరు యెహోవా పవిత్రమైన పేరును స్తుతిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. అలా మీరు వాళ్ల ప్రాణాల్ని కూడా కాపాడతారు. మీ రాజైన యేసుక్రీస్తును అనుసరిస్తారు. అన్నిటికి మించి, మీ ప్రేమగల తండ్రైన యెహోవాను సంతోషపెడతారు. మీరు ‘నిరంతరం దేవుని పేరును స్తుతిస్తూ’ ఉండాలి!—కీర్త. 145:2.

ప్రజలకు యెహోవా పేరును చెప్పి, ఆయన ఎలాంటి వ్యక్తో చూపించినప్పుడు మనం ఆయన్ని స్తుతిస్తాం (17వ పేరా చూడండి)

దేవుని పేరును స్తుతించినప్పుడు . . .

  • యెహోవాను ఎలా సంతోషపెడతాం?

  • యేసుక్రీస్తును ఎలా సంతోషపెడతాం?

  • ప్రాణాల్ని ఎలా కాపాడుతాం?

పాట 2 యెహోవా నీ పేరు

a కొన్ని పేర్లను మార్చాం.