జీవిత కథ
వైద్యం చేయడం కన్నా మెరుగైన సేవను కనుగొన్నాను
“నా చిన్నతనం నుండి నేను దేనిగురించైతే కోరుకున్నానో మీరు దానిగురించే చెప్తున్నారు.” ఈ మాటల్ని 1971లో నా దగ్గరికి వచ్చిన ఇద్దరు కొత్త పేషంట్లతో అన్నాను. నేను ఒక డాక్టర్‌గా అప్పుడే క్లినిక్ పెట్టాను. ఇంతకీ ఆ పేషంట్లు ఎవరు? చిన్నప్పటి నుండి నాకున్న కోరిక ఏంటి? వాళ్లతో మాట్లాడాక నా జీవితంలో దేనికి అన్నిటికన్నా ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలో ఎలా తెలుసుకోగలిగాను? అలాగే నా చిన్ననాటి కోరిక నెరవేరుతుందని ఎందుకు నమ్మకం కలిగింది? వాటిగురించి ఇప్పుడు చెప్తాను.
1941వ సంవత్సరంలో, నేను ఫ్రాన్స్‌లోని పారిస్‌లో పుట్టాను. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ నాకు 10 ఏళ్లున్నప్పుడు టీబీ సోకడం వల్ల, నేను స్కూల్‌కి వెళ్లకూడదని డాక్టర్లు చెప్పారు. నా ఊపిరితిత్తులు బలహీనంగా ఉండడంతో నన్ను విశ్రాంతి తీసుకోమన్నారు. ఆ తర్వాత కొన్ని నెలలవరకు నేను డిక్షనరీ చదువుతూ, యూనివర్సిటీ ఆఫ్ పారిస్ ప్రసారం చేసిన రేడియో కార్యక్రమాల్ని వింటూ గడిపాను. చివరికి నాకు టీబీ తగ్గిపోయిందని, నేను స్కూల్‌కి వెళ్లొచ్చని డాక్టర్ చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ‘డాక్టర్లు చేసేపని ఎంత గొప్పదో కదా’ అని నాలో నేను అనుకున్నాను. అప్పటినుండి నేను ప్రజల రోగాల్ని నయం చేయాలని కోరుకున్నాను. నేను పెద్దయ్యాక ఏం అవ్వాలని అనుకుంటున్నానో మా నాన్న నన్ను అడిగినప్పుడల్లా, “డాక్టర్ అవుతా” అని చెప్పేవాణ్ణి. అలా నేను డాక్టర్ అవ్వడానికి నా జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాను.
సైన్స్ గురించి నేర్చుకున్నప్పుడు దేవునికి దగ్గరయ్యాను
మా కుటుంబంలో అందరం క్యాథలిక్కులం. కానీ నాకు దేవుని గురించి ఎక్కువ తెలీదు. అలాగే నాకు ఎన్నో ప్రశ్నలు ఉండేవి. నేను యూనివర్సిటీలో డాక్టర్ కోర్స్ చదవడం మొదలుపెట్టిన తర్వాతే జీవం సృష్టించబడిందని నాకు నమ్మకం కలిగింది.
నేను మొదటిసారి మైక్రోస్కోప్‌లో ట్యూలిప్ మొక్క కణాల్ని చూడడం నాకింకా గుర్తుంది. వేడి నుండి, చల్లదనం నుండి ఆ కణాలు వాటంతటవే ఎలా కాపాడుకుంటాయో చూసినప్పుడు నాకు ఆశ్చర్యమనిపించింది. కణంలో ఉండే సైటోప్లాజం అనే పదార్థం ఉప్పు తగిలినప్పుడు ముడుచుకుంటుందని; మంచినీరు తగిలినప్పుడు ఇంకా పెద్దగా అవుతుందని నేను గమనించాను. ఈ సామర్థ్యం అలాగే ఇతర సామర్థ్యాల వల్ల చిన్నచిన్న ప్రాణులు ఎలాంటి వాతవరణంలోనైనా బ్రతకగలుగుతాయి. ప్రతీ కణం ఎంత అద్భుతంగా ఉందో నేను గమనించినప్పుడు జీవం దానంతటదే రాలేదని నమ్మాను.
నేను డాక్టర్ కోర్స్ చదువుతున్న రెండో సంవత్సరంలో, దేవుడు ఉన్నాడని మరిన్ని రుజువుల్ని చూశాను. మేం మానవ శరీరం గురించి నేర్చుకుంటున్నప్పుడు, మోచేయి నిర్మాణాన్ని తెలుసుకున్నాను. మన వేళ్లను వంచడానికి, నిలువుగా ఉంచడానికి అదెలా సహాయం చేస్తుందో గమనించాను. కండరాలు ఎముకలకు అతుక్కున్న విధానం, అవి కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణకు, మోచేతి కండరం నుండి వచ్చే ఒక టెండాన్ (టెండాన్ అంటే కండరాన్ని ఎముకతో కలిపే తాడు లాంటిది) వేలులోని రెండో ఎముకకు అతుక్కునే ముందు, రెండుగా చీలి వంతెనలా ఏర్పడుతుంది. దానివల్ల కింద నుండి ఇంకొక టెండాన్ వేలి చివరివరకు వెళ్తుంది. టెండాన్లు వేలి ఎముకకు గట్టిగా అతుక్కునేలా కణజాలాలు కూడా సహాయం చేస్తాయి. మన వేళ్లు ఆవిధంగా నిర్మించబడి లేకపోతే, టెండాన్లు బిగుసుకుపోయి నిటారుగా ఉండేవి. అప్పుడు మన వేళ్లను వంచడం, చాపడం వీలయ్యేది కాదు. దీన్నిబట్టి మానవ శరీరాన్ని నిర్మించిన వ్యక్తి చాలా తెలివైనవాడని నాకర్థమైంది.
బిడ్డ పుట్టిన తర్వాత ఊపిరి తీసుకోవడం ఎలా మొదలౌతుందో తెలుసుకున్నప్పుడు, సృష్టికర్త మీద నాకింకా గౌరవం పెరిగింది. తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు బొడ్డుతాడు ద్వారా ఆక్సిజన్ అందుతుంది. కాబట్టి దానంతటదే ఊపిరి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దానివల్ల ఊపిరితిత్తుల్లో చిన్న గాలి సంచుల్లా ఉండే ఆల్వియోలై అప్పటికింకా గాలితో నిండి ఉండవు. బిడ్డ పుట్టడానికి కొన్ని వారాల ముందు, ఆల్వియోలై వాటంతటవే సర్ఫ్యాక్టెంట్ అనే ద్రవాన్ని తయారు చేసుకుంటాయి. లోపల ఆ ద్రవం ఒక పొరలా ఏర్పడుతుంది. తర్వాత, బిడ్డ పుట్టి మొదటిసారి ఊపిరి తీసుకున్నప్పుడు అద్భుతమైన కొన్ని పనులు జరుగుతాయి. ఆ సమయంలో బిడ్డ గుండెలో ఉండే ఒక రంధ్రం మూసుకుపోతుంది. దానివల్ల రక్తం ఊపిరితిత్తులకు వెళ్తుంది. అంతేకాదు ఆల్వియోలై ముడుచుకోకుండా ఉండడానికి వాటిలో ఉండే సర్ఫ్యాక్టెంట్ సహాయం చేస్తుంది. దాంతో గాలి వాటిలోకి తేలిగ్గా వెళ్తుంది. అలా బిడ్డ పుట్టిన తర్వాత దానంతటదే ఊపిరి తీసుకుంటుంది.
ఇలాంటి అద్భుతాల్ని చేసిన సృష్టికర్త గురించి నేను తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకే బైబిల్ని శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాను. దేవుడు 3,000 సంవత్సరాల క్రితం ఆరోగ్యానికి సంబంధించి ఇశ్రాయేలీయులకు ఇచ్చిన నియమాలు నాకెంతో ఆశ్చర్యం కలిగించాయి. ఇశ్రాయేలీయులు తమ మలాన్ని మట్టితో కప్పాలని, నీళ్లతో ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలని, ఎవరికైనా అంటువ్యాధి సోకితే వాళ్లను ప్రజలకు దూరంగా ఉంచాలని దేవుడు చెప్పాడు. (లేవీ. 13:50; 15:11; ద్వితీ. 23:13) ఆ విషయాల గురించి బైబిలు ఎప్పుడో చెప్పినా, శాస్త్రవేత్తలు మాత్రం వ్యాధులు ఎలా సోకుతాయో కేవలం 150 సంవత్సరాల క్రితం తెలుసుకున్నారు. అలాగే లైంగిక విషయాలకు సంబంధించి లేవీయకాండంలో ఇచ్చిన నియమాలు, ఇశ్రాయేలు ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేశాయని నేను గుర్తించాను. (లేవీ. 12:1-6; 15:16-24) సృష్టికర్త ఆ నియమాల్ని ఇశ్రాయేలీయుల మంచికోసమే ఇచ్చాడని, వాటిని పాటించినవాళ్లను ఆయన ఆశీర్వదించాడని నేను అర్థంచేసుకున్నాను. అవన్నీ చదివాక బైబిల్ని దేవుడే రాయించాడని నమ్మకం కలిగింది. కానీ ఆ దేవుని పేరేంటో అప్పటికింకా నాకు తెలీదు.
నా కాబోయే భార్యను కలుసుకున్నాను; యెహోవాను తెలుసుకున్నాను
నేను యూనివర్సిటీలో డాక్టర్ కోర్స్ చదువుతున్నప్పుడే లిడీ అనే అమ్మాయిని కలిశాను. ఆమె నాకు బాగా నచ్చింది. నా చదువు పూర్తి కాకుండానే 1965లో మేమిద్దరం పెళ్లిచేసుకున్నాం. 1971 కల్లా మాకు ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఇంకో ముగ్గురు పిల్లలు పుట్టారు. లిడీ నా పనిలో అలాగే కుటుంబాన్ని చూసుకోవడంలో నాకెంతో మద్దతిచ్చింది.
అపొ. 15:28, 29) అలాగే ఆ జంట దేవుని రాజ్యం బాధల్ని, జబ్బుల్ని, మరణాన్ని తీసేస్తుందని బైబిలు నుండి చూపించారు. (ప్రక. 21:3, 4) అప్పుడు నేను వాళ్లతో, “నా చిన్నతనం నుండి నేను దేనిగురించైతే కోరుకున్నానో మీరు దానిగురించే చెప్తున్నారు. ప్రజల బాధని తగ్గించాలనే నేను డాక్టర్ని అయ్యాను” అని అన్నాను. వాళ్లు చెప్పిన విషయాలు నాకెంత నచ్చాయంటే గంటన్నర సేపు వాళ్లతో మాట్లాడాను. ఆ జంట క్లినిక్ నుండి బయటికి వెళ్లే సమయానికి, నేను ఇక క్యాథలిక్‌గా ఉండకూడదని అనుకున్నాను. అలాగే నేను ఎంతగానో గౌరవించిన సృష్టికర్త పేరు యెహోవా అని తెలుసుకున్నాను.
నేను ఒక హాస్పిటల్లో మూడు సంవత్సరాలు పనిచేశాక సొంతగా క్లినిక్ పెట్టుకున్నాను. కొంతకాలం తర్వాత, నేను మొదట్లో చెప్పిన భార్యాభర్తలైన ఇద్దరు పేషంట్లు ట్రీట్మెంట్ కోసం నా దగ్గరికి వచ్చారు. ఆ వ్యక్తికి నేను మందులు రాస్తున్నప్పుడు అతని భార్య నాతో ఇలా అంది: “డాక్టర్, దయచేసి రక్తం కలవని మందులు రాయండి.” దానికి నేను ఆశ్చర్యపోయి, “అవునా! ఎందుకు?” అని అడిగాను. దానికి ఆమె, “మేము యెహోవాసాక్షులం” అని చెప్పింది. యెహోవాసాక్షుల గురించి, రక్తం విషయంలో వాళ్ల నమ్మకం గురించి నేనెప్పుడూ వినలేదు. కాబట్టి ఆమె బైబిలు తీసి, రక్తాన్ని తీసుకోకూడదని వాళ్లెందుకు నిర్ణయించుకున్నారో కొన్ని లేఖనాల్ని చూపించింది. (ఆ యెహోవాసాక్షుల జంట మా క్లినిక్‌కి మూడుసార్లు వచ్చారు. వాళ్లు వచ్చినప్పుడల్లా గంటకు పైగా బైబిలు విషయాల్ని మాట్లాడుకున్నాం. ఇంకా ఎక్కువసేపు చర్చించుకోవడానికి వాళ్లను మా ఇంటికి రమ్మన్నాను. లిడీ నాతోపాటు బైబిలు స్టడీలో కూర్చోవడానికి ఇష్టపడినా, మేం అప్పటికే నేర్చుకున్న కొన్ని క్యాథలిక్ సిద్ధాంతాలను తప్పని ఒప్పుకునేది కాదు. అందుకే నేనొక ప్రీస్టుని మా ఇంటికి పిలిచాను. కేవలం బైబిలు ఉపయోగించి, చర్చి బోధల గురించి అర్ధరాత్రి వరకు ఆయనతో చర్చించాం. దానివల్ల యెహోవాసాక్షులు సత్యం బోధిస్తున్నారని లిడీకి అర్థమైంది. ఆ తర్వాత, మేమిద్దరం యెహోవామీద ఎంత ప్రేమ పెంచుకున్నామంటే, 1974లో బాప్తిస్మం తీసుకున్నాం.
నేను యెహోవా సేవకు మొదటిస్థానం ఇచ్చాను
నేను ఒకప్పుడు నా డాక్టర్ వృత్తికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాను. కానీ మనుషులపట్ల దేవుని సంకల్పాన్ని తెలుసుకున్న తర్వాత నేను, లిడీ యెహోవా సేవకు మొదటిస్థానం ఇచ్చాం. మా పిల్లల్ని బైబిలు ప్రమాణాల ప్రకారం పెంచాలని నిర్ణయించుకున్నాం. వాళ్లకు దేవుణ్ణి, ప్రజల్ని ప్రేమించడం నేర్పించాం. దానివల్ల మేం కుటుంబంగా ఒకరికొకరం దగ్గరయ్యాం.—మత్త. 22:37-39.
మేం తల్లిదండ్రులుగా ఒకే మాటమీద ఉండడం గురించి, మా పిల్లలు ఏం అనుకునేవాళ్లో గర్తుచేసుకున్నప్పుడు నాకు, లిడీకి నవ్వొచ్చేది. యేసు చెప్పిన, “మీ మాట ‘అవును’ అంటే అవును, ‘కాదు’ అంటే కాదు అన్నట్టే ఉండాలి” అనే నియమాన్ని మా ఇంట్లో పాటించేవాళ్లం అని వాళ్లకు తెలుసు. (మత్త. 5:37) ఉదాహరణకు, మా పెద్ద అమ్మాయికి 17 ఏళ్లున్నప్పుడు తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్లాలనుకుంది. కానీ లిడీ దానికి ఒప్పుకోలేదు. ఆ స్నేహితుల్లో ఒక అమ్మాయి తనతో, “మీ మమ్మి ఒప్పుకోకపోతే, మీ డాడీని అడుగు” అని అంది. దానికి మా అమ్మాయి: “అలా అడిగి ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్లిద్దరు ఎప్పుడూ ఒకే మాటమీద ఉంటారు” అని చెప్పింది. మేమిద్దరం బైబిలు సూత్రాల్ని పాటించే విషయంలో ఒకే మాటమీద ఉంటామని మా ఆరుగురు పిల్లలు చూశారు. ప్రస్తుతం మా కుటుంబ సభ్యుల్లో చాలామంది యెహోవాను సేవిస్తున్నందుకు మేము ఆయనకు రుణపడి ఉన్నాం.
సత్యం తెలుసుకున్న తర్వాత నేను యెహోవా సేవకు మొదటిస్థానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అయితే ఒక డాక్టర్‌గా నేను నేర్చుకున్న వైద్యాన్ని దేవుని ప్రజల కోసం ఉపయోగించాలని అనుకున్నాను. అందుకే నేను పారిస్‌లోని బెతెల్‌కు వెళ్లి, స్వచ్ఛందంగా ఒక డాక్టర్‌గా సేవచేశాను. ఆ తర్వాత లూవ్యేలోని కొత్త బెతెల్‌లో సేవచేశాను. నేను దాదాపు 50 సంవత్సరాలు ఇంటినుండి బెతెల్‌కు వెళ్లొచ్చేవాణ్ణి. ఆ సమయంలో బెతెల్ కుటుంబంలోని కొంతమంది నాకు మంచి స్నేహితులయ్యారు. వాళ్లలో కొందరికి ఇప్పుడు 90 కన్నా ఎక్కువ ఏళ్లు ఉంటాయి. ఒకరోజు నేను బెతెల్‌కి కొత్తగా వచ్చిన ఒక సహోదరుణ్ణి కలిశాను. 20 సంవత్సరాల క్రితం అతన్ని నేనే డెలివరీ చేశానని తెలుసుకుని ఆశ్చర్యపోయాను.
యెహోవా తన ప్రజల్ని ఎంతగా పట్టించుకుంటాడో నేను చూశాను
యెహోవా తన సంస్థ ద్వారా తన ప్రజల్ని ఎలా నడిపిస్తాడో, సంరక్షిస్తాడో నేను చూసినప్పుడు ఆయనమీద నాకున్న ప్రేమ ఇంకా పెరిగింది. సుమారు 1980లో యెహోవాసాక్షులు రక్తం ఎందుకు ఎక్కించుకోరో డాక్టర్లకు, ఇతర వైద్య సిబ్బందికి అర్థమయ్యేలా చెప్పడానికి పరిపాలక సభ అమెరికాలో ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.
1988లో పరిపాలక సభ, హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనే బెతెల్ డిపార్ట్మెంట్ని ప్రారంభించింది. ఈ డిపార్ట్మెంట్ మొదట్లో ఆసుపత్రి అనుసంధాన కమిటీలను (హెచ్.ఎల్.సి.) పర్యవేక్షించేది. ఆ కమిటీలు అమెరికాలోని సాక్షులకు తగిన వైద్య సదుపాయం దొరికేలా సహాయం చేసేవి. ఆ కమిటీలను ప్రపంచవ్యాప్తంగా మొదలుపెట్టినప్పుడు ఫ్రాన్స్‌లో కూడా ప్రారంభించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సహోదరసహోదరీలకు దేవుని సంస్థ ఇచ్చే ప్రేమపూర్వక మద్దతును చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
నా కోరిక నెరవేరడం
ప్రజలకు వైద్యం చేయడాన్ని నేను ఒకప్పుడు ఎంతో ఇష్టపడ్డాను. కానీ దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలో తర్వాత ఆలోచించాను. అప్పుడు, జీవానికి మూలమైన యెహోవాను ప్రజలు తెలుసుకుని, ఆయన్ని సేవించేలా వాళ్లకు సహాయం చేయడమే అన్నిటికన్నా ప్రాముఖ్యమని నాకర్థమైంది. రిటైర్మెంట్ తర్వాత, నేనూ లిడీ క్రమ పయినీర్లుగా సేవచేస్తూ ప్రతీనెల ఎన్నో గంటలు మంచివార్త ప్రకటించాం. ప్రాణాల్ని కాపాడే ఈ పనిని మాకు వీలైనంత ఎక్కువగా ఇప్పటికీ చేస్తున్నాం.
నేను ఇప్పుడు కూడా చేయగలిగిన వైద్యం చేస్తున్నాను. కాకపోతే అది తాత్కాలికమైనది. అయితే ఎంత మంచి డాక్టరైనా అన్ని జబ్బుల్ని తగ్గించలేడని లేదా మరణాన్ని తీసేయలేడని అర్థంచేసుకున్నాను. అందుకే నొప్పి, అనారోగ్యం ఇక ఉండని కాలం కోసం ఎదురుచూస్తున్నాను. అతిత్వరలో రాబోతున్న కొత్తలోకంలో, అద్భుతంగా తయారు చేయబడిన మనిషి శరీరంతో పాటు, దేవుని సృష్టి గురించి నేర్చుకుంటూనే ఉంటాను. నిజానికి నా చిన్ననాటి కోరిక కొంతవరకు నెరవేరింది. అయితే అది భవిష్యత్తులో పూర్తిగా నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను.