కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 7

‘తెలివిగలవాళ్ల మాటల్ని విను’

‘తెలివిగలవాళ్ల మాటల్ని విను’

“తెలివిగలవాళ్ల మాటల్ని చెవిపెట్టి విను.”—సామె. 22:17.

పాట 123 దైవపరిపాలనా పద్ధతికి నమ్మకంగా లోబడదాం

ఈ ఆర్టికల్‌లో. . . a

1. మనం ఏయే విధాలుగా సలహా పొందుతాం? అదెందుకు అవసరం?

 మనందరికీ ఏదోక సమయంలో సలహా అవసరం. కొన్నిసార్లు మనమే వెళ్లి మనం గౌరవించేవాళ్లను సలహా అడుగుతాం. ఇంకొన్నిసార్లు, మనమీద శ్రద్ధ ఉన్న ఒక సహోదరుడు మన దగ్గరికి వచ్చి, మనం “తప్పటడుగు” వేయబోతున్నామని చెప్పొచ్చు. (గల. 6:1) మరికొన్నిసార్లు, గంభీరమైన తప్పు చేసినందుకు మనల్ని సరిదిద్దుతూ సలహా ఇవ్వొచ్చు. మనకు సలహా ఏవిధంగా వచ్చినా, దాన్ని వినాలి. అలాచేస్తే మనకు మంచి జరుగుతుంది అలాగే మన ప్రాణాల్ని కాపాడుకోవచ్చు.—సామె. 6:23.

2. సామెతలు 12:15 ప్రకారం, మనం సలహాను ఎందుకు వినాలి?

2 “తెలివిగలవాళ్ల మాటల్ని చెవిపెట్టి విను” అని ఈ ఆర్టికల్‌ ముఖ్యవచనం మనల్ని ప్రోత్సహిస్తుంది. (సామె. 22:17) అందరికీ అన్ని విషయాలు తెలీవు; మనకన్నా ఎక్కువ జ్ఞానం లేదా అనుభవం ఉన్నవాళ్లు ఎవరోఒకరు ఎప్పుడూ ఉంటారు. (సామెతలు 12:15 చదవండి.) కాబట్టి సలహాను విన్నప్పుడు మనకు వినయం ఉందని చూపిస్తాం. మన పరిమితులు మనకు తెలుసని చూపిస్తాం. అలాగే లక్ష్యాలు చేరుకోవడానికి మనకు సహాయం అవసరమని గుర్తిస్తున్నామని చూపిస్తాం. పవిత్రశక్తి ప్రేరణతో జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా రాశాడు: “సలహాదారులు ఎక్కువమంది ఉంటే పనులు జరుగుతాయి.”—సామె. 15:22.

ఈ రెండు రకాల సలహాల్లో ఏది మీకు పాటించడం కష్టంగా ఉంది? (3-4 పేరాలు చూడండి)

3. మనం ఏ రెండు విధాలుగా సలహా పొందుతాం?

3 కొన్నిసార్లు మనం నేరుగా సలహా పొందుతాం. ఒక సంఘపెద్ద లేదా పరిణతిగల సహోదరుడు మనం మెరుగుపర్చుకోవాల్సిన ఒక విషయం గురించి మనకు చెప్పొచ్చు. అలా ఎవరైనా మనమీద ప్రేమతో బైబిలు నుండి సలహా ఇస్తే దాన్ని విని, పాటించడం ద్వారా వాళ్లపట్ల కృతజ్ఞత చూపించాలి. ఇంకొన్నిసార్లు, మరోవిధంగా కూడా మనం సలహా పొందుతాం. బైబిల్లో లేదా ఒక ప్రచురణలో దేనిగురించైనా చదివినప్పుడు కాస్త ఆగి, మనం చేసే ఒక పని గురించి ఆలోచిస్తాం. ఆ తర్వాత దాన్ని సరిచేసుకోవాలని అనుకుంటాం.—హెబ్రీ. 4:12.

4. మనకు ఎవరైనా సలహా ఇస్తే ప్రసంగి 7:9 ప్రకారం, మనమేం చేయకూడదు?

4 నిజానికి మనకెవరైనా నేరుగా సలహా ఇస్తే దాన్ని విని, పాటించడం చాలా కష్టంగా ఉండొచ్చు. కొన్నిసార్లు మనం నొచ్చుకోవచ్చు కూడా. ఎందుకు? అపరిపూర్ణులమని మనకు తెలిసినా, మనం చేసిన ఒక తప్పు గురించి చెప్పి ఎవరైనా సలహా ఇస్తే, దాన్ని అంగీకరించడం కష్టంగా ఉండొచ్చు. (ప్రసంగి 7:9 చదవండి.) అప్పుడు మనల్ని మనం సమర్థించుకోవచ్చు. మనకు సలహా ఇచ్చిన వ్యక్తి ఉద్దేశాల్ని ప్రశ్నించొచ్చు లేదా అతను సలహా ఇచ్చిన విధానాన్నిబట్టి బాధపడొచ్చు. అంతేకాదు సలహా ఇచ్చిన వ్యక్తిని విమర్శిస్తూ, ‘అతను కూడా తప్పులు చేస్తాడు కదా, మరి నాకెలా సలహా ఇస్తాడు?’ అని మనం అనుకోవచ్చు. ఆఖరికి, ఆ సలహా నచ్చకపోతే దాన్ని పట్టించుకోం లేదా మనకు నచ్చేలా మాట్లాడేవాళ్ల దగ్గర సలహా తీసుకోవాలని అనుకోవచ్చు.

5. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

5 సలహాను పాటించని అలాగే పాటించిన కొంతమంది బైబిలు ఉదాహరణల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. అంతేకాదు సలహాను పాటించడానికి మనకేది సహాయం చేస్తుందో, పాటిస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటో కూడా చూస్తాం.

వాళ్లు సలహాను పాటించలేదు

6. రాజైన రెహబాము ఉదాహరణ నుండి మనమేం నేర్చుకోవచ్చు?

6 రెహబాము ఉదాహరణ పరిశీలించండి. అతను ఇశ్రాయేలుమీద రాజైనప్పుడు, ఆ రాజ్యంలోని ప్రజలు అతని దగ్గరికి వచ్చి ఒక విన్నపం చేసుకున్నారు. అతని తండ్రియైన సొలొమోను వాళ్లమీద పెట్టిన బరువైన కాడిని తేలిక చేయమని అడిగారు. అప్పుడు రెహబాము ఒక మంచిపని చేశాడు. అతను ఇశ్రాయేలు పెద్దల్ని పిలిపించి, ప్రజలకు ఏం జవాబివ్వాలో చెప్పమని సలహా అడిగాడు. ప్రజలు అడిగింది చేస్తే వాళ్ల మద్దతు అతనికి ఎప్పుడూ ఉంటుందని ఆ పెద్దలు చెప్పారు. (1 రాజు. 12:3-7) అయితే రెహబాముకు ఆ సలహా నచ్చలేదు. కాబట్టి తనతో పెరిగిన కొంతమందిని సలహా అడిగాడు. వాళ్లకు దాదాపు 40 ఏళ్లు ఉండివుంటాయి, కాబట్టి ఎంతోకొంత అనుభవం ఉండివుంటుంది. (2 దిన. 12:13) కానీ ఈ సందర్భంలో వాళ్లు రెహబాముకు చెడ్డ సలహా ఇచ్చారు. ప్రజల కాడిని ఇంకా బరువైనదిగా చేయమని వాళ్లు చెప్పారు. (1 రాజు. 12:8-11) రెహబాముకు రెండు రకాల సలహాలు వచ్చినప్పుడు, వాటిలో దేన్ని పాటించాలో తెలుసుకోవడానికి అతను యెహోవాను అడగాల్సింది. దానికి బదులు, తనకు నచ్చిన సలహాను అంటే తన తోటివాళ్లు చెప్పినదాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాడు. దానివల్ల రెహబాముకు, ఇశ్రాయేలు ప్రజలకు చాలా నష్టం జరిగింది. మన విషయం కూడా అంతే. ఇతరులు ఎప్పుడూ మనకు నచ్చే సలహా ఇవ్వకపోవచ్చు. అయినా అది దేవుని వాక్యంమీద ఆధారపడిందైతే దాన్ని పాటించాలి.

7. రాజైన ఉజ్జియా ఉదాహరణ నుండి మనమేం నేర్చుకోవచ్చు?

7 రాజైన ఉజ్జియా తనకిచ్చిన సలహాను పాటించలేదు. యెహోవా ఆలయంలో యాజకులు మాత్రమే వెళ్లాల్సిన చోటుకు వెళ్లి, అతను ధూపం వేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు యాజకులు అతనితో, “ఉజ్జియా, నువ్వు యెహోవాకు ధూపం వేయడం సరికాదు! యాజకులు మాత్రమే ధూపం వేయాలి” అని అన్నారు. దానికి ఉజ్జియా ఎలా స్పందించాడు? అతను ఆ సలహాను వినయంగా అంగీకరించి, వెంటనే ఆలయాన్ని విడిచి వెళ్లుంటే యెహోవా అతన్ని క్షమించి ఉండేవాడు. కానీ “ఉజ్జియాకు చాలా కోపం వచ్చింది.” తాను రాజు కాబట్టి ఇష్టమొచ్చింది చేయొచ్చని అతను అనుకున్నాడు. అందుకే ఆ సలహాను పాటించలేదు. కానీ యెహోవాకు అతని ఆలోచనా విధానం నచ్చలేదు. ఉజ్జియా చేయకూడని పని చేయడంవల్ల అతనికి కుష్ఠువ్యాధి వచ్చింది. అలాగే “చనిపోయే రోజు వరకు కుష్ఠురోగిగానే ఉన్నాడు.” (2 దిన. 26:16-21) మనం ఎవరిమైనా సరే, బైబిలిచ్చే సలహాను పాటించకపోతే యెహోవా అనుగ్రహాన్ని కోల్పోతామని ఉజ్జియా ఉదాహరణ నేర్పిస్తుంది.

వాళ్లు సలహాను పాటించారు

8. సలహా ఇచ్చినప్పుడు యోబు ఎలా స్పందించాడు?

8 సలహాను అంగీకరించి ఆశీర్వాదం పొందినవాళ్ల ఉదాహరణలు కూడా బైబిల్లో ఉన్నాయి. యోబు గురించి ఆలోచించండి. అతను దేవుణ్ణి ప్రేమించి, ఆయన్ని సంతోషపెట్టాలని కోరుకున్నాడు. అయితే అతను అపరిపూర్ణుడు, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆలోచించకుండా మాట్లాడాడు. దానివల్ల ఎలీహు నుండి, యెహోవా నుండి నేరుగా సలహా పొందాడు. దానికి యోబు ఎలా స్పందించాడు? తనకిచ్చిన సలహాను వినయంగా అంగీకరించాడు. అతనిలా అన్నాడు: “నేను మాట్లాడాను, కానీ అవగాహన లేకుండా మాట్లాడాను. . . . నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను. ధూళిలో, బూడిదలో కూర్చుని పశ్చాత్తాపపడుతున్నాను.” యోబు వినయం చూపించడం వల్ల యెహోవా అతన్ని ఆశీర్వదించాడు.—యోబు 42:3-6, 12-17.

9. సలహాను అంగీకరించే విషయంలో మోషే మనకెలా మంచి ఆదర్శం ఉంచాడు?

9 మోషే గంభీరమైన తప్పు చేసినప్పుడు యెహోవా అతన్ని సరిదిద్దాడు. అతను దాన్ని అంగీకరించడం ద్వారా మంచి ఆదర్శం ఉంచాడు. అసలేం జరిగిందంటే, ఒక సందర్భంలో మోషే కోపం తెచ్చుకుని యెహోవాను ఘనపర్చలేదు. దానివల్ల అతను వాగ్దాన దేశంలోకి వెళ్లే అవకాశాన్ని కోల్పోయాడు. (సంఖ్యా. 20:1-13) తన విషయంలో తీసుకున్న నిర్ణయం గురించి మళ్లీ ఆలోచించమని మోషే యెహోవాను అడిగినప్పుడు, ఆయన అతనితో ఇలా అన్నాడు: “ఈ విషయం గురించి ఇంకెప్పుడూ నాతో మాట్లాడకు!” (ద్వితీ. 3:23-27) మోషే ఆ మాటల్ని విని కోపం తెచ్చుకోలేదు. బదులుగా యెహోవా నిర్ణయాన్ని అంగీకరించాడు. దాంతో, ఆ తర్వాత కూడా ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి యెహోవా అతన్ని ఉపయోగించుకున్నాడు. (ద్వితీ. 4:1) సలహాను అంగీకరించే విషయంలో యోబు, మోషే మనకు మంచి ఆదర్శం ఉంచారు. యోబు తన ఆలోచనను సరిచేసుకున్నాడు, అలాగే సాకులు చెప్పలేదు. మోషే వాగ్దాన దేశంలోకి వెళ్లే గొప్ప అవకాశాన్ని కోల్పోయినా, చివరివరకు నమ్మకంగా ఉండడం ద్వారా యెహోవా ఇచ్చిన సలహాను అంగీకరించాడని చూపించాడు.

10. (ఎ) సలహాను అంగీకరిస్తే మనమెలాంటి ప్రయోజనాల్ని పొందుతామని సామెతలు 4:10-13 చెప్తుంది? (బి) సలహా గురించి కొంతమంది ఏమంటున్నారు?

10 నమ్మకస్థులైన యోబు అలాగే మోషే ఆదర్శాన్ని మనం అనుకరించినప్పుడు ప్రయోజనం పొందుతాం. (సామెతలు 4:10-13 చదవండి.) చాలామంది సహోదరసహోదరీలు అదే చేశారు. కాంగోలో ఉంటున్న ఇసాక్‌​ అనే సహోదరుడు తనకిచ్చిన హెచ్చరిక గురించి ఇలా అంటున్నాడు: “యెహోవాతో నా సంబంధం పాడయ్యేలా ఉందని సంఘంలో పరిణతిగల సహోదరులు గమనించి, నాకు సహాయం చేయడానికి ప్రయత్నించారు. వాళ్లిచ్చిన సలహాను నేను పాటించాను. దానివల్ల చాలా సమస్యల్ని తప్పించుకున్నాను.” b కెనడాలో పయినీరుగా సేవచేస్తున్న మేగన్‌​ అనే సహోదరి సలహా గురించి ఇలా చెప్తుంది: “సలహా అనేది నేను వినాలనుకునే విషయంకాదు. కానీ అది నాకు మంచి చేస్తుంది.” అలాగే క్రోషియాలో ఉంటున్న మార్క్‌ అనే సహోదరుడు ఇలా అంటున్నాడు: “నేను సంఘంలో సేవావకాశాన్ని కోల్పోయాను. కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ సమయంలో నాకిచ్చిన సలహా వల్ల యెహోవాతో నా సంబంధాన్ని తిరిగి బలపర్చుకున్నానని అర్థంచేసుకున్నాను.”

11. సలహాను అంగీకరించడం గురించి సహోదరుడు కార్ల్‌​ క్లయిన్‌​ ఏమంటున్నాడు?

11 సలహాను అంగీకరించడం వల్ల ప్రయోజనం పొందిన మరొకరు సహోదరుడు కార్ల్‌ క్లయిన్‌​​. అతను పరిపాలక సభ సభ్యునిగా సేవచేశాడు. సహోదరుడు జోసెఫ్‌​ ఎఫ్‌​. రూథర్‌ఫర్డ్‌​ అతనికి మంచి స్నేహితుడు. అయితే ఒకసారి రూథర్‌ఫర్డ్‌ తనను సరిదిద్దుతూ ఒక సలహా ఇచ్చాడని క్లయిన్‌ తన జీవిత కథలో చెప్పాడు. మొదట్లో ఆ సలహా నచ్చలేదని క్లయిన్‌​ ఒప్పుకున్నాడు. అతనిలా చెప్పాడు: “ఆ తర్వాత మేం కలిసినప్పుడు [సహోదరుడు రూథర్‌ఫర్డ్‌] నన్ను చూసి చిరునవ్వుతో ‘హలో కార్ల్‌​’ అని పలకరించాడు. కానీ నేనింకా ఆ సలహా గురించే ఆలోచిస్తూ తప్పదన్నట్టు తిరిగి పలకరించాను. అప్పుడాయన నాతో: ‘కార్ల్‌,​ అపవాది నిన్ను ఉచ్చులో పడేయడానికి ప్రయత్నిస్తున్నాడు, జాగ్రత్త!’ అని అన్నాడు. దానికి నేను కాస్త ఇబ్బందిపడుతూ, ‘నాకు మీమీద కోపం లేదు బ్రదర్‌​’ అని అన్నాను. కానీ ఆయనకు నా గురించి బాగా తెలుసు కాబట్టి, నన్ను మళ్లీ హెచ్చరిస్తూ: ‘నేను అర్థంచేసుకోగలను; సాతాను నిన్ను ఉచ్చులో పడేయడానికి ప్రయత్నిస్తున్నాడు, జాగ్రత్త’ అని చెప్పాడు. ఆయన సరిగ్గానే చెప్పాడు. మనం ఒక సహోదరుడి మీద మనసులో కోపాన్ని ఉంచుకుంటే, ముఖ్యంగా అధికారంతో అతనిచ్చిన సలహానుబట్టి అలాచేస్తే . . . సాతాను ఉచ్చుల్లో తేలిగ్గా చిక్కుకుంటాం.” c (ఎఫె. 4:25-27) సహోదరుడు రూథర్‌ఫర్డ్‌​ ఇచ్చిన సలహాను క్లయిన్‌​ అంగీకరించాడు. అలాగే వాళ్లెప్పటికి మంచి స్నేహితులుగా ఉండిపోయారు.

సలహాను అంగీకరించడానికి మనకేది సహాయం చేస్తుంది?

12. సలహాను అంగీకరించడానికి మనకు వినయం ఎలా సహాయం చేస్తుంది? (కీర్తన 141:5)

12 సలహాను అంగీకరించడానికి మనకేది సహాయం చేస్తుంది? మనం అపరిపూర్ణులమని, కొన్నిసార్లు తెలివితక్కువగా ఆలోచిస్తామని గుర్తుంచుకొని వినయం చూపించాలి. పైపేరాల్లో చూసినట్లు, యోబు సరైన విధంగా ఆలోచించలేక పోయాడు. కానీ తర్వాత అతను తన ఆలోచనా విధానాన్ని సరిచేసుకున్నప్పుడు యెహోవా ఆశీర్వదించాడు. ఎందుకంటే యోబు వినయం చూపించాడు. తనకన్నా వయసులో చాలా చిన్నవాడైన ఎలీహు సలహా ఇచ్చినప్పుడు, దాన్ని అంగీకరించడం ద్వారా తనకు వినయం ఉందని చూపించాడు. (యోబు 32:6, 7) కొన్నిసార్లు కారణం లేకుండా ఇతరులు మనకు సలహా ఇచ్చారని అనిపించొచ్చు. లేదా సలహా ఇచ్చే వ్యక్తి మనకన్నా వయసులో చిన్నవాడై ఉండొచ్చు. అయినా మనకు వినయం ఉంటే ఆ సలహాను అంగీకరిస్తాం. కెనడాలో ఉంటున్న ఒక సంఘపెద్ద ఇలా అంటున్నాడు: “ఎవ్వరూ మనకు సలహా ఇవ్వకపోతే మనం ప్రగతి సాధించడం చాలా కష్టం.” పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని మనందరం వృద్ధిచేసుకోవాలి. అలాగే మంచి ప్రచారకులుగా, బోధకులుగా అవ్వాలి.—కీర్తన 141:5 చదవండి.

13. మనం సలహా పొందినప్పుడు దాన్నెలా చూడాలి?

13 సలహాను యెహోవా ప్రేమకు రుజువుగా చూడండి. యెహోవా ఎప్పుడూ మన మంచి కోరుకుంటాడు. (సామె. 4:20-22) బైబిలు ద్వారా, ఒక ప్రచురణ ద్వారా లేదా పరిణతిగల క్రైస్తవుడి ద్వారా ఆయన సలహా ఇస్తున్నప్పుడు మనమీద ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన “మన ప్రయోజనం కోసమే” మనకు సలహా ఇస్తాడని హెబ్రీయులు 12:9, 10 చెప్తున్నాయి.

14. సలహా ఇచ్చినప్పుడు మనం దేనిమీద మనసుపెట్టాలి?

14 సలహా మీద మనసుపెట్టండి, ఇచ్చిన విధానం మీద కాదు. కొన్నిసార్లు సలహాను సరైన విధంగా ఇవ్వలేదని మనకు అనిపించొచ్చు. నిజమే సలహా ఇచ్చే వ్యక్తి, ఇతరులు దాన్ని వీలైనంత తేలికగా అంగీకరించేలా ఇవ్వాలి. d (గల. 6:1) ఒకవేళ మనకే సలహా ఇస్తే, దాన్ని ఇంకా బాగా ఇవ్వవచ్చని అనిపించినా సలహా మీదే మనసుపెట్టాలి. ఈ విషయంలో మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘నాకు సలహా ఇచ్చిన విధానం నచ్చకపోయినా, వాళ్లు చెప్పినదాంట్లో ఏదైనా నిజముందా? సలహా ఇచ్చిన వ్యక్తికున్న లోపాల్ని పట్టించుకోకుండా, అతను ఇచ్చిన సలహా నుండి నేనేమైనా నేర్చుకోవచ్చా?’ ఇచ్చిన సలహా నుండి ఏదోకవిధంగా ప్రయోజనం పొందడానికి మనం ప్రయత్నించినప్పుడు తెలివిగలవాళ్లమని చూపిస్తాం.—సామె. 15:31.

సలహా కోసం అడగండి, ప్రయోజనాల్ని పొందండి

15. సలహా కోసం మనమెందుకు అడగాలి?

15 సలహా కోసం అడగమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. సామెతలు 13:10 ఇలా చెప్తుంది: “సలహా కోసం వెదికేవాళ్ల దగ్గర తెలివి ఉంటుంది.” ఆ మాటలు ఎంత నిజమో కదా! ఎదుటివాళ్లు సలహా ఇచ్చేవరకు ఆగే వ్యక్తి కన్నా, సలహాను అడిగి తీసుకునే వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎక్కువ ప్రగతి సాధిస్తాడు. కాబట్టి మీరు చొరవ తీసుకుని సలహా అడగండి.

ఒక యౌవన సహోదరి, పరిణతిగల సహోదరిని ఎందుకు సలహా అడుగుతుంది? (16వ పేరా చూడండి)

16. మనం ఏయే విషయాల్లో తోటి సహోదరసహోదరీల్ని సలహా అడగొచ్చు?

16 మనం ఏయే విషయాల్లో తోటి సహోదరసహోదరీల్ని సలహా అడగొచ్చు? ఈ సందర్భాల్ని పరిశీలించండి. (1) ఒక సహోదరి తన బైబిలు స్టడీకి అనుభవం ఉన్న ఇంకో సహోదరిని తీసుకెళ్లింది. స్టడీ పూర్తయిన తర్వాత, తన బోధనా పద్ధతుల్ని ఇంకా ఎలా మెరుగుపర్చుకోవచ్చో ఆమెను సలహా అడుగుతుంది. (2) ఒక పెళ్లికాని సహోదరి బట్టలు కొనుక్కోవాలని అనుకుంది. కాబట్టి ఎలాంటి బట్టలు కొనుక్కోవాలో ఒక పరిణతిగల సహోదరిని సలహా అడుగుతుంది. (3) ఒక సహోదరుడు మొదటిసారి బహిరంగ ప్రసంగం ఇచ్చే నియామకాన్ని పొందాడు. తాను ప్రసంగిస్తున్నప్పుడు ఒక అనుభవంగల ప్రసంగీకుణ్ణి జాగ్రత్తగా వినమని చెప్తాడు. ఆ తర్వాత, ఎక్కడ మెరుగుపర్చుకోవచ్చో చెప్పమని సలహా అడుగుతాడు. అయితే ఎన్నో సంవత్సరాలుగా ప్రసంగాలిస్తున్న సహోదరుడు కూడా నైపుణ్యంగల ప్రసంగీకుణ్ణి సలహా అడగొచ్చు, దాన్ని పాటించవచ్చు.

17. మనం సలహా నుండి ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి?

17 రానున్న రోజుల్లో మనందరం ఏదోక విధంగా సలహాను పొందుతాం. ఆ సమయంలో, ఈ ఆర్టికల్‌లో నేర్చుకున్న పాఠాల్ని మీరు గుర్తుచేసుకోండి. ఎప్పుడూ వినయం చూపించండి; సలహా మీద మనసుపెట్టండి, ఇచ్చిన విధానం మీద కాదు; అలాగే సలహాను పాటించండి. మనలో ఎవ్వరం పుట్టుకతోనే తెలివిగలవాళ్లం కాదు. కానీ ‘సలహాను విని, క్రమశిక్షణను స్వీకరిస్తే’ మనం ‘తెలివిగలవాళ్లం అవుతాం’ అని బైబిలు మాటిస్తోంది.—సామె. 19:20.

పాట 124 ఎల్లప్పుడూ యథార్థంగా ఉందాం

a బైబిలు ద్వారా వచ్చే సలహాను విని, పాటించడం ప్రాముఖ్యమని దేవుని ప్రజలకు తెలుసు. అయితే ఆ సలహాను అంగీకరించి, పాటించడం అన్నిసార్లూ తేలిక కాదు. ఎందుకలా? మనకిచ్చే సలహా నుండి ప్రయోజనం పొందడానికి ఏది సహాయం చేస్తుంది?

b కొన్ని అసలు పేర్లు కావు.

d సలహా ఇచ్చేవాళ్లు ఇతరుల్ని నొప్పించకుండా ఎలా ఇవ్వవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో చర్చిస్తాం.