కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 6

యెహోవా ఎప్పుడూ సరైనదే చేస్తాడని మీరు నమ్ముతారా?

యెహోవా ఎప్పుడూ సరైనదే చేస్తాడని మీరు నమ్ముతారా?

“ఆయన ఆశ్రయదుర్గం, ఆయన కార్యం పరిపూర్ణం, ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన ఎన్నడూ అన్యాయం చేయడు; ఆయన నీతిమంతుడు, నిజాయితీపరుడు.”—ద్వితీ. 32:4.

పాట 3 మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం

ఈ ఆర్టికల్‌లో. . . a

1-2. (ఎ) అధికారంలో ఉన్నవాళ్లను చాలామంది ఎందుకు నమ్మట్లేదు? (బి) ఈ ఆర్టికల్‌లో మనమేం చర్చిస్తాం?

 అధికారంలో ఉన్నవాళ్లను ఈ రోజుల్లో చాలామంది నమ్మట్లేదు. ప్రభుత్వాలు, చట్టాలు డబ్బు-పలుకుబడి ఉన్నవాళ్లను కాపాడుతూ, పేదవాళ్లకు అన్యాయం చేస్తున్నారని వాళ్లు గమనించారు. కాబట్టి “మనిషి ఇంకో మనిషి మీద అధికారం చెలాయించి తనకు హాని చేసుకున్నాడు” అని బైబిల్లో రాయబడిన మాటలు ఎంత నిజమో కదా! (ప్రసం. 8:9) అంతేకాదు కొందరు మతనాయకులు కూడా చెడ్డపనులు చేస్తున్నారు. దీనివల్ల కొంతమంది ప్రజలు దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయారు. కాబట్టి మనం ఎవరికైనా బైబిలు స్టడీ చేస్తున్నప్పుడు, వాళ్లు యెహోవాను అలాగే భూమ్మీద ఆయన నియమించిన వాళ్లను నమ్మేలా సహాయం చేయాలి.

2 నిజమే బైబిలు విద్యార్థులు యెహోవామీద, ఆయన సంస్థమీద నమ్మకం పెంచుకోవాలి. వాళ్లేకాదు ఎంతోకాలంగా సత్యంలో ఉన్న మనం కూడా యెహోవా ఎప్పుడూ సరైనది చేస్తాడనే నమ్మకాన్ని కోల్పోకూడదు. అయితే కొన్నిసార్లు యెహోవామీద మన నమ్మకాన్ని పరీక్షించే పరిస్థితులు రావొచ్చు. అలాంటి మూడు పరిస్థితుల గురించి ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. అవేంటంటే: (1) కొన్ని బైబిలు వృత్తాంతాల్ని చదివినప్పుడు, (2) యెహోవా సంస్థ నుండి ఏదైనా నిర్దేశం వచ్చినప్పుడు, (3) భవిష్యత్తులో మనకు సవాళ్లు ఎదురైనప్పుడు.

బైబిలు చదువుతున్నప్పుడు యెహోవామీద నమ్మకం ఉంచండి

3. కొన్ని బైబిలు వృత్తాంతాల్ని చదువుతున్నప్పుడు ఎలాంటి సందేహాలు రావొచ్చు?

 3 బైబిలు చదువుతున్నప్పుడు యెహోవా కొంతమందితో వ్యవహరించిన విధానం గురించి, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి మనకు సందేహాలు రావచ్చు. ఉదాహరణకు, ఒకవ్యక్తి విశ్రాంతి రోజున కట్టెలు ఏరుకున్నందుకు యెహోవా అతనికి మరణశిక్ష విధించాడని సంఖ్యాకాండంలో చదువుతాం. వ్యభిచారం చేయడంతోపాటు, హత్య చేయించిన దావీదును యెహోవా క్షమించాడని రెండో సమూయేలులో చదువుతాం. (సంఖ్యా. 15:32, 35; 2 సమూ. 12:9, 13) ఈ వృత్తాంతాల్ని చదివినప్పుడు మనకిలా అనిపించవచ్చు: ‘గంభీరమైన తప్పులు చేసిన దావీదును యెహోవా క్షమించాడు. కానీ చిన్న తప్పుచేసిన వ్యక్తికి ఆయన ఎందుకు మరణశిక్ష విధించాడు?’ దీనికి జవాబు తెలుసుకోవాలంటే మనం బైబిలు చదువుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన మూడు విషయాల్ని ఇప్పుడు చూద్దాం.

4. యెహోవా నిర్ణయాలు ఎప్పుడూ సరైనవనే నమ్మకాన్ని ఆదికాండం 18:20, 21 అలాగే ద్వితీయోపదేశకాండం 10:17 వచనాల్లోని మాటలు ఎలా బలపరుస్తాయి?

4 ఒక వృత్తాంతానికి సంబంధించిన వివరాలన్నిటినీ బైబిలు ప్రతీసారి ఇవ్వకపోవచ్చు. ఉదాహరణకు, దావీదు తాను చేసిన తప్పులకు నిజంగా పశ్చాత్తాపపడ్డాడని మనకు తెలుసు. (కీర్త. 51:2-4) కానీ విశ్రాంతి రోజున కట్టెలు ఏరుకున్న ఇశ్రాయేలీయుడు ఎలాంటి వ్యక్తి అయ్యుంటాడు? తాను చేసిన పనికి అతను పశ్చాత్తాపపడ్డాడా? దేవుని నియమాలకు గతంలో అతను లోబడలేదా? అంతకుముందు ఇచ్చిన హెచ్చరికల్ని అతను పట్టించుకోలేదా? ఆ వివరాల్ని బైబిలు చెప్పట్లేదు. అయితే, యెహోవా “ఎన్నడూ అన్యాయం చేయడు” అనే నమ్మకంతో మనం ఉండొచ్చు. (ద్వితీ. 32:4) ఆయన వాస్తవాలన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటాడు. అంతేగానీ మనుషుల్లా ఎవరో చెప్పిన మాటల్ని బట్టి, పక్షపాతాన్ని బట్టి లేదా ఇంకేదైనా కారణాన్నిబట్టి ఆయన నిర్ణయం తీసుకోడు. (ఆదికాండం 18:20, 21; ద్వితీయోపదేశకాండం 10:17 చదవండి.) యెహోవా గురించి, ఆయన ప్రమాణాల గురించి ఎంతెక్కువగా తెలుసుకుంటే, ఆయన నిర్ణయాలు ఎప్పుడూ సరైనవే అని అంతెక్కువగా నమ్ముతాం. మనం ఒక బైబిలు వృత్తాంతాన్ని చదువుతున్నప్పుడు సందేహాలు రావచ్చు కానీ వాటికి జవాబులు దొరక్కపోవచ్చు. అయినా యెహోవా గురించి మనకు తెలిసిన దాన్నిబట్టి ఆయన “తన మార్గాలన్నిట్లో నీతిగలవాడు” అనే నమ్మకంతో ఉండొచ్చు.—కీర్త. 145:17.

5. మనం అపరిపూర్ణులం కాబట్టి ఏం జరిగే అవకాశముంది? (“ అపరిపూర్ణత వల్ల విషయాల్ని అన్నిసార్లూ స్పష్టంగా అర్థంచేసుకోలేం” అనే బాక్సు చూడండి.)

5 మనం అపరిపూర్ణులం కాబట్టి అన్నిసార్లూ సరైన విధంగా ఆలోచించలేం. దేవుడు మనల్ని తన స్వరూపంలో చేశాడు కాబట్టి ప్రజలందరికీ న్యాయం జరగాలని కోరుకుంటాం. (ఆది. 1:26) కానీ మనం అపరిపూర్ణులం కాబట్టి, మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అనుకున్నప్పుడు కూడా విషయాల్ని సరిగ్గా అంచనా వెయలేం. ఉదాహరణకు, నీనెవె ప్రజలమీద కనికరం చూపించాలని యెహోవా నిర్ణయించుకున్నప్పుడు అది యోనాకు నచ్చలేదు. (యోనా 3:10–4:1) యెహోవా తీసుకున్న నిర్ణయంవల్ల ఏం జరిగిందో ఆలోచించండి. పశ్చాత్తాపం చూపించిన 1,20,000 కన్నా ఎక్కువమంది నీనెవె ప్రజలు రక్షించబడ్డారు. ఆ తర్వాత, తప్పు యెహోవాది కాదు తనదేనని యోనాకు అర్థమైంది.

6. యెహోవా ఒక నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో మనకు వివరించాల్సిన అవసరం ఎందుకు లేదు?

6 యెహోవా ఒక నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో మనుషులకు వివరించాల్సిన అవసరంలేదు. నిజమే యెహోవా గతంలో తాను తీసుకున్న నిర్ణయాల గురించి లేదా తీసుకోబోతున్న నిర్ణయాల గురించి, తన సేవకులు ఏమనుకుంటున్నారో చెప్పే అవకాశమిచ్చాడు. (ఆది. 18:25; యోనా 4:2, 3) అలాగే కొన్నిసార్లు ఒక నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడో వివరించాడు. (యోనా 4:10, 11) నిజానికి అలా వివరించాల్సిన అవసరం ఆయనకు లేదు. యెహోవా మన సృష్టికర్త కాబట్టి ఏదైనా చేసే ముందు లేదా చేసిన తర్వాత మన అంగీకారాన్ని తీసుకోవాల్సిన అవసరంలేదు.—యెష. 40:13, 14; 55:9.

సంస్థ నుండి నిర్దేశం వచ్చినప్పుడు యెహోవామీద నమ్మకం ఉంచండి

7. మనకు ఏం చేయడం కష్టంగా ఉండొచ్చు? ఎందుకు?

7 యెహోవా చేసే పనులన్నీ ఎప్పుడూ సరైనవేనని మనం ఖచ్చితంగా అంగీకరిస్తాం. అయితే ఆయన నియమించినవాళ్లను నమ్మడం మనకు కష్టంగా ఉండొచ్చు. యెహోవా సంస్థలో కొంత అధికారం ఉన్నవాళ్లు, ఆయన నిర్దేశం ప్రకారం పనిచేస్తారా లేదా తమ సొంత ఆలోచన ప్రకారం పనిచేస్తారా అని మనకు అనిపించవచ్చు. బైబిలు కాలాల్లో జీవించిన కొంతమంది బహుశా అలా ఆలోచించి ఉంటారు.  3వ పేరాలో ఉన్న రెండు సందర్భాల గురించి ఆలోచించండి. బహుశా విశ్రాంతి రోజున దేవుని ఆజ్ఞ మీరిన వ్యక్తి బంధువు ఇలా అనుకుని ఉండొచ్చు, ‘మరణశిక్ష విధించే ముందు మోషే నిజంగా యెహోవాను సంప్రదించి ఉంటాడా?’ అలాగే ఊరియా స్నేహితుల్లో ఒకరు ఇలా ఆలోచించి ఉండొచ్చు, ‘దావీదు ఒక రాజు కాబట్టి శిక్షను తప్పించుకోవడానికి తన అధికారాన్ని ఉపయోగించి ఉంటాడు.’ అయితే సంస్థను, సంఘాన్ని నడిపించడానికి యెహోవా తాను నియమించిన వాళ్లను నమ్ముతాడు. కాబట్టి మనం వాళ్లను నమ్మకపోతే, యెహోవాను కూడా నమ్మనట్టే.

8. అపొస్తలుల కార్యాలు 16:4, 5 లో ఉన్నట్టు, నేడు క్రైస్తవ సంఘం ఎలా పని చేస్తుంది?

8 నేడు యెహోవా తన సంస్థలోని భూభాగాన్ని ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుని’ ద్వారా నడిపిస్తున్నాడు. (మత్త. 24:45) మొదటి శతాబ్దపు పరిపాలక సభలాగే ఈ దాసుడు, ప్రపంచవ్యాప్తంగా దేవుని ప్రజల్ని చూసుకుంటూ సంఘపెద్దలకు నిర్దేశాల్ని ఇస్తున్నాడు. (అపొస్తలుల కార్యాలు 16:4, 5 చదవండి.) పెద్దలు ఆ నిర్దేశాల్ని సంఘాల్లో పాటిస్తారు. సంస్థ అలాగే పెద్దలు ఇచ్చే నిర్దేశాల్ని పాటించినప్పుడు, యెహోవా ఎప్పుడూ సరైనది చేస్తాడని మనం నమ్ముతున్నట్లు చూపిస్తాం.

9. పెద్దలు తీసుకునే నిర్ణయానికి లోబడడం ఎప్పుడు కష్టంగా ఉండొచ్చు? ఎందుకు?

9 కొన్నిసార్లు సంఘపెద్దలు తీసుకునే నిర్ణయాలకు లోబడడం మనకు కష్టంగా ఉండొచ్చు. ఉదాహరణకు, ఈ మధ్యకాలంలో చాలా సంఘాల్ని కలిపేశారు. దానివల్ల కొన్ని సంఘాల్ని వేరే సర్క్యూట్‌కు మార్చారు. కొన్నిసార్లు, రాజ్యమందిరాన్ని ఎక్కువమంది ఉపయోగించుకునేలా పెద్దలు కొంతమంది ప్రచారకుల్ని వేరే సంఘానికి వెళ్లమని అడిగారు. ఒకవేళ మనల్నే వేరే సంఘానికి వెళ్లమని అడిగితే స్నేహితుల్ని, కుటుంబాన్ని విడిచివెళ్లడం మనకు కష్టంగా ఉండొచ్చు. ప్రచారకుల్ని ఏయే సంఘాలకు పంపించాలో యెహోవా పెద్దలకు చెప్తాడా? ఆయన అలా చెప్పడు. కాబట్టి పెద్దలిచ్చే నిర్దేశాల్ని పాటించడం మనకు కష్టంగా ఉండొచ్చు. కానీ అలాంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో యెహోవా పెద్దల్ని నమ్ముతున్నాడు. కాబట్టి మనమూ వాళ్లను నమ్మాలి. b

10. మనం పెద్దలకు ఎందుకు మద్దతివ్వాలి? (హెబ్రీయులు 13:17)

10 పెద్దలు తీసుకునే నిర్ణయాలు మనకు నచ్చకపోయినా ఎందుకు మద్దతివ్వాలి? అలా చేస్తే సంఘ ఐక్యతను కాపాడుతాం. (ఎఫె. 4:2, 3) అంతేకాదు పెద్దలు తీసుకునే నిర్ణయాలకు అందరూ వినయంగా లోబడితే సంఘాలు అభివృద్ధి అవుతాయి. (హెబ్రీయులు 13:17 చదవండి.) మరిముఖ్యంగా, మనల్ని చూసుకోవడానికి యెహోవా ఎంతో నమ్మకంతో నియమించిన పెద్దలకు మద్దతివ్వడం ద్వారా ఆయనపై నమ్మకముందని చూపిస్తాం.—అపొ. 20:28.

11. పెద్దలిచ్చే నిర్దేశంపై నమ్మకాన్ని పెంచుకోవడానికి ఏం చేయొచ్చు?

11 పెద్దలిచ్చే నిర్దేశంపై నమ్మకాన్ని పెంచుకోవడానికి ఏం చేయొచ్చు? వాళ్లు సంఘానికి సంబంధించిన విషయాల్ని చర్చిస్తున్నప్పుడు, పవిత్రశక్తి కోసం ప్రార్థిస్తారని మనం గుర్తుంచుకోవడం ద్వారా నమ్మకాన్ని పెంచుకోవచ్చు. వాళ్లు దేనిగురించి చర్చించుకుంటారో దానికి సరిపోయే బైబిలు సూత్రాల్ని, సంస్థ నిర్దేశాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తారు. అలాగే యెహోవాను సంతోషపెట్టాలని, ఆయన ప్రజల్ని వీలైనంత శ్రద్ధగా చూసుకోవాలని వాళ్లు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. తమకిచ్చిన బాధ్యతల్ని నెరవేర్చే విషయంలో దేవునికి లెక్క అప్పజెప్పాలని వాళ్లకు తెలుసు. (1 పేతు. 5:2, 3) ఒకసారి ఆలోచించండి: జాతి, మతం, రాజకీయం వల్ల విభజించబడిన ఈ లోకంలో, యెహోవా ప్రజలు ఒకే సత్య దేవుణ్ణి ఐక్యంగా ఆరాధిస్తున్నారు. యెహోవా తన సంస్థకు సహాయం చేయడం వల్లే ఇది సాధ్యమౌతుంది.

12. ఒకవ్యక్తి పశ్చాత్తాపపడ్డాడో లేదో నిర్ణయించేటప్పుడు పెద్దలు ఏ విషయాల్ని జాగ్రత్తగా పరిశీలించాలి?

12 సంఘాన్ని పవిత్రంగా ఉంచే బరువైన బాధ్యతను యెహోవా పెద్దలకు ఇచ్చాడు. ఒకవ్యక్తి గంభీరమైన తప్పుచేస్తే, అతను సంఘంలో ఉండాలో లేదో పెద్దలు నిర్ణయించాలని యెహోవా కోరుతున్నాడు. అలా చేసే ముందు పెద్దలు ఈ విషయాల గురించి ఆలోచించాలి: ఆ వ్యక్తి తాను చేసిన పనికి నిజంగా పశ్చాత్తాపపడుతున్నాడా? ఒకవేళ పశ్చాత్తాపపడుతున్నానని చెప్పినా, తాను చేసిన పనిని నిజంగా అసహ్యించుకుంటున్నాడా? అతను ఆ పాపాన్ని మళ్లీ చేయకూడదని నిశ్చయించుకున్నాడా? ఒకవేళ తప్పు చేయడానికి చెడు స్నేహితులు కారణమైతే, వాళ్లను వదులుకోవడానికి ఇష్టపడుతున్నాడా? పెద్దలు సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తారు. తర్వాత వాస్తవాల్ని పరిశీలించి, బైబిలు ఏం చెప్తుందో చూస్తారు. అలాగే ఆ వ్యక్తి తాను చేసిన తప్పు గురించి ఎలా భావిస్తున్నాడో పరిశీలిస్తారు. ఆ తర్వాత తప్పుచేసిన వ్యక్తి సంఘంలో ఉండాలో లేదో నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో, ఆ వ్యక్తి బహిష్కరించబడతాడు.—1 కొరిం. 5:11-13.

13. మన స్నేహితుడు లేదా బంధువు బహిష్కరించబడితే మనమెలా ఆలోచించే అవకాశముంది?

13 పెద్దలమీద మనకున్న నమ్మకం ఎలా పరీక్షించబడుతుంది? ఒకవ్యక్తి బహిష్కరించబడినప్పుడు అతను మన దగ్గరి స్నేహితుడు లేదా బంధువు కాకపోతే, పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని మనం తేలిగ్గా అంగీకరించే అవకాశముంది. కానీ ఒకవేళ అతను మన దగ్గరి స్నేహితుడు లేదా బంధువు అయితే అప్పుడేంటి? పెద్దలు వాస్తవాలన్నిటినీ పరిశీలించలేదని మనం ఆందోళనపడొచ్చు. లేదా వాళ్లు యెహోవాలా న్యాయం తీర్చలేదని అనుకోవచ్చు. పెద్దలు తీసుకునే నిర్ణయం గురించి సరిగ్గా ఆలోచించడానికి మనకేది సహాయం చేస్తుంది?

14. మన స్నేహితుల్లో లేదా బంధువుల్లో ఎవరైనా బహిష్కరించబడితే మనం ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి?

14 యెహోవా చేసిన బహిష్కరించడం అనే ఏర్పాటు సంఘానికి, తప్పుచేసిన వ్యక్తికి మంచి చేస్తుందని గుర్తుంచుకోవాలి. ఒకవేళ పశ్చాత్తాపపడని తప్పిదస్థుణ్ణి సంఘంలోనే ఉండనిస్తే, అతని ప్రభావం ఇతరులమీద పడొచ్చు. (గల. 5:9) అంతేకాదు, అతను చేసిన తప్పు ఎంత గంభీరమైనదో గుర్తించలేకపోవచ్చు. పైగా యెహోవా ఆమోదాన్ని తిరిగి పొందడానికి తన ఆలోచనల్ని, పనుల్ని మార్చుకోవాల్సిన అవసరంలేదని అతను అనుకోవచ్చు. (ప్రసం. 8:11) ఒకవ్యక్తిని బహిష్కరించాలా వద్దా అనే నిర్ణయాన్ని సంఘపెద్దలు జాగ్రత్తగా ఆలోచించి తీసుకుంటారని మనం నమ్మకంతో ఉండవచ్చు. పెద్దలు పూర్వకాలంలోని ఇశ్రాయేలీయుల న్యాయాధిపతుల్లాగే, “మనుషుల కోసం కాదు యెహోవా కోసం న్యాయం తీరుస్తున్నారు” అని అర్థంచేసుకుంటారు.—2 దిన. 19:6, 7.

యెహోవాపై ఇప్పుడు నమ్మకం ఉంచితే, భవిష్యత్తులో కూడా ఉంచగలుగుతాం

మహాశ్రమ సమయంలో మనకొచ్చే నిర్దేశాల్ని నమ్మడానికి, పాటించడానికి ఏది సహాయం చేస్తుంది? (15వ పేరా చూడండి)

15. యెహోవా నిర్దేశాన్ని ఇంతకుముందు కన్నా ఎక్కువగా ఇప్పుడు ఎందుకు నమ్మాలి?

15 ఈ వ్యవస్థ అంతమయ్యే సమయం దగ్గర పడుతుండగా, యెహోవా ఎప్పుడూ సరైనదే చేస్తాడని ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఎక్కువగా నమ్మాలి. ఎందుకు? మహాశ్రమ కాలంలో మనకొచ్చే నిర్దేశాలు అర్థంచేసుకోవడానికి కష్టంగా ఉన్నట్టు లేదా పాటించడానికి వీలుగా లేనట్టు అనిపించవచ్చు. నిజమే యెహోవా మనతో నేరుగా మాట్లాడడు, కానీ ఆయన నియమించిన వ్యక్తుల ద్వారా మనకు నిర్దేశం ఇస్తాడు. అప్పుడు, ‘ఈ నిర్దేశం నిజంగా యెహోవాయే ఇచ్చాడా లేదా ఇది నాయకత్వం వహిస్తున్న సహోదరుల అభిప్రాయమా?’ అని సందేహించడానికి లేదా ఆలోచించడానికి అది సమయం కాదు. ఆ ప్రాముఖ్యమైన సమయంలో యెహోవాను, ఆయన సంస్థను మనం నమ్ముతామా? దేవుడు తాను నియమించినవాళ్ల ద్వారా ఇచ్చే నిర్దేశం గురించి ఇప్పుడు మనమెలా ఆలోచిస్తున్నాం అనేది ఆ ప్రశ్నకు జవాబిస్తుంది. నేడు మనకొచ్చే నిర్దేశాన్ని నమ్ముతూ, దాన్ని వెంటనే పాటిస్తే మహాశ్రమ సమయంలో కూడా అలాగే చేస్తాం.—లూకా 16:10.

16. యెహోవా నిర్ణయాలపై మనకున్న నమ్మకం భవిష్యత్తులో ఎలా పరీక్షించబడొచ్చు?

16 ఈ చెడ్డ లోకం అంతమయ్యే సమయంలో, యెహోవా తీసుకునే నిర్ణయాలకు మనమెలా స్పందిస్తామో కూడా ఆలోచించాలి. ప్రస్తుతం యెహోవాను ఆరాధించని మన బంధువులతో సహా చాలామంది, అంతం వచ్చేలోపు ఆయన్ని ఆరాధిస్తారని మనం ఆశిస్తాం. కానీ యెహోవా హార్‌మెగిద్దోన్‌ సమయంలో, ప్రతి ఒక్కరికీ యేసు ద్వారా తీర్పుతీరుస్తాడు. (మత్త. 25:31-33; 2 థెస్స. 1:7-9) అప్పుడు తన కరుణను ఎవరు పొందుతారో, ఎవరు పొందరో యెహోవాయే నిర్ణయిస్తాడు. (మత్త. 25:34, 41, 46) ఆ సమయంలో యెహోవా తీసుకునే నిర్ణయాలమీద నమ్మకం ఉంచుతామా? లేదా అవి నచ్చక ఆయన్ని సేవించడం ఆపేస్తామా? కాబట్టి భవిష్యత్తులో మనం యెహోవాను పూర్తిగా నమ్మాలంటే, ఆయనమీద మనకున్న నమ్మకాన్ని ఇప్పుడే బలపర్చుకోవాలి.

17. ఈ వ్యవస్థ అంతమయ్యే సమయంలో యెహోవా తీసుకున్న నిర్ణయాలవల్ల మనమెలా ప్రయోజనం పొందుతాం?

17 యెహోవా తీసుకున్న నిర్ణయాలవల్ల వచ్చే ఫలితాల్ని కొత్తలోకంలో చూసినప్పుడు మీకెలా అనిపిస్తుందో ఆలోచించండి. అబద్ధమతం ఉనికిలో లేకుండా పోతుంది. అత్యాశ చూపించిన వాణిజ్య వ్యవస్థతోపాటు, మానవ చరిత్రంతటిలో ప్రజల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వాలు ఇక ఉండవు. అనారోగ్యం, వయసు పైబడడం, మనకిష్టమైనవాళ్లు చనిపోవడం లాంటివి ఇక చూడం. సాతాను, అతని చెడ్డదూతలు వెయ్యి సంవత్సరాలు బంధించబడతారు. వాళ్లు ఎదురుతిరగడం వల్ల వచ్చిన చెడు పర్యవసానాలన్నీ పోతాయి. (ప్రక. 20:2, 3) యెహోవా ఎప్పుడూ సరైనదే చేస్తాడని నమ్మినందుకు అప్పుడు మనమెంత సంతోషిస్తామో కదా!

18. ఇశ్రాయేలీయుల నుండి మనం ఏ పాఠాలు నేర్చుకుంటాం? (సంఖ్యాకాండం 11:4-6; 21:5)

18 కొత్తలోకంలో మనకెదురయ్యే కొన్ని పరిస్థితులు, యెహోవా ఎప్పుడూ సరైనది చేస్తాడనే మన నమ్మకాన్ని పరీక్షిస్తాయా? ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి వచ్చిన కొంతకాలానికి ఏం జరిగిందో ఆలోచించండి. కొంతమంది ఐగుప్తులో తిన్న తాజా ఆహారాన్ని గుర్తుచేసుకుంటూ అసంతృప్తిపడ్డారు. అలాగే యెహోవా ఇచ్చిన మన్నాను అసహ్యించుకున్నారు. (సంఖ్యాకాండం 11:4-6; 21:5 చదవండి.) మహాశ్రమ ముగిశాక మనం కూడా అలా ఆలోచిస్తామా? ఈ భూమిని శుభ్రం చేసి మెల్లమెల్లగా అందమైన తోటలా మార్చడానికి ఎంత పని చేయాల్సి ఉంటుందో మనకు తెలీదు. మొదట్లో చాలా పని చేయాల్సి రావొచ్చు. అలాగే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవ్వొచ్చు. ఆ సమయంలో యెహోవా ఇచ్చే దాన్నిబట్టి మనం తృప్తిపడతామా లేదా ఫిర్యాదు చేస్తామా? మనం యెహోవా ఇస్తున్న వాటికి ఇప్పుడు ఎంతెక్కువ కృతజ్ఞత చూపిస్తే, భవిష్యత్తులో అంతెక్కువ కృతజ్ఞత చూపించగలుగుతాం.

19. ఈ ఆర్టికల్‌లో మీరు ఏ ప్రాముఖ్యమైన విషయాల్ని నేర్చుకున్నారు?

19 యెహోవా ఎప్పుడూ సరైనదే చేస్తాడని మనం నమ్మాలి. అలాగే ఆయన ఎవరినైతే నమ్ముతున్నాడో వాళ్లను కూడా నమ్మాలి. యెషయా ప్రవక్త ద్వారా యెహోవా చెప్పిన ఈ మాటల్ని మనమెప్పుడూ మర్చిపోకుండా ఉందాం: “మీరు కంగారుపడకుండా, నమ్మకం చూపిస్తే అదే మీకు బలం.”—యెష. 30:15.

పాట 98 లేఖనాల్ని దేవుడు ప్రేరేపించాడు

a యెహోవా మీద అలాగే ఈ భూమ్మీద ఆయన నియమించిన వాళ్లమీద మన నమ్మకాన్ని ఎందుకు బలపర్చుకోవాలో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అలా చేయడం వల్ల ఇప్పుడు ఎలా ప్రయోజనం పొందుతామో, భవిష్యత్తులో వచ్చే సవాళ్లకు ఎలా సిద్ధపడతామో కూడా తెలుసుకుంటాం.

b కొన్నిసార్లు, ఒక సహోదరుడు లేదా సహోదరి లేదా ఒక కుటుంబం కొన్ని కారణాల్నిబట్టి అదే సంఘంలో ఉండాల్సి రావచ్చు. 2002 నవంబరు, మన రాజ్య పరిచర్యలో “ప్రశ్నాభాగం” చూడండి.